తిక్కతిక్కగా ఉందా.. మా వాళ్లే వదిలెయ్ !
సాక్షి, అనంతపురం : ‘ఏమండీ.. మా వాళ్లని తెలిసీ కూడా జేసీబీని పట్టుకుంటారా? ఏదో తెలిసో.. తెలియకో పట్టుకున్నారు. వెంటనే వదిలిపెట్టండి. లేదంటే మిమ్మల్ని బదిలీ చేయిస్తా. మా ప్రభుత్వంలో మా మాట వినకుండా మీరిక్కడ పనెలా చేస్తారు? ఇక్కడే ఉద్యోగం చేయాలనుకుంటే వెంటనే జేసీబీని విడిచిపెట్టండి’ అంటూ అటవీ శాఖ అధికారులను అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే బెదిరించారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. తాడిమర్రి మండలం నాయనివారిపల్లె అటవీ ప్రాంతంలో టీడీపీకి చెందిన కొందరు నాయకులు జేసీబీతో అక్రమంగా తవ్వకాలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ (ఎఫ్‌ఎస్‌ఓ) నాయక్ సిబ్బందితో కలసి వెళ్లి దాడులు నిర్వహించారు. అక్రమంగా తవ్వకాలు చేపట్టిన వారిని హెచ్చరించి జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. దాన్ని తాడిమర్రి పోలీసుస్టేషన్‌లో అప్పగించిన అధికారులు.. అనంతపురం ఫారెస్టు కార్యాలయానికి వచ్చేశారు. అయితే.. టీడీపీ నాయకులు నేరుగా ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వద్దకు వెళ్లారు. విషయాన్ని చెప్పడంతో ఆగ్రహించిన ఆ ఎమ్మెల్యే.. వెంటనే ఎఫ్‌ఎస్‌ఓకు ఫోన్ చేశారు.
‘ఏమండీ..వాళ్లు మా పార్టీ అని మీకు తెలియదా? లేక తెలిసినా ఏం చేస్తారులే అని అడ్డుకున్నారా? సరే జరిగిందేదో జరిగిపోయింది. వెంటనే తాడిమర్రి పోలీసుస్టేషన్‌కు ఫోన్‌చేసి జేసీబీని విడిచి పెట్టమని చెప్పండి’ అంటూ హుకుం జారీ చేశారు. ఇందుకు ఎఫ్‌ఎస్‌ఓ ససేమిరా అనడంతో ఆగ్రహించిన ఆ ఎమ్మెల్యే ‘ఏం.. తిక్కతిక్కగా ఉందా? ఇది మా ప్రభుత్వం. మేము చెబితే మీరు పనిచేయరా? ఇలాగే ఉంటే బదిలీ తప్పదు’ అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించి ఫోన్ పెట్టేశారు. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బుధవారం సాయంత్రం వరకు వారు జేసీబీని విడిచి పెట్టలేదు.