భవిష్యత్తులో మరిన్ని పతకాలు: ఉష
సాక్షి, హైదరాబాద్: జాతీయ అథ్లెటిక్స్‌లో తాజా పరిస్థితిపై స్ప్రింట్ క్వీన్ పీటీ ఉష తన మనోభావాలు వెల్లడించింది. ‘స్పీడ్‌స్టార్’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉష హైదరాబాద్ వచ్చింది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’తో మాట్లాడింది.
కొత్త ప్రతిభ: చాలా చోట్ల ప్రతిభ గల అథ్లెట్లు వెలుగులోకి వస్తున్నారు. కానీ కంటిన్యుటీ లేకపోవడమే సమస్యగా మారింది. నిలకడగా ఎక్కువ కాలం కొనసాగితేనే ఫలితాలు వస్తాయి. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి.
మాలిక్‌కు బోల్ట్ అకాడమీలో శిక్షణ: మన దేశం నుంచి అలాంటి అవకాశం రావడం అదృష్టమే. అయితే 3-4 వారాల కోచింగ్ ఏ మాత్రం ఉపయోగ పడదు. సుదీర్ఘ కాలం పట్టుదలగా ఆడాలి.
తన అకాడమీ పని తీరు: బాగుంది. టింటూ లూకా సీనియర్ స్థాయిలో, జెస్సీ జోసెఫ్ జూనియర్ స్థాయిలో రాణిస్తున్నారు. వారి ప్రదర్శన చాలా మెరుగైంది.
ఇతర రాష్ట్రాలలో అకాడమీ: ప్రస్తుతం నేను నడిపిస్తున్న అకాడమీలో పూర్తి స్థాయి సౌకర్యాలు లేవు. అదంతా అయ్యాకే మరో రాష్ట్రం గురించి ఆలోచించగలను. అయితే ఆయా ప్రభుత్వాల సహకారం కూడా కావాలి.
భారత అథ్లెటిక్స్: ఈ ఏడాది ఆసియా క్రీడల్లో, కామన్వెల్త్‌లో పతకాల సంఖ్య పెరగొచ్చు. లండన్ ఒలింపిక్స్‌లో మన అథ్లెట్లు ఇద్దరు ఫైనల్స్ చేరడం చెప్పుకోదగ్గదే. వచ్చే ఒలింపిక్స్‌లో ఇంకా ఎక్కువ మంది వస్తారని నా నమ్మకం.