రైతులకేదీ భరోసా?
బచావో తెలంగాణ మిషన్ వ్యవస్థాపకుడు నాగం జనార్ధన్‌రెడ్డి బుధవారం దౌల్తాబాద్, మెదక్, రామాయంపేట ప్రాంతాల్లో పర్యటించారు. రైతు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.
- ఆత్మహత్యల్ని విస్మరించి విదేశీయానమా?
- నాగం జనార్ధన్‌రెడ్డి ఎద్దేవా
దౌల్తాబాద్/రామాయంపేట: సీఎం కేసీఆర్ రైతులను విస్మరిస్తున్నారని సొంత నియోజకవర్గం చుట్టుపక్కలే ఎందరో రైతుల ఆత్మహత్యలు జరుగుతుంటే పట్టించుకోకుండా చైనా బాట పట్టారని మాజీ మంత్రి బచావో తెలంగాణా మిషన్ వ్యవస్థాపకులు నాగం జనార్ధన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం ఎల్కల్‌లో ఆత్మహత్య బాధిత రైతు కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికైనా రైతుల పరిస్థితిని అంచనా వేయాలని సీఎంను డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులకు చేయూతనందించాలన్నారు. రైతులకు మేలు జరిగే వరకు ప్రభుత్వంపై వత్తిడి తెస్తామన్నారు. ఆయన వెంట నాయకులు అంజిరెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు.
ప్రాజెక్టులపై నిర్లక్ష్యం..
అసంపూర్తిగా నిలిచిపోయిన ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బచావో తెలంగాణ మిషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం మెదక్ జిల్లా లక్ష్మాపూర్‌లోని గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో రుణమాఫీ పథకాన్ని సమీక్షించిన అనంతరం ఆయన అక్కన్నపేట ఎల్లమ్మ ఆలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. మహబూబ్‌నగర్ జిల్లాలో రూ. వెయ్యి కోట్లతో నాలుగు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేస్తే 8 లక్షల ఎకరాలకు నీరందే అవకాశం ఉండగా, ఈ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించడం లేదన్నారు. మిషన్ కాకతీయ పథకం అధికార పార్టీ నేతలు జేబులు నింపుకొనేందుకు పనికొస్తుందని నాగం ధ్వజమెత్తారు. అనాలోచిత నిర్ణయాలు, ఆశ్రీత పక్షపాతం, అవినీతిలో ప్రభుత్వం కూరుకుపోయిందన్నారు. రుణమాఫీ పథకం రైతులపాలిట శాపంగా మారిందన్నారు. దీనస్థితిలో ఉన్న రైతులకు ధైర్యం చెప్పడానికే తాను పర్యటిస్తున్నానన్నారు.