ఆర్టీసీ పండుగ బాదుడు
సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకునే సన్నాహాల్లో సంస్థ
హైదరాబాద్ నుంచి 100 ప్రత్యేక బస్సులు
తిరుగు ప్రయాణానికి విశాఖ నుంచి 45 బస్సులు
ఇతర ప్రాంతాలకూ అదనపు బస్సులు
వీటిన్నింటిలో 50 శాతం అదనపు చార్జీలు
విశాఖపట్నం : సందట్లో సడేమియా అన్నట్లు ఆర్టీసీ సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రయాణికుల అవసరాలను గుర్తించి, రద్దీని తట్టుకునేందుకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామంటూనే.. పనిలో పనిగా ప్రత్యేక సర్వీసులకు ప్రత్యేక చార్జీల పేరుతో దండుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. పండుగ సీజన్లో సహజంగానే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. దూరతీరాల్లో ఉన్న వారంతా స్వగ్రామాలకు రావడానికి ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే రెగ్యులర్ రైళ్లన్నింటిలో రిజర్వేషన్లు పూర్తి అయ్యాయి. ప్రత్యేక రైళ్లదీ అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళ్లాలనుకునే వారికి బస్సులే శరణ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకొని వందలాది ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు ఆర్టీసీ విశాఖ రీజనల్ మేనేజర్ సుధేశ్‌కుమార్ తెలిపారు. రెగ్యులర్ సర్వీసులకు అదనంగా నడిపే ఈ ప్రత్యేక సర్వీసుల్లో చార్జీలు కూడా ప్రత్యేకంగానే ఉంటాయని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారన్నారు. రెగ్యులర్ సర్వీసుల్లో వసూలు చేసే చార్జీలపై 50 శాతం ఎక్కువగా ఈ చార్జీలు ఉంటాయని వివరించారు. హైదరాబాద్ నుంచి వేల సంఖ్యలో విశాఖ, తదితర ఉత్తరాంధ్ర జిల్లాలకు తరలివచ్చే వారిని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్-విశాఖ మధ్య సుమారు 100 బస్సులు నడపాలని నిర్ణయించారు.
ఈ బస్సులు జనవరి 8 నుంచి 14వ తేదీ వరకు హైదారబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరుతాయి. అలాగే సంక్రాంతి పండుగ అనంతరం విశాఖ నుంచి హైదారబాద్ వెళ్లే ప్రయాణికుల కోసం 45 బస్సులు, విజయవాడకు 50, కాకినాడకు 20, రాజమండ్రికి 30 బస్సులు నడుపుతారు. బెంగుళూరు, చెన్నై తదితర రాష్ట్రేతర ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న బస్సులకు అదనంగా ఒక్కో బస్సు అదనంగా వేస్తారు. ఈ బస్సులన్నీ జనవరి 16, 17, 18, 19 తేదీల్లో విశాఖ నగరంలోని ద్వారకా బస్‌స్టేషన్ నుంచే బయలుదేరుతాయి. రెగ్యులర్ బస్సులతోపాటు ప్రత్యేక సర్వీసులకు ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. జనవరి ప్రారంభం నుంచి లభించే ఈ సౌకర్యాన్ని ఠీఠీఠీ.్చఞటట్టఛి ౌజీౌ.జీ ద్వారా పొందవచ్చు. అలాగే ద్వారకా బస్‌స్టేషన్ వద్ద, ఇతర అధీకృత ఏజెంట్ల వద్ద కూడా రిజర్వేషన్ చేసుకోవచ్చని ఆర్ఎం సుధేశ్‌కుమార్ చెప్పారు.