కర్నూలు(అగ్రికల్చర్): పాణ్యం నియోజకవర్గంలో భారీస్థాయిలో ఓట్లు ఎలా తగ్గాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రశ్నించారు. ఓటర్లు పెరగాల్సింది పోయి తగ్గడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శనివారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాణ్యం నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో 2.80 లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇప్పుడు ఆ సంఖ్య 2.30 లక్షలకు తగ్గిందన్నారు. ఇందుకు కారణాలేమిటని ప్రశ్నించారు. కలెక్టర్ సమాధానమిస్తూ డీ డూప్లికేట్ సాఫ్ట్‌వేర్‌తో రెండు చోట్ల ఓటు కలిగిన వారందరినీ తొలగించామని, డోర్ టు డోర్ సర్వేకు వచ్చినప్పుడు ఇళ్లలో లేనివారిని కూడా తొలగించామని తెలిపారు.
దీనివల్ల ఓటర్లు తగ్గారని చెప్పారు. ఓటరు నమోదు పెద్దఎత్తున చేపట్టేందుకు మునిసిపల్, తహసీల్దారు కార్యాలయాల్లో ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ ప్రతినిధి తోట వెంకటకృష్ణారెడ్డి సూచించారు. ఓటరు నమోదుపై విస్తృత ప్రచారం చేయాలని, ముఖ్యంగా విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. కర్నూలు నగరంలోని పలు పోలింగ్ కేంద్రాలకు బీఎల్‌వోలుగా పొదుపు మహిళలను నియమించడాన్ని సీపీఎం నేతలు రాముడు, షడ్రక్ తప్పుబట్టారు. వీరు అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేయడం లేదని, అక్రమాలకు తావిస్తున్నారని ఆరోపించారు. వీరిని తొలగించి అంగన్‌వాడీ కార్యకర్తలను నియమించాలని కోరారు. దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామంలో 20 ఏళ్ల క్రితం ఊరొదిలి వెళ్లిన వారు ఇప్పటికీ అక్కడ ఓటర్లుగా ఉన్నారని, ఇదెలా సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పెద్దారెడ్డి ప్రశ్నించారు.
ఓటర్ల నమోదుకు అందరూ సహకరించాలి: కలెక్టర్
వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్నందున అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా నమోదు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. గుర్తింపు పొందిన అన్ని పార్టీలు వెంటనే అన్ని పోలింగ్ కేంద్రాలకు బీఎల్‌ఏలను నియమించుకోవాలని సూచించారు. ఆ వివరాలను అక్టోబరు ఐదులోగా ఇవ్వాలన్నారు. ఓటర్ల జాబితా సవరణ అక్టోబరు 31 వరకు కొనసాగుతుందని, జనవరి నాలుగున తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు. తహసీల్దార్, మండల పరిషత్, మునిసిపల్ కార్యాలయాల్లో ఓటరు నమోదు దరఖాస్తులు వేసేందుకు ప్రత్యేక బాక్స్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులు, జాబితాలో లేని ఇతరులను ఓటర్లుగా నమోదు చేయాలని సూచించారు. 18–19 ఏళ్ల యువత జిల్లాలో 1.80 లక్షల మంది ఉండగా.. 30వేల మంది మాత్రమే ఓటర్లుగా ఉన్నారని, యువ ఓటర్ల నమోదుకు రాజకీయ పార్టీలు సంపూర్ణ సహకారం ఇవ్వాలని కోరారు. 19 నుంచి 30 ఏళ్ల మధ్య వారు కూడా చాలామంది ఓటుకు దూరంగా ఉన్నారని, వీరిపైనా దృష్టి సారించాలని అన్నారు. చనిపోయిన వారు, గ్రామాలు వదిలి వెళ్లిన వారు ఓటర్లుగా ఉంటే ఫారం–7 ద్వారా తొలగింపునకు దరఖాస్తు చేయవచ్చని సూచించారు. అర్హత కలిగిన వారందరూ ఓటర్లుగా నమోదయ్యేందుకు స్వీప్ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.
విశ్వవిద్యాలయంతో పాటు డిగ్రీ కళాశాలలు, ఇతర వృత్తి విద్యాసంస్థల్లో స్వీప్ యాక్టివిటీ కింద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ పూర్తి అయ్యిందని, దీనివల్ల పోలింగ్ కేంద్రాల సంఖ్య 3,780కి పెరిగిందని తెలిపారు. ఇంకా ఎక్కడైనా కొత్త పోలింగ్ కేంద్రం అవసరమనుకుంటే తమకు చెప్పవచ్చని, ప్రతిపాదనలు పంపుతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వీప్ కార్యాక్రమాలకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ విడుదల చేశారు. ఓటరు నమోదు ప్రచార వాహనాలను కూడా జెండా ఊపి ప్రారంభించారు. సమావేశంలో డీఆర్‌వో వెంకటేశం, ఈఆర్‌వోలు శశీదేవి, సుధాకర్‌రెడ్డి, అనురాధ, సత్యం, జయకుమార్, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ హరినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment