sp shailaja
-
విశ్వనాథ్ గారు నన్ను అమ్మాయి అని కూడా చూడకుండా తిట్టేవాడు..
-
అన్నయ్య తో మంకు పట్టు పట్టాను..
-
SP balasubrahmanyam: మైమరపించే గీతాలు
చిన్నప్పుడు సుశీల పాడిన పాటలు పాడి గుర్తింపు పొందారు బాలూ. గూడూరులో ఆయన ప్రతిభ గమనించి ‘సినిమాల్లో పాడు’ అని ప్రోత్సహించారు జానకి. కలిసి పాడి హిట్స్ ఇచ్చారు వాణి జయరాం. అన్నయ్యకు దీటుగా గొంతు సవరించుకున్నారు ఎస్.పి.శైలజ . ఒక రికార్డింగ్ థియేటర్లో బాలూతో బ్రేక్‌ఫాస్ట్–పాట, మరో థియేటర్లో లంచ్–పాట, మరో థియేటర్లో డిన్నర్ –పాట... ఇలా జీవితం గడిపారు చిత్ర. బాలు మరణించాక వస్తున్న తొలి జయంతి ఇది. జీవించి ఉంటే పుట్టిన్రోజు అనుండేవాళ్లం. ఎందరో మహిళా గాయనులతో పాటలు పాడి శ్రోతలను సేదదీర్చాడు ఆయన. ప్రతి గాయనితో కనీసం ఒక్కో యుగళగీతాన్ని తలుచుకునే సందర్భం ఇది. మావిచిగురు తినగానే (పి.సుశీల) ‘మావిచిగురు తినగానే కోవిల పలుకుతుందట.. కోవిల గొంతు వినగానే మావి– చిగురు తొడుగుతుందట’... తెలుగువారికి మావిచిగురుకి, కోయిలకి, కృష్ణశాస్త్రి కవిత్వానికి, సుశీల–బాలసుబ్రహ్మణ్యంల గొంతులకు ఉన్న అనుబంధం అవిభాజ్యం. ‘సీతామాలక్ష్మి’లో కె.వి.మహదేవన్ బాణీకట్టిన ఈ పాట రైల్వేస్టేషన్లో మొదలయ్యి పచ్చటి దారుల వెంట పరుగుతీస్తుంది. ‘బింకాలు బిడియాలు.. పొంకాలు.. పోడుములు’ అని సుశీల అంటే ‘ఏమో ఎవ్వరిదోగాని ఈ విరి గడసరి’ అని బాలూ అంటూ ఒక చిరునవ్వు నవ్వుతారు. ఆ నవ్వు ఆయన సిగ్నేచర్. పాటల్లో ఆయన నవ్వుకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. అలివేణి ఆణిముత్యమా (ఎస్.జానకి) ‘స్వాతివాన లేతఎండలో... జాలి నవ్వు జాజిదండలో’ అని రాశారు వేటూరి. ఆ స్వాతివాన జానకి అయితే ఆ జాజిదండ బాలూ అయి ఉండవచ్చు. తెలుగు పాటల్లో ఇంత లోగొంతుకతో లాలిత్యంతో సున్నితంగా పాడిన మరొక పాట లేదు. ‘ముద్దమందారం’ సినిమా కోసం రమేశ్ నాయుడు స్వరకల్పనకు జానకి తో కలిసి బాలూ ఇచ్చిన ఆవిరి చిగురు... ఊపిరి కబురు కలకాలం నిలిచి ఉన్నాయి. ‘కుదురైన బొమ్మకి కులుకుమల్లె రెమ్మకి నుదుటబొట్టు పెట్టనా... బొట్టుగా’ అని బాలూ అంటే దానికి జానకి ‘వద్దంటే ఒట్టుగా’ అని పరవశంగా చెప్పే జవాబు ఇక్కడ చదివితే తెలియవు. వినండి. ఎన్నెన్నో జన్మల బంధం (వాణీజయరాం) ఈ పాటలో పల్లవి, చరణాలు ఒకెత్తు. మొదటి చరణం తర్వాత వచ్చే ఆలాపనలు ఒకెత్తు. ‘హా’ అని బాలూ అంటే ‘హా’ అని వాణిజయరాం అంటే ఆ తర్వాత ఇద్దరూ కలిసి ‘ఆ..’ అని తీసే ఆలాపన అద్భుతం. బాలూ పాడిన ఉత్తమ పది డ్యూయెట్లు ఎవరు ఏవి ఎంచినా ఈ పాట ఉంటుంది. ‘నీవు కడలివైతే నే నదిగా మారి చిందులు వేసి వేసి చేరనా’ అని దాశరథి రాశారు. బాలూ–వాణి జయరాంల కాంబినేషన్లో వచ్చిన ఈ పాట అలా శ్రోతల హృదయజలధికి ఎప్పుడో చేరింది. మాటే మంత్రము (ఎస్పి.శైలజ) ‘నీవే నాలో స్పందించినా ఈ ప్రియలయలో శృతి కలిసే ప్రాణమిదే’ అని బాలూ పాడితే వెంటనే శైలజ ‘నేనే నీవుగా పూవూ తావిగా సంయోగాల సంగీతాలు విరిసే వేళలో’... అంటారు. ఏమి యుగళగీతం ఇది. ‘సీతాకోకచిలుక’కు వందల వర్ణాలు ఇచ్చిన యుగళగీతం. అన్నయ్య బాలూతో చెల్లెలు శైలజ ఎన్నో మంచి పాటలు పాడారు. కాని సంఖ్యా పరంగా చూస్తే పాడాల్సినన్ని పాడలేదు అనిపిస్తుంది. సొంత చెల్లెలైనా ఏనాడూ ఆమెను ప్రత్యేకంగా రికమండ్ చేయలేదు బాలూ. శైలజ తన ప్రతిభ తో రాణించారు. ‘పడమటి సంధ్యారాగం’లో ‘పిబరే రామరసం’, శుభసంకల్పంలో ‘సీతమ్మ అందాలూ’... ఈ అన్నాచెల్లెళ్లు కలిసి పంచిన తీపినిమ్మతొనలు ఎన్నని. సన్నజాజులోయ్ కన్నెమోజులోయ్ (ఎల్.ఆర్.ఈశ్వరి) ‘మరో చరిత్ర’లో ‘బలేబలే మగాడివోయ్’ పాటను ఎల్.ఆర్.ఈశ్వరి, బాలూ కలిసి పాడారు. ఎల్.ఆర్.ఈశ్వరి దూకుడు ముందు నిలవడం తోటి గాయకులకు కష్టమే. కాని ఆమె సై అంటే బాలూ సై అనడం వీరిద్దరి పాటల్లో కనిపిస్తుంది. ‘సింహబలుడు’ కోసం వేటూరి రాయగా ఎం.ఎస్.విశ్వనాథన్ చేసిన ‘సన్నజాజులోయ్’ పెద్ద హిట్. ‘ఒకటున్నది నీలో ఒడుపున్నది నాలో’ అని అచ్చు ఎన్.టి.ఆర్ అన్నట్టే బాలూ అని మనల్ని మెస్మరైజ్ చేస్తారు ఈ పాటలో. పూసింది పూసింది పున్నాగ (చిత్ర) గాత్రాన్ని వెనక్కు నెట్టి బీట్‌ను ముందుకు తెచ్చిన 1990ల కాలంలో కీరవాణి రంగప్రవేశం చేసి మళ్లీ మాటను ముందుకు తెచ్చారు. ‘పూసింది పూసింది పున్నాగ’ అందుకు అతి పెద్ద ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. పచ్చటి చేలలో పిల్లగాలుల్లా మారడం ఈ పాటలో బాలూ, చిత్ర చేశారు. వేటూరి సాహిత్యం అందుకు తోడైంది. ‘సీతారామయ్య గారి మనవరాలు’ వేదికయ్యింది. చిత్ర, బాలూ వేల పాటలు పాడారు. కాని ఈ పాట ఎప్పుడూ ప్రత్యేకమే. తెల్లచీరకు తకధిమి తపనలు (లతా) లతా మంగేశ్కర్ తెలుగులో బాలూతో పాడిన ఏకైక డ్యూయెట్. కె.రాఘవేంద్రరావు, ఇళయరాజాల వల్ల ఇది సాధ్యమైంది. లతాతో బాలూ హిందీలో ఎన్నో పాటలు పాడినా తెలుగులో ఇద్దరూ కలిసి పాడటం పాట ప్రియులకు పసందైన జ్ఞాపకంగా నిలిచింది. తెల్లచీరకు తపనలు వేటూరి తప్ప ఇంకెవరు రప్పించగలరు. వైశాఖం, కార్తీకం, ఆషాఢం, హేమంతం.. ఇవన్నీ ఈ పాట చరణాల్లో ఉంటాయి. ఈ ప్రకృతి సౌందర్యాలే లతా మంగేష్కర్, బాలూ గళాలు కూడా. అందుకే ఆ అందం.. ఆ గంధం. ఓ వాలుజడా (సునీత) తెలుగువారికి వాలుజడ సత్యభామ కాలం నుంచి తెలుసు. దానిని ‘రాధాగోపాళం’లో పాటగా మలిచారు బాపురమణ. ‘అన్ని అందాలు స్త్రీలు ముందు ఉన్నా నువ్వొక్కదానివి వెనకెందుకున్నావు?’ అని కవి జొన్నవిత్తుల కొంటెగా వాలుజడను ప్రశ్నిస్తారు ఈ పాటలో. ఈ అచ్చతెనుగు పాటకు బాలూతో పాటు సునీత కాకుండా ఇంకెవరు గొంతు కలపగలరు. జీవితం సప్తసాగర గీతం (ఆశాభోంస్లే) ఈ పాటను ఆశా భోంస్లే మొదలెడతారు. మొదటి చరణం చివరలో బాలూ అందుకుంటారు. ‘హే... బ్రహ్మమానస గీతం.. మనిషి గీసిన చిత్రం.. చేతనాత్మక శిల్పం... మతి కృతి పల్లవించే చోట’... ఇలా పాడేవాళ్లు... ఇలా పాడగలిగినవాళ్లు ఎందరని? ‘చిన్నకృష్ణుడు’ కోసం ఆర్.డి. బర్మన్ చేసిన ఈ పాట వేటూరి మాటల్లో తాత్త్వికంగా ఉంటుంది. బాలూ, ఆశాభోంస్లే గొంతుల వల్ల లోతుగా ఉంటుంది. ‘జీవితం వెలుగు నీడల వేదం’ అని అంటారు వేటూరి. పాటకు ఒక వెలుగు బాలూ లేరు కదా. నీడగా ఆయన జ్ఞాపకమే ఉంది. జగదానందకారకా (శ్రేయా ఘోషాల్) బాలూ ఐదు దశాబ్దాలు పాడారు. పాతతరంతో ఎంత బాగా జోడీ కట్టారో కొత్తతరంలో కూడా అంతే దీటుగా గొంతు కలిపారు. శ్రేయా ఘోషాల్ దేశంలో ఒక ఉత్తమ యువ గాయని. కాని ఆమెతో ఈ డ్యూయెట్ లో బాలూ, శ్రేయా ఇళయరాజా గీతానికి ఎంత సౌందర్యం ఇచ్చారో... ఎలాంటి వాడని తోరణం కట్టారో... జొన్నవిత్తుల ఈ గీతం రాసి ప్రశంసనీయులయ్యారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అన్నయ్య.. మాకు భయం నేర్పారు: ఎస్పీ శైలజ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న అన్నయ్యకు చెల్లెలు కావడం అనే అదృష్టాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు గానంలోనూ, గాత్ర దానంలోనూ ఆ పాటసారికి వారసురాలిగానూ తనను తాను నిరూపించుకున్నారు ప్రముఖ గాయని ఎస్పీ శైలజ. జీ తెలుగులో ప్రసారమయ్యే ‘జీ సరిగమప’ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ నగరానికి రాకపోకలు సాగించే ఈ మధురగాయని అన్నయ్యతో తన అనుబంధం గురించి ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆమె ఏమన్నారంటే.. అన్నయ్యతో మధుర క్షణాలు ఎన్నో ఎన్నెన్నో.. ఎన్నని పంచుకోను? ఎత్తుకుని పెంచాడు. వేలుపట్టి నడిపించా డు. ఎలా మాట్లాడాలి? ఎలా పాటలు పాడాలి? అని మాత్రమే కాదు.. ఎలా నడుచుకోవాలో కూడా నేర్పించాడు. తొలి కచేరీ అన్నయ్యతో కలిసి పాడిన సమయంలో చాలా చిన్నదాన్ని. నాకు భయం ఉండేది కాదు. అన్నయ్య మాత్రం నా విషయంలో గాభరాపడేవాడు. తనెలా పాడుతుందో ఆని భయపడేవాడు. తర్వాత తర్వాత నామీద నమ్మకం వచ్చింది తన కి. ఆయనతో కలిసి వేల కచేరీ లు చేశాను. ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం. ఒకో అనుభవం. ప్రతి కచేరీ ముందు స్ట్రిక్ట్‌గా సాధన చేయించేవాడు. అంత పెద్ద ఆర్టిస్టయినా ఎన్ని వేల కచేరీలు చేసినా ప్రతి కచేరీనీ అదే మొదట కచేరీగా భావించేవాడు. స్టేజీ మీదకు వెళుతూ ‘నాకు మొదటి పాట పాడేంత వరకూ ఈ చాలా కంగారుగా, భయంగా ఉంటుంది నీకెలా ఉంది? అనేవాడు. నేనేమో..‘స్టేజ్ ఎక్కా క ఇంక చేసేదేముంది? పాడేసేయడమే భగవంతుడే చూసు కుంటాడు’ అనేదాన్ని. ఆ తర్వాత అర్థమైంది. అది అవసరమైన భయం అని. అన్నయ్య ప్రతి కచేరీకి ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చేవాడు. అవన్నీ మేం చూసి నేర్చుకున్నాం. ఆయన పొగిడితే.. ఆ ఆనందమే వేరు.. నేను.. చరణ్.. పల్లవి.. మా సిస్టర్స్.. ఇలా ఎవరైనా ఏదై నా పని మీరు బాగా చేశారు అని అన్నయ్య అంటే చాలు పెద్ద అవార్డు వచ్చినంత ఆనందపడేవాళ్లం. ఎందుకంటే సామాన్యంగా తను లోలోపల ఆనందిస్తాడు గానీ బయటకు చెప్పుకోడు. నువ్విలా చేశావ్. బాగా పాడావు అని చాలా రేర్‌గా పొగిడేవారు. అలాంటి అరుదైన ఆనందాలు జీవితంలో నాకు చాలా దక్కాయి. అంత మాత్రా న సాధన సమయంలో ఆయనెప్పుడూ కోప్పడ్డం కూడా చూడలేదు. కోప్పడితే అవతలి ఆర్టిస్ట్ మూడ్ డిస్ట్రబ్ అవుతుందని ఆయనకు తెలుసు. ఇది సరిచేసుకో అది సరిచేసుకో.. కొంచెం ఎక్స్ప్రెషన్తో ఓపికగా సలహాలు ఇచ్చేవాడు. ఒక్క చూపుతో మన ప్రవర్తన ఏమిటనేది చెప్పగలిగేవాడు. మరీ ఇంత పర్ఫెక్షనిస్ట్ ఏమిటీయన అనుకునే దశ నుంచి వాటన్నింటినీ తిరిగి అలాగే పాటించే దశకు చేరుకున్నాం. ఇప్పుడు జీ సరిగమన లాంటి పోటీల్లో జడ్జిగా.. ఆ సూచనలే స్ఫూర్తి. మేం కలిసి పాడిన పాటలన్నీ నాకిష్టమే. మరీ ముఖ్యంగా ‘మాటే మంత్రము’తోపాటు ‘సాగర సంగమం’లో పాడిన పాటలు బాగా ఇష్టం. గుండెల్లో భద్రంగా.. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే తనే కారణం. ఇంకా మున్ముందుకు సాగాలంటే కూడా తనే కారణం కావాలి. తనే ఆ ధైర్యం నింపాలి. ప్రస్తుతం శూన్యంలో ఉన్నట్టున్నాం. ఆయన ఆ ఖాళీని భర్తీ చేసి మాలో తను నిండి మమ్మల్ని తన బాటలో నడిపిస్తారని ఆశిస్తున్నాను. అన్నయ్య మధుర జ్ఞాపకాలు మాత్రమే గుర్తుంచుకుని ఆయన లేడనే బాధ నుంచి మేం కోలుకుంటున్నాం. ఒకప్పుడు భౌతికంగా మాతో ఉన్నా ఇప్పుడు విశ్వమంతా వ్యాపించి మాతోనే నడుస్తున్నాడు అనే ధైర్యం మాకుంది. ఆయన ఎప్పుడూ మా పక్కనే ఉంటాడు. మాతో తనుంటాడు. ఈ సమయంలో పూజలు, ప్రార్థనలతో ఎంతో మద్దతు ఇచ్చిన బాలూ అభిమానులందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మీ గుండెల్లో ఆయనను భద్రపరచుకున్నారు. ఇలాగే మీలో.. మాలో ఆయన నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. -
అలరించిన ఎస్పీ శైలజ గానామృతం
శ్రీశైలం: శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఎస్పీ శైలజ, శివకాకాని బృందం వారి భక్తి సంగీత విభావరి భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. సోమవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ శైలజతోపాటు గోపికాపూర్ణిమ, శ్రీనివాస్, హరి, పారిజాత, హరిప్రియలు శివ శివ శంకరా, బ్రహ్మమురారి, ఓం నమఃశివాయా, శృతినీవు, గతినీవు విభాతన తలపున, అందెల రవమిది తొలిమంచు, అనతి నియరా ప్రభు, వేదం... అణువణువన నాదం తదితర గీతాలను ఆలపించారు. అలాగే వేణుగానాన్ని సత్యశ్రీనివాస్, కీబోర్డును వెంకటేష్, పుణి, వినయ్ డోలక్, సంతోష్, ముఖేష్ తబల సహకారాన్ని అందించారు. కార్యక్రమంలో ఈఓ నారాయణభరత్‌గుప్త, జేఈఓ హరినాథ్‌రెడ్డి, స్థానికులు, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. కళానీరాజనంలో భాగంగా మంగళవారం యల్లా వెంకటేశ్వరరావు బృందం వారి మృదంగ స్వరలయమాధురి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఈఓ తెలిపారు.