త్వరలోనే పట్టేస్తాం....ఇంతకీ మూటలో ఏముంది?
సీన్ 1: శుక్రవారం ఉదయం... అనంతపురం నగరంలోని సూర్యనగర్ నుంచి రాజా, రమణ రమేష్ గ్రూప్ థియేటర్ వైపు మార్గంలోని వంతెన వద్ద డ్రెయినేజీలో అనుమానాస్పదంగా ఓ మూట.. సంచి రంధ్రంలోంచి గీతల చొక్కా.. తెల్లటి వెంట్రుకలు కనిపించడంతో వృద్ధుడి మృతదేహంగా భావించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వన్‌టౌన్, టూటౌన్ సీఐలు గోరంట్ల మాధవ్, మన్సూరుద్దీన్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇది మా పరిధి కాదంటే.. మాది కాదంటూ చాలాసేపు వాదులాడుకున్నారు. చివరకు టేపు తెచ్చి కొలత వేసి ఎవరి సరిహద్దో తేల్చుకుందామా అనే స్థాయికి వెళ్లారు.
సీన్ 2: చివరకు టూటౌన్ సీఐ మన్సూరుద్దీన్ కేసు నమోదుకు ముందుకొచ్చారు. త్వరలో మృతదేహం ఎవరిదో గుర్తించి.. నిందితులు ఎవరో దర్యాప్తులో తేలుస్తామని మీడియాకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అప్పటికే మూటలోంచి దుర్వాసన వస్తుండటంతో సంచిని తెరవకుండా ప్లాస్టిక్ కవర్‌లో భద్రంగా ప్యాక్ చేసి.. అంబులెన్‌సలో సర్వజనాస్పత్రి మార్చురీకి తీసుకెళ్లారు.
సీన్ 3: డీఎస్పీ నాగరాజు, సీఐలు, పోలీసులు బయట వేచి ఉండగా.. కానిస్టేబుళ్ల సమక్షంలో శవపంచనామా చేయడానికి పోస్టుమార్టం సిబ్బంది ఆ సంచిని తెరిచారు. అందులో బెల్టు, షర్టు వేసి ఉన్న కుక్క కళేబరం కనిపించింది. అంతే.. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కానిస్టేబుళ్లు బయటకు వచ్చి.. విషయం చెప్పగానే ‘ఛీ..’ అని నవ్వుకుంటూ ఉన్నతాధికారులు వెనుదిరిగారు. అప్పటిదాకా స్టేషన్ సరిహద్దుల గురించి పోట్లాడుకున్న పోలీసు అధికారుల మధ్య నవ్వులు విరబూశాయి.
ఉపసంహారం: శవం కనబడితే... అది హత్య అనుకుంటే... కనీసం ఎలా చంపారో చూడటానికైనా పరిశీలిస్తారు. స్థానికులను పిలిచి చనిపోయిన వ్యక్తి ఎవరనేది గుర్తించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ సంఘటనలో పోలీసులు ఆ దిశగా కనీస ప్రయత్నం చేయకపోవడం విడ్డూరం.