సీఎం సెల్ ప్రారంభం | CM cell start | Sakshi
Sakshi News home page

సీఎం సెల్ ప్రారంభం

Published Thu, Dec 17 2015 1:13 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 PM

CM cell start

విజయవాడ సిటీ: కాల్‌మనీ వ్యాపారుల ఆగడాలపై కమిషనరేట్‌లో ప్రత్యేక విభాగం (సీఎం సెల్) ప్రారంభమైంది. ఏసీపీ ప్రకాష్‌బాబు నేతృత్వంలో సెంట్రల్ కంప్లైంట్ సెల్ (సీసీసీ) కార్యాలయంలో దీన్ని ఏర్పాటు చేశారు. కాల్‌మనీ బాధితుల నుంచి వచ్చే అర్జీలను ఈ విభా గం స్వీకరిస్తుంది. పటమట పంట కాల్వ రోడ్డులోని శ్రీరామాంజనేయ ఫైనాన్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత కాల్‌మనీ వ్యాపారుల ఆగడాలపై పెద్ద సంఖ్యలో బాధితులు కమిషనరేట్‌కు వస్తున్నారు. సీపీ సవాంగ్ ఆదేశాల మేరకు నగరంలోని పలువురు కాల్‌మనీ బాధితుల నుంచి పోలీసులు అర్జీలు తీసుకుంటున్నారు.  మూడు రోజుల వ్యవధిలో 100 మంది వరకు కాల్‌మనీ బాధితులు కమిషనరేట్‌కి వచ్చి ఫిర్యాదు చేశారు. బుధవారం భారీ సంఖ్యలో కాల్‌మనీ వ్యాపారులు పోలీసు కమిషనర్‌ను కలిసేందుకు వచ్చారు. వీరందరి అర్జీలు తీసుకోవడం ఉన్నతాధికారులకు ఇబ్బందిగా మారింది. దీంతో సీఎం సెల్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
 
ఇకపై ఇక్కడే

కమిషనరేట్ పరిధిలో వచ్చే వడ్డీ వ్యాపారుల నుంచి ఇక్కడ అర్జీలు తీసుకుంటారు. వచ్చిన బాధితులందరి వద్ద అర్జీలు తీసుకుని వాటిని వేరుపరుస్తారు. సివిల్, క్రిమినల్ స్వభావం ఉన్న వాటిని వేరుచేస్తారు. వచ్చిన అర్జీల్లో క్రిమినల్ చర్యలకు అవకాశం ఉన్న వాటిని వేరు చేసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంబంధిత పోలీసు స్టేషన్లకు పంపుతారు. తద్వారా ఆయా పోలీసు స్టేషన్ల సిబ్బంది కాల్‌మనీ వ్యాపారులపై కఠిన చర్యలకు దిగుతుంది. క్రిమినల్ ఎలిమెంట్స్ లేని సివిల్ వివాదాలను సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ప్రీ లిటిగేషన్ ఫోరానికి పంపుతారు. లేని పక్షంలో కోర్టు ద్వారా పరిష్కారానికి చర్యలు చేపడతారు.
 
ఇలా చేస్తే కేసులే
చట్టానికి లోబడి వడ్డీ వ్యాపారం చేసేవారి జోలికి వెళ్లబోమంటూ శాంతి భద్రతల విభాగం డీసీపీ ఎల్.కాళిదాస్ తెలిపారు. అలాకాక చట్టాన్ని చేతిలోకి తీసుకుని బాధితులను వేధింపులకు గురిచేస్తే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. వీరిపై క్రిమినల్ కేసుల నమోదుతోపాటు చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఏయే సందర్బాల్లో క్రిమినల్ కేసులు నమోదు చేస్తారనేది ఆయన మాటల్లోనే...

ఖాళీ చెక్కులు, నోట్లు తీసుకోవడం.
అప్పు ఉన్నట్టు స్టాంపు పేపర్లపై రాయించుకోవడం.
తనఖా కమ్ సేల్ డీడ్ రిజిస్టర్ చేయించడం.
అప్పు తీసుకున్న వారిని బెదిరించడం.
అప్పు ఉన్నారనే నెపంతో మహిళలతో అనుచితంగా ప్రవర్తించడం
చట్టాన్ని అతిక్రమించి అధిక వడ్డీలు తీసుకోవడం.
ఈ సెక్షన్ల కింద కేసు కాల్‌మనీ పేరిట నిబంధనలు అతిక్రమిస్తే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. సెక్షన్ 384 (బలవంతం), 385 (డబ్బు కోసం దాడి), 474 (అక్రమంగా డాక్యుమెంట్లు తీసుకోవడం), 506 (నేరం చేయాలనే దురుద్దేశం), 420(మోసం) కింద కేసులు నమోదు చేస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement