అమ్మ చాలా ఉద్వేగపడింది: అర్మాన్ మాలిక్ | Special Talk with Singer Armaan Malik | Sakshi
Sakshi News home page

అమ్మ చాలా ఉద్వేగపడింది: అర్మాన్ మాలిక్

Published Tue, Oct 28 2014 10:56 PM | Last Updated on Wed, Apr 3 2019 7:07 PM

అమ్మ చాలా ఉద్వేగపడింది:  అర్మాన్ మాలిక్ - Sakshi

అమ్మ చాలా ఉద్వేగపడింది: అర్మాన్ మాలిక్

 బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డెరైక్టర్ అనూ మాలిక్ తెలుసు కదా! ఆయన తమ్ముడు డబూ మాలిక్ కూడా మ్యూజిక్ డెరైక్టర్‌గా, సింగర్‌గా పాపులరే. ఈ డబూ మాలిక్ పెళ్లాడింది ఓ తెలుగమ్మాయిని. పేరు జ్యోతి. వీళ్లబ్బాయే అర్మాన్ మాలిక్. మ్యూజిక్ ఫీల్డ్‌లో చిచ్చర పిడుగులా దూసుకుపోతున్న అర్మాన్ తెలుగులో ‘రక్తచరిత్ర’, ‘రౌడీ ఫెలో’ సినిమాల్లో పాటలు పాడారు. అర్మాన్‌తో ‘సాక్షి’ స్పెషల్ టాక్.
 
 హీరో కొడుకు హీరో.. కమెడియన్ కొడుకు కమెడియన్ అన్నట్లుగా.. మీ తండ్రిలా మీరూ మ్యూజిక్ ఫీల్డ్‌లోకే వచ్చారు..?
 మ్యూజిక్ అనేది నా బ్లడ్‌లోనే ఉందండీ. సంగీతదర్శకునిగా, గాయకునిగా నాన్న (డబూ మాలిక్), పెదనాన్న (అనూ మాలిక్)లకు మంచి పేరున్న విషయం తెలిసిందే. నాకు చిన్నప్పట్నుంచీ గాయకుడు కావాలనే కల ఉండేది. నా అభిరుచిని గమనించి అమ్మా, నాన్న ప్రోత్సహించారు. చిన్నప్పుడు ఏదో ఒక పాట హమ్ చేస్తుండేవాడినట. ఏదైనా చెప్పేటప్పుడు ఆ మాటలను పాటలా పాడేవాడినట. నా ఆసక్తి చూసి, నాకు హిందుస్తానీ సంగీతం నేర్పించారు.
 
 జీ టీవీలో ‘స రి గ మ ప’ లిటిల్ చాంప్స్‌లో పాల్గొన్నప్పుడు మీ వయసెంత? అసలా షోలో పాల్గొనాలని ఎందుకనిపించింది?
 అప్పుడు నాకు తొమ్మిదేళ్లు. పోటీ అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనిపించి, పాల్గొన్నాను. దేశ వ్యాప్తంగా ఎక్కడెక్కణ్ణుంచో వచ్చి, ఈ పోటీలో పాల్గొంటారు. అంత మందితో పోటీపడటం అంత సులువు కాదు. పోటీ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి, నా ప్రతిభను అంచనా వేసుకోవడానికి, ఇతరులకు తెలియజేయడానికి ఆ కార్యక్రమం ఉపయోగపడింది. నన్ను సినిమా రంగంలో కూడా పాపులర్ చేసిన షో అది.
 
 మీ నాన్నగారు, బాబాయ్‌కి బాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది. వాళ్ల ద్వారానే మీరు సినిమా పరిశ్రమలోకి వెళ్లొచ్చు.. దానికోసం ప్రత్యేకంగా ఏదైనా షోలో పాల్గొనాల్సిన అవసరంలేదు కదా?
 ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ని వాడుకుని, అవకాశాలు తెచ్చుకోవడం నాకిష్టం లేదు. మన కుటుంబం గురించి అందరూ మాట్లాడుకుంటారు. కానీ, మన ప్రతిభ గురించి అందరూ మాట్లాడాలంటే ముందు నేనేంటో నిరూపించుకోవాలిగా.
 
 సల్మాన్ ఖాన్ నటించిన ‘జై హో’ సినిమాలో పాడే అవకాశం వచ్చినప్పుడు ఎలా అనిపించింది?
 ఆ సినిమాకి పాడినప్పుడు నా వయసు 18. ఇప్పుడు 19. ఓ పద్ధెనిమిదేళ్ల కుర్రాడికి సల్మాన్ ఖాన్ లాంటి సీనియర్ హీరోకి పాడే అవకాశం వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. నాకు తెలిసి ఇది చాలా అరుదైన అవకాశం. ఆ ఆఫర్ వచ్చినప్పుడు నేనేం భయపడలేదు. బాగా పాడేస్తానని నమ్మకం. ఆ పాటలు విని, సల్మాన్ భాయ్ అభినందించారు.
 
 సలీమ్-సులైమాన్, విశాల్-శేఖర్ వంటి ప్రసిద్ధ సంగీతదర్శకుల దగ్గర పాటలు పాడటం ఎలా అనిపిస్తోంది?
 చాలా చిన్న వయసులోనే అలాంటి వాళ్ల దగ్గర పాడే అవకాశం రావడం నా అదృష్టం. ఒక్కో సంగీతదర్శకుడిది ఒక్కో శైలి. దాన్ని అర్థం చేసుకోవడంలోనే మన నేర్పు ఉంటుంది.
 
 ‘జై హో’ సినిమాలో ‘లవ్ యు టిల్ ది ఎండ్’ పాటలో ఆ చిత్ర సంగీతదర్శకుడు (మూడు పాటలకు స్వరాలు సమకూర్చారు), మీ సోదరుడు అమాల్ మాలిక్‌తో కలిసి కనిపించారు.. నటుడు కావాలనే ఆలోచన కూడా ఉందా?
 నాకు తెరపై కూడా కనిపించాలని ఉంది. హీరోగా మాత్రమే చేస్తానని చెప్పడంలేదు.. కథకు కీలకంగా ఉండటంతో పాటు ఆ కథను భుజాల మీద మోసే పాత్రలైతే చేయాలనుకుంటున్నా. అయితే ఇప్పుడు కాదు.. ప్రస్తుతం నా దృష్టంతా సింగింగ్ మీదే.
 
 మీ నాన్నగారు హిందీ అయినప్పటికీ, మీ అమ్మగారు జ్యోతీ మాలిక్ తెలుగే కదా.. ఇంగ్లిష్ మానేసి కాసేపు తెలుగులో మాట్లాడదామా?
 వాస్తవానికి నేను పెద్దగా తెలుగు మాట్లాడలేనండి. నేను పుట్టి, పెరిగిందంతా ముంబయ్‌లోనే. తెలుగు బాగా అర్థమవుతుంది కానీ.. పెద్దగా మాట్లాడలేను.
 
 మరి.. ఇంట్లో తెలుగు మాట్లాడిన సందర్భాలు అస్సలు లేవా?

 మా అమ్మమ్మ మాట్లాడేది. ఆ మాటలు వింటూ పెరగడంవల్లనే తెలుగు భాష అర్థం చేసుకోగలుగుతున్నాను.
 
 కానీ, తెలుగు చిత్రాలు ‘రక్తచరిత్ర’ (ఆట...), ‘రౌడీ ఫెలో’ (ఏదో...)కు పాడినప్పుడు పదాలను బాగానే ఉచ్చరించారు కదా?
 తెలుగు మూలాలు ఉండటంవల్లనో ఏమో పదాలు పలికిన తీరులో స్పష్టత ఉంది. బేసిక్‌గా నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం. మంచి ఫీల్ ఉన్న భాష. తెలుగు మాట్లాడటం కష్టం కానీ.. పాట పాడటం చాలా ఈజీ అండీ.
 
 మీకు తెలుగు సినిమాకి పాడే అవకాశం వచ్చినప్పుడు మీ అమ్మగారు ఎలా ఫీలయ్యారు?
 అమ్మ చాలా ఎగ్జయిట్ అయ్యింది. తెలుగులో ఎన్ని పాటలు పాడగలిగితే అన్ని పాడమని చెప్పింది. ఆ మాటకొస్తే.. నేను తమిళ చిత్రాలకూ పాడుతున్నాను. నాకు భాష భేదం లేదు.
 
 మీ నాన్నగారు, పెదనాన్న నుంచి సలహాలు తీసుకుంటుంటారా?
 ఇద్దరూ గొప్ప వ్యక్తులు. అవసరమైనప్పుడు సలహాలు తీసుకుంటా. ‘దేనికీ అధైర్యపడకూడదు. ఈరోజు చెడు జరగొచ్చు. రేపంటూ ఒకటుందని గుర్తు పెట్టుకో. ఈరోజుతోనే జీవితం అంతం అయిపోదు’ అని నాన్నగారు ఓ సందర్భంలో చెప్పారు. ఆ మాటలు జీవితాంతం గుర్తుంటాయి. ఇక, మా పెదనాన్న విషయానికొస్తే, నేను పాడిన ప్రతి పాటా విని, అభినందిస్తారు. మొదటిసారి నేను టీవీలో కనిపించినప్పుడు ‘నిన్ను టీవీలో చూసి, ఆశ్చర్యపోయాను. నీ వాయిస్ నాకు బాగా నచ్చింది’ అని అభినందించారు.
 
 ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ చిత్రంలో ఇంగ్లిష్ కుర్రాడి పాత్రకు డబ్బింగ్ చెప్పారు కదా.. డబ్బింగ్ అంటే ఆసక్తి ఉందా?
 ఇంట్రస్ట్ ఉంది. అందుకే చెప్పాను. పాడటానికి మాత్రమే కాదు.. మాటలకు కూడా నా గొంతుని అరువు ఇవ్వడానికి అభ్యంతరం లేదు.
 
 పాటలు కూడా రాస్తున్నారట?
 బేసిక్‌గా మ్యూజికల్ ఫ్యామిలీకి చెందినవాణ్ణి కాబట్టి, పాట అంటే ప్రాణం. కొంచెం భావుకత కూడా ఉంది కాబట్టి, రాయగలుగుతున్నాను. నేనేం చేసినా వంద శాతం ఎఫర్ట్ పెడతాను.
 - డి.జి. భవాని

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement