Special Operation Team
-
బయో డీజిల్ పేరుతో ఇంధన దందా
సాక్షి, యాదాద్రి: బయో డీజిల్ పేరుతో సాగుతున్న కృత్రిమ డీజిల్ దందాను సోమవారం స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొండమడుగు పారిశ్రామిక వాడ కేంద్రంగా కొంతమంది వ్యక్తులు గుజరాత్‌లోని ప్రైవేట్ రీఫైనరీల నుంచి ద్రవపదార్థాలను తీసుకొచ్చి వాటికి కొన్ని రసాయనాలు కలిపి కృత్రిమ డీజిల్ తయారు చేసి వినియోగదారులకు అమ్ముతున్నారు. పెట్రోల్ బంక్‌లలో లభించే డీజిల్ మాదిరిగానే ఈ కృత్రిమ డీజిల్‌తో వాహనాలు నడుస్తుండటంతో, వాహనాలకు మైలేజీ కూడా అధికంగా వస్తుండటంతో అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. పెట్రోల్ బంకుల్లో లభించే డీజిల్ రేట్లు ఆకాశన్నంటుతుండటం, ఈ కృత్రిమ డీజిల్ లీటరు రూ.85 నుంచి రూ.90లకే లభిస్తుండటంతో ప్రైవేటు ట్రావెల్స్, భారీ వాహనాల వినియోగదారులు ఈ డీజిల్‌నే ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ్నుంచే హైదరాబాద్, గుంటూరు, తిరుపతి తదితర పట్టణాలకు ఈ కృత్రిమ డీజిల్‌ను సరఫరా చేస్తున్నారు. గత మూడు నెలలుగా ఆయిల్ ట్యాంకర్లలో డీజీల్ తీసుకువచ్చి బీబీనగర్ మండలం కొండమడుగు వద్ద గోదాంలో నిల్వ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాహనాలను సిద్ధం చేసుకున్నారు. ఇక్కడి నుంచి వాహనదారులకు, కొన్ని పెట్రోల్ బంక్‌లకు తమ వాహనాల ద్వారా సరఫరా చేస్తున్నారు. కొనుగోలు దారులను డీజిల్ అని నమ్మించేందుకు తెల్లని ద్రవ ప్రదార్థంలో పసుపు రంగు పౌడర్‌ను కలుపుతున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున రంగుప్యాకెట్లను సైతం నిల్వ ఉంచారు. విషయం తెలుసుకున్న ఎస్వోటీ పోలీసులు కొండమడుగు పారిశ్రామిక వాడలోని గోదాంపై సోమవారం దాడులు చేసి కృత్రిమ డీజిల్ ట్యాంకర్లను పట్టుకున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మేనేజర్ చిరాగ్‌పటేల్, ఈ డీజిల్‌ను కొనుగోలుచేస్తున్న సీఎంఆర్ ట్రావెల్స్ యజమాని, మరికొందరిపై కేసు నమోదు చేశారు. విచారణ జరుపుతున్నాం: ఎస్ఓటీ కృత్రిమ డీజిల్ ఘటనపై విచారణ జరుపుతున్నామని భువనగిరి జోన్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ ఎ. రాములు తెలిపారు. డీజిల్ లాగానే ఉన్న ఈ ద్రవ పదార్థాన్ని నిర్ధారణ పరీక్షల కోసం ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌కు పంపించినట్లు చెప్పారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం వాస్తవాలు విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. -
కుషాయిగూడలో పేకాట రాయుళ్ల అరెస్టు!
సాక్షి, హైదరాబాద్: కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కమలానగర్లో పేకాట శిబిరంపై ప్రత్యేక పోలీసులు బృందాలు మంగళవారం దాడులు చేశాయి. డాల్ఫిన్స్ బాయ్స్ హాస్టల్‌పై దాడి చేసి 10 మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. రూ.94 వేల నగదు, 9 మొబైల్ ఫోన్లు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎం.శ్రీకాంత్, ఎ.సందీప్, వి.సాయి, ఎ.భరత్, ఎ.కార్తీక్, కె.సాయికిరణ్, బి.రాజు, ఎస్.రాజు, వి.కల్యాణ్, డి.వాసును కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
వ్యభిచారం నిర్విహస్తే ఇల్లు సీజ్
* ఆదేశాలు జారీ చేసిన కమిషనర్ సీవీ ఆనంద్ * తొలిసారి ఉప్పల్‌లో రెండు ఇళ్లు సీజ్ సాక్షి, సిటీబ్యూరో: వ్యభిచారం అనే మాట వినపడకుండా చేసేందుకు సైబరాబాద్ పోలీసులు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. వ్యభిచారం నిర్వహించేందుకు వినియోగించిన ఇంటిని, అందులోని సామగ్రిని సీజ్ చేయాలని కమిషనర్ సీవీ ఆనంద్ అన్ని ఠాణాల ఎస్హెచ్ఓలకు ఆదేశాలు జారీ చేశారు. సైబరాబాద్ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) కల్తీ పదార్థాల తయారీ గౌడాన్స్, కంపెనీలతో పాటు పేకాట కేంద్రాలపై పై ఉక్కుపాదం మోపారు. దీంతో పేకాట రాయుళ్లు ఇతర రాష్ట్రాల బాట పట్టారు. ఇక వ్యభిచార నిర్వాహకులపై కూడా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. శివార్లలోని రిసార్ట్స్, ఫాంహౌస్‌లలో నిర్వహిస్తున్న రేవ్ పార్టీలను కూడా అడ్డుకొని యువతులు, యువకులను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇదిలా ఉండగా... అపార్ట్మెంట్లు, హోటళ్లు, లాడ్జీలలో సైతం కొందరు గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వృభిచార గృహాలకు వెళ్తూ యువత.. అవసరమైన డబ్బు కోసం నేరాల బాటపడుతోంది. అలాగే నిర్వాహకులు రాష్ట్రంలోని వివిధ జిల్లాలల నుంచి, ఇతర రాష్ట్రాలనుంచి అమ్మాయిలను బలవంతంగా తీసుకొచ్చి ఈ రొంపిలోకి దింపుతున్న ఘటనలుసైతం ఇటీవల వెలుగు చూశాయి. ఈ నేథ్యంలో వ్యభిచారం నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆనంద్ నిర్ణయించారు. హోటళ్లు, లాడ్జీలు, ఫాంహౌస్‌లు, రెస్టారెంట్లు, రిసార్ట్స్లపై వ్యభిచారం నిరోధానికి ఉద్దేశించిన ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ (పీటా)ను ప్రయోగిస్తారు. ఆయా ప్రదేశాల్లో ఉద్దేశపూర్వకంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారని విచారణలో తేలితే మాత్రం వీటిని వాటిని సైతం సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉంది. పీటా యాక్ట్ అంటే... పీటా యాక్ట్ ప్రకారం.. పోలీసులు ప్రస్తుతం వ్యభిచార గృహంపై దాడి చేసి నిర్వాహకుడు, విటుడు, వ్యభిచారం చేస్తున్న అమ్మాయిలను అరెస్టు చేస్తున్నారు. పీటా యాక్ట్‌లోని 3,4,5 సెక్షన్ల కింద కోర్టులో హాజరుపరుస్తున్నారు. పట్టుబడ్డ యువతిని కోర్టు బాధితురాలిగా చూపిస్తూ మహిళా సంరక్షిత కేంద్రం (రెస్క్యూ హోం)కు తరలించాలని ఆదేశిస్తోంది. ఇక విటుడికి అదే రోజు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఎందుక ంటే పోలీసులు పెట్టే ఈ సెక్షన్లు అసలు విటుడికి వర్తించవు, ఇంత వరకు విటుడిని ఏ-సెక్షన్లో అరెస్టు చేయాలో ఎక్కడా లేదు. ఇక వ్యభిచార కేంద్రం నిర్వాహకుడికి మాత్రం 14 రోజుల పాటు రిమాండ్‌కు కోసం జైలుకు పంపుతారు. అమ్మాయి కోసం వారి రక్తసంబంధీకులు పిటిషన్ దాఖలు చేస్తే కోర్టు ఆదేశాల మేరకు రెస్క్యూ హోం ప్రాజెక్ట్ డెరైక్టర్ ఆ అమ్మాయి కుటుంబ పరిస్థితులను క్షణ్ణంగా అధ్యయనం చేసి ఓ నివేదికను కోర్టుకు అందజేస్తారు. నివేదిక సంతృప్తికరంగా ఉందని కోర్టు భావిస్తే పిటిషనర్‌కు అమ్మాయిని అప్పగిస్తారు. లేదం టే ఆమె రెస్క్యూ హోంలోనే ఉండాల్సి ఉం టుంది. ఇదిలా ఉండగా.. ఇదే చట్టంలో ఆస్తుల సీజ్ చేసే అవకాశం ఉన్నా పోలీసులు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. కమిషనర్ సీవీ ఆనంద్ ఇకపై వ్యభిచారం నిర్వహించిన ఇంటిని కూడా సీజ్ చేయాలని నిర్ణయించారు. రెండు ఇళ్లు సీజ్.... కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలోని పద్మావతి, విజయపూరి కాలనీల్లో ఆది వారం వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడిన రెండు ఘటనలో కూడా రెండు ఇళ్లను మల్కాజిగిరి డీసీపీ రమా రాజేశ్వరీ, ఏసీపీ ఎం.రవిచందన్రెడ్డిల ఆదేశాల మేరకు ఉప్పల్ ఇన్స్పెక్టర్ వై.నర్సిం హారెడ్డి సీజ్ చేశారు. సైబరాబాద్‌లో పీటా కేసులో ఇళ్లలను సీజ్ చేయడం ఇదే మొదటిసారి. ఉప్పల్‌లో బంగ్లాదేశ్ ముఠా వ్యభిచారం * పోలీసుల అదుపులో ముగ్గురు యువతులు, * నిర్వాహకుడు ఉప్పల్: ఉప్పల్‌లో వ్యభిచారం చేస్తున్న బంగ్లాదేశ్ ముఠా గుట్టును ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... బంగ్లాదేశ్‌కు చెందిన ఎండీ జబ్బార్ ఏడేళ్ల క్రితం ఉప్పల్‌కు వచ్చాడు. తన పేరు వినోద్ వర్మగా చెప్పుకొని విజయపురి కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు యువతులను తీసుకొచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు ఆదివారం వారు ఉంటున్న ఇంటిపై దాడి చేసి ముగ్గురు యువతులతో పాటు జబ్బార్‌ను ఆదుపులోకి తీసుకొని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. నిందితుల నుంచి కీలకమైన డాక్యుమెంట్లు, ఒక ద్విచక్రవాహనం, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశీయులు కాదా? పట్టుబడ్డ యువతులు బంగ్లాదేశీయులా లేదా పశ్చిమబెంగాల్‌కు చెందినవారా? అనేది పోలీసులు స్పష్టం చేయలేకపోతున్నారు. వీరు బంగ్లాదేశీయులని ఎస్ఓటీ పోలీసులు చెప్తుండగా... ఉప్పల్ పోలీసులు మాత్రం వారు వెస్ట్‌బెంగాల్‌కు చెందినవారని అంటున్నారు. ఇక నుంచి ఉక్కుపాదం వ్యభిచారం కేసులో అరెస్టు చేస్తే బెయిల్‌పై విడుదలవుతున్న నిర్వాహకులు, విటులు తిరిగి అదే వృత్తిని కొనసాగిస్తున్నారు. ఇటీవల ఎస్ఓటీ పోలీసులు నిర్వహించిన వరుస దాడుల్లో పట్టుబడిన నిర్వాహకులు గతంలో కూడా పట్టుబడిన వారే అని తేలింది. ఈనేపథంలోనే వ్యభిచార నిర్వహణకు వినియోగించిన ఇల్లు, ఫాంహౌస్, లాడ్జీ, రిసార్ట్స్, అందులోని సామగ్రిని సీజ్ చేయాలని నిర్ణయించాం. ఇలా చేయడంతో తిరిగి వారు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా ఉంటారు. - సీవీ ఆనంద్, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ -
పేకాడేస్తున్నారు
*జూద గృహాలపై పోలీసుల ఉక్కుపాదం *ఐదు నెలల్లో 146 శిబిరాలపై దాడులు *పట్టుబడిన 1089 మంది జూదగాళ్లు *20 కార్లు, 265 బైక్‌లు.1037 సెల్ఫోన్లు సీజ్ సిటీబ్యూరో: పేకాట శిబిరాలపై సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు ఉక్కుపాదం మోపారు. గడిచిన ఐదు నెలల్లో పేకాట శిబిరాలపై జరిపిన వరుస దాడులే ఇందుకు నిదర్శనం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం నగరంలో పేకాట క్లబ్బులు మూసివేయడంతో పేకాటరాయుళ్లు నగర శివార్లతో పాటు తమ ఇళ్లను అడ్డాగా చేసుకొని రహస్యంగా పేకాటాడుతున్నారు. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ఎస్ఓటీ పోలీసులు అన్ని ఠాణాల పరిధిలో పేకాట శిబిరాల గురించి తెలుసుకొనేందుకు పకడ్బందీ సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. గత ఐదు నెలల్లోనే 146 పేకాట శిబిరాలపై దాడి చేశారు. నిందితుల నుంచి సుమారు కోటి రూపాయలు, 26 కార్లు, 277 బైక్‌లు, 1040 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో పారిశ్రామికవేత్తలు, బడా బాబుల పిల్లలు, మహిళలు, పోలీసులు, విలేకరులు ఉండటం గమనార్హం. మహిళల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పేకాట శిబిరాల గుట్టును కూడా ఎస్ఓటీ పోలీసులు బట్టబయలు చేశారు. నగరంలోని క్లబ్‌లు మూసివేయడంతో హోటళ్లలో పేకాటాడితే పోలీసులు పట్టుకుంటారనే ఉద్దేశంతో నగర శివార్లలో శిబిరాలు ఏర్పాటు చేసుకొని పేకాటాడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఎస్ఓటీ పోలీసులు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 30 ఠాణాల పరిధిలో దాడులు నిర్వహిస్తున్నారు. శివార్లలోని హోటళ్లు, ఫామ్‌హౌస్‌లతో పాటు గుట్టుచప్పుడు కాకుండా ఇళ్లల్లో నిర్వహిస్తున్న జూదగృహాలపైనా దృష్టి పెట్టి దాడులు కొనసాగిస్తున్నారు. ఎస్ఓటీ అదనపు డీసీపీ రామచంద్రారెడ్డి, ఇన్స్పెక్టర్లు పుష్పన్‌కుమార్, ఉమేందర్, గురురాంఘవేంద్ర, వెంకట్‌రెడ్డి, ఎస్ఐలు ఆంజనేయులు, రాములు నాలుగు బృందాలుగా ఏర్పడి తరచూ దాడులు నిర్వహిస్తున్నారు. వీరి దాడులకు వెరసి పేకాట రాయుళ్లు దారి మార్చారు. హైదరాబాద్ టూ విజయవాడ... జూదాన్ని వృత్తిగా పెట్టుకున్న కొందరు విజయవాడకు తమ మకాం మార్చుకున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. అక్కడ కొన్ని క్లబ్బులు ఇక్కడి పేకాటరాయుళ్లతో నిత్యం సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వారికి రవాణా సౌకర్యంతో పాటు వసతి వంటి సకల సదుపాయాలు కల్పిస్తున్నాయి. మరికొందరైతే గోవాకు వెళ్లి పేకాడుతున్నారు. ఖాళీ చేయని క్లబ్‌లు.... మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తున్న పేకాట క్లబ్బులు ఒక్కసారిగా బంద్ కావడంతో నిర్వాహకుల గొంతులో పచ్చివెలక్కాయపడినట్టు కాగా... సాధారణ ప్రజలు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని కొనియాడుతున్నారు. క్లబ్బులు ఇక తెరిచేది లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్వయంగా ప్రకటించినా... నిర్వాహకులు మాత్రం క్లబ్బులను ఇంకా ఖాళీ చేయడం లేదు. క్లబ్బులపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని తెరిచేందుకు రేపో మాపో అనుమతి ఇస్తుందనే ఆశతో ఉన్నారు. ఈనేపథ్యంలోనే అద్దె భవనాల్లో ఉన్న క్లబ్బులకు వేలాది రూపాయల అద్దె చెల్లిస్తూనే ఉన్నారు. నగరంలోని ఓ క్లబ్ నిర్వాహకులు రోజుకు రూ.50 వేలు అద్దె చెల్లిస్తున్నారు. ఇప్పటికైనా క్లబ్ నిర్వాహకులు అప్పుల్లో కూరుకుపోకుండా వెంటనే భవనాలు ఖాళీ చేసి ఇతర వ్యాపారాలు చేసుకుంటే మంచిదని పోలీసులు హితవు పలుకుతున్నారు. ఆటలు సాగనివ్వం పేకాట శిబిరాలపై దాడులు కొనసాగిస్తాం. గుట్టుచప్పుడు కాకుండా నాలుగు గోడల మధ్య కూర్చొని పేకాటాడుకుంటున్నామని ఎవరూ అనుకోవద్దు. ఇలాంటి శిబిరాల సమాచారం సేకరించేందుకు అన్ని ఠాణాల పరిధిలో పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. జూదం ఆడుతుంటే క్షణాల్లో మాకు తెలిసిపోతుంది. వెంటనే వెళ్లి నిర్వాహకులతో పాటు పేకాటాడుతున్నవారిని పట్టేస్తాం. జూదగృహాల గురించి తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరుతున్నా. పేకాటాడుతూ తరచూ పట్టుబడే వారిపై ఇకపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే నిర్వాహకులపై రౌడీషీట్ తెరుస్తాం. రామచంద్రారెడ్డి, ఎస్ఓటీ అదనపు డీసీపీ జూదకేంద్రాలపై దాడి: 16 మంది అరెస్టు సిటీబ్యూరో: ఉప్పల్, మైలార్‌దేవ్‌పల్లి ఠాణాల పరిధిలోని పేకాట కేంద్రాలపై ఎస్ఓటీ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. లక్ష నగదులో పాటు 16 మందిని అరెస్టు చేశారు. ఎస్ఓటీ అదనపు డీసీపీ రామచంద్రారెడ్డి నేతృత్వంలో ఇన్స్పెక్టర్లు పుష్పన్‌కుమార్, ఉమేందర్, ఎస్ఐలు ఆంజనేయులు, రాములు ఈ దాడులు నిర్వహించారు. -
అసాంఘికశక్తుల దుమ్ముదులిపిన ఎస్ఓటీ
నెలరోజుల్లో 19 ప్రాంతాల్లో దాడులు 186 మంది అరెస్టు 93 వాహనాలు, రూ.5.60 లక్షల స్వాధీనం సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు నెల రోజుల్లో అసాంఘిక అడ్డాలపై వరుస దాడులు చేసి దుమ్ము దులిపారు. గత నెలలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఆయా పోలీసుస్టేషన్ల పరిధిలో 19 చోట్ల ఆకస్మిక దాడులు చేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 186 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి 170 సెల్ఫోన్లు, 91 బైక్‌లు, రెండు కార్లతో పాటు రూ.5,60,910 స్వాధీనం చేసుకున్నారు. పేకాటలో సర్వంకోల్పోయిన ఓ వ్యక్తి ఏకంగా రాజ్‌భవన్ ముందు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించిన విషయం తెలిసిందే. పేకాట క్లబ్‌లతో పాటు అసాంఘిక అడ్డాలపై ఉక్కుపాదం మోపాలంటూ ఏకంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్ని జిల్లాల పోలీసు బాస్‌లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్పందించిన సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అసాంఘికశక్తుల ఆట కట్టించే బాధ్యతను ఎస్ఓటీకి అప్పగించారు. దీంతో రంగంలోకి దిగిన ఈస్ట్, వెస్ట్ ఎస్ఓటీ ఓఎస్డీలు నర్సింగ్‌రావు, అశోక్‌కుమార్, ఇన్స్పెక్టర్లు ఉమేందర్, పుష్పన్‌కుమార్, వెంకట్‌రెడ్డి, గురురాఘవేందర్లు తమ బృందాలతో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్న ఫాంహౌస్‌లతో పాటు అపార్ట్మెంట్లు, హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లో కొనసాగుతున్న పేకాట శిబిరాలు, వ్యభిచార కేంద్రాలు, ఆయిల్ వంటివి కల్తీ చేస్తున్న కేంద్రాలపై వరుస దాడులు చేశారు. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం... సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని అణచివేస్తాం. ఇప్పటికే నిర్మానుష్య ప్రదేశాలలో ఉన్న అసాంఘిక అడ్డాలపై ఎస్ఓటీ పోలీసులతో దాడులు చేయిస్తున్నాం. ఒకసారి పోలీసుల దాడిలో అరెస్టై మళ్లీ అదే నేరానికి పాల్పడిన వారిపై రౌడీషీట్ తెరుస్తాం. సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పేకాట క్లబ్‌కు కూడా అనుమతి ఇవ్వలేదు. అయితే, గుట్టుచప్పుడు కాకుండా పేకాట గృహాలు కొనసాగిస్తున్న వారి ఆగడాలను ఇక సాగనివ్వం. ఇప్పటికే వ్యభిచారం, పేకాట, కల్తీ మాఫీయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. అసాంఘిక శక్తుల కదలికపై సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.