చిరునామా చెప్పారూ!
నగరంలో గందరగోళంగా ఇంటి నెంబర్లు గుర్తించేందుకు కష్టాలు
నిత్యం ఎంతోమందికి అవస్థలు
సిటీబ్యూరో: సురేష్ కొత్తగా నగరంలోకి వచ్చాడు. బంజారాహిల్స్‌లో ఉంటున్న అతని మిత్రుడు ఇచ్చిన చిరునామా ఆధారంగా ఇంటి నెంబర్ కనుక్కొనేందుకు బయలుదేరాడు. ఉదయం 8 గంటలకు వెతకడం ప్రారంభిస్తే...11 గంటలైనా చిరునామా కనుక్కోలేకపోయాడు. ఇంటి నెంబర్ గుర్తించలేకపోయాడు. చివరికి తన మిత్రుడు ఆఫీస్‌కు ఒక పూట సెలవు పెట్టి...స్వయంగా వచ్చి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఒక్క సురేష్ మాత్రమే కాదు... నిత్యం ఎంతోమందికి ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది. పూర్తి చిరునామా కాగితం చేతిలో ఉన్నా.. మనం చేరాల్సిన ఇల్లు ఎక్కడ ఉందో తెలియక గంటలు గంటలు తిరగాల్సిన పరిస్థితి. ఒక ఇంటి నెంబరును చూసి.. తర్వాతి నెంబరు గల ఇల్లు పక్కనే ఉంటుందనుకుంటే పొరపాటే. గజిబిజి గల్లీలు... క్రమపద్ధతిలో లేని వీధి నెంబర్లు... గందరగోళంగా కాలనీలు... వరుస క్రమంలో లేని ఇళ్ల నెంబర్లు.. ఒక్క డోర్ నెంబరులోనే ఎన్నో బై (/) సంఖ్యలతో ఇళ్లు. వీటిలో అసలు చిరునామా కనుక్కోవడానికి నిత్యం ఎంతోమంది అవస్థలు పడుతున్నారు. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం నాటి నెంబర్ల వ్యవస్థే నేటికీ కొనసాగుతోంది. ఈ మధ్యకాలంలో లక్షల సంఖ్యలో ఇళ్లు పెరిగాయి. దాంతో అప్పటికే ఉన్న ఇంటి నెంబరుకు ‘బై’ (/) గుర్తును చేర్చి... వరుసగా నెంబర్లు రాసుకుంటూ పోవడమో లేక ఏ..బీ..సీ.. డీ.. ఈ..లుగా పొడిగిస్తూ పోవడమో చేశారు. ఫలితంగా చిరునామాలు కనుక్కోవడం పరీక్షగా మారింది. ప్రజలకు ఈ అవస్థలు తప్పించేందుకు... సులభంగా చిరునామాలు తెలుసుకునేందుకు వీలుగా పద్ధతి ప్రకారం ఉండేలా కొత్త ఇంటి నెంబర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కానీ.. ముందుకు సాగడం లేదు.
ప్రత్యేక విభాగం
ఇళ్లు, రోడ్లు, వీధుల పేర్లు, నెంబర్లకోసం జీహెచ్‌ఎంసీలో ఒక విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. డెరైక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలో ఇది పని చేస్తుంది. గతంలో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నయ్ నగరాల్లోని ఇంటినంబర్ల విధానాన్ని పరిశీలించి.. సులభంగా ఉండేలా లొకాలిటీల (ప్రాంతాలు) విధానంతో ఇంటి నెంబర్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు నిబంధనలు రూపొందించారు. ఏళ్లకేళ్లు గడుస్తున్నాయే తప్ప ప్రజలు సులభంగా ఇంటి చిరునామా కనుక్కునే అవకాశం మాత్రం కలుగలేదు.
కొత్త పద్ధతి ఇలా..
కొత్త ఇంటి నెంబర్ల విధానానికి నగరాన్ని ‘లొకాలిటీ’లు.. ప్రధాన రహదారులుగా విభజించారు. బాగా వాడుకలో ఉన్న ప్రాంతాల పేర్లనే ‘లొకాలిటీ’లకు వినియోగించాలని నిర్ణయించారు. వీటిలో వీధి నెంబర్లు .. ఇంటి నెంబర్లను నిర్ణయించారు. నిర్మాణ అనుమతులు ఉన్నదీ లేనిదీ... సంబంధం లేకుండా అన్ని ఇళ్లకూ.. ఖాలీ స్థలాలుంటే ఆవరణలకు (ప్రెమిసెస్) సైతం నెంబర్లు ఇవ్వాలని యోచించారు. అపార్టుమెంట్లు, వాణిజ్య కాంప్లెక్సుల్లో ఆవరణ నెంబర్/ఇంటి నెంబరు రెండూ కేటాయించే ప్రయత్నం చేశారు. తద్వారా చిరునామా కనుక్కోవడం సులభమవుతుందని భావించారు.
కొత్త విధానంలో వీధి ప్రారంభంలోనే ఆ ప్రాంతంలోని ఇంటి నెంబర్లను సూచిస్తూ సైన్‌బోర్డులు ఉంటాయి. ప్రాంతం (లొకాలిటీ) పేరు, వీధి నెంబరు, అక్కడ ఎన్ని ఇళ్లు ఉన్నాయో వివరాలు ఉంటాయి. ఇంటి నెంబరు ప్లేటుపై లొకాలిటీ (ఉదా: బాగ్ లింగంపల్లి ), వీధి నెంబరు (ఉదా: 3), ఇంటి నెంబరు (ఉదా:15) ఉంటాయి. ఇదంతా ఒకటి, రెండు చోట్ల ప్రయోగాలకే పరిమితమైంది.
కొత్త ప్రభుత్వంలోనైనా సమస్య తీరేనా?
నాలుగేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇళ్ల నెంబర్ల కార్యక్రమాన్ని అప్పటి మున్సిపల్ మంత్రి మహీధర్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అప్పటి ప్రభుత్వంతో పాటు రాష్ట్రం కూడా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం నగరానికి సంబంధించిన వివిధ అంశాలపై దృష్టి సారించినప్పటికీ... ఇంటి నెంబర్లపై మాత్రం ఇంతవరకూ శ్రద్ధ చూపలేదు. దాంతో పరిస్థితిలో మార్పులేకుండాపోయింది.
కాంట్రాక్ట్ ఇచ్చినా...
జీహెచ్‌ఎంసీ సిబ్బందితో పని కాకపోవడంతో కాప్రా, ఉప్పల్, ఎల్‌బీనగర్, రాజేంద్రనగర్, మల్కాజిగిరి, కూకట్‌పల్లి సర్కిళ్ల బాధ్యతలను కాంట్రాక్టుకు ఇచ్చారు. అయినా అదే పరిస్థితి. శివార్లలో కాప్రా, మల్కాజిగిరి సర్కిళ్లలో సర్వే పూర్తయింది. ఎల్‌బీనగర్, రాజేంద్రనగర్, కూకట్‌పల్లి సర్కిళ్లలో లొకాలిటీ ప్రణాళికల పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే ప్రణాళికబద్ధ నగరమైన చండీగఢ్‌లా ఉంటుందని భావిస్తున్నారు. కానీ.. ఎప్పటికో మరి.. ?!
టెండర్లకు సిద్ధం?
శివార్లలోని శేరిలింగంపల్లి-1, శేరిలింగంపల్లి-2, పటాన్‌చెరు-ఆర్‌సీపురం, కుత్బుల్లాపూర్, అల్వాల్‌సర్కిళ్లలో సర్వే లొకాలిటీ ప్రణాళిక పనులను కాంట్రాక్టు ఏజెన్సీలకు ఇచ్చారు. ప్రణాళికలు ఇంకా పూర్తి కాలేదు. కోర్ ఏరియాలోని ఖైరతాబాద్, మెహదీపట్నం (సర్కిల్7) సర్కిళ్ల సర్వే సైతం కాంట్రాక్టుకు ఇవ్వాలని యోచిస్తున్నారు.
సిబ్బంది కొరత
జీహెచ్‌ఎంసీలో తగినంతమంది సర్వేయర్లు, ఇతర సిబ్బంది లేరు. దాంతో పనులు పూర్తి కాలేదు. రెండు సర్కిళ్లలో(సర్కిల్-9, సర్కిల్-8) మాత్రం ఇంటి నెంబర్ ప్లేట్లు బిగించారు. నాలుగు, ఐదు సర్కిళ్లలో సర్వే పూర్తయింది.