రెండో కుమార్తె విధీతో ఇంద్రాణి (ఫైల్)
ముంబై: షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు, ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న ఇంద్రాణి ముఖర్జియాకు సీబీఐ న్యాయస్థానం ప్రత్యేక అనుమతులిచ్చింది. ఇంద్రాణి రెండో కూతురు విధీ చదువుల నిమిత్తం చెక్కులపై సంతకాలు చేసేందుకు ఓకే చెప్పింది. రిమాండ్ గడువు ముగిసిన నేపథ్యంలో నిందితులు ఇంద్రాణి, సంజీవ్ ఖన్నా, శ్యామ్ రాయ్ లను సీబీఐ అధికారులు సోమవారం కోర్టులో హాజరుపర్చారు. జనవరి 16 వరకు జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చిన కోర్టు.. చెక్కులపై సంతకాలకు కూడా అనుమతించింది.
కోర్టు హాలు బయట ఇంద్రాణి- విధీలు కౌగిలించుకుని కన్నీటిపర్యంతమయ్యారు. తల్లీకూతుళ్లు ఒకరినొకరు ఓదార్చుకున్నారు. విచారణ అనంతరం తిరిగి జైలుకు వెళ్లేందుకు పోలీస్ వ్యాన్ ఎక్కిన సందర్భంలోనూ ఇరువురూ భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు జైలు తిండి తనకు పడటంలేదని, ఇంటినుంచి భోజనం తెప్పించుకుంటానన్న సంజీవ్ ఖన్నా అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. విధీ.. ఇంద్రాణి- సంజీవ్ ఖన్నాల కూతురు.