సాక్షి ప్రతినిధి, అనంతపురం : దారి తప్పిన పోలీసు వ్యవస్థను గాడిలో పెట్టేందుకు డీఐజీ బాలకృష్ణ, ఎస్పీ సెంథిల్‌కుమార్ సిద్ధమయ్యారు. గీత దాటిన పోలీసు అధికారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. బహిరంగ కౌన్సెలింగ్ నిర్వహించి చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటోన్న గుంతకల్లు డీఎస్పీ సుప్రజ, గుంతకల్లు అర్బన్ సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ ఇస్మాయిల్‌కు డీఐజీ బాలకృష్ణ మంగళవారం చార్జ్ మెమోలు జారీ చేశారు.
అనంతపురం వన్‌టౌన్, టూటౌన్ సీఐలు గోరంట్ల మాధవ్, మన్సూరుద్దీన్‌లకూ రేపో మాపో మెమోలు జారీ చేయనున్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన హిందూపురం రూరల్ సీఐ వేణుగోపాల్, చిలమత్తూరు, అనంతపురం వన్‌టౌన్ ఎస్సైలు సద్గురుడు, ధరణి కిషోర్‌లకు ఎస్పీ సెంథిల్‌కుమార్ సోమవారం చార్జ్ మెమోలు జారీ చేశారు. ఇది జిల్లా పోలీసు వ్యవస్థలో కలకలం రేపింది. అక్టోబరు 27 నుంచి జిల్లా ఎస్పీ లేకపోవడం వల్ల పోలీసు వ్యవస్థ గాడి తప్పిందనే విమర్శలు అదే శాఖ నుంచి బలంగా వ్యక్తమవుతున్నాయి. విధి నిర్వహణలో అలసత్వం వహించడం.. కొందరికే కొమ్ము కాయడం.. అవినీతిలో కూరుకుపోవడం అనే ఆరోపణలను కొందరు పోలీసు అధికారులు ఎదుర్కొంటున్నారు.
ఈ ఆరోపణలపై డీఐజీ బాలకృష్ణ ప్రత్యేకంగా విచారణ చేయిస్తున్నారు. ఈ ఆరోపణలపై విచారణ చేయించడం ఒక ఎత్తయితే.. కొందరు పోలీసు అధికారులు ఇటీవల ఎదుర్కొంటున్న ఆరోపణలపై తక్షణమే చర్యలకు డీఐజీ, ఎస్పీ సిద్ధమయ్యారు. గుంతకల్లులో తాపీ మేస్త్రీ మల్లయ్య హత్య కేసులో నిందితులైన బోయ శేఖర్, హుస్సేనీ, పెద్దన్న, చంద్రలకు నవంబర్ 30న డీఎస్పీ సుప్రజ, సీఐ శ్రీనివాసులు, ఎస్సై ఇస్మాయిల్ బహిరంగంగా కౌన్సెలింగ్ నిర్వహించారు. తద్వారా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. బహిరంగంగా కౌన్సెలింగ్ నిర్వహించడం చట్ట విరుద్ధం కావడంతో గుంతకల్లు ఘటనపై సమగ్ర విచారణ చేసి, నివేదిక పంపాలంటూ డీఐజీ బాలకృష్ణను సోమవారం డీజీపీ ప్రసాదరావు ఆదేశించారు. ఇదే సందర్భంలో అనంతపురం వన్‌టౌన్, టూటౌన్ సీఐలు గోరంట్ల మాధవ్, మన్సూరుద్దీన్ ఇటీవల కొన్ని కేసుల్లో నిందితులకు బహిరంగ కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఈ కేసుల్లో బహిరంగ కౌన్సెలింగ్‌ను ఎదుర్కొన్న బాధితులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు గుంతకల్లు డీఎస్పీ సుప్రజ, సీఐ శ్రీనివాసులు, ఎస్సై ఇస్మాయిల్‌లకు మంగళవారం డీఐజీ బాలకృష్ణ చార్జ్‌మెమోలు జారీ చేశారు. ఆ క్రమంలోనే అనంతపురం వన్‌టౌన్, టూటౌన్ సీఐలు గోరంట్ల మాధవ్, మన్సూరుద్దీన్‌లకు కూడా చార్జ్ మెమోలు జారీ చేయాలని నిర్ణయించారు. జిల్లా ఎస్పీగా సోమవారం బాధ్యతలు చేపట్టిన సెంథిల్‌కుమార్ మంగళవారం ఉదయం ఎస్సై, సీఐ, డీఎస్పీ, ఏఎస్పీలతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాయంత్రం సీఐ, డీఎస్పీ, ఏఎస్పీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. క్రమశిక్షణ తప్పినా.. చట్టాన్ని దుర్వినియోగం చేసినా చర్యలు తప్పవని జారీ చేసిన హెచ్చరికలను చేతల్లోనూ చూపారు. చిలమత్తూరు మండలంలో ఒక గ్రామంలో చోటు చేసుకున్న ఘర్షణపై కేసు నమోదు చేయడంలో అలసత్వం వహించినందుకు ఎస్సై సద్గురుడు, హిందూపురం రూరల్ సీఐ వేణుగోపాల్‌లకు ఎస్పీ సెంథిల్‌కుమార్ చార్జ్ మెమోలు జారీ చేశారు. అనంతపురంలో మంగళవారం ఒక కేసు విచారణలో అలసత్వం వహించిన వన్ టౌన్ ఎస్సై ధరణి కిషోర్‌కు కూడా చార్జ్ మెమో జారీ చేశారు. డీఐజీ బాలకృష్ణ, ఎస్పీ సెంథిల్‌కుమార్ ఒకే సారి చర్యలకు ఉపక్రమించడంతో పోలీసు శాఖలో కలకలం రేగింది.
గీత దాటితే వేటే!
Published Wed, Dec 4 2013 3:17 AM | Last Updated on Tue, Aug 21 2018 8:52 PM
Advertisement
Advertisement