speed star
-
‘స్పీడ్ స్టార్’ విజేతలు పృథ్వీరాజ్, హరికృష్ణ
జాతీయ స్థాయిలో మెరిసిన హైదరాబాద్ కుర్రాళ్లు సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఇద్దరు కుర్రాళ్లు జాతీయ స్థాయిలో ఫాస్టెస్ట్ అథ్లెట్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కూహ్ స్పోర్ట్స్ సంస్థ నిర్వహించిన ‘స్పీడ్‌స్టార్’ అథ్లెటిక్స్ ప్రతిభాన్వేషణ పోటీల్లో నగరానికి చెందిన పృథ్వీరాజ్, హరికృష్ణ విజేతలుగా నిలిచారు. ఈ పోటీల ఫైనల్స్ ఆదివారం ముంబైలో జరిగాయి. ఇందులో దేశవ్యాప్తంగా 10 నగరాలకు చెందిన 80 మంది చిన్నారులు పోటీ పడ్డారు. అండర్-10 విభాగంలో 60 మీటర్ల పరుగును 8.64 సెకన్లలో పూర్తి చేసి పృథ్వీరాజ్ చాంపియన్‌గా నిలిచాడు. అండర్-12 విభాగంలో 100 మీటర్ల రేస్‌లో హరికృష్ణ (12.06 సెకన్లు) మొదటి స్థానం సాధించాడు. ఈ ఈవెంట్లో అండర్-10, 12, 14, 16 విభాగాల్లో ఇద్దరు చొప్పున (బాలబాలికలు) మొత్తం ఎనిమిది మందిని విజేతలుగా ప్రకటించాడు. అండర్-10 విజేతగా నిలిచిన పృథ్వీరాజ్‌కు రూ. 50 వేల నగదు బహుమతి లభించింది. అండర్-10 మినహా మిగతా ఆరుగురికి ఆస్ట్రేలియాలో వారం రోజుల పాటు ప్రత్యేక శిక్షణ పొందే అవకాశం దక్కింది. ప్రఖ్యాత అంతర్జాతీయ కోచ్ షరాన్ హెనాన్ వీరికి శిక్షణ ఇస్తారు. కూహ్ స్పోర్ట్స్ ప్రచారకర్తగా ఉన్న దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష విజేతలుగా నిలిచిన చిన్నారులను అభినందించారు. -
భవిష్యత్తులో మరిన్ని పతకాలు: ఉష
సాక్షి, హైదరాబాద్: జాతీయ అథ్లెటిక్స్‌లో తాజా పరిస్థితిపై స్ప్రింట్ క్వీన్ పీటీ ఉష తన మనోభావాలు వెల్లడించింది. ‘స్పీడ్‌స్టార్’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉష హైదరాబాద్ వచ్చింది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’తో మాట్లాడింది. కొత్త ప్రతిభ: చాలా చోట్ల ప్రతిభ గల అథ్లెట్లు వెలుగులోకి వస్తున్నారు. కానీ కంటిన్యుటీ లేకపోవడమే సమస్యగా మారింది. నిలకడగా ఎక్కువ కాలం కొనసాగితేనే ఫలితాలు వస్తాయి. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి. మాలిక్‌కు బోల్ట్ అకాడమీలో శిక్షణ: మన దేశం నుంచి అలాంటి అవకాశం రావడం అదృష్టమే. అయితే 3-4 వారాల కోచింగ్ ఏ మాత్రం ఉపయోగ పడదు. సుదీర్ఘ కాలం పట్టుదలగా ఆడాలి. తన అకాడమీ పని తీరు: బాగుంది. టింటూ లూకా సీనియర్ స్థాయిలో, జెస్సీ జోసెఫ్ జూనియర్ స్థాయిలో రాణిస్తున్నారు. వారి ప్రదర్శన చాలా మెరుగైంది. ఇతర రాష్ట్రాలలో అకాడమీ: ప్రస్తుతం నేను నడిపిస్తున్న అకాడమీలో పూర్తి స్థాయి సౌకర్యాలు లేవు. అదంతా అయ్యాకే మరో రాష్ట్రం గురించి ఆలోచించగలను. అయితే ఆయా ప్రభుత్వాల సహకారం కూడా కావాలి. భారత అథ్లెటిక్స్: ఈ ఏడాది ఆసియా క్రీడల్లో, కామన్వెల్త్లో పతకాల సంఖ్య పెరగొచ్చు. లండన్ ఒలింపిక్స్‌లో మన అథ్లెట్లు ఇద్దరు ఫైనల్స్ చేరడం చెప్పుకోదగ్గదే. వచ్చే ఒలింపిక్స్‌లో ఇంకా ఎక్కువ మంది వస్తారని నా నమ్మకం.