Special Revival Campaign
-
ఎల్ఐసీ పాలసీదారులకు అలర్ట్..! ఇదే చివరి అవకాశం..!
ఎల్ఐసీ పాలసీదారులకు అలర్ట్..! కోవిడ్‌తో పాటు ఆర్ధిక కారణాలతో కట్టలేని పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్(ఎల్ఐసీ) పాలసీదారులకు కల్పించిన విషయం తెలిసిందే. మార్చి 25, 2022తో పాలసీల పునరుద్దరణ గడువు ముగియనుంది. కొంత ఆలస్య రుసుము చెల్లించడంతో ఆగిపోయిన పాలసీలను మళ్లీ పునరుద్ధరించుకోవచ్చని ఇప్పటికే ఎల్ఐసీ అధికారిక ప్రకటన చేసింది. సకాలంలో బీమా ప్రీమియం చెల్లించలేని కుటుంబాలకు ఆర్ధిక ప్రయోజనాల్ని కల్పించే దిశగా ఎల్ఐసీ ఈ నిర్ణయం తీసుకుంది. 2022 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 25, 2022లోపు పాలసీదారులు ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్దరించుకునే అవకాశాన్ని ఎల్ఐసీ కల్పించింది. పాలసీ రివైవల్ క్యాంపెయిన్‌లో భాగంగా.. నిర్దిష్ట నిబంధనలు, షరతులకు లోబడి మొదటి చెల్లించని ప్రీమియం తేదీ నుంచి 5 సంవత్సరాలలోపు నిర్దిష్ట అర్హత గల ప్లాన్, పాలసీ టర్మ్ పూర్తికాని పాలసీలను పునరుద్ధరించవచ్చును.వీటికి కొత్త ఆలస్య రుసుములో కూడా రాయితీను అందిస్తోంది ఎల్ఐసీ. అర్హతగల పాలసీలకు ఆలస్య రుసుములో రాయితీలు ఇలా ఉన్నాయి. రూ. 1,00,000 వరకు- ఆలస్య రుసుములో రాయితీ- 20%, గరిష్ట రాయితీ- రూ. 2000. రూ.1,00,001 నుంచి రూ.3,00,000 వరకు- ఆలస్య రుసుములో రాయితీ 25%, గరిష్ట రాయితీ- రూ.2,500. రూ. 3,00,001 అంతకంటే ఎక్కువ పాలసీలపై- ఆలస్య రుసుములో రాయితీ 30%, గరిష్ట రాయితీ రూ. 3000. చదవండి: ఇన్సురెన్స్ ప్రీమియంపై జీఎస్టీను తగ్గించండి -
రుణం వచ్చేలా వృద్ధులకు పాలసీ..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కేవలం పెన్షన్ పథకాలే కాకుండా పదవీ విరమణ తర్వాత బీమా రక్షణతో పాటు, ఆర్థిక అవసరాలను తీర్చేలా వృద్ధులకు ప్రత్యేక పథకాలను అందుబాటులోకి తెస్తోంది బజాజ్ అలయంజ్. ఇప్పటి వరకు వయసుపై బడిన వారికి మార్కెట్లో సరైన బీమా పథకం లేదని, ఆ లోటును భర్తీ చేసేలా త్వరలోనే కొత్త పథకం ప్రవేశపెడుతున్నామంటున్న బజాజ్ అలయంజ్ లైఫ్ ప్రొడక్ట్ హెడ్ రితురాజ్ భట్టాచార్యతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. కొత్త నిబంధనలు వచ్చాక అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడిందా? ఈ మార్పులతో ప్రీమియం రేట్లు ఏమైనా పెరిగాయా? మార్పులు జరిగినప్పుడు కొంత ఒడిదుడుకులు ఉండటం సహజం. కొత్త నిబంధనలు వచ్చి నెల రోజులు మాత్రమే అయింది. కాబట్టి అప్పుడే అమ్మకాల గురించి వ్యాఖ్యానించటం కష్టం. మార్పులను అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం మేం కొత్త పథకాలపై ఏజెంట్లకు అవగాహన కల్పించే పనిలో ఉన్నాం. ఇదంతా పూర్తయి మామూలు పరిస్థితి రావడానికి మరికొన్నాళ్లు పడుతుంది. మా పథకాల పోర్ట్‌ఫోలియోను సమూలంగా మార్చి కొత్త తరహా పథకాలను ప్రవేశపెట్టడానికి ఈ నిబంధనల మార్పును చక్కగా వినియోగించుకుంటున్నాం. కొత్త నిబంధనలతో బీమా రక్షణ పెరిగింది. ఆ మేరకు ప్రీమియం ధరల్లో కొంత మార్పు ఉండచ్చు కాని ప్రీమియం ధరల్లో భారీ మార్పులేమీ రాలేదు. బజాజ్ అలయంజ్ ఎటువంటి ఉత్పత్తులపై దృష్టిపెడుతోంది? ప్రస్తుతం ఎన్ని పథకాలు అందుబాటులో ఉన్నాయి? ప్రస్తుతం 8 వ్యక్తిగత బీమా పథకాలు, మరో 8 గ్రూపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా ఉద్యోగంలోకి చేరి తొలిసారిగా బీమా తీసుకునే వారికోసం, అలాగే రిటైర్ అయిన తర్వాత కూడా బీమా రక్షణతో పాటు వారి అవసరాలకు ఉపయోగపడే విధంగా ఉండే పథకాలపై దృష్టిసారిస్తున్నాం. ముఖ్యంగా జీవించే కాలం పెరుగుతుండటంతో 60 ఏళ్ల పైబడిన వారికి ఉపయోగపడేలా, అవసరమైతే బీమా పథకంపై రుణం తీసుకునే అవకాశం ఉండే హోల్‌లైఫ్ పథకాలపై దృష్టిసారిస్తున్నాం. ఇంతకాలం బీమారంగం వీరి అవసరాలను పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ విభాగంపై మేం ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాం. వచ్చే నెలలోనే ఇటువంటి పాలసీని ప్రవేశపెట్టనున్నాం. మొత్తం మీద నెలకు 3 పథకాలు చొప్పున ప్రవేశపెట్టాలన్నది లక్ష్యం. టర్మ్, యులిప్, ఎండోమెంట్ అన్ని పథకాలు ఉండే విధంగా బ్యాలెన్స్డ్ పోర్ట్‌ఫోలియోపై దృష్టిసారిస్తున్నాం. కేవలం ఆన్లైన్లో తీసుకునేలా ఏమైనా కొత్త బీమా పథకాలను ప్రవేశపెడుతున్నారా? ప్రత్యేకంగా ఎటువంటి ఆన్లైన్ పథకాలనూ ప్రవేశపెట్టడం లేదు. కాని అన్ని పథకాలనూ ఆన్లైన్లో తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. ఆన్లైన్ ద్వారా తీసుకునే పాలసీలపై ఏజెంట్లకు కమీషన్లు చెల్లించాల్సి ఉండదు కాబట్టి ఆ మేరకు ప్రీమియం భారం తగ్గుతుంది. కాని ప్రస్తుతం సరళిని చూస్తే పాలసీ వివరాలను తెలుసుకోవడానికి ఆన్లైన్ ఉపయోగించి, ఆఫ్‌లైన్‌లో పాలసీలు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. పాలసీ తీసుకునే సమయంలో ఏజెంట్ సహాయం కావాలనుకోవడం దీనికి ప్రధాన కారణంగా గమనించాం. అలాగే రెన్యువల్ ప్రీమియంలు ఆన్లైన్ ద్వారా చెల్లించే వారి సంఖ్యలో 30 శాతానికిపైగా వృద్ధి నమోదవుతోంది. యులిప్ ఫండ్స్ మార్చుకోవడం, చిరునామా మార్పు వంటి సేవలన్నీ ఆన్లైన్లో అందిస్తున్నాం. బ్యాంకులు కేవలం ఒక బీమా కంపెనీ పథకాలనే కాకుండా అన్ని బీమా కంపెనీలు పథకాలూ అమ్మేలా ఐఆర్డీఏ విడుదల చేసిన మార్గదర్శకాల సంగతి? మొత్తం వ్యాపారంలో 55 శాతం వరకు బ్యాంకుల నుంచే వస్తోంది. దేశవ్యాప్తంగా 100కిపైగా బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నాం. బ్యాంకులను బ్రోకర్లుగా మారిస్తే మా వ్యాపారం మరింత వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. వ్యాపారం సన్నగిల్లడంతో కొన్ని బీమా కంపెనీలు శాఖల సం ఖ్యను తగ్గించుకుంటున్నాయి? బజాజ్ అలయంజ్ పరిస్థితేంటి? గతంలో ఒకే పట్టణంలో నాలుగైదు శాఖలను ఏర్పాటు చేసిన బీమా కంపెనీలు వ్యయ నియంత్రణలో భాగంగా వాటిని విలీనం చేస్తున్నాయి. శాఖలను పునర్ వ్యవస్థీకరించడం తప్ప పూర్తిగా మూసేయడం లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 773 శాఖలు ఉన్నాయి. తగినన్ని శాఖలు ఉండటంతో కొత్తగా ఎటువంటి విస్తరణ కార్యక్రమాల యోచన లేదు.