special CBI court
-
నిందితులంతా నిర్దోషులే
ముంబై: పదమూడేళ్లనాటి సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో 21మంది పోలీసు అధికారులు సహా మొత్తం 22 మందీ నిర్దోషులేనని స్పెషల్ సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సొహ్రాబుద్దీన్, అతని భార్య కౌసర్ బీ, అనుచరుడు తులసీ ప్రజాపతిల మృతిలో కుట్ర కోణం, ఆ ముగ్గురి మృతితో నిందితులకు ప్రమేయం ఉందన్న ఆరోపణలపై ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాధారాలను చూపలేకపోయిందంటూ స్పెషల్ సీబీఐ కోర్టు జడ్జి ఎస్జే శర్మ తీర్పుచెప్పారు. ‘22 మంది నిందితులపై కుట్ర ఆరోపణలను సమర్ధనగా సీబీఐ ఎలాంటి ఆధారాలను చూపలేకపోయింది. దీంతో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తున్నాం’ అని తీర్పుచెప్పారు. సొహ్రాబుద్దీన్ షేక్‌కు లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని మోదీని హత్య చేసేందుకు కుట్ర పన్నాడనేది పోలీసుల ఆరోపణ. అప్పటి డీజీపీ వంజారా ఆదేశాల మేరకే మరో అధికారి పీసీ పాండే ఎన్కౌంటర్లో ప్రజాపతిని చంపారని సీబీఐ ఆరోపించింది. అయితే, ఇందుకు ఫోన్‌కాల్స్ వంటి ఎలాంటి ఆధారాలను చూపకపోవడంతో న్యాయస్థానం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. సీబీఐ కోర్టు తీర్పుపై సొహ్రాబుద్దీన్ సోదరుడు రుబాబుద్దీన్ స్పందించారు. ఈ తీర్పు విచారకరమనీ, దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. గ్యాంగ్‌స్టర్ సొహ్రాబుద్దీన్, అతని భార్య కౌసర్ బీ, అనుచరుడు తులసీ ప్రజాపతితో కలిసి హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని సాంగ్లీకి బస్సులో వస్తుండగా 2005 నవంబర్ 22వ తేదీ రాత్రి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అదే ఏడాది నవంబర్ 26వ తేదీన సొహ్రాబుద్దీన్, మరో మూడు రోజుల తర్వాత కౌసర్ బీ హత్యకు గురయ్యారు. వీరిని గుజరాత్, రాజస్తాన్ పోలీసు బృందమే హత్య చేసిందని సీబీఐ ఆరోపించింది. ప్రజాపతిని ఉదయ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉంచిన పోలీసులు 2006 డిసెంబర్ 27వ తేదీన గుజరాత్–రాజస్తాన్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో చంపేశారని సీబీఐ పేర్కొంది. ఈ కేసులోని 22 మంది నిందితుల్లో 21 మంది గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాలకు చెందిన దిగువ స్థాయి పోలీసు అధికారులు కాగా 22వ వ్యక్తి గుజరాత్లో సొహ్రాబుద్దీన్ దంపతులు హత్యకు ముందు బస చేసిన ఫాంహౌస్ యజమాని. గుజరాత్ సీఐడీ నుంచి కేసు దర్యాప్తు బాధ్యతలను చేపట్టిన సీబీఐ.. అప్పటి గుజరాత్ హోం మంత్రి, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, అప్పటి రాజస్తాన్ హోం మంత్రి గులాబ్‌చంద్ కటారియా, ఐపీసీ అధికారులు వంజారా, పీసీ పాండే సహా 38మందిపై ఆరోపణలు మోపింది. మొత్తం 210 మంది సాక్షులను విచారించగా అందులో 92 మంది వ్యతిరేకంగా మాట్లాడారు. విచారణ నిష్పాక్షికంగా సాగేందుకు ఈ కేసును గుజరాత్ నుంచి మహారాష్ట్రకు బదిలీ చేయాలన్న సీబీఐ పిటిషన్‌కు అనుకూలంగా 2013లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ కోర్టు జడ్జి బీహెచ్ లోయా మూడేళ్ల క్రితం మృతి చెందడం కూడా వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కేసు విచారణ సాగిందిలా.. నవంబర్ 22, 2005: గ్యాంగ్‌స్టర్ సొహ్రాబుద్దీన్ షేక్, ఆయన భార్య కౌసర్ బీ, అనుచరుడు తులసి ప్రజాపతి హైదరాబాద్ నుంచి సాంగ్లికి బస్సులో వస్తుండగా పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. షేక్ దంపతులను ఒక వాహనంలో, ప్రజాపతిని మరో వాహనంలో తీసుకెళ్లారు. నవంబర్ 22 నుంచి 25 2005: అహ్మదాబాద్ సమీపంలోని ఒక ఫాం హౌస్‌లో సొహ్రాబుద్దీన్, కౌసర్ బీలను ఉంచారు. ప్రజాపతిని ఉదయ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు నవంబర్ 26, 2005: గుజరాత్, రాజస్థాన్ పోలీసులు కలిసి జరిపిన ఎన్కౌంటర్లో సొహ్రాబుద్దీన్ మరణించాడు. అది నకిలీ ఎన్కౌంటర్ అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి నవంబర్ 29, 2005: కౌసర్ శరీరమంతా కాలిన గాయాలతో శవమై కనిపించింది. డిసెంబర్ 27, 2006: రాజస్థాన్, గుజరాత్ పోలీసు బృందం ఉదయ్‌పూర్ సెంట్రల్ జైలు నుంచి ప్రజాపతిని తీసుకువెళుతూ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని సర్హాద్ చప్రిలో జరిగిన ఎన్కౌంటర్లో చంపేశారు. మే 22, 2006: ఈ ఎన్కౌంటర్ కేసును విచారించాలని, కౌసర్ ఆచూకీ తెలపాలంటూ సొహ్రాబుద్దీన్ కుటుంబసభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా గుజరాత్ రాష్ట్ర సీఐడీని ఈ కేసును విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జనవరి 2010: సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. జులై 23, 2010: అప్పటి గుజరాత్ హోంమంత్రి అమిత్ షా, అప్పటి రాజస్థాన్ హోంమంత్రి గులాబ్‌చంద్ కటారియా, ఇతర ఐపీఎస్ అధికారులతో పాటు 38 మందిపై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. జులై 25: అమిత్ షాను సీబీఐ అరెస్ట్ చేసింది. డిసెంబర్ 30, 2014: ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు అమిత్‌ను కేసు నుంచి విముక్తుడ్ని చేసింది. ఇతర ఐపీఎస్ అధికారులు బయటపడ్డారు. నవంబర్ 2017: సీబీఐ ప్రత్యేక జడ్జి ఎస్జే శర్మ కేసు విచారణను ప్రారంభించారు డిసెంబర్ 21, 2018: సరైన సాక్ష్యాలు లేవంటూ 22 మందికి విముక్తి కల్పిస్తూ తీర్పు నిర్దోషులుగా బయటపడిన పోలీసులు -
కోర్టు ముందు లొంగిపోయిన లాలూ
రాంచీ: దాణా కుంభకోణం కేసుల్లో దోషి, బిహార్ మాజీ సీఎం అయిన లాలూ ప్రసాద్ యాదవ్. గురువారం సీబీఐ కోర్టు ఎదుట లొంగిపోయారు. తన తాత్కాలిక బెయిల్ గడువు ముగియడంతో సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు సరెండర్ అయ్యారు. తర్వాత లాలూను బిర్సా ముండా జైలుకు తరలించారు. సీబీఐ ప్రత్యేక కోర్టుల ముందు లొంగిపోవాలని జార్ఖండ్ హైకోర్టు ఇటీవల లాలూను ఆదేశించడం తెల్సిందే. చాయ్‌బసా ఖజానా నుంచి అక్రమంగా నగదు ఉపసంహరించిన కేసుకు సంబంధించి తొలుత జడ్జి ఎదుట లాలూ హాజరయ్యారు. తర్వాత డియోఘర్, డమ్కా ట్రెజరీ కేసులకు సంబంధించి మరో జడ్జి ఎదుట లొంగిపోయారు. దాణా కుంభకోణానికి సంబంధించిన 4 కేసుల్లో లాలూ దోషిగా తేలారు. -
మూడో కేసులోనూ లాలూ దోషే
-
మూడో కేసులోనూ లాలూ దోషే
రాంచీ: దాణా కుంభకోణానికి సంబంధించిన మూడో కేసులోనూ బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం దోషిగా తేల్చింది. లాలూతోపాటు మరో మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా కూడా దోషేనని పేర్కొన్న కోర్టు..వీరిద్దరికీ ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది. వీరు ఒక్కోసారి 5 లక్షల రూపాయలను రెండు దఫాల్లో చెల్లించొచ్చు. జరిమానా కట్టని పక్షంలో వారు మరో ఏడాది సాధారణ జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. 1992–93 మధ్య కాలంలో చాయ్‌బాసా ఖజానా నుంచి రూ. 37.62 కోట్లను వీరు అక్రమంగా కాజేసినట్లు గుర్తించిన సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎస్ఎస్ ప్రసాద్..ఇదే కేసులో మరో 50 మందిని కూడా దోషులుగా తేల్చారు. బిహార్ మాజీ మంత్రి విద్యాసాగర్ నిషద్, బిహార్ శాసనసభ ప్రజా పద్దుల కమిటీ మాజీ చైర్మన్ జగదీశ్ శర్మ, మాజీ ఎమ్మెల్యేలు ధ్రువ్ భగత్, ఆర్కే రాణా, ముగ్గురు మాజీ ఐఏఎస్ అధికారులు దోషుల జాబితాలో ఉన్నారు. తీర్పు వెలువడిన అనంతరం లాలూ కొడుకు, బిహార్ శాసనసభలో ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ ‘సీబీఐ కోర్టు తీర్పుకు మేం కట్టుబడి ఉంటాం. అయితే ఈ తీర్పే అంతిమం కాదు. హైకోర్టులో అప్పీల్ చేస్తాం. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్తాం’ అని అన్నారు. బిహార్ ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్, బీజేపీ కలసి కుట్రపన్ని తన తండ్రిని ఈ కేసుల్లో ఇరికించాయని తేజస్వీ ఆరోపించారు. అన్ని శిక్షలూ ఏకకాలంలోనే అమలు దాణా కుంభకోణానికి సంబంధించి మొత్తం ఐదు కేసులుండగా వాటిలో లాలూకు ఇప్పటికే మూడు కేసుల్లో శిక్ష ఖరారైంది. మరో రెండు కేసులు విచారణ దశలో ఉన్నాయి. ప్రస్తుతం బిర్సాముండా జైలులో లాలూ శిక్షననుభవిస్తున్నారు. తొలికేసులో తీర్పు 2013లోనే వెలువడగా అప్పట్లో లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. అయితే ఆయన హైకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారు. రెండో కేసులో తీర్పు ఈ ఏడాది జనవరి 6న వచ్చింది. ఈ కేసులో లాలూకు మూడున్నరేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానాను సీబీఐ కోర్టు విధించింది. తొలి కేసులో ఐదేళ్లు, రెండో కేసులో మూడున్నరేళ్లు, మూడో కేసులోనూ ఐదేళ్లు కలిపి మొత్తం లాలూకు పదమూడున్నరేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. అయితే ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అమలవుతాయి కాబట్టి ఆయన ఐదేళ్లు మాత్రమే జైలులో ఉంటే చాలు. మరో రెండు కేసుల్లోనూ లాలూ ఇంకా నిందితుడిగా ఉన్నారు. వాటిలోనూ దోషిగా తేలి శిక్ష పడితే..అన్ని కేసుల్లోకెళ్లా అత్యధిక శిక్షాకాలం ఏది ఉంటుందో అంతకాలం మాత్రం ఆయన జైలులో ఉండాల్సి ఉంటుంది. -
నేటి నుంచి అయోధ్య కేసుల విచారణ
లక్నో: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులుసహా బీజేపీ సీనియర్ నాయకులు ఎల్కే ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ ఉమా భారతిలపై నమోదైన కేసును నేడు లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు విచారించనుంది. కుట్ర ఆరోపణలపై నేర విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆడ్వానీ, జోషీ, ఉమా భారతిలను గత నెలలో ఆదేశించిన సుప్రీంకోర్టు.. సంబంధిత కేసును రాయ్‌బరేలీ నుంచి లక్నోకు బదిలీచేయాలని ఆదేశాలిచ్చింది. మరో కేసులో నిందితుల్లో ఒకరైన సతీశ్ ప్రధాన్ హాజరుకాకపోవడంతో కేసును కోర్టు విచారించలేదు. రాజకీయంగా సున్నితమైన కేసు కావడంతో ఈ కేసును సీబీఐ కోర్టు ప్రతిరోజూ విచారిస్తోంది. -
'స్పృహ కోల్పోతున్నాను.. బెయిల్ ఇవ్వండి'
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ నెలాఖరు వరకు (మార్చి 31)వాయిదా వేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయం వెలువరించింది. తన ఆరోగ్యం బాగాలేని కారణంగా ఆస్పత్రిలో చూపించుకునేందుకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ గత ఫిబ్రవరి నెలలో ఈ కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇటీవల బలహీనత కారణంగా తాను తరుచూ కళ్లు తిరిగి పడిపోతున్నానని పిటిషన్ లో పేర్కొంది. కన్న కూతురుని దేశం నివ్వెరపోయేలా ఇంద్రాణి హత్య చేసిన విషయం తెలిసిందే. -
విధీ కోసం ఇంద్రాణికి ప్రత్యేక అనుమతి
ముంబై: షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు, ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న ఇంద్రాణి ముఖర్జియాకు సీబీఐ న్యాయస్థానం ప్రత్యేక అనుమతులిచ్చింది. ఇంద్రాణి రెండో కూతురు విధీ చదువుల నిమిత్తం చెక్కులపై సంతకాలు చేసేందుకు ఓకే చెప్పింది. రిమాండ్ గడువు ముగిసిన నేపథ్యంలో నిందితులు ఇంద్రాణి, సంజీవ్ ఖన్నా, శ్యామ్ రాయ్ లను సీబీఐ అధికారులు సోమవారం కోర్టులో హాజరుపర్చారు. జనవరి 16 వరకు జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చిన కోర్టు.. చెక్కులపై సంతకాలకు కూడా అనుమతించింది. కోర్టు హాలు బయట ఇంద్రాణి- విధీలు కౌగిలించుకుని కన్నీటిపర్యంతమయ్యారు. తల్లీకూతుళ్లు ఒకరినొకరు ఓదార్చుకున్నారు. విచారణ అనంతరం తిరిగి జైలుకు వెళ్లేందుకు పోలీస్ వ్యాన్ ఎక్కిన సందర్భంలోనూ ఇరువురూ భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు జైలు తిండి తనకు పడటంలేదని, ఇంటినుంచి భోజనం తెప్పించుకుంటానన్న సంజీవ్ ఖన్నా అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. విధీ.. ఇంద్రాణి- సంజీవ్ ఖన్నాల కూతురు.