హస్తవ్యస్తం!
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచార రంగంలోకి దూకారు. వైఎస్ఆర్సీపీ, టీడీపీల అభ్యర్థులు తమ జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఎవరి స్థాయిలో వారు ప్రచారంలో దూసుకుపోయేందుకు ప్రయత్నిస్తుండగా మరో ప్రధాన పక్షమైన కాంగ్రెస్ అభ్యర్థులు దిశానిర్దేశం చేసే నాయకులు లేక దిక్కులు చూస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులను నిలపడంలో విఫలమైన ఆ పార్టీ.. ప్రచారంలోనూ ఉత్సాహం కొరవడటంతో పార్టీ శ్రేణులు, అభ్యర్థులు డీలా పడిపోతున్నారు. జిల్లాలో 38 జెడ్పీటీసీలు, 675 ఎంపీటీసీలు ఉండగా 23 జెడ్పీటీసీల్లో కాంగ్రెస్ అభ్యర్థులే లేరు. అలాగే 12 మండలాల్లో పూర్తిగా, ఇంకా చాలా మండలాల్లో సగానికిపైగా ఎంపీటీసీ అభ్యర్థులను కూడా నిలపలేకపోయిన కాంగ్రెస్ పోటీలో ఉన్న స్థానాలనెనా చేజిక్కించుకునే దిశగా ప్రచారం ముమ్మరం చేయలేకపోతోంది.
మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెళ్లిపోయిన తర్వాత తానే జిల్లా పార్టీకి పెద్ద దిక్కుగా భావించిన కేంద్రమంత్రి కిల్లి కృపారాణి జిల్లాలో ఉన్నారో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికలపై ఆమె దృష్టి కేంద్రీకరించిన దాఖలాల్లేవు. తన సొంత నియోజకవర్గమైన టెక్కలి అభ్యర్థుల గురించే ఆమె పట్టించుకోవడం లేదు. రాష్ట్ర మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్దీ అదే పరిస్థితి. సొంత నియోజకవర్గమైన ఎచ్చెర్లలోగానీ.. ప్రాతినిధ్యం వహిస్తున్న రాజాంలో గానీ పార్టీ ప్రచారం గురించి ఆయన పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో ఎందుకు పోటీకి దిగామా అని కాంగ్రెస్ తరఫున రంగంలో ఉన్న అభ్యర్థులు మధన పడుతున్నారు. అలా అని వెనక్కు తగ్గలేక.. ప్రధాన ప్రత్యర్థులతో పోటీ పడి ముందుకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు.
ఆత్మస్థైర్యం కోల్పోయిన కాంగ్రెస్ కార్యకర్తలు, రెండో శ్రేణి నాయకులు మరింతగా కుంగిపోతూ పక్కచూపులు చూస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల దుస్థితిని గమనించిన టీడీపీ అభ్యర్థులు ఎలాగోలా వారిని తమవైపు తిప్పుకొని ఎన్నికల పోరాటంలో లాభపడాలని లోపాయికారీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే కొందరు టీడీపీ అభ్యర్థులకు పార్టీ నుంచి ప్రచార నిధులు అందడంతో దాన్ని ప్రచారం కోసం కంటే కాంగ్రెస్ నాయకులను మచ్చిక చేసుకునేందుకు వినియోగించాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు కూడా గెలిచే పరిస్థితి లేనప్పుడు ప్రచారానికి భారీగా సొమ్ము ఖర్చు చేసి చేతులు కాల్చుకోవడం కంటే టీడీపీతో ఒప్పందానికి వచ్చి సొమ్ము చేసుకుంటేనే మేలన్న భావనకు వచ్చేశారు.