అసాంఘికశక్తుల దుమ్ముదులిపిన ఎస్‌ఓటీ
నెలరోజుల్లో 19 ప్రాంతాల్లో దాడులు
186 మంది అరెస్టు
93 వాహనాలు, రూ.5.60 లక్షల స్వాధీనం
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ) పోలీసులు నెల రోజుల్లో అసాంఘిక అడ్డాలపై వరుస దాడులు చేసి దుమ్ము దులిపారు. గత నెలలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఆయా పోలీసుస్టేషన్ల పరిధిలో 19 చోట్ల ఆకస్మిక దాడులు చేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 186 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి 170 సెల్‌ఫోన్లు, 91 బైక్‌లు, రెండు కార్లతో పాటు రూ.5,60,910 స్వాధీనం చేసుకున్నారు.
పేకాటలో సర్వంకోల్పోయిన ఓ వ్యక్తి ఏకంగా రాజ్‌భవన్ ముందు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించిన విషయం తెలిసిందే. పేకాట క్లబ్‌లతో పాటు అసాంఘిక అడ్డాలపై ఉక్కుపాదం మోపాలంటూ ఏకంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్ని జిల్లాల పోలీసు బాస్‌లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్పందించిన సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అసాంఘికశక్తుల ఆట కట్టించే బాధ్యతను ఎస్‌ఓటీకి అప్పగించారు.
దీంతో రంగంలోకి దిగిన ఈస్ట్, వెస్ట్ ఎస్‌ఓటీ ఓఎస్డీలు నర్సింగ్‌రావు, అశోక్‌కుమార్, ఇన్‌స్పెక్టర్లు ఉమేందర్, పుష్పన్‌కుమార్, వెంకట్‌రెడ్డి, గురురాఘవేందర్‌లు తమ బృందాలతో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్న ఫాంహౌస్‌లతో పాటు అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లో కొనసాగుతున్న పేకాట శిబిరాలు, వ్యభిచార కేంద్రాలు, ఆయిల్ వంటివి కల్తీ చేస్తున్న కేంద్రాలపై వరుస దాడులు చేశారు.
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం...
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని అణచివేస్తాం. ఇప్పటికే నిర్మానుష్య ప్రదేశాలలో ఉన్న అసాంఘిక అడ్డాలపై ఎస్‌ఓటీ పోలీసులతో దాడులు చేయిస్తున్నాం. ఒకసారి పోలీసుల దాడిలో అరెస్టై మళ్లీ అదే నేరానికి పాల్పడిన వారిపై రౌడీషీట్ తెరుస్తాం. సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పేకాట క్లబ్‌కు కూడా అనుమతి ఇవ్వలేదు. అయితే, గుట్టుచప్పుడు కాకుండా పేకాట గృహాలు కొనసాగిస్తున్న వారి ఆగడాలను ఇక సాగనివ్వం. ఇప్పటికే వ్యభిచారం, పేకాట, కల్తీ మాఫీయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. అసాంఘిక శక్తుల కదలికపై సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.