భయపడవద్దు..
శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కుటుంబీకులకు పోలీసు అధికారుల భరోసా
ఇంటి ఆవరణలో పరిశీలన
ఎఫ్ఐఆర్ నమోదు
పోలీస్ పికెట్ ఏర్పాటు
పెనమలూరు : కానూరు సనత్నగర్లో ఉన్న శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఎ.ఎస్.ఖాన్ ఇంటిని శుక్రవారం పోలీసు ఉన్నతాధికారులు సందర్శించారు. గురువారం వేకువజామున ఈ ఇంటిలోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడిన విషయం తెలిసిందే. ఎస్పీ ఖాన్ ఇంటికి శుక్రవారం క్రైం అదనపు డీసీపీ రామకోటేశ్వరరావు, ఇన్చార్జి ఏసీపీ గుణ్ణం రామకృష్ణ, తూర్పు డివిజన్ ఏసీపీ మహేశ్వరరాజు వచ్చారు. ఆగంతకుల రెక్కీ గురించి ఎస్పీ కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. గురువారం వేకువజామున గుర్తుతెలియని వ్యక్తులు ముఖాలకు వస్త్రాలు కట్టుకుని గోడ దూకి ఇంటి ఆవరణలోకి చొరబడ్డారని ఎస్పీ కుటుంబసభ్యులు తెలిపారు. ఆగంతకులు వరండాలో లైట్లు తీసి తలుపు గడియ విరగ్గొట్టి, ఇంట్లోకి చొరబడేందుకు యత్నించారని వివరించారు. ఆ శబ్దాలకు ఎదురింట్లో వారికి మెలకువ వచ్చి బయటకు వచ్చారన్నారు. వారిని చూసి ఆ వ్యక్తులు పారిపోయారని తెలిపారు. ఖాన్ ఇంటి ఆవరణను పోలీసు ఉన్నతాధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. భయపడాల్సింది లేదని ఎస్పీ కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ ప్రాంతంలో పోలీసు నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇక్కడ సంచరించినా.. ఏదైనా అనుమానం ఉన్నా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
కేసు నమోదు
పెనమలూరు సీఐ మురళీకృష్ణ శుక్రవారం శోధన బృందంతో ఎస్పీ ఖాన్ ఇంటికి వచ్చి, విచారణ నిర్వహించారు. ఆయన కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు శోధన టీం కేసు నమోదు చేసింది. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు.
దుండగులు ఇంట్లోకి వచ్చి ఉంటే ఏమయ్యేదో..?
కాగా ఈ విషయమై ఎస్పీ భార్య నసీమా ‘సాక్షి’తో మాట్లాడుతూ, నూతన సంవత్సరం సందర్భంగా కుటుంబ సభ్యులు శ్రీకాకుళం వెళ్లారని తెలిపారు. ఇంట్లో తాను, కుమార్తె ఉన్నామన్నారు. తాము నిద్రిస్తున్న సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఉండి ఉంటే తమ పరిస్థితి ఏమయ్యేదోనని ఆందోళ వ్యక్తం చేశారు. అదృష్టం బాగుండి అలికిడి అవ్వటంతో ఎదురింటి వారు బయటకు రావడాన్ని చూసి దుండగులు పారిపోయారని తెలిపారు.