ఇద్దరు ఉగ్రవాదుల హతం
కశ్మీర్లో ఎస్పీ కాన్వాయ్‌పై ఉగ్రదాడి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఎస్పీ స్థాయి అధికారిని లక్ష్యంగా చేసుకుని హిజ్బుల్ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. ఈ ఘటన పుల్వామా జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. అనంతనాగ్, శ్రీనగర్ లోక్‌సభ స్థానాల్లో ఉపఎన్నికలకు సంబంధించి ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో సమావేశమై తిరిగివస్తున్న అదనపు ఎస్పీ చందన్ కోహ్లీ(32) కాన్వాయ్‌పై పద్గమ్పొరా ప్రాంతం లో ఈ దాడి జరిగింది. వెంటనే స్పందించిన గార్డులు ఉగ్రవాదుల కారుపై కాల్పులు జరిపి దుండగుల్ని మట్టుబెట్టారు.
రెచ్చిపోయిన ఉగ్రవాదులు
జమ్మూకశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో శనివారం రాత్రి సబ్–ఇన్స్పెక్టర్ సుభాన్ భట్ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు, అతడి కుమారుడు, మేనల్లుడిని బందించి, ఇంటిని లూటీ చేయడంతో పాటు వాహనానికి నిప్పు పెట్టి పరారయ్యారు. మరో ఘటనలో దుండగులు పోలీసు రక్షణాధికారి మహమ్మద్ హనీఫ్పై దాడికి తెగబడ్డారు. అతనివద్ద ఉన్న ఎకే–47 రైఫిల్‌ను ఎత్తుకెళ్లారు.
కశ్మీర్ మంత్రి ఇంటిపై ఉగ్ర దాడి
దక్షిణ కశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలోని ఆ రాష్ట్ర మంత్రి ఫరూక్ అబ్ద్రాబి పూర్వీకులకు చెందిన ఇంటిపై ఆదివారం రాత్రి ఉగ్రవాదులు దాడిచేయడంతో ఓ పోలీస్ గాయపడ్డాడు. గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు.