Special Talk
-
కుదిపేసిన బ్యాంకింగ్ స్కాంలు
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఆందోళనల మధ్య మలిదశ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. ఊహించినట్లే బ్యాంకింగ్ కుంభకోణాలపై విపక్షాలు ఉభయ సభల్ని స్తంభింపచేశాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంపై ప్రత్యేక చర్చ చేపట్టాలని, ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్, తృణమూల్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు లోక్‌సభ, రాజ్యసభల్లో పోడియంను చుట్టుముట్టి నినాదాలతో హోరెత్తించాయి. రిజర్వేషన్ల అంశంపై లోక్‌సభలో టీఆర్ఎస్, కావేరీ నదీ జలాల బోర్డు ఏర్పాటుపై సమాధానం చెప్పాలని పట్టుబడుతూ ఉభయ సభల్లో అన్నాడీఎంకే, డీఎంకేలు ఆందోళన కొనసాగించాయి. ప్రశ్నోత్తరాల్లేకుండానే... పీఎన్బీ కుంభకోణంపై విపక్షాల ఆందోళనలతో లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగింది. దీంతో ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టకుండానే స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక.. కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి పీఎన్బీ కుంభకోణం సూత్రధారి నీరవ్ మోదీ ఎక్కడున్నారో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ కూడా అదే అంశంపై నినాదాలు చేస్తూ కాంగ్రెస్‌కు జతకలిసింది. తెలంగాణలో ఎస్టీలు, మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచాలని కోరుతూ టీఆర్ఎస్ ఎంపీలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. రిజర్వేషన్ల అంశాన్ని రాష్ట్రానికే విడిచిపెట్టేలా ఆర్టికల్ 16ను సవరించాలని ఆ పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు. అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేశారు. ఉదయం లోక్‌సభ ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ సభలోకి రాగానే బీజేపీ సభ్యులు చప్పట్లతో స్వాగతం పలికారు. అనంతరం అధికార, ప్రతిపక్ష సభ్యులకు మోదీ అభివాదం చేశారు. మూడు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాల విజయానికి సంకేతంగా బీజేపీ ఎంపీలు అస్సామీ గమోసా(కండువా)లతో దర్శనమిచ్చారు. నిబంధన మేరకు చర్చకు అనుమతిస్తా అటు పీఎన్బీ కుంభకోణంపై రాజ్యసభలోను ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే తృణమూల్ కాంగ్రెస్ బ్యాంకింగ్ కుంభకోణాల్ని ప్రస్తావించగా.. కావేరీ నదీ జలాల నిర్వహణ బోర్డు ఏర్పాటుపై సుప్రీం ఆదేశాల్ని అమలుచేయాలని అన్నాడీఎంకే, డీఎంకేలు పట్టుబట్టాయి. దీంతో చైర్మన్ వెంకయ్య నాయుడు సభను పదినిమిషాలు వాయిదా వేశారు. అనంతరం సమావేశమయ్యాక వెంకయ్య మాట్లాడుతూ.. పీఎన్బీ అంశంపై చర్చించాలని 267 నిబంధన కింద పలువురు సభ్యుల నుంచి నోటీసులు అందాయని తెలిపారు. పీఎన్బీ కుంభకోణం అంశం చాలా ముఖ్యమైందని.. అయితే 267 కింద కాకుండా 176 నిబంధన మేరకు చర్చకు అనుమతి స్తానని చెప్పారు. నీరవ్ మోదీని భారత్‌కు తీసుకురావాలంటూ తృణమూల్ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. దీంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. సభ మరోసారి సమావేశమైనా ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించడంతో మంగళవారానికి వాయిదా వేశారు. ప్రశ్నోత్తరాల అనంతరం చర్చ చేపట్టాలి: ప్రతిపక్షాలు బ్యాంకింగ్ స్కాంలపై మంగళవారం 4 గంటలపాటు చర్చించా లని లోక్‌సభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన జరిగిన భేటీలో తృణమూల్ కాంగ్రెస్, బీజేడీ సభ్యులు మాట్లాడుతూ.. మధ్యాహ్నం 12 గంటలకు చర్చను చేపట్టాలని కోరారు. అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ ఈ భేటీలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. -
అప్పుడు టెన్షన్... ఇప్పుడు కూల్!
మనకెంతో ఇచ్చిన ఊరికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి.. లేకపోతే లావైపోతాం.. ఇది ‘శ్రీమంతుడు’ డైలాగ్. రీల్ కోసం ఈ డైలాగ్ మాట్లాడిన మహేశ్‌బాబు రియల్‌గా కూడా ఇదే పాటిస్తారు. తెరపై తనని చూసి, ఇష్టపడటంతో పాటు, తన సినిమాలను హిట్ చేస్తున్న ప్రేక్షకులకుమంచి సినిమాలు ఇవ్వాలనుకుంటారు. ‘శ్రీమంతుడు’ ఇచ్చారు. ఇప్పుడు ‘బ్రహ్మోత్సవం’ కూడా మంచి సినిమానే అంటున్నారు. వరుసగా మంచి సినిమాలిస్తే.. ఇక మహేశ్‌బాబు లావు ఎందుకు అవుతారు. ఈ హ్యాండ్సమ్ హీరోతో ‘సాక్షి’ స్పెషల్ టాక్... ♦ ‘బ్రహ్మోత్సవం’ కారణంగా వ్యక్తిగా ఎదిగానని ఆడియో ఫంక్షన్లో అన్నారు. ఒక సినిమా అంత ప్రభావితం చేస్తుందా? డెఫినెట్‌గా చేస్తుంది. ఎందుకంటే, ఒక సినిమాకి దాదాపు ఏడెనిమిది నెలలు పని చేస్తాం. ఆ ట్రావెల్లో ఆ సినిమాలో ఉన్న మంచి విషయాలు మనల్ని వెంటాడతాయి. శ్రీకాంత్‌గారి సినిమాల్లో చిన్న చిన్న విలువలు ఉంటాయి. అలాంటి చిన్న విలువలను మోడ్రన్ డే లైఫ్‌లో మనం మర్చిపోతుంటాం. ఈ సినిమా చేస్తున్నప్పుడు అవి గుర్తొచ్చాయి. చూసే ప్రేక్షకులకు కూడా గుర్తొస్తాయి. ♦ మీకు గుర్తొచ్చిన రెండు, మూడు విషయాలను షేర్ చేసుకుంటారా? మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం రెగ్యులర్‌గా లంచ్‌కి కలుస్తుంటాం. ఆ సమయంలో హాయిగా కబుర్లు చెప్పుకుంటాం. ‘బ్రహ్మోత్సవం’లో ఒక సీక్వెన్స్ ఉంటుంది. అందరం కలిసి టూర్‌కి వెళతాం. ఆ టూర్‌ని బాగా ఎంజాయ్ చేస్తాం. ఆ ఎంజాయ్మెంట్లో ఒక పాట కూడా పాడుకుంటాం. రియల్ లైఫ్‌లో అలా పాటలు పాడుకోలేం కానీ, ఆ టూర్ తాలూకు సన్నివేశాలు చేస్తున్నప్పుడు నా ఫ్యామిలీ గుర్తొచ్చింది. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఇంకా చాలా చాలా గుర్తొచ్చాయి. ♦ ‘శ్రీమంతుడు’ మంచి ఎమోషనల్ మూవీ... ‘బ్రహ్మోత్సవం’ కూడా అలానే ఉంటుందేమో అనిపిస్తోంది.. ‘శ్రీమంతుడు’ లార్జర్ దేన్ లైఫ్. అందుకు పూర్తిగా భిన్నంగా ఉండే సినిమా ‘బ్రహ్మోత్సవం’. ఏ సినిమా వేల్యూ దానికి ఉంటుంది. ‘శ్రీమంతుడు’తో దీనికి పోలిక లేదు. ♦ ‘శ్రీమంతుడు’తో మీ ఇమేజ్ ఒక్కసారిగా స్కై హై అయ్యింది.. దాంతో నెక్ట్స్ సినిమా ఏం చేయాలా? అనే భయం ఏర్పడిందా? ‘పోకిరి’ అప్పుడు భయం వేసింది. మళ్లీ నెక్ట్స్ సినిమా ఏంటి? అని. అప్పుడు నా వయసూ తక్కువ. కెరీర్ వయసూ తక్కువే. దాంతో కొంచెం టెన్షన్ అనిపించింది. ‘శ్రీమంతుడు’ తర్వాత భయం అనిపించలేదు. వ్యక్తిగా, నటుడిగా పరిణతి వచ్చింది. జెన్యూన్‌గా చేసిన సినిమా అందరి కితాబులు అందుకున్నందుకు హ్యాపీ అనిపించింది. ‘శ్రీమంతుడు’ తర్వాతి సినిమా ఏంటి? అని ఆలోచించాను. కాన్సన్ట్రేషన్ ‘బ్రహ్మోత్సవం’ పై పెట్టా. టెన్షన్ పడకుండా కూల్‌గా చేశా. ♦ ‘శ్రీమంతుడు’ అందరి హార్ట్‌ని టచ్ చేసింది కాబట్టి, మళ్లీ అలానే అవ్వాలని ‘బ్రహ్మోత్సవం’ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ని కావాలనే అంగీకరించారా? ‘శ్రీమంతుడు’ అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడే చెప్పారు. ఆయన కథలు రియలిస్టిక్‌గా ఉంటాయి. అలా ఇది నాకు బాగా కనెక్ట్ అయింది. యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఇప్పటివరకూ ఇలాంటి కథతో నేను సినిమా చేయలేదు. ♦ వసూళ్ల పరంగా ‘శ్రీమంతుడు’ని ‘బ్రహ్మోత్సవం’ దాటేస్తుందనిపిస్తోందా? అసలు వసూళ్ల గురించి నేను ఆలోచించలేదు. అది మన చేతుల్లో లేదు. మన బాధ్యత అంతా మంచి సినిమా చేయడం వరకే. కష్టపడి చేయాలి. మిగతాదంతా ఆడియన్స్ చేతుల్లో ఉంటుంది. ♦ టాలీవుడ్లో నంబర్ వన్ ప్లేస్‌కి సంబంధించిన స్పేస్ అలా ఉండిపోయింది. కొంతమంది మీరే ‘నంబర్ వన్’ అంటారు.. లేదండి. నేను దాని గురించి ఆలోచించను. ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు నాకు ముఖ్యం. నా సినిమాలను వాళ్లు ఆదరిస్తే ఆనందపడతాను. వాళ్లకు గ్రేట్‌ఫుల్‌గా ఉండాలనుకుంటాను. ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకుల కోసం మంచి సినిమాలు చేయాలని అనుకుంటాను. నా దృష్టంతా ఎప్పుడూ మంచి సినిమా మీదే ఉంటుంది. నంబర్ మీద ఉండదు. ♦ ఈ మధ్య సొంతూరు బుర్రిపాలెం వెళ్లారు.. అంతకుముందెప్పుడు వెళ్లారు? నా మొదటి సినిమా ‘రాజకుమారుడు’కి వెళ్లాను. ఆ తర్వాత ఇదే వెళ్లడం. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత వెళ్లినప్పటికీ ప్రజలు రిసీవ్ చేసుకున్న విధానం ఆశ్చర్యపరిచింది. ఎండని లెక్క చేయకుండా పిల్లలు, పెద్దవాళ్లందరూ నన్ను చూడ్డానికి గంటలు గంటలు నిలబడటం ఏదో చెప్పలేని ఫీలింగ్‌ని కలిగించింది. ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది. ♦ సెలబ్రిటీలు మనుషులే అయినప్పటికీ మిమ్మల్ని చూడ్డానికి మిగతా మనుషులు వెయిట్ చేస్తుంటారు ? ఆ సమయంలో ఓ స్టార్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ‘దటీజ్ ది పవర్ ఆఫ్ సినిమా’. సినిమా ఆర్టిస్ట్ కావడం నా లక్. నిజంగానే మాతో ప్రేక్షకులకు ఏ బంధమూ ఉండదు. కానీ, విపరీతంగా ప్రేమిస్తారు. ఆ ప్రేమ చూసినప్పుడు బాధ్యత బాగా పెరిగినట్లుగా అనిపిస్తుంది. మంచి సినిమా చేసి, వాళ్లని ఆనందపరచాలనిపిస్తుంది. ♦ వ్యక్తిగా, నటుడిగా మీ నాన్నగారు సాధించిన దాంట్లో మీరెంత ఎచీవ్ చేశారనుకుంటున్నారు? నాన్నగారితో పోలికా? ‘హీ ఈజ్ గ్రేట్’. అందుకే నాన్నగారి చేసినదాంట్లో మనం ఎంత చేశాం? అని ఎప్పుడూ ఆలోచించలేదు. బట్.. నా కెరీర్ ప్రోగ్రెస్ అవుతున్న విధానం చూసి, ఆయన చాలా ఆనందపడతారు. అది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ♦ ఈ మధ్య ఓ ఫుట్‌బాల్ ట్రైనర్ ట్రైనప్ అయినట్లుగా అయ్యారట. రోజు రోజుకీ యంగ్‌గా కనిపించడానికి అదే రీజనా? బేసిక్‌గా నాకు ఫిట్‌గా ఉండటం ఇష్టం. కొత్త కొత్త ఎక్స్ర్సైజులు ట్రై చేస్తుంటాను. ఇప్పుడు ‘బ్రహ్మోత్సవం’కి అనే కాదు.. ‘శ్రీమంతుడు’ అప్పుడు కూడా వర్కవుట్స్ చేశాను. ఎప్పుడూ చేస్తూ ఉంటాను. ♦ హ్యాండ్సమ్గా పుట్టినందుకు ఆ దేవుడికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పుకున్నారా? యస్.. ఐయామ్ వెరీ మచ్ బ్లెస్డ్. గాడ్కి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. నాకూ, నా సిస్టర్, బ్రదర్.. అందరికీ నాన్నగారి జీన్స్ వచ్చింది. నేను నాన్నగారిలా ఉంటాను. ♦ మీ మేనరిజమ్స్‌లో మీ అబ్బాయి గౌతమ్ ఫాలో అయ్యేవి... తల్లిదండ్రుల దగ్గర్నుంచి పిల్లలకు కొన్ని మేనరిజమ్స్ వస్తాయి. నేను ఒక రకంగా నవ్వుతాను. గౌతమ్ నవ్వు అచ్చంగా అలానే ఉంటుంది. నేను మాట్లాడేటప్పుడు చేతులు ఎలా ఊపుతానో గౌతమ్ కూడా అంతే. గౌతమ్ ఎక్కువగా నాన్నగారిలా ఉంటాడు. ♦ ఎక్కువగా హాలిడే ట్రిప్స్ వెళుతుంటారు.. ఆ ప్లేసెస్‌ని ఎవరు సెలక్ట్ చేస్తారు? పిల్లలే అడుగుతారు. ముఖ్యంగా గౌతమ్.. ‘ఆ ప్లేస్’కి వెళదాం అని సెలక్ట్ చేస్తాడు. వాళ్ల ఇష్టానికి తగ్గట్టే హాలిడే ట్రిప్ ప్లాన్ చేస్తుంటాం. ♦ చదువులో మీ పిల్లలు మీకన్నా బెటరా? మీరే బాగా చదివేవారా? నేను బ్యాడ్ స్టూడెంట్‌ని కాదు. కానీ, నా పిల్లలు నాకన్నా బాగానే చదువుతారని చెప్పొచ్చు. ♦ చదువు విషయంలో ఒత్తిడి చేస్తుంటారా? అస్సలు లేదు. ఎందుకంటే పదేళ్ల లోపు పిల్లలను జడ్జ్ చేయకూడదు. చిన్నప్పుడు బాగా చదవకపోతే పెద్దయ్యాక కూడా చదవరనీ, చిన్నప్పుడు బాగా చదివితే పెద్దయ్యాక కూడా చదువుతారనీ అనలేం. పిల్లల్ని జస్ట్ వాళ్ల లైఫ్ వాళ్లని ఎంజాయ్ చేయనివ్వాలి.రేవతి, సత్యరాజ్, మహేశ్‌బాబు, రజిత, ఈశ్వరీ రావ్, జయసుధ ♦ మూడు చక్రాల బుల్లెట్‌కి ఇన్స్పిరేషన్ అదే! ‘‘ప్రతి ఊరిలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. అలా ఓ ఊరిలో జరిగిన బ్రహ్మోత్సవాలను తీసుకొని మా ‘బ్రహ్మోత్సవం’ చిత్రం తెరకెక్కించాం. కుటుంబంతో కలిసి సంతోషంగా చూసేలా తీర్చిదిద్దాం’’ అని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అన్నారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోన్న ఈ చిత్రం గురించి శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ - ‘‘కుటుంబ కథా చిత్రమిది. అందులోనే లవ్‌స్టోరీ ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ గురించి చూపించాం. రాజస్థాన్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ రాష్ట్ర టూరిజం వాళ్ల వద్ద మూడు చక్రాల బుల్లెట్ ఉండేది. చూసేందుకు డిఫరెంట్‌గా ఉండటంతో బాగుంటుందనిపించి, అలాంటి వెహికల్ తయారు చేయించాం. హీరో, హీరోయిన్లు, ఇతర నటీనటులందరితో తీసిన ‘సంగీత్’ ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. మా చిత్రం తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే కాన్ఫిడెన్స్ ఉంది. ♦ ‘24’ సినిమా మీదాకా వచ్చింది కదా.. ఎందుకు అంగీకరించలేదు? ఆ సినిమా సూర్యగారు మాత్రమే చేయగలరని నా ఫీలింగ్. ఎవరెవరికి ఏది సూట్ అవుతుందో తెలుసుకోవాలి. నేను ‘24’ చేయలేను. అలాగే, ‘శ్రీమంతుడు’ క్యారెక్టర్ నాకు బాగా సూట్ అవుతుంది. కొన్ని క్యారెక్టర్స్ కొంతమందికే సూట్ అవుతాయి. ప్రతి యాక్టర్‌కి ఒక్కో సినిమా అలా ఉండిపోతుంది. ♦ మీ ‘ఎంబి కార్పొరేషన్’పై తీసిన మొదటి సినిమా ‘శ్రీమంతుడు’ మంచి సక్సెస్‌నిచ్చింది. ఇప్పుడు రెండో సినిమాకి కూడా ఓ నిర్మాతగా చేశారు కదా.. ప్రతి సినిమాకీ అలా చేస్తారా? అలా ఏం లేదు. డెఫినెట్‌గా నేను నమ్మిన సినిమాలకు నేను అసోసియేట్ అవుతాను. నమ్మనంత మాత్రాన అది బ్యాడ్ మూవీ అనలేం. కథ విన్నప్పుడు ఎక్కడో కనెక్ట్ అయిపోతాం. ‘బ్రహ్మోత్సవం’ నచ్చింది. అందుకే అసోసియేట్ అయ్యాను. ♦ ప్రొడక్షన్ చూసుకోవడం ఇబ్బందిగా అనిపించిందా? నేనా సైడ్ పట్టించుకోను. వేరే టీమ్ చూసుకుంటారు. పీవీపీగారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన కూడా కథని నమ్మారు. ఖర్చుకు వెనకాడకుండా బడ్జెట్ పెట్టారు. ఆయనలాంటి నిర్మాత లేకపోతే ఇలాంటి మంచి సినిమాలు రావు. ♦ ఫైనల్లీ మీ తదుపరి సినిమా గురించి? తెలుగు, తమిళ భాషల్లో మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నా. ఇప్పట్నుంచీ ఓ పదిహేను, ఇరవై రోజులు బ్రేక్ తీసుకుని, ఆ తర్వాత ఆ సినిమాలో బిజీ అయిపోతా. - డి.జి. భవాని -
ఎప్పటికైనా జానపదమో... పౌరాణికమో తీస్తాను!
మదర్, ఫాదర్ ఫేమస్ డాక్టర్లు. చాలా పెద్ద బ్యాక్‌గ్రౌండ్.పేరెంట్స్ ప్రేరణతో ఇట్టే డాక్టరైపోవచ్చు. కానీ, నాగ్ అశ్విన్రైటర్ వాలనుకున్నాడు... డెరైక్టర్ కావాలనుకున్నాడు. చిన్నప్పట్నుంచీ ఇదే తపన. ఇదే కసి. కట్ చేస్తే - ఇప్పుడతనో సెలబ్రిటీ. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. నాగ్ అశ్విన్‌తో ‘సాక్షి’ స్పెషల్ టాక్. తొలి ప్రయత్నంలోనే ఇంత పేరు, ఆదరణ. ఎలా ఉంది ఈ అనుభూతి? స్కూలు రోజుల నుంచీ సినిమాలే నా లక్ష్యం. ఈ స్థాయికి రావడం కోసం అనేక మజిలీలు. అవన్నీ తలచుకుంటుంటే గమ్మత్తుగా అనిపిస్తోంది. మీ తల్లితండ్రులిద్దరూ పేరొందిన వైద్యులు. సినిమా రంగానికి వెళ్తానంటే వాళ్లు ఒప్పుకున్నారా? నాన్నగారు జయరామిరెడ్డి యూరాలజిస్ట్. అమ్మ జయంతీ రెడ్డి గైనకాలజిస్ట్. మా జె.జె. హాస్పటల్ హైదరాబాద్‌లోనే ఫేమస్. వాళ్ల వారసత్వాన్ని నిలబెడతానని వారు అనుకునే ఉంటారు. అందుకే నేనీ మార్గంలో వెళ్తానన్నప్పుడు కొంచెం నిరుత్సాహపడ్డారు. తర్వాత నా తపన చూసి ప్రోత్సహించారు. వాళ్ల అండదండలే లేకపోతే నేను మణిపాల్‌లో మాస్ కమ్యూనికేషన్ కోర్సు చేసేవాణ్ణి కాదు. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో డెరైక్షన్ కోర్సు చేసేవాణ్ణి కాదు. ‘ప్రాణ ఫిలిమ్స్’ పేరుతో యాడ్ కంపెనీ పెట్టేవాణ్ణీ కాదు. శేఖర్ కమ్ముల దగ్గర శిష్యరికం చేసినట్టున్నారు? అవును. ‘లీడర్’, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశా. ఆర్టిస్టుల ఎంపిక, ప్రచార వ్యవహారాలు ఎక్కువ చూసేవాణ్ణి. నాకు తెలిసి ఆయనంత పర్ఫెక్ట్గా ఎవ్వరూ స్క్రిప్టు చేయలేరేమో. ఆయన దగ్గర పనిచేయడం నాకెంతో మంచిదైంది. ఇంతకీ ‘ఎవడే సుబ్రమణ్యం’ డెరైక్ట్ చేసే అవకాశం ఎలా వచ్చింది? శేఖర్ కమ్ముల గారి దగ్గర నుంచీ వచ్చేశాక, ఇద్దరు స్నేహితులతో కలిసి ‘ప్రాణ ఫిలిమ్స్’ అనే సంస్థ మొదలుపెట్టి యాడ్ ఫిల్మ్స్, సినిమాటిక్ వెడ్డింగ్ ఫిల్మ్స్ చాలా చేశాం. ఆ సమయంలోనే నిర్మాతలు స్వప్నా దత్, ప్రియాంకా దత్‌లు పరిచయమయ్యారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఓ షార్ట్ ఫిల్మ్ చేయమని అడిగారు. రెండ్రోజులు మాత్రమే టైమ్ ఉంది. కాన్సెప్ట్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, అప్లోడింగ్... ఇవన్నీ రెండు రోజుల్లోనే పూర్తి చేశాం. ‘యాదోంకి బారాత్’ పేరుతో చేసిన ఆ లఘు చిత్రం కాన్స ఫిల్మ్‌ఫెస్టివల్‌కు ఎంపికైంది. దాంతో ప్రియాంక, స్వప్నలకు నా మీద నమ్మకం వచ్చింది. సినిమా చేసే అవకాశం ఇచ్చారు. మొదట వేరే కథ అనుకుని దాని మీద చర్చలు చేస్తున్నాం. మరోపక్క నాకు ఓ ఐడియా వచ్చి 5డి కెమెరాతో ఓ చిన్న సినిమా చేద్దామని ప్రయత్నాలు మొదలుపెట్టా. ఆ ఐడియా గురించి ప్రియాంక వాళ్లకు చెబితే చాలా ఎగ్జయిటయ్యారు. అది మనమే చేద్దామన్నారు. అదే ‘ఎవడే సుబ్రమణ్యం’. హీరో నానికి కథ నచ్చడంతో వెంటనే మొదలైంది. ఈ కథకు ప్రేరణ ఏమిటి? ‘నీవెవరో నీవు తెలుసుకో’ అనే ఆలోచనలో నుంచి ఈ కథ పుట్టింది. ఎక్కడా సినిమాటిక్ ఆలోచనలు లేకుండా నిజాయతీగా ఈ కథ చేసుకున్నా. చుట్టూ ఉండే సమాజం, చదివిన పుస్తకాలు... ఇవన్నీ కలగలిసి ఈ కథను పరిపుష్టం చేశాయి. మా స్కూల్లో సుబ్రమణ్యం అనే సీనియర్ ఉన్నాడు. ఫొటోగ్రాఫర్‌గా స్థిరపడ్డాడు. ఫేస్బుక్లో రోజూ జీవితం గురించి మంచి కామెంట్లు పెడుతుంటాడు. అవన్నీ చాలా బాగుంటాయి. అందుకే నా సినిమాలో హీరో పేరు సుబ్రమణ్యం అని పెట్టా. తొలుత ఈ సినిమాకు ‘హూ యామ్ ఐ’ అనే పెడదామనుకున్నాం. తర్వాత ‘హూ ఈజ్ సుబ్రమణ్యం’ అనుకుని ఫైనల్‌గా ‘ఎవడే సుబ్రమణ్యం’ అని పెట్టాం. కృష్ణంరాజు, షావుకారు జానకి, ప్రతాప్ పోతన్ లాంటి సీనియర్ తారలను ఎంచుకోవాలని ఎందుకనిపించింది? నేను స్క్రిప్టు దశలో రామయ్య పాత్ర అనుకున్నపుడే కృష్ణంరాజుగారిని ఊహించుకున్నా. నాకెందుకో ఆయనను అలా చూడాలనిపించింది. నేను పాత సినిమాలు బాగా చూస్తా. అలా నాకు ‘షావుకారు’ జానకి గారంటే బాగా ఇష్టం. ఆవిడైతే ఇందులో పాత్రకు బావుంటారనిపించింది. ఇక ప్రతాప్ పోతన్ పోషించిన పాత్రకు నేను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని అనుకున్నా. ఇవి చిన్న చిన్న పాత్రల్లా అనిపిస్తాయి కానీ, సినిమాకు అవే హార్ట్ అండ్ సోల్. వాళ్లు చేశారు కాబట్టే, సినిమాకు అంత డెప్త్ వచ్చింది. దూద్‌కాశీ నేపథ్యంలో ఈ సినిమా చేయాలని ఎందుకనిపించింది? మొదట వేరే లొకేషన్ ఏదో అనుకున్నాం. కాశీలో ఆఖరి మజిలీ పూర్తి చేసుకోవాలని చాలామంది అనుకుంటుంటారు. అలాంటి లొకేషన్ గురించి ఆలోచిస్తుంటే దూద్ కాశీ గుర్తొచ్చింది. ఇప్పుడు నన్ను కలిసిన వాళ్లంతా దూద్ కాశీకి ఎలా వెళ్లాలని అడుగుతున్నారు. ఇందులో ఒక పాటను ఇళయరాజాతో చేయించాలని ఎందుకనిపించింది? నాజర్ డెరైక్ట్ చేసిన తమిళ చిత్రం ‘అవతారం’లోని పాటంటే ప్రియాంకకు చాలా ఇష్టం. ఈ సినిమాలో ఓ సందర్భానికి ఆ పాట కరెక్ట్ అనిపించింది. ఇళయరాజా గారికి ట్రయిలర్, కొంత ఫుటేజ్ పంపితే, ఆయనకు నచ్చి ఆ తమిళ పాటనే తెలుగులో ‘చల్లగాలి’ పాటగా చేసి ఇచ్చారు. మీ రెండో సినిమా ఎప్పుడు? ఏం చేయాలి, ఎలా చేయాలని ఆలోచిస్తున్నా. ‘ఎవడే సుబ్రమణ్యం’ తరహాలో నిజాయతీగా ఓ కథ చేసుకోవాలి. చాలామంది సినిమా చేయమని అడుగుతున్నారు కానీ, నాకేమో హడావిడిగా కథ చేసేయాలని లేదు. ఏదో ఇన్స్టెంట్ ఫుడ్‌లా కాక, లైబ్రరీలో నిలిచిపోయే సినిమాలు చేయాలని ఉంది. మీ అభిమాన దర్శకుడు? కేవీ రెడ్డి గారు. ఆయన లేకపోతే తెలుగు సినిమానే లేదు. ‘పాతాళభైరవి, మాయాబజార్, జగదేకవీరుని కథ’ లాంటి క్లాసిక్స్ తీసిన మహానుభావుడాయన. మరో వందేళ్ల తర్వాతా ఆయన గుర్తుంటారు. ఆయన ప్రేరణతో ఎప్పటికైనా మంచి జానపదమో, పౌరాణికమో తీస్తాను. ‘‘అశ్విన్ మా లాగా డాక్టర్ కావాలని కోరుకున్నాం. కానీ వాడేమో జర్నలిజం, యాడ్‌ఫిల్మ్స్, సినిమాలూ అంటూ తిరుగుతుంటే కొంచెం బెంగపడ్డాం. మణిపాల్‌లో మాస్ కమ్యూనికేషన్ చదువుతున్నప్పుడు వాడికి భవిష్యత్తు మీద ఓ స్పష్టత వచ్చేసినట్టుంది. దాంతో మేం కూడా సంతోషపడ్డాం. మంచి సినిమా తీస్తాడనుకున్నాం కానీ, ఇంత పేరు ప్రఖ్యాతు లొచ్చే సినిమా తీస్తాడని అనుకోలేదు. అశ్విన్‌ని చూసి మేం గర్వపడుతున్నాం. ఇందులో నాతో టీచర్ వేషం కూడా వేయించాడు.’’ - జయంతీ రెడ్డి, ప్రసిద్ధ గైనకాలజిస్ట్ -
అందుకే మాకు పిల్లలు వద్దనుకున్నాం : నిరోషా
మణిరత్నం ‘ఘర్షణ’ సినిమాలో‘ఒక బృందావనం... సోయగం’ అంటూ కవ్వించిన సోయగం గుర్తుంది కదూ! ‘స్టూవర్ట్‌పురం పోలీస్ స్టేషన్’లోచిరంజీవితో ‘నీతోనే ఢంకా పలాసు’ అంటూసయ్యాటలాడిన సుందరి నిరోషాను తెలుగు ప్రేక్షకులు అంత తొందరగా మరచిపోలేరు.రాధిక చెల్లెలిగా ఎంటరైన నిరోషాతన నిషా నటనతో దక్షిణాది వెండితెరపై ‘సిందూర పువ్వు’లా విరబూశారు.ఇంతకూ ఈ నిరోషా ఏమయ్యారు?ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు?ఇటీవలే హైదరాబాద్‌లో సడన్గాప్రత్యక్షమైన నిరోషాతో ‘సాక్షి’ స్పెషల్ టాక్. అన్నట్టు నేడు ఈ బొద్దుగుమ్మ పుట్టిన రోజు కూడానూ. చాలా రోజుల తర్వాత కనిపించారు. లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుంది. తమిళ, కన్నడ భాషల్లో కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నాను. నా సొంత సంస్థలో ‘తామరై’, ‘చిన్న పాప పెరియ పాప’ అనే టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నాను. తెలుగు భాష గుర్తుందా? భలేవారేనండి. తెలుగు ఎలా మర్చిపోతాను. నారీ నారీ నడుమ మురారి, కొబ్బరి బొండాం, స్టూవర్ట్‌పురం పోలీస్‌స్టేషన్... ఇలా మంచి మంచి సినిమాలు చేశాను. తెలుగు భాషనూ మర్చిపోలేదు.. తెలుగు పరిశ్రమ మీద ప్రేమా పోలేదు. మరి.. తమిళంలో కీలక పాత్రలు చేస్తున్నారు కదా! తెలుగులో ఎందుకు చేయడంలేదు? తెలుగులో మానేయలేదు. కొంచెం విరామం తీసుకున్నానంతే. కథానాయికగా ఇక్కడ మంచి మంచి పాత్రలు చేశాను. అలాగే, సహాయ నటిగా మంచి పాత్రలు వస్తే చేయాలనుకుంటున్నాను. ‘ఘర్షణ’ టైమ్‌లో మెరుపు తీగలా ఉండేవారు. ఎందుకని హఠాత్తుగా లావయ్యారు? కథానాయికగా సినిమాలు మానేశాక.. ఫిజిక్ గురించి పట్టించుకోలేదు. ఆ మధ్య కఠినమైన వ్యాయామాలు చేసి, కొంచెం తగ్గాను. కానీ, నా దురదృష్టం ఏంటంటే.. చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది. దాంతో నెలన్నరగా వర్కవుట్లు చేయలేదు. దానివల్ల కొంచెం బరువు పెరిగాను. ఇప్పుడు కొంచెం ఫరవాలేదు. అందుకని మళ్లీ వర్కవుట్లు మొదలుపెట్టాను. ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు? అప్పట్లో ‘ఘర్షణ’ చేశాను కదా. ఇప్పుడూ అలానే చేస్తానంటే ఒప్పుకుంటారా? ఇప్పుడు లక్ ఏంటంటే.. గ్లామరస్ అమ్మ, అక్క, వదిన పాత్రలుంటున్నాయి. అలాంటివి చేయడానికి రెడీగా. ఒకసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళదాం. కథానాయికగా కెరీర్ బాగున్న సమయంలోనే సినిమాలు చేయడం తగ్గించేశారు. ఎందుకలా? కావాలని తగ్గించలేదు. తెలుగులో ఒకటి, తమిళంలో ఒకటిరెండు, కన్నడంలో.. ఇలా మూడు భాషల్లో చేయడం వల్ల ఏ భాషలోనూ పెద్దగా సినిమాలు చేసినట్లుగా ఎవరికీ అనిపించడం లేదు. తెలుగులో ‘పచ్చని సంసారం’ చేస్తున్నప్పుడు కన్నడంలో ఎక్కువ సినిమాలు ఒప్పుకున్నాను. ఆ కారణంగా తెలుగుకి దూరమయ్యాను. మీ సోదరి రాధిక మీకు సలహాలు ఇస్తుంటారా? ‘నువ్వు సక్సెస్ అవుతావ్.. ట్రై చెయ్’ అని తను చెప్పడంవల్లే సినిమాల్లోకొచ్చా. మీ పెళ్లి విషయానికొద్దాం. ‘సింధూర పువ్వు’ చిత్రంలో మీ పక్కన హీరోగా చేసిన రాంకీనే ప్రేమ వివాహం చేసుకున్నారు. మీ లవ్‌స్టోరీ గురించి? ఆ సినిమా టైమ్‌లో ప్రేమలో పడ్డాం. పెద్దల సమ్మతితో పెళ్లి చేసుకున్నాం. మీ పెళ్లయ్యి దాదాపు 20 ఏళ్లయ్యింది. పిల్లలు వద్దనుకున్నారా? అవును. తల్లిదండ్రులు లేని పిల్లలకు మేం అమ్మా, నాన్నా అవ్వాలనుకున్నాం. అలాంటి పిల్లలకు మా వంతు సహాయం చేస్తున్నాం. ఇది ఇద్దరి నిర్ణయమా? అవును. ‘పుట్టాం, పెరిగాం, పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని, వాళ్లని పెంచి, పెద్ద చేస్తాం. ఇంతేనా జీవితం అంటే...’ అనుకున్నాం. ఇతరులకు ఉపయోగపడేలా ఉండాలనుకున్నాం. అందుకే, మాకు పిల్లలు వద్దనుకున్నాం. మేం సంపాదిస్తున్న డబ్బులో చాలావరకు నిరాదరణకు గురైన, అనాథలైన పిల్లల సహాయార్థం ఉపయోగిస్తున్నాం. చాలామందిని చదివిస్తున్నాం.. వైద్య సహాయం చేస్తున్నాం. ఈ మధ్య ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారనే వార్త వచ్చింది. అవన్నీ తొలగిపోయాయా? కష్టసుఖాలేవీ నిరంతరం కాదు. జీవితం అన్నాక ఎవరికైనా ఒడుదొడుకులుంటాయి. మేం మా సమస్యలను అధిగమించేశాం. మీ 20 ఏళ్ల వైవాహిక జీవితం గురించి ఏం చెబుతారు? మేమిద్దరం అదృష్టవంతులమే. ఇద్దరి ఆలోచనలూ దాదాపు ఒకే విధంగా ఉంటాయి. వివాహ జీవిత పరంగా నేను పూర్తి సంతృప్తిగా ఉన్నాను. ప్రస్తుతం కెరీర్ పరంగా మీ ప్రణాళికల గురించి? నా భర్త రాంకీ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నా. సినిమాకు సంబంధించిన అన్ని శాఖల్లోనూ ఆయన పని చేశారు. ఓ ఫ్యామిలీ డ్రామాతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు నిర్మించాలన్నది మా లక్ష్యం. -
అమ్మ చాలా ఉద్వేగపడింది: అర్మాన్ మాలిక్
బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డెరైక్టర్ అనూ మాలిక్ తెలుసు కదా! ఆయన తమ్ముడు డబూ మాలిక్ కూడా మ్యూజిక్ డెరైక్టర్‌గా, సింగర్‌గా పాపులరే. ఈ డబూ మాలిక్ పెళ్లాడింది ఓ తెలుగమ్మాయిని. పేరు జ్యోతి. వీళ్లబ్బాయే అర్మాన్ మాలిక్. మ్యూజిక్ ఫీల్డ్‌లో చిచ్చర పిడుగులా దూసుకుపోతున్న అర్మాన్ తెలుగులో ‘రక్తచరిత్ర’, ‘రౌడీ ఫెలో’ సినిమాల్లో పాటలు పాడారు. అర్మాన్తో ‘సాక్షి’ స్పెషల్ టాక్. హీరో కొడుకు హీరో.. కమెడియన్ కొడుకు కమెడియన్ అన్నట్లుగా.. మీ తండ్రిలా మీరూ మ్యూజిక్ ఫీల్డ్‌లోకే వచ్చారు..? మ్యూజిక్ అనేది నా బ్లడ్‌లోనే ఉందండీ. సంగీతదర్శకునిగా, గాయకునిగా నాన్న (డబూ మాలిక్), పెదనాన్న (అనూ మాలిక్)లకు మంచి పేరున్న విషయం తెలిసిందే. నాకు చిన్నప్పట్నుంచీ గాయకుడు కావాలనే కల ఉండేది. నా అభిరుచిని గమనించి అమ్మా, నాన్న ప్రోత్సహించారు. చిన్నప్పుడు ఏదో ఒక పాట హమ్ చేస్తుండేవాడినట. ఏదైనా చెప్పేటప్పుడు ఆ మాటలను పాటలా పాడేవాడినట. నా ఆసక్తి చూసి, నాకు హిందుస్తానీ సంగీతం నేర్పించారు. జీ టీవీలో ‘స రి గ మ ప’ లిటిల్ చాంప్స్‌లో పాల్గొన్నప్పుడు మీ వయసెంత? అసలా షోలో పాల్గొనాలని ఎందుకనిపించింది? అప్పుడు నాకు తొమ్మిదేళ్లు. పోటీ అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనిపించి, పాల్గొన్నాను. దేశ వ్యాప్తంగా ఎక్కడెక్కణ్ణుంచో వచ్చి, ఈ పోటీలో పాల్గొంటారు. అంత మందితో పోటీపడటం అంత సులువు కాదు. పోటీ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి, నా ప్రతిభను అంచనా వేసుకోవడానికి, ఇతరులకు తెలియజేయడానికి ఆ కార్యక్రమం ఉపయోగపడింది. నన్ను సినిమా రంగంలో కూడా పాపులర్ చేసిన షో అది. మీ నాన్నగారు, బాబాయ్‌కి బాలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది. వాళ్ల ద్వారానే మీరు సినిమా పరిశ్రమలోకి వెళ్లొచ్చు.. దానికోసం ప్రత్యేకంగా ఏదైనా షోలో పాల్గొనాల్సిన అవసరంలేదు కదా? ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ని వాడుకుని, అవకాశాలు తెచ్చుకోవడం నాకిష్టం లేదు. మన కుటుంబం గురించి అందరూ మాట్లాడుకుంటారు. కానీ, మన ప్రతిభ గురించి అందరూ మాట్లాడాలంటే ముందు నేనేంటో నిరూపించుకోవాలిగా. సల్మాన్ ఖాన్ నటించిన ‘జై హో’ సినిమాలో పాడే అవకాశం వచ్చినప్పుడు ఎలా అనిపించింది? ఆ సినిమాకి పాడినప్పుడు నా వయసు 18. ఇప్పుడు 19. ఓ పద్ధెనిమిదేళ్ల కుర్రాడికి సల్మాన్ ఖాన్ లాంటి సీనియర్ హీరోకి పాడే అవకాశం వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. నాకు తెలిసి ఇది చాలా అరుదైన అవకాశం. ఆ ఆఫర్ వచ్చినప్పుడు నేనేం భయపడలేదు. బాగా పాడేస్తానని నమ్మకం. ఆ పాటలు విని, సల్మాన్ భాయ్ అభినందించారు. సలీమ్-సులైమాన్, విశాల్-శేఖర్ వంటి ప్రసిద్ధ సంగీతదర్శకుల దగ్గర పాటలు పాడటం ఎలా అనిపిస్తోంది? చాలా చిన్న వయసులోనే అలాంటి వాళ్ల దగ్గర పాడే అవకాశం రావడం నా అదృష్టం. ఒక్కో సంగీతదర్శకుడిది ఒక్కో శైలి. దాన్ని అర్థం చేసుకోవడంలోనే మన నేర్పు ఉంటుంది. ‘జై హో’ సినిమాలో ‘లవ్ యు టిల్ ది ఎండ్’ పాటలో ఆ చిత్ర సంగీతదర్శకుడు (మూడు పాటలకు స్వరాలు సమకూర్చారు), మీ సోదరుడు అమాల్ మాలిక్‌తో కలిసి కనిపించారు.. నటుడు కావాలనే ఆలోచన కూడా ఉందా? నాకు తెరపై కూడా కనిపించాలని ఉంది. హీరోగా మాత్రమే చేస్తానని చెప్పడంలేదు.. కథకు కీలకంగా ఉండటంతో పాటు ఆ కథను భుజాల మీద మోసే పాత్రలైతే చేయాలనుకుంటున్నా. అయితే ఇప్పుడు కాదు.. ప్రస్తుతం నా దృష్టంతా సింగింగ్ మీదే. మీ నాన్నగారు హిందీ అయినప్పటికీ, మీ అమ్మగారు జ్యోతీ మాలిక్ తెలుగే కదా.. ఇంగ్లిష్ మానేసి కాసేపు తెలుగులో మాట్లాడదామా? వాస్తవానికి నేను పెద్దగా తెలుగు మాట్లాడలేనండి. నేను పుట్టి, పెరిగిందంతా ముంబయ్‌లోనే. తెలుగు బాగా అర్థమవుతుంది కానీ.. పెద్దగా మాట్లాడలేను. మరి.. ఇంట్లో తెలుగు మాట్లాడిన సందర్భాలు అస్సలు లేవా? మా అమ్మమ్మ మాట్లాడేది. ఆ మాటలు వింటూ పెరగడంవల్లనే తెలుగు భాష అర్థం చేసుకోగలుగుతున్నాను. కానీ, తెలుగు చిత్రాలు ‘రక్తచరిత్ర’ (ఆట...), ‘రౌడీ ఫెలో’ (ఏదో...)కు పాడినప్పుడు పదాలను బాగానే ఉచ్చరించారు కదా? తెలుగు మూలాలు ఉండటంవల్లనో ఏమో పదాలు పలికిన తీరులో స్పష్టత ఉంది. బేసిక్‌గా నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం. మంచి ఫీల్ ఉన్న భాష. తెలుగు మాట్లాడటం కష్టం కానీ.. పాట పాడటం చాలా ఈజీ అండీ. మీకు తెలుగు సినిమాకి పాడే అవకాశం వచ్చినప్పుడు మీ అమ్మగారు ఎలా ఫీలయ్యారు? అమ్మ చాలా ఎగ్జయిట్ అయ్యింది. తెలుగులో ఎన్ని పాటలు పాడగలిగితే అన్ని పాడమని చెప్పింది. ఆ మాటకొస్తే.. నేను తమిళ చిత్రాలకూ పాడుతున్నాను. నాకు భాష భేదం లేదు. మీ నాన్నగారు, పెదనాన్న నుంచి సలహాలు తీసుకుంటుంటారా? ఇద్దరూ గొప్ప వ్యక్తులు. అవసరమైనప్పుడు సలహాలు తీసుకుంటా. ‘దేనికీ అధైర్యపడకూడదు. ఈరోజు చెడు జరగొచ్చు. రేపంటూ ఒకటుందని గుర్తు పెట్టుకో. ఈరోజుతోనే జీవితం అంతం అయిపోదు’ అని నాన్నగారు ఓ సందర్భంలో చెప్పారు. ఆ మాటలు జీవితాంతం గుర్తుంటాయి. ఇక, మా పెదనాన్న విషయానికొస్తే, నేను పాడిన ప్రతి పాటా విని, అభినందిస్తారు. మొదటిసారి నేను టీవీలో కనిపించినప్పుడు ‘నిన్ను టీవీలో చూసి, ఆశ్చర్యపోయాను. నీ వాయిస్ నాకు బాగా నచ్చింది’ అని అభినందించారు. ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ చిత్రంలో ఇంగ్లిష్ కుర్రాడి పాత్రకు డబ్బింగ్ చెప్పారు కదా.. డబ్బింగ్ అంటే ఆసక్తి ఉందా? ఇంట్రస్ట్ ఉంది. అందుకే చెప్పాను. పాడటానికి మాత్రమే కాదు.. మాటలకు కూడా నా గొంతుని అరువు ఇవ్వడానికి అభ్యంతరం లేదు. పాటలు కూడా రాస్తున్నారట? బేసిక్‌గా మ్యూజికల్ ఫ్యామిలీకి చెందినవాణ్ణి కాబట్టి, పాట అంటే ప్రాణం. కొంచెం భావుకత కూడా ఉంది కాబట్టి, రాయగలుగుతున్నాను. నేనేం చేసినా వంద శాతం ఎఫర్ట్ పెడతాను. - డి.జి. భవాని