‘మిషన్ భగీరథ’ వేగవంతం!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేసి సురక్షిత మంచినీటిని అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు మరింత వేగవంతం కానున్నాయి. ఈ నెల 2, 3 న జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలపై అధికారులతో సమీక్ష జరిపిన సంగతి తెలిసిందే. కొన్ని సందర్భాల్లో మిషన్ భగీరథ పనుల్లో అలసత్వంపై ఆయన అసంతృప్తిని కూడ వ్యక్తం చే శారు. మిషన్ భగీరథ పనుల వేగం పెంచేందుకు సీఎం కార్యాలయపు అదనపు కార్యదర్శి స్మితసబర్వాల్ను ప్రత్యేక పర్యవేక్షణ కోసం పంపిస్తామని చెప్పారు.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితారాణా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతోసమావేశం నిర్వహించి పనుల వేగం పెంచారు. ఇదే సమయంలో మిషన్ భగీరథ పనులు నిర్దేశిత లక్ష్యం ప్రకారం పూర్తయ్యేందుకు ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్మిత సబర్వాల్ మంగళవారం మెదక్, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లు రొనాల్డ్‌రోస్, డాక్టర్ యోగితారాణాలు, ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టు సంస్థల నిర్వాహకులతో కలిసి పనులను పరిశీలించారు.
మెదక్, నిజామాబాద్‌లో పనుల పరిశీలన..
జిల్లాలోని ప్రతి ఇంటికి తాగునీటిని సరఫరా చేసేందుకు రూ.1300 కోట్ల అంచనాతో మెదక్ జిల్లా సింగూరు ప్రాజెక్టు సమీపంలో పెద్దరెడ్డిపేట వద్ద నిర్మిస్తున్న ఇన్‌టెక్ వెల్, వాటర్ గ్రిడ్ ట్రిట్మెంట్ ప్లాంట్, పంపింగ్ వెల్ పనులను స్మిత సబర్వాల్ తనిఖీ చేశారు. అనంతరం బాల్కొండ మండలంలోని ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్‌తో జలాల్పూర్ వద్ద నిర్మించే మిషన్ భగీరథ పనులను సబర్వాల్ పరిశీలించారు.
ఇన్‌టెక్ వెల్, పంపింగ్ హౌస్, రోజుకు 14 కోట్ల లీటర్ల సామర్థ్యం గల మూడు వాటర్ ట్రిట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి రూ. 1350 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆమె తెలిపారు. జలాల్పూర్ ఇన్‌టెక్ వెల్‌కు అనుసంధానంగా అర్గుల్ వద్ద రోజుకు 6 కోట్ల లీటర్లు, ఇందల్వాయి వద్ద రోజుకు 4 కోట్ల లీటర్లు, మల్లన్నగుట్ట వద్ద రోజుకు 4 కోట్ల లీటర్ల సామర్థ్యం గల ట్రిట్మెంట్ ప్లాంట్ల పనులు చురుకుగా సాగుతున్నట్లు తెలిపారు.
వీటికి తోడుగా గతంలో ఈ ప్రాంతంలో నిర్మించిన ఒక్కొక్కటి 3 కోట్ల లీటర్ల సామర్థ్యం కలిగిన 3 వాటర్ ట్రిట్మెంట్ ప్లాంట్లకు జలాల్పూర్ వద్ద నిర్మించే ఇన్‌టెక్ వెల్ నుంచి నీటిని సరఫరా చేయనున్నట్లు తెలిపారు. జలాల్పూర్ ఇన్‌టెక్ వెల్ నుంచి 20 మండలాల్లోని 860 ఆవాసాలకు తాగునీరు సరఫరా చేయనున్నట్లు తెలిపారు.
ఇంటింటికీ సురక్షిత నీరు..
స్మిత సబర్వాల్‌తో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితారాణా, మెదక్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్, మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ జగన్మోహన్రెడ్డి, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఎస్ఈ ప్రసాద్‌రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, మెగా ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్మితసబర్వాల్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న మిషన్ భగీరథ ప్రాజెక్టు రాష్ట్రానికే తలమానికం కావాలన్నారు.
నిర్ణీత కాలంలో నిర్దేశించిన గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రధాన పనులతో పాటు గ్రామాలలో ఇంటింటికి అనుసంధానం చేసే పైపులైన్ల పనులను కూడా ఏకకాలంలో చేపట్టి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పైపులైన్ల నిర్మాణపు పనులను మే నెలాఖరులోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రైతులకు నష్టం జరగరాదన్నారు.
పెద్దరెడ్డిపేట వద్ద నిర్మించే వాటర్ ట్రిట్మెంట్ ప్లాంట్ సామర్థ్యం రోజుకు 14 కోట్ల 50 లక్షల లీటర్లు ఉందని తెలిపారు. పెద్దరెడ్డి పేట నుంచి 5.25 కిలో మీటర్లు దూరంలో ఉన్న తడమనూరు (మెదక్ జిల్లా)కు 100 మీటర్ల ఎత్తున పంపింగ్ చేయనున్నట్లు తెలిపారు. తడమనూరు నుంచి గ్రావిటి ద్వారా జుక్కల్, బాన్సువాడ, బోధన్ నియోజక వర్గాలలోని అన్ని గ్రామాలతో పాటు బోధన్ మున్సిపాలిటీకి, ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని కొన్ని గ్రామాలకు సింగూరు జలాలను శుద్ధిచేసి సరఫరా చేయనున్నట్లు తెలిపారు.
మొత్తం 16 మండలాల్లోని 785 ఆవాసాలకు తాగునీరు సరఫరా చేయడం లక్ష్యమన్నారు. 2017 జూన్ నాటికి 213 గ్రామాలకు, 2017 డిసెంబరు నాటికి 512 గ్రామాలకు సింగూరు జలాలు అందుతాయని తెలిపారు. ఈ పనులను వేగంగా పూర్తి చేయించేందుకు ప్రభుత్వం రెగ్యులర్‌గా మానిటరింగ్ చేస్తున్నట్లు ఆమె తెలిపారు.