‘స్పీడ్ స్టార్’ విజేతలు పృథ్వీరాజ్, హరికృష్ణ
జాతీయ స్థాయిలో మెరిసిన హైదరాబాద్ కుర్రాళ్లు
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఇద్దరు కుర్రాళ్లు జాతీయ స్థాయిలో ఫాస్టెస్ట్ అథ్లెట్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కూహ్ స్పోర్ట్స్ సంస్థ నిర్వహించిన ‘స్పీడ్‌స్టార్’ అథ్లెటిక్స్ ప్రతిభాన్వేషణ పోటీల్లో నగరానికి చెందిన పృథ్వీరాజ్, హరికృష్ణ విజేతలుగా నిలిచారు. ఈ పోటీల ఫైనల్స్ ఆదివారం ముంబైలో జరిగాయి. ఇందులో దేశవ్యాప్తంగా 10 నగరాలకు చెందిన 80 మంది చిన్నారులు పోటీ పడ్డారు. అండర్-10 విభాగంలో 60 మీటర్ల పరుగును 8.64 సెకన్లలో పూర్తి చేసి పృథ్వీరాజ్ చాంపియన్‌గా నిలిచాడు.
అండర్-12 విభాగంలో 100 మీటర్ల రేస్‌లో హరికృష్ణ (12.06 సెకన్లు) మొదటి స్థానం సాధించాడు. ఈ ఈవెంట్‌లో అండర్-10, 12, 14, 16 విభాగాల్లో ఇద్దరు చొప్పున (బాలబాలికలు) మొత్తం ఎనిమిది మందిని విజేతలుగా ప్రకటించాడు. అండర్-10 విజేతగా నిలిచిన పృథ్వీరాజ్‌కు రూ. 50 వేల నగదు బహుమతి లభించింది. అండర్-10 మినహా మిగతా ఆరుగురికి ఆస్ట్రేలియాలో వారం రోజుల పాటు ప్రత్యేక శిక్షణ పొందే అవకాశం దక్కింది. ప్రఖ్యాత అంతర్జాతీయ కోచ్ షరాన్ హెనాన్ వీరికి శిక్షణ ఇస్తారు. కూహ్ స్పోర్ట్స్ ప్రచారకర్తగా ఉన్న దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష విజేతలుగా నిలిచిన చిన్నారులను అభినందించారు.