SP senthilkumar
-
బియ్యం మాటున ‘ఎర్ర’ స్మగ్లింగ్
చిత్తూరు అర్బన్ (చిత్తూరు జిల్లా): ఓ కంటైనర్‌లో రూ.1.5 కోట్ల విలువచేసే ఎర్రచందనం దుంగలను తీసుకెళ్తూ ఎవరికీ అనుమానం రాకుండా దుంగలపైన బియ్యం బస్తాలను వేసినా పోలీసులు పట్టుకున్నారు. చిత్తూరులో ఈ వివరాలను ఎస్పీ సెంథిల్‌కుమార్ ఆదివారం విలేకరులకు వివరించారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో పీలేరు వద్ద ఎర్రచందనం దుంగలు తరలుతున్నట్లు సీఐ సాధిల్‌అలీకి సమాచారం రావడంతో పోలీసులు సరిహద్దుల వద్ద తనిఖీలు చేపట్టారు. ఓ కంటైనర్‌కు ముందు, వెనుక వైపు ఎస్కార్ట్లుగా వాహనాలు వెళుతుండగా వాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కంటైనర్‌ను తెరచి చూశారు. తొలుత ఇందులో పోలీసులకు బియ్యం బస్తాలు కనిపించాయి. వాటిని కిందకు దింపించి చూస్తే పెద్ద సంఖ్యలో ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరపగా.. గుడిపాల సరిహద్దుల్లో మరో రెండు వాహనాల్లో తరలుతున్న ఎర్రచందనం దుంగలు, తీసుకెళుతున్న వారిని సైతం అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి నుంచి తమిళనాడుకు ఎర్రచందనం దుంగలు తీసుకెళుతున్నట్లు విచారణలో తేలింది. ఘటనలో వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన కొత్త సురేంద్రరెడ్డి (27), వసంతు అశోక్‌కుమార్‌రెడ్డి (40), తిరుపతికి చెందిన అప్పిలి మురళి (29), యర్రమరెడ్డి రామంజులు (41), తలారి వికేష్ (26), యాదమరికి చెందిన చేంద్ర శ్రీరాములు వెంకటేష్ (32), తమిళనాడు తిరుపత్తూర్‌కు చెందిన స్వామినాథన్ సంజీవ్ (24), వేలూరుకు చెందిన జి.విజయకాంత్ (28), ఎస్.శక్తివేల్ (30), ఆర్.విజయ్‌కుమార్ (36), ఎం.వేలుసామి (42), రాజమని హరిమూర్తి (42), తిరువణ్ణామలైకి చెందిన ధనతరాన్ ఏలుమలై (37)లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి మూడున్నర టన్నుల బరువున్న 115 ఎర్రచందనం దుంగలు, నాలుగు కార్లు, ఓ కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుందని ఎస్పీ తెలిపారు. -
టీడీపీ నేత ఇంట్లో చోరీ.. ఘరానా దొంగలు అరెస్టు
చిత్తూరు అర్బన్: చిత్తూరు తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ ఆదికేశవులు నాయుడు తమ్ముడు బద్రినారాయణ ఇంట్లో పది రోజుల క్రితం జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ చోరీకి పాల్పడ్డ విశాఖకు చెందిన కర్రి సతీష్‌రెడ్డి(37), తెలంగాణ దేవరకొండకు చెందిన ఎన్.నరేంద్రనాయక్(26)తో పాటు వైఎస్సార్ కడపకు చెందిన కుదువ వ్యాపారి అనిమల కుమార్ ఆచారి (45)ను అరెస్టు చేశారు. చిత్తూరు నగరంలోని పోలీసు అతిథిగృహంలో వివరాలను ఎస్పీ ఎస్.సెంథిల్‌కుమార్, డీఎస్పీ ఎన్.సుధాకర్‌రెడ్డి శుక్రవారం మీడియాకు వివరించారు. గతనెల 28వ తేదీ తెల్లవారుజామున ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు లక్ష్మీనగర్ కాలనీలోని బద్రినారాయణ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. కేసును ఛేదించడానికి డీఎస్పీ సుధాకర్‌రెడ్డి పర్యవేక్షణలో క్రైమ్ సీఐ రమేష్, టూటౌన్ సీఐ యుగంధర్‌ను ఎస్పీ రంగంలోకి దింపారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లెలో రెండేళ్లుగా నివాసం ఉంటున్న విశాఖజిల్లా కొత్తగాజువాకకు చెందిన కర్రి సతీష్‌రెడ్డిని, ఇతనితో పాటు చోరీలో పాల్గొన్న తెలంగాణ నల్గొండకు చెందిన ఎన్.నరేంద్రను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ విచారించిన పోలీసులు రూ.3.04 కోట్ల విలువచేసే 2.03 కిలోల బంగారు ఆభరణాలు, వజ్రవైఢూర్యాలు పొదిగిన గాజులు, బ్రాస్లెట్లు, వాచీలు, చెవికమ్మలు, హారాలు, నక్లెస్‌లు, బంగారు మొలతాడు, డాలర్లతో పాటు రూ.10 లక్షల విలువైన విదేశీ కరెన్సీ, ఓ బుల్లెట్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు గతేడాది ఆగస్టులో చిత్తూరులో జరిగిన మరోచోరీ కేసులో కూడా సతీష్‌రెడ్డి, నరేంద్ర పాల్గొన్నట్లు గుర్తించి అక్కడ చోరీకి గురైన 80 గ్రాముల బంగారు వడ్డాణం సీజ్ చేశారు. చోరీ సొత్తు అని తెలిసినప్పటికీ బంగారు చైను కుదువపెట్టుకున్న నేరానికి కుమార్ ఆచారిని అరెస్టు చేశారు. కాగా, చోరీ జరిగినపుడు టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదులో రూ.2.57 కోట్ల విలువచేసే వస్తువులు మాత్రమే పోయినట్లు పేర్కొన్నాడు. కానీ పోలీసులు నిందితుడ్ని పట్టుకున్నపుడు కేజీకి పైగా బరువున్న బంగారు, వజ్రాభరణాలు బద్రి ఇంట్లో చోరీ చేసినట్లు చెప్పడంతో వాటిని కూడా రికవరీలో చూపించారు. దీంతో వారికి ఎస్పీ నగదు రివార్డులు అందజేశారు. -
దాడి చేసింది టీడీపీ నేత అనుచరుడే
మదనపల్లె టౌన్ (చిత్తూరు జిల్లా): సస్పెండ్ అయిన న్యాయమూర్తి రామకృష్ణ తమ్ముడు రామచంద్ర (42)పై జరిగిన దాడిలో రాజకీయ కోణం లేదని, దాడికి పాల్పడిన యువకుడు తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్ అనుచరుడేనని జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్ స్పష్టం చేశారు. రామచంద్రపై జరిగిన దాడికి టీడీపీయే కారణమైనప్పటికీ ఈ ఘటనను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాసి, వైఎస్సార్సీపీపై బురదజల్లేందుకు ప్రయత్నించారు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో ఆదివారం జరిగిన దాడికి సంబంధించిన కారణాలను మదనపల్లెలో సోమవారం ఎస్పీ ఆధారాలతో తెలియజేశారు. ► రామచంద్రపై దాడి ఘటనపై పోలీసుల నోటీసుకు వచ్చిన వెంటనే డీఎస్పీ రవిమనోహరాచారి అనారోగ్యంగా ఉన్నప్పటికీ దర్యాప్తు చేశారు. ► ఘటనా స్థలంలో సెల్ఫోన్లో కొందరు తీసిన వీడియోలు సేకరించి, దాడికి పాల్పడిన ప్రతాప్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యక్ష సాక్షులను విచారించి, నిజాలు తెలుసుకుని కేసు నమోదు చేశారు. ప్రతాప్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అనుచరుడు దాడికి పాల్పడిన ప్రతాప్‌రెడ్డి టీడీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్ అనుచరుడని తేలినట్టు ఎస్పీ తెలిపారు. ప్రతాప్ రెడ్డి తల్లి విజయలక్ష్మి తెలుగుదేశం పార్టీ తరపున అక్కడి ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ వేసినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. ప్రతిపక్ష పార్టీ చేసిన దుష్ప్రచారం వెనుక ఎవరెవరు ఉన్నారో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ సెంథిల్‌కుమార్ తెలిపారు. శాంతిభద్రతల సమస్య తలెత్తాలా చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
మహిళలపై దాడి..ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్
చిత్తూరు : తన భర్త మృతిపట్ల అనుమానాలున్నాయని, న్యాయం చేయాలని కోరిన మహిళపై దాడిచేశారనే ఆరోపణలపై ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్ సస్పెండ్ చేశారు. వివరాల ప్రకారం..వాల్మీకిపురం మండలంలోని చింతపర్తి పంచాయతీ, కోటపల్లెకు చెందిన గొర్రెలకాపరి రవి (27) గత శుక్రవారం మృతి చెందాడు. అయితే తన భర్తను అదే గ్రామానికి చెందిన ధనశేఖర్‌రెడ్డి చంపేశాడని, అప్పు తీర్చకపోవడమే ఇందుకు కారణమంటూ మృతుడి భార్య రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును రాజీ చేసుకోవాలంటూ జయచంద్ర, రామచంద్ర అనే ఇద్దరు కానిస్టేబుళ్లు తనను లాఠీలతో కొట్టారని రమాదేవి పేర్కొన్నారు. నిందితుడు ధనశేఖర్‌రెడ్డిని అరెస్టు చేయకపోగా.. మృతుడి తల్లి రాజమ్మ, భార్య రమాదేవిలను తీసుకెళ్లి హింసించారంటూ ప్రజాసంఘాలు గురువారం మదనపల్లెలో ధర్నా నిర్వహించాయి. దీనిపై ఎస్పీ సెంథిల్‌కుమార్ సీరియస్ అయ్యారు. మహిళలను కొట్టారనే ఆరోపణలపై వాల్మీకిపురం స్టేషన్లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. (దళిత యువకుడిపై చేయి చేసుకున్న ఎస్ఐ, ఏఎస్ఐ) -
ఫలించని ‘పోలీస్' వ్యూహం
నెల్లూరు(క్రైమ్): జిల్లాలో దొంగల ముఠాలు తిష్టవేశాయి. పగలు..రాత్రి తేడా లేకుండా దొంగతనాలకు తెగబడుతున్నారు. పగలు రెక్కీ నిర్వహించి, తాళం వేసిన ఇల్లు కనిపిస్తే రాత్రికి దోచేస్తున్నారు. చోరీలను నియంత్రించేందుకు ఎస్పీ సెంథిల్‌కుమార్ ప్రత్యేక చర్యలు చేపట్టినా ఫలితం కరువైంది. నాలుగు నెలల్లో సుమారు రూ.2.35 కోట్ల విలువైన సొత్తు చోరీకి గురికాగా, చైన్‌స్నాచింగ్‌లు, వాహన దొంగతనాలు లెక్కలేదనే చెప్పాలి. ఇటీవల కాలంలో జిల్లాలో ఏదో ఒక చోట దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో శివారు ప్రాంతాలే దొంగల టార్గెట్ కాగా, ఇప్పుడు జనం రద్దీగా ఉండే ప్రదేశాల్లోనూ చోరీలకు తెగబడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. మరోవైపు నకిలీ పోలీసులు, ఆటోడ్రైవర్ల ముసుగులోని దుండగులు అందిన కాడికి దోచుకుంటున్నారు. నాలుగు నెలల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా సుమారు 82కి పైగా దొంగతనాలు జరిగాయి. అన్ని ఘటనల్లో కలిపి సుమారు రూ.1.25 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, రూ.25 లక్షల నగదు చోరీకి గురయ్యాయి. బైక్‌లు, లారీలను సైతం దొంగలు అపహరించారు. ఇక చైన్ స్నాచింగ్లైతే లెక్కేలేదు. వరుస దొంగతనాల నేపథ్యంలో మహిళలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. మరోవైపు ఇళ్లలో ఉన్నా దొంగల బారిన పడుతుండటంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బందోబస్తుకే సీసీఎస్ పరిమితం సాధారణంగా జిల్లాలో ఎక్కడ చోరీలు, దోపిడీలు జరిగినా దర్యాప్తునకు సంబంధించి వెంటనే గుర్తుకొచ్చేది సీసీఎస్ మాత్రమే. ఈ తరహా కేసులను ఆ విభాగ పోలీసులు ఎన్నో పరిష్కరించారు. అయితే రెండేళ్లుగా సీసీఎస్ విభాగం సేవలు కేవలం బందోబస్తుకే పరిమితమయ్యాయి. కీలకమైన ఈ విభాగాన్ని జిల్లాలో పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఉన్నతాధికారులు ఏదేని కేసు అప్పగిస్తే తప్ప ప్రత్యేకంగా దృష్టిపెట్టని పరిస్థితి నెలకొంది. పోలీసులకు సవాల్.. తమిళనాడు ఇందిరానగర్ సెటిల్మెంట్ ఏరియా, కృష్ణగిరి, తిరుచ్చి, ఇరువాక్కం, చిత్తూరు జిల్లా ఓజికుప్పం, శ్రీకాళహస్తి, ఒంగోలు రాంనగర్, స్టూవర్టుపురం, కర్నూలు జిల్లా నూనెపల్లికి చెందిన దొంగలతో పాటు ఇరానీ ముఠాలు జిల్లాలో తిష్టవేసి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. అయితే జిల్లా ఎస్పీగా సెంథిల్‌కుమార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నేరనియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించారు. గస్తీ పెంచడంతో పాటు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ దొంగల కోసం గాలింపు ముమ్మరం చేశారు. పలు ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్‌లు సైతం నిర్వహించారు. అయినా ఫలితాలు ఆశాజనకంగా లేవు. రోజూ ఏదో ఒక చోట దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు దొంగలు సవాల్ విసురుతున్నారు. కొన్ని చైన్‌స్నాచింగ్ కేసులను చేధించిన పోలీసులకు విస్తుపోయే అనుభవాలు ఎదురయ్యాయి. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన విద్యావంతులు పలువురు చైన్‌స్నాచర్లుగా అవతారమెత్తినట్లు వెలుగులోకి వచ్చింది. ఇటీ వల జరిగిన కొన్ని ఘటనలు సెప్టెంబర్ 15న జిల్లా వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో దొంగలు పడి సుమారు 32సవర్ల బంగారు ఆభరణాలు, రూ. 5.57లక్షల విలువచేసే సొత్తు అపహరించారు. 17న నెల్లూరులోని ఆర్పీఎఫ్ క్వార్టర్స్‌లోని ఓ కానిస్టేబుల్ ఇంట్లో 20గ్రాముల బంగారు నగలు ఎత్తుకెళ్లారు. 22న కరెంట్ఆఫీస్ సెంటర్లో రెండు ఇళ్లలో దొంగలు పడి 9 సవర్ల బంగారు ఆభరణాలు, 15వేల నగదు అపహరించారు. అక్టోబర్‌లో బుచ్చిరెడ్డిపాళెం మం డలం జొన్నవాడ, కోవూరు మండలం పాటూరులో ఇద్దరు మహిళలను హతమార్చి బంగారు నగలను దోచుకెళ్లారు. గత నెలలోనే నెల్లూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఓ రోగికి చెందిన 7సవర్ల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. మనుబోలు సమీపంలోని కాగితాలపూరు క్రాస్‌రోడ్డులో ఉన్న పవర్‌గ్రిడ్ ఉద్యోగుల క్వార్టర్స్‌లో సుమారు రూ.75 లక్షలు చోరీకి గురైన ఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. క్వార్టర్స్‌లోని ఐదుగురు ఉద్యోగుల ఇళ్లలో దొంగలు చోరీలకు తెగబడ్డారు. శుక్రవారమే కోటలో ఇన్‌కంట్యాంక్స్ అధికారులమంటూ ముగ్గురు యువకు లు ఓ ఇంట్లోకి చొరబడి వృద్ధ దంపతులను బెదిరించి రూ.10 సవర్ల బంగారు, రూ.70 వేలు నగదు దోచుకెళ్లారు. చోరీల నియంత్రణకు పటిష్ట చర్యలు: చోరీల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. ప్రత్యేక బృందాలను నియమించి నిఘా ముమ్మరం చేశాం. ఇప్పటికే పలువురు గజ దొంగలను అరెస్ట్ చేసి సుమారు రూ.70 లక్షలకు పైగా విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నాం. ప్రజలు కూడా సహకరించి అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై 100, 94946 26644 నంబర్లకు సమాచారం ఇస్తే వెంటనే స్పందిస్తాం. - సెంథిల్‌కుమార్, ఎస్పీ -
గీత దాటితే వేటే!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : దారి తప్పిన పోలీసు వ్యవస్థను గాడిలో పెట్టేందుకు డీఐజీ బాలకృష్ణ, ఎస్పీ సెంథిల్‌కుమార్ సిద్ధమయ్యారు. గీత దాటిన పోలీసు అధికారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. బహిరంగ కౌన్సెలింగ్ నిర్వహించి చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటోన్న గుంతకల్లు డీఎస్పీ సుప్రజ, గుంతకల్లు అర్బన్ సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ ఇస్మాయిల్‌కు డీఐజీ బాలకృష్ణ మంగళవారం చార్జ్ మెమోలు జారీ చేశారు. అనంతపురం వన్‌టౌన్, టూటౌన్ సీఐలు గోరంట్ల మాధవ్, మన్సూరుద్దీన్లకూ రేపో మాపో మెమోలు జారీ చేయనున్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన హిందూపురం రూరల్ సీఐ వేణుగోపాల్, చిలమత్తూరు, అనంతపురం వన్‌టౌన్ ఎస్సైలు సద్గురుడు, ధరణి కిషోర్‌లకు ఎస్పీ సెంథిల్‌కుమార్ సోమవారం చార్జ్ మెమోలు జారీ చేశారు. ఇది జిల్లా పోలీసు వ్యవస్థలో కలకలం రేపింది. అక్టోబరు 27 నుంచి జిల్లా ఎస్పీ లేకపోవడం వల్ల పోలీసు వ్యవస్థ గాడి తప్పిందనే విమర్శలు అదే శాఖ నుంచి బలంగా వ్యక్తమవుతున్నాయి. విధి నిర్వహణలో అలసత్వం వహించడం.. కొందరికే కొమ్ము కాయడం.. అవినీతిలో కూరుకుపోవడం అనే ఆరోపణలను కొందరు పోలీసు అధికారులు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణలపై డీఐజీ బాలకృష్ణ ప్రత్యేకంగా విచారణ చేయిస్తున్నారు. ఈ ఆరోపణలపై విచారణ చేయించడం ఒక ఎత్తయితే.. కొందరు పోలీసు అధికారులు ఇటీవల ఎదుర్కొంటున్న ఆరోపణలపై తక్షణమే చర్యలకు డీఐజీ, ఎస్పీ సిద్ధమయ్యారు. గుంతకల్లులో తాపీ మేస్త్రీ మల్లయ్య హత్య కేసులో నిందితులైన బోయ శేఖర్, హుస్సేనీ, పెద్దన్న, చంద్రలకు నవంబర్ 30న డీఎస్పీ సుప్రజ, సీఐ శ్రీనివాసులు, ఎస్సై ఇస్మాయిల్ బహిరంగంగా కౌన్సెలింగ్ నిర్వహించారు. తద్వారా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. బహిరంగంగా కౌన్సెలింగ్ నిర్వహించడం చట్ట విరుద్ధం కావడంతో గుంతకల్లు ఘటనపై సమగ్ర విచారణ చేసి, నివేదిక పంపాలంటూ డీఐజీ బాలకృష్ణను సోమవారం డీజీపీ ప్రసాదరావు ఆదేశించారు. ఇదే సందర్భంలో అనంతపురం వన్‌టౌన్, టూటౌన్ సీఐలు గోరంట్ల మాధవ్, మన్సూరుద్దీన్ ఇటీవల కొన్ని కేసుల్లో నిందితులకు బహిరంగ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ కేసుల్లో బహిరంగ కౌన్సెలింగ్‌ను ఎదుర్కొన్న బాధితులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు గుంతకల్లు డీఎస్పీ సుప్రజ, సీఐ శ్రీనివాసులు, ఎస్సై ఇస్మాయిల్‌లకు మంగళవారం డీఐజీ బాలకృష్ణ చార్జ్‌మెమోలు జారీ చేశారు. ఆ క్రమంలోనే అనంతపురం వన్‌టౌన్, టూటౌన్ సీఐలు గోరంట్ల మాధవ్, మన్సూరుద్దీన్లకు కూడా చార్జ్ మెమోలు జారీ చేయాలని నిర్ణయించారు. జిల్లా ఎస్పీగా సోమవారం బాధ్యతలు చేపట్టిన సెంథిల్‌కుమార్ మంగళవారం ఉదయం ఎస్సై, సీఐ, డీఎస్పీ, ఏఎస్పీలతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాయంత్రం సీఐ, డీఎస్పీ, ఏఎస్పీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. క్రమశిక్షణ తప్పినా.. చట్టాన్ని దుర్వినియోగం చేసినా చర్యలు తప్పవని జారీ చేసిన హెచ్చరికలను చేతల్లోనూ చూపారు. చిలమత్తూరు మండలంలో ఒక గ్రామంలో చోటు చేసుకున్న ఘర్షణపై కేసు నమోదు చేయడంలో అలసత్వం వహించినందుకు ఎస్సై సద్గురుడు, హిందూపురం రూరల్ సీఐ వేణుగోపాల్‌లకు ఎస్పీ సెంథిల్‌కుమార్ చార్జ్ మెమోలు జారీ చేశారు. అనంతపురంలో మంగళవారం ఒక కేసు విచారణలో అలసత్వం వహించిన వన్ టౌన్ ఎస్సై ధరణి కిషోర్‌కు కూడా చార్జ్ మెమో జారీ చేశారు. డీఐజీ బాలకృష్ణ, ఎస్పీ సెంథిల్‌కుమార్ ఒకే సారి చర్యలకు ఉపక్రమించడంతో పోలీసు శాఖలో కలకలం రేగింది.