Special Section
-
చిరునామా చెప్పారూ!
నగరంలో గందరగోళంగా ఇంటి నెంబర్లు గుర్తించేందుకు కష్టాలు నిత్యం ఎంతోమందికి అవస్థలు సిటీబ్యూరో: సురేష్ కొత్తగా నగరంలోకి వచ్చాడు. బంజారాహిల్స్‌లో ఉంటున్న అతని మిత్రుడు ఇచ్చిన చిరునామా ఆధారంగా ఇంటి నెంబర్ కనుక్కొనేందుకు బయలుదేరాడు. ఉదయం 8 గంటలకు వెతకడం ప్రారంభిస్తే...11 గంటలైనా చిరునామా కనుక్కోలేకపోయాడు. ఇంటి నెంబర్ గుర్తించలేకపోయాడు. చివరికి తన మిత్రుడు ఆఫీస్‌కు ఒక పూట సెలవు పెట్టి...స్వయంగా వచ్చి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఒక్క సురేష్ మాత్రమే కాదు... నిత్యం ఎంతోమందికి ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది. పూర్తి చిరునామా కాగితం చేతిలో ఉన్నా.. మనం చేరాల్సిన ఇల్లు ఎక్కడ ఉందో తెలియక గంటలు గంటలు తిరగాల్సిన పరిస్థితి. ఒక ఇంటి నెంబరును చూసి.. తర్వాతి నెంబరు గల ఇల్లు పక్కనే ఉంటుందనుకుంటే పొరపాటే. గజిబిజి గల్లీలు... క్రమపద్ధతిలో లేని వీధి నెంబర్లు... గందరగోళంగా కాలనీలు... వరుస క్రమంలో లేని ఇళ్ల నెంబర్లు.. ఒక్క డోర్ నెంబరులోనే ఎన్నో బై (/) సంఖ్యలతో ఇళ్లు. వీటిలో అసలు చిరునామా కనుక్కోవడానికి నిత్యం ఎంతోమంది అవస్థలు పడుతున్నారు. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం నాటి నెంబర్ల వ్యవస్థే నేటికీ కొనసాగుతోంది. ఈ మధ్యకాలంలో లక్షల సంఖ్యలో ఇళ్లు పెరిగాయి. దాంతో అప్పటికే ఉన్న ఇంటి నెంబరుకు ‘బై’ (/) గుర్తును చేర్చి... వరుసగా నెంబర్లు రాసుకుంటూ పోవడమో లేక ఏ..బీ..సీ.. డీ.. ఈ..లుగా పొడిగిస్తూ పోవడమో చేశారు. ఫలితంగా చిరునామాలు కనుక్కోవడం పరీక్షగా మారింది. ప్రజలకు ఈ అవస్థలు తప్పించేందుకు... సులభంగా చిరునామాలు తెలుసుకునేందుకు వీలుగా పద్ధతి ప్రకారం ఉండేలా కొత్త ఇంటి నెంబర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కానీ.. ముందుకు సాగడం లేదు. ప్రత్యేక విభాగం ఇళ్లు, రోడ్లు, వీధుల పేర్లు, నెంబర్లకోసం జీహెచ్ఎంసీలో ఒక విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. డెరైక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలో ఇది పని చేస్తుంది. గతంలో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నయ్ నగరాల్లోని ఇంటినంబర్ల విధానాన్ని పరిశీలించి.. సులభంగా ఉండేలా లొకాలిటీల (ప్రాంతాలు) విధానంతో ఇంటి నెంబర్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు నిబంధనలు రూపొందించారు. ఏళ్లకేళ్లు గడుస్తున్నాయే తప్ప ప్రజలు సులభంగా ఇంటి చిరునామా కనుక్కునే అవకాశం మాత్రం కలుగలేదు. కొత్త పద్ధతి ఇలా.. కొత్త ఇంటి నెంబర్ల విధానానికి నగరాన్ని ‘లొకాలిటీ’లు.. ప్రధాన రహదారులుగా విభజించారు. బాగా వాడుకలో ఉన్న ప్రాంతాల పేర్లనే ‘లొకాలిటీ’లకు వినియోగించాలని నిర్ణయించారు. వీటిలో వీధి నెంబర్లు .. ఇంటి నెంబర్లను నిర్ణయించారు. నిర్మాణ అనుమతులు ఉన్నదీ లేనిదీ... సంబంధం లేకుండా అన్ని ఇళ్లకూ.. ఖాలీ స్థలాలుంటే ఆవరణలకు (ప్రెమిసెస్) సైతం నెంబర్లు ఇవ్వాలని యోచించారు. అపార్టుమెంట్లు, వాణిజ్య కాంప్లెక్సుల్లో ఆవరణ నెంబర్/ఇంటి నెంబరు రెండూ కేటాయించే ప్రయత్నం చేశారు. తద్వారా చిరునామా కనుక్కోవడం సులభమవుతుందని భావించారు. కొత్త విధానంలో వీధి ప్రారంభంలోనే ఆ ప్రాంతంలోని ఇంటి నెంబర్లను సూచిస్తూ సైన్‌బోర్డులు ఉంటాయి. ప్రాంతం (లొకాలిటీ) పేరు, వీధి నెంబరు, అక్కడ ఎన్ని ఇళ్లు ఉన్నాయో వివరాలు ఉంటాయి. ఇంటి నెంబరు ప్లేటుపై లొకాలిటీ (ఉదా: బాగ్ లింగంపల్లి ), వీధి నెంబరు (ఉదా: 3), ఇంటి నెంబరు (ఉదా:15) ఉంటాయి. ఇదంతా ఒకటి, రెండు చోట్ల ప్రయోగాలకే పరిమితమైంది. కొత్త ప్రభుత్వంలోనైనా సమస్య తీరేనా? నాలుగేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇళ్ల నెంబర్ల కార్యక్రమాన్ని అప్పటి మున్సిపల్ మంత్రి మహీధర్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అప్పటి ప్రభుత్వంతో పాటు రాష్ట్రం కూడా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం నగరానికి సంబంధించిన వివిధ అంశాలపై దృష్టి సారించినప్పటికీ... ఇంటి నెంబర్లపై మాత్రం ఇంతవరకూ శ్రద్ధ చూపలేదు. దాంతో పరిస్థితిలో మార్పులేకుండాపోయింది. కాంట్రాక్ట్ ఇచ్చినా... జీహెచ్ఎంసీ సిబ్బందితో పని కాకపోవడంతో కాప్రా, ఉప్పల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మల్కాజిగిరి, కూకట్పల్లి సర్కిళ్ల బాధ్యతలను కాంట్రాక్టుకు ఇచ్చారు. అయినా అదే పరిస్థితి. శివార్లలో కాప్రా, మల్కాజిగిరి సర్కిళ్లలో సర్వే పూర్తయింది. ఎల్బీనగర్, రాజేంద్రనగర్, కూకట్పల్లి సర్కిళ్లలో లొకాలిటీ ప్రణాళికల పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే ప్రణాళికబద్ధ నగరమైన చండీగఢ్‌లా ఉంటుందని భావిస్తున్నారు. కానీ.. ఎప్పటికో మరి.. ?! టెండర్లకు సిద్ధం? శివార్లలోని శేరిలింగంపల్లి-1, శేరిలింగంపల్లి-2, పటాన్చెరు-ఆర్సీపురం, కుత్బుల్లాపూర్, అల్వాల్సర్కిళ్లలో సర్వే లొకాలిటీ ప్రణాళిక పనులను కాంట్రాక్టు ఏజెన్సీలకు ఇచ్చారు. ప్రణాళికలు ఇంకా పూర్తి కాలేదు. కోర్ ఏరియాలోని ఖైరతాబాద్, మెహదీపట్నం (సర్కిల్7) సర్కిళ్ల సర్వే సైతం కాంట్రాక్టుకు ఇవ్వాలని యోచిస్తున్నారు. సిబ్బంది కొరత జీహెచ్ఎంసీలో తగినంతమంది సర్వేయర్లు, ఇతర సిబ్బంది లేరు. దాంతో పనులు పూర్తి కాలేదు. రెండు సర్కిళ్లలో(సర్కిల్-9, సర్కిల్-8) మాత్రం ఇంటి నెంబర్ ప్లేట్లు బిగించారు. నాలుగు, ఐదు సర్కిళ్లలో సర్వే పూర్తయింది. -
విపత్తుకేదీ విరుగుడు?
ముంపు ముంగిట నగరం.. మేల్కోవాలి నాయక గణం కుంభవృష్టి కురవకపోయినా.. 24 గంటల్లో 24 సెంటీమీటర్ల వర్షం కురిసినా నగరం మునిగిపోయే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక విపత్తు వస్తే పరిస్థితేంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలాలు ఓవైపు ఆక్రమణలకు గురై.. మరోవైపు చెత్తాచెదారం నిండిపోవడంతో వరద నీరు వెళ్లలేని దుస్థితి నగరానిది. సిటీలో సుమారు వంద నీట మునిగే(వాటర్ లాగింగ్) ప్రాంతాలున్నట్లు బల్దియా గుర్తించినా.. నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. రాష్ట్ర గవర్నర్ నివాసముండే రాజ్‌భవన్, అసెంబ్లీ, అమీర్‌పేట్ మైత్రీవనం, ఖైరతాబాద్ తదితర ప్రధాన ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వరదనీరు సాఫీగా వెళ్లేందుకు తగిన ప్రణాళికలు గానీ, చేసిన పనులు గానీ లేవంటే అతిశయోక్తి కాదు. కాగితాలపైనే నివేదికలు... 2000 ఆగస్టులో కురిసిన వర్షాలకు నగరం జలమయమైంది. నీరు వెళ్లే మార్గం లేకపోవడం, వరదనీటి కాలువల్లో పేరుకుపోయిన భవన నిర్మాణ వ్యర్థాలు, ఇంకుడు గుంతలు లేకపోవడం, నాలాలు, చెరువులు ఆక్రమణలకు గురవ్వడమే దీనికి కారణమని నిపుణులు గుర్తించారు. సమస్య పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించే బాధ్యత కిర్లోస్కర్ కన్సల్టెంట్‌కు అప్పగించారు. 2003లో నివేదిక సమర్పించిన కిర్లోస్కర్ కమిటీ వరదనీరు సాఫీగా వెళ్లేందుకు నాలాలను అభివద్ధి చేయాలని సూచించింది. దీనికి దాదాపు రూ.264 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. భూసేకరణ, పునరావాసాలకు అదనపు నిధులు అవసరమవుతాయని భావించారు. మేజర్ నాలాల అభివద్ధికి కిర్లోస్కర్ కమిటీ ఈ నివేదిక రూపొందించగా, మైక్రోలెవల్ వరకు వరదనీటి నిర్వహణకు మాస్టర్‌ప్లాన్ రూపొందించాల్సిందిగా అధికారులు 2006లో కమిటీ కి సూచించారు. 2007లో నగరం గ్రేటర్‌గా ఏర్పటయ్యాక ‘సమగ్ర మాస్టర్‌ప్లాన్, సూక్ష్మస్థాయి వరదనీటి పారుదల నెట్వర్క్ ప్లాన్, మేజర్, మైనర్ వరద కాలువల ఆధునీకరణకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) బాధ్యతను ఓయంట్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించారు. దీని ప్రాథమిక అంచనా మేరకు గ్రేటర్లో వరద నీటి సమస్య పరిష్కారానికి రూ.6,247 కోట్లు అవసరమవుతాయి. ఈ నిధులతో బల్కాపూర్, కూకట్పల్లి, పికెట్, ఎర్రమంజిల్, బంజారాహిల్స్, ఎల్లారెడ్డిగూడ, పంజగుట్ట, యూసుఫ్‌గూడ, నాగమయ్యకుంట, కళాసిగూడ, ఇందిరాపార్కు, ముర్కినాలాలను ప్రక్షాళన చేసి, ఆక్రమణలు నిరోధించాలి. వీటితో పాటు దండు మాన్షన్, గాంధీనగర్, మోడల్‌హౌస్, జలగం వెంగళరావు పార్కు ప్రాంతాల్లో టన్నెలింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. కానీ ఈ నివేదికలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. చతుర్విద ప్రక్రియతో జలసిరి.. నగరంలోని పార్కులు, లోతట్టు ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాల్లో సుమారు పది ఎకరాల విస్తీర్ణంలో ఒక్కటి చొప్పున భారీ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి. ఇవి 22 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పు, 6 మీటర్ల లోతులో ఉండాలి. వీటిపై రంధ్రాలున్న సిమెంట్ జాలి, చెత్తాచెదారం చేరకుండా సిల్టు ట్రాపు మూతలు ఏర్పాటు చేయాలి. దీంతో సమీప బోరుబావులు రీఛార్జ్ అయి జలసిరి సంతరించుకుంటాయి. ఇలా చేస్తే 80 శాతం వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవచ్చు. ముంపు సమస్యలనూ అధిగమించొచ్చు. వీటి ఏర్పాటుపై జలమండలి, జీహెచ్ఎంసీ, స్వచ్ఛంద సంస్థలు, కాలనీ సంక్షేమ సంఘాలు దృష్టి సారించాలి. - హనుమంతరావు, ఇంజినీర్ ఇన్ చీఫ్, రిటైర్డ్ ఆధునీకరించాలి.. లక్ష్మి, వివేకానందనగర్ నాలాల విస్తరణ చేపట్టాలి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో నాలాలు కబ్జాలకు గురయ్యాయి. వర్షపు నీరు వెళ్లేందుకు నిర్మించిన నాలాల్లో ప్రస్తుతం రసాయన జలాలు, డ్రైనేజీ పారుతోంది. చెత్తాచెదారాలు నిండిపోయాయి. దీంతో వర్షపు నీరు వెళ్లే దారి లేక వరద ఇళ్లలోకి వస్తోంది. ఇళ్లలోకి నీరు చేరి విష సర్పాలు కూడా వచ్చిన సందర్భాలున్నాయి. నాలాలు ఆధునీకరించి అభివృద్ధి చేసే వారికే నా ఓటు. అక్రమార్కులపై చర్యలేవీ? లావణ్య, కుత్బుల్లాపూర్ కుత్బుల్లాపూర్‌లో 6 కిలో మీటర్ల మేర నాలా విస్తరించి ఉంది. సుమారు 30 ఫీట్ల నాలా 15 ఫీట్లకు కుంచించుకుపోయింది. దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణం. ఆక్రమణలు జరుగుతున్నా అడ్డుకోకపోవడంతో నాలాలను ఆనుకొని బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి. గతంలో అధికారులు పలు నిర్మాణాలు అక్రమమని తేల్చారు. కానీ చర్యలు తీసుకోలేదు. ఆక్రమణలకు అడ్డుకట్ట వేసే నాయకులకే పట్టం కడతాం. నాలాల నిర్వహణేదీ..? ఈఎస్ ధనుంజయ, అంబర్‌పేట అధికారులు నాలాల నిర్వహణ మరిచారు. ‘నామ్‌కే వాస్త్’గా నాలాల పూడికతీత తీసి, నిధులు దండుకుంటున్నారు. మరోవైపు నాలాలు ఆక్రమణలకు గురై కుంచించుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదు. నాలాల చుట్టూ ప్రహరీ నిర్మిస్తామని ఎన్నికల వేళ నాయకులు హామీలిస్తున్నారే తప్ప నెరవేర్చడం లేదు. హామీలు నెరవేర్చే వారినే గెలిపించాలి. చినుకొస్తే నగరం చిగురుటాకే.. కుంభవృష్టి కురిస్తే క‘న్నీటి’ సంద్రమే.. రహదారులు జలమయమే. రాకపోకలు రణరంగమే.. నిలువ నీడ లేక బస్తీలకు నిత్య కష్టమే.. ‘కబ్జా’ సర్పం పడగవిప్పి.. నీరు వెళ్లే దారి లేకుండా నాలాలను ఆక్రమించిన నరకమిది. నివేదికలు కాగితాలకే పరిమితమై.. వరద నీరు నగరాన్ని వణికిస్తున్న చిత్రమిది. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యం, అక్రమార్కుల ఆగడాల ఫలితమే ఈ దుస్థితి. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ను ముంపు ముప్పు నుంచి గట్టెక్కించే పార్టీకే పట్టం కడతామంటున్నారు నగరవాసులు. ..: సాక్షి, సిటీబ్యూరో , కుత్బుల్లాపూర్ ‘మెట్రో’ల్లో భేష్ ముంబై, బెంగళూర్, ఢిల్లీ, కోల్‌కతా లాంటి మెట్రో నగరాల్లో విపత్తును సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆయా ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఏర్పాటు చేసిన విపత్తు స్పందనా దళం(ఎన్డీఆర్ఎఫ్) అందుబాటులో ఉంది. ఇందులో ఆయా నగరపాలక సంస్థలు, జలబోర్డులు, అగ్నిమాపక, రెవెన్యూ శాఖల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. విపత్తు నిర్వహణ విభాగానికి ప్రత్యేక కార్యాలయం, ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తారు. విపత్తు సంభవించినప్పుడు సంస్థ సభ్యులు ఆయా విభాగాలను అప్రమత్తం చేసి, సుశిక్షితులైన సిబ్బంది సహకారంతో సహాయక చర్యలు చేపడతారు. కానీ నగరంలో ఇలాంటి ప్రత్యేక విభాగం లేదు. సిటీలోనూ ఇవి అవసరం ► నగరంలోనూ విపత్తు స్పందనా దళం(ఎన్డీఆర్ఎఫ్) ఏర్పాటు చేయాలి. ► సిటీలోని పురాతన భవనాల నాణ్యత, మన్నికను గుర్తించేందుకు రేడియోధార్మిక టెక్నాలజీని వినియోగించాలి. ► నాలాలు, లోతట్టు ప్రాంతాలను జీఐఎస్ పరిజ్జానం ద్వారా గుర్తించి మ్యాపులు సిద్ధం చేయాలి. ► లోతట్టు ప్రాంతాల్లో ఆటోమేటిక్ రెయిన్‌గేజ్ యంత్రాల ఏర్పాటు ► ముప్పు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు ప్రవేశించకుండా అత్యవసర మోటార్లు ఏర్పాటు చేయాలి. ► ప్రతి నాలా చుట్టూ వలయం నిర్మించాలి. ప్రతిపాదనలకే పరిమితం... నాలాల ఆధునీకరణకు రూ.10 వేల కోట్లు ఖర్చవుతాయని జీహెచ్ఎంసీ అధికారులు ప్రతిపాదించారు. తొలిదశలో 390 కి.మీ.ల మేర నాలాలను అభివద్ధి చేయాలని గతేడాది నవంబర్‌లో భావించారు. దశల వారీగా పనులు పూర్తి చేయాలని, ఇద్దరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఇంజినీర్లు, సర్వేయర్లతో ప్రత్యేక బృందాలను నియమిస్తామని ప్రకటించారు. నేటికీ ఆచరణలోకి రాలేదు. ఇవిగో పరిష్కార మార్గాలు.. ► ప్రధాన నాలాలపై ఉన్న ఆక్రమణలను తొలగించాలి. ► బీపీఎల్, ఏపీఎల్ కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి. ► నిర్ణీత వ్యవధిలో పనుల పూర్తికి ప్రత్యేక విభాగం ఏర్పాటు ► నాలాల ఆధునీకరణ ఆవశ్యకతను ప్రజలకు వివరించాలి. దీనికి పార్టీలు, ఎన్జీఓల సహకారం తీసుకోవాలి. ► వరద నీటి కాలువల్లో మురుగునీరు పారకుండా జలమండలికి స్పష్టమైన ► ఆదేశాలివ్వాలి. మురుగునీటి పారుదలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలి. ► అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ► చెరువులు పునరుద్ధరించాలి. -
సీఎం సెల్ ప్రారంభం
విజయవాడ సిటీ: కాల్‌మనీ వ్యాపారుల ఆగడాలపై కమిషనరేట్‌లో ప్రత్యేక విభాగం (సీఎం సెల్) ప్రారంభమైంది. ఏసీపీ ప్రకాష్‌బాబు నేతృత్వంలో సెంట్రల్ కంప్లైంట్ సెల్ (సీసీసీ) కార్యాలయంలో దీన్ని ఏర్పాటు చేశారు. కాల్‌మనీ బాధితుల నుంచి వచ్చే అర్జీలను ఈ విభా గం స్వీకరిస్తుంది. పటమట పంట కాల్వ రోడ్డులోని శ్రీరామాంజనేయ ఫైనాన్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత కాల్‌మనీ వ్యాపారుల ఆగడాలపై పెద్ద సంఖ్యలో బాధితులు కమిషనరేట్‌కు వస్తున్నారు. సీపీ సవాంగ్ ఆదేశాల మేరకు నగరంలోని పలువురు కాల్‌మనీ బాధితుల నుంచి పోలీసులు అర్జీలు తీసుకుంటున్నారు. మూడు రోజుల వ్యవధిలో 100 మంది వరకు కాల్‌మనీ బాధితులు కమిషనరేట్‌కి వచ్చి ఫిర్యాదు చేశారు. బుధవారం భారీ సంఖ్యలో కాల్‌మనీ వ్యాపారులు పోలీసు కమిషనర్‌ను కలిసేందుకు వచ్చారు. వీరందరి అర్జీలు తీసుకోవడం ఉన్నతాధికారులకు ఇబ్బందిగా మారింది. దీంతో సీఎం సెల్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఇక్కడే కమిషనరేట్ పరిధిలో వచ్చే వడ్డీ వ్యాపారుల నుంచి ఇక్కడ అర్జీలు తీసుకుంటారు. వచ్చిన బాధితులందరి వద్ద అర్జీలు తీసుకుని వాటిని వేరుపరుస్తారు. సివిల్, క్రిమినల్ స్వభావం ఉన్న వాటిని వేరుచేస్తారు. వచ్చిన అర్జీల్లో క్రిమినల్ చర్యలకు అవకాశం ఉన్న వాటిని వేరు చేసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంబంధిత పోలీసు స్టేషన్లకు పంపుతారు. తద్వారా ఆయా పోలీసు స్టేషన్ల సిబ్బంది కాల్‌మనీ వ్యాపారులపై కఠిన చర్యలకు దిగుతుంది. క్రిమినల్ ఎలిమెంట్స్ లేని సివిల్ వివాదాలను సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ప్రీ లిటిగేషన్ ఫోరానికి పంపుతారు. లేని పక్షంలో కోర్టు ద్వారా పరిష్కారానికి చర్యలు చేపడతారు. ఇలా చేస్తే కేసులే చట్టానికి లోబడి వడ్డీ వ్యాపారం చేసేవారి జోలికి వెళ్లబోమంటూ శాంతి భద్రతల విభాగం డీసీపీ ఎల్.కాళిదాస్ తెలిపారు. అలాకాక చట్టాన్ని చేతిలోకి తీసుకుని బాధితులను వేధింపులకు గురిచేస్తే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. వీరిపై క్రిమినల్ కేసుల నమోదుతోపాటు చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఏయే సందర్బాల్లో క్రిమినల్ కేసులు నమోదు చేస్తారనేది ఆయన మాటల్లోనే... ఖాళీ చెక్కులు, నోట్లు తీసుకోవడం. అప్పు ఉన్నట్టు స్టాంపు పేపర్లపై రాయించుకోవడం. తనఖా కమ్ సేల్ డీడ్ రిజిస్టర్ చేయించడం. అప్పు తీసుకున్న వారిని బెదిరించడం. అప్పు ఉన్నారనే నెపంతో మహిళలతో అనుచితంగా ప్రవర్తించడం చట్టాన్ని అతిక్రమించి అధిక వడ్డీలు తీసుకోవడం. ఈ సెక్షన్ల కింద కేసు కాల్‌మనీ పేరిట నిబంధనలు అతిక్రమిస్తే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. సెక్షన్ 384 (బలవంతం), 385 (డబ్బు కోసం దాడి), 474 (అక్రమంగా డాక్యుమెంట్లు తీసుకోవడం), 506 (నేరం చేయాలనే దురుద్దేశం), 420(మోసం) కింద కేసులు నమోదు చేస్తారు.