నీటి సమస్య పరిష్కరించండి
కర్నూలు(కలెక్టరేట్): పాణ్యం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో తీవ్రమైన నీటి సమస్య ఉందని, వెంటనే చొరవ తీసుకుని పరిష్కరించాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కోరారు. శనివారం ఆమె కలెక్టర్‌ను ఆయన చాంబర్‌లో కలసి నియోజకవర్గ సమస్యలపై చర్చించారు. ఓర్వకల్లు మండలంలోని ఉప్పలపాడు, ఉయ్యాలవాడ, గుమితంతండా, గుడుంబాయితండా, కల్లూరు మండలంలో పుసులూరు, ఉలిందకొండ, పాణ్యం మండలంలో పిన్నాపురం, తొగర్చేడు, నెరవాడ, గడివేముల మండలంలో ఉండట్ల తదితర గ్రామాల్లో నీటి సమస్య ఎక్కువగా ఉందని తెలిపారు.
సమస్య పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు తక్షణం నిధులు విడుదల చేయాలని కోరారు. కర్నూలు నగరపాలక సంస్థలోని వార్డుల్లో ఓటర్ల సంఖ్యలో తేడా ఎక్కువగా ఉందని కలెక్టర్‌కు వివరించారు. కొన్ని వార్డుల్లో అత్యధికంగా ఓటర్లు ఉంటే, మరికొన్ని వార్డుల్లో తక్కువగా ఉన్నారని, అలా కాకుండా అన్ని వార్డుల్లో ఓటర్ల సంఖ్య సమానంగా ఉండేలా చూడాలని కోరారు. అవసరమైతే వార్డులను పునర్విభజన చేయాలని సూచించారు. ఈ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యే సూచించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు.