వి'దాహ'నగరం
ఈ చిత్రంలో కనిపిస్తున్న మంచినీటి పథకం విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌కు కూతవేటు దూరంలో ఉన్న తోటపాలెం వైఎస్సార్‌నగర్‌లో ఉంది. సుమారు రూ. 45.5లక్షల వ్యయంతో 2015లో నిర్మించిన ఈ పథకం కొన్ని నెలలుగా పనిచేయడంలేదు. కానీ, ఏ ఒక్క అధికారీ పట్టించుకున్న పాపాన పోలేదు. మరమ్మతు చేయిద్దామని ముందుకు రావడం లేదు. ఇక్కడి ప్రజలు తాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. అయినా వారికి పట్టడంలేదు. ఇది జిల్లా కేంద్రంలో ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్యే అనుకుంటే పొరపాటే. జిల్లాలో ఇలాంటి పథకాలు అనేకం ఉన్నాయి. ఒకవైపు క్రాష్‌ప్రొగ్రాం పేరిట హడావుడి చేస్తున్నా ఎక్కడా తాగునీటి సమస్య పరిష్కార దిశగా అడుగులైతే పడటంలేదు.
► జిల్లా కేంద్రంలోనే దాహం కేకలు
► తోటపాలెం వైఎస్సార్‌కాలనీలో పనిచేయని మంచినీటి పథకం
► వేసవి వచ్చేసినా చొరవ చూపని యంత్రాంగం
► మిగతా చోట్లా అదే పరిస్థితి
సాక్షి ప్రతినిధి, విజయనగరం : వేసవి వచ్చేసింది. జిల్లా వ్యాప్తంగా అప్పుడే నీటి ఎద్దడి మొదలైంది. తాగునీటి ఇక్కట్లు లేకుండా, పరిష్కార చర్యలు తీసుకునేందుకు అప్రమత్తమైనట్టు అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఆర్‌డబ్ల్యూఎస్ ద్వారా క్రాష్ ప్రొగ్రామ్ నిర్వహిస్తుండగా, పట్టణాల్లో మున్సిపల్ యంత్రాంగం తగు చర్యలు తీసుకున్నట్టు ప్రకటించారు. ఎక్కడే సమస్య ఉన్నా ఇట్టే పరిష్కరించేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసినట్టు పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేశారు. కానీ ఇవేవీ అమలు కావడం లేదని చెప్పడానికి తోటపాలెం వైఎస్సార్‌కాలనీలో లక్షలాది రూపాయలతో నిర్మించిన మంచినీటి పథకాన్నే ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇదేదో నదిపై ఆధారపడిన మంచినీటి పథకం అనుకుంటే పొరపాటే. ఊటబావుల రీచార్జ్‌తో పనే లేదు. స్థానికంగా తీసిన బోరు ద్వారా కాలనీ వాసులకు నీరు సరఫరా చేయాల్సి ఉంది.
జిల్లాలో పరిస్థితులూ అంతే...: జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే జిల్లాలో మిగతా చోట్ల ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 150 వరకు మంచినీటి పథకాలు చెడిపోయినట్టు లెక్కలు ఉన్నాయి. వీటి సంగతి ఎలా ఉందో స్థానికులకే ఎరుక. ఒకవైపు కలెక్టర్ సీరియస్‌గా తీసుకుని సీజన్‌లో ఎట్టి పరిస్థితుల్లో మంచినీటి సమస్య తలెత్తకూడదని, నిధుల కోసమని వెనక్కి చూడొద్దని, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశిస్తున్నారు. తరచూ సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. కానీ, అధికారులకు ఇవేవీ తలకెక్కడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. పాలకులు కూడా వీటిగురించి పట్టించుకోవడంలేదు.
రెండేళ్లుగా ఇదే పరిస్థితి: వాస్తవానికి ఈ పథకం 2013 డిసెంబర్ 11వ తేదీన మంజూరైంది. దీన్ని నిర్మించడానికి అధికారులకు రెండేళ్లు పట్టింది. 2015లో ప్రారంభమైంది. కానీ, కాలనీ వాసులకు సక్రమంగా ఎప్పుడూ నీరందించడం లేదు. ఎప్పటికప్పుడు మొరాయిస్తోంది. మున్సిపల్ అధికారులకు ఎప్పుడో బుద్ధి పుడితే అలా వచ్చి ఏదో చేసి వెళ్లిపోతున్నారు. ఆ తర్వాత పరిస్థితి మామూలే. సాధారణంగా వేసవి సీజన్ వచ్చేసరికి మరమ్మతుకు గురైన మంచినీటి పథకాలను యుద్ధ ప్రతిపాదికన బాగు చేయాల్సి ఉంది. దీని కోసం ప్రత్యేక ప్రణాళిక కూడా రూపొందిస్తారు. కానీ, విజయనగరం మున్సిపల్ అధికారులకు తోటపాలెం వైఎస్సార్ కాలనీలో మూలకు చేరిన మంచినీటి పథకం గుర్తుకు రాలేదు. అసలిక్కడ బోర్లు ఎలా ఉన్నాయి? మంచినీటి పథకం ఎలా ఉంది? అన్నదానిపై పరిశీలనే జరగలేదు. వేసవి నేపథ్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాల్సి ఉంది. ఇక్కడదేమీ జరగకపోవడంతో నెలల తరబడి పనిచేయని మంచినీటి పథకానికి మోక్షం కలగడం లేదు. చెప్పాలంటే అధికారులెవ్వరూ పట్టించుకోవడం లేదు. దీంతో 250కి పైగా కుటుంబాలు తాగునీటి కోసం ఇక్కట్లు పడుతున్నాయి.
మరమ్మతు చేయిస్తాం: ఆ నీటి పథకం పనిచేయడం లేదని నా దృష్టికి రాలేదు. తప్పని మరమ్మతు చేపట్టి సమస్య పరిష్కరిస్తాం. మున్సిపల్ డీఈని పంపిస్తాను. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. తాగునీటి సమస్య లేకుండా చూసుకుంటాను.
---నాగరాజు, మున్సిపల్ కమిషనర్, విజయనగరం