Sponge Iron Company
-
మూతబడిన స్పాంజ్ ఐరన్ యూనిట్
సాక్షి, కొత్తగూడెం: పాల్వంచలోని జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ(ఎన్ఎండీసీ) ఆధ్వర్యంలోని స్పాంజ్ ఐరన్ యూనిట్ మనుగడ మూడు నెలల ముచ్చటే అయింది. మూడేళ్ల పాటు మూతబడిన ఈ ప్లాంట్‌లో గత జనవరిలో ఉత్పత్తి పునఃప్రారంభించారు. అయితే మూడు నెలలకే మళ్లీ మూతబడింది. స్పాంజ్ ఐరన్ విక్రయిస్తే వచ్చే డబ్బు కంటే తయారీకే ఎక్కువగా ఖర్చవుతోందని, దీంతో నష్టాలు వస్తున్నాయని ఎన్ఎండీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉత్పత్తి ప్రక్రియ భారం కావడంతో తిరిగి మూసేశారు. నష్టాలు వస్తున్నాయనే కారణంతో ఈ ప్లాంట్‌లో ఉత్పత్తిని 2016లో నిలిపివేశారు. ఉద్యోగుల కోరిక, జిల్లా ప్రజల ఆకాంక్ష, రాష్ట్ర విభజన నేపథ్యంలో బయ్యారంలో చేపట్టాల్సిన ఉక్కు కర్మాగారం విషయమై అనేక ఆందోళనల నేపథ్యంలో పాల్వంచలోని ఎన్ఎండీసీ స్టీల్ ప్లాంట్‌లో మూడేళ్ల తరువాత ఈ ఏడాది జనవరి 22న తిరిగి ఉత్పత్తి ప్రారంభించారు. అయితే ఉత్పత్తి ప్రక్రియ నిరాటంకంగా నడుస్తుందని ఆశించినప్పటికీ అది సాధ్యం కాలేదు. నడిపించి నష్టాలను పెంచుకోవడం కంటే ఉత్పత్తిని నిలిపివేయడమే మేలని నిర్ణయానికి వచ్చిన ఎన్ఎండీసీ.. గత మార్చిలో తిరిగి ఉత్పత్తిని ఆపేసింది. దీంతో ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా.. స్పాంజ్ ఐరన్ బదులు కోల్డ్ రోల్ మిల్ (మెటల్ ప్రాసెసింగ్ మిషనరీ) చేస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. దీనిపై అ«ధ్యయనం చేసేందుకు ఎంఎన్ దస్తూరి అనే కన్సెల్టెన్సీకి కాంట్రాక్ట్ అప్పగించినట్లు తెలుస్తోంది. ఎన్ఎండీసీలో విలీనం చేసినా నష్టాలే.. 1980లో స్పాంజ్ ఐరన్ యూనిట్(డీఆర్పీ 1) వార్షిక ఉత్పత్తి 30 వేల టన్నులతో ప్రారంభమైంది. లక్ష్యాలకు మించి 60 వేల టన్నుల ఉత్పత్తిని కూడా సాధించింది. 2008లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోవడంతో ఉక్కు పరిశ్రమలో మాంద్యం నెలకొంది. దీంతో నష్టాలు మొదలైన ఈ కర్మాగారాన్ని 2010 జూలై 31న లాభదాయకమైన నవరత్న స్థాయి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎండీసీ లిమిటెడ్‌లో విలీనం చేశారు. ఈ విధంగా అయినా తిరిగి స్పాంజ్ ఐరన్ యూనిట్ నష్టాలను అధిగమిస్తుందని ఆశించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఉత్పత్తి ధర కంటే అమ్మకం ధర తక్కువగా ఉండటంతో 2016లో ఉత్పత్తిని నిలిపివేశారు. అనేక పరిణామాల మధ్య తిరిగి 2019 జనవరి 22న పునరుద్ధరించేందుకు నూతన జీఎం ఆర్డీ నంద్ ప్రత్యేక చొరువ తీసుకుని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టీఎస్ చెరియన్ సహకారంతో 100 టన్నుల సామర్థ్యం గల ఒక యూనిట్‌ను ప్రారంభించారు. ఇందుకు అవసరమైన ముడి సరుకు ఐరన్ ఓర్, బొగ్గు దిగుమతికి చర్యలు చేపట్టారు. అయితే టన్ను ఉత్పత్తికి రూ.23 వేలు ఖర్చు అవుతుండగా.. అది అమ్మితే రూ.19 వేలు మాత్రమే వస్తోంది. అంటే టన్నుకు రూ.4 వేల వరకు నష్టం వాటిల్లుతోంది. ఇలా నెలకు రూ.12 కోట్లు నష్టం వస్తున్నట్లు సమాచారం. దీంతో నడపడం కంటే మూసేయడమే మేలని భావించి గత మార్చిలో ఉత్పత్తిని నిలిపివేశారు. మరో వైపు సిబ్బంది జీతభత్యాలు కూడా భారమై సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కర్మాగారంలో ఉత్పత్తి లేక పోవడంతో ఇక్కడ పనిచేస్తున్న సుమారు 30 మంది అధికారులు, 102 మంది కార్మికులు ఆందోళన చెందుతున్నారు. తెరపైకి కోల్డ్ రోల్ మిల్.. మార్కెట్లో స్పాంజ్ ఐరన్ ధర పెరిగితే తప్ప నష్టాలు తప్పవని అధికారులు అంటున్నారు. సిబ్బంది సంక్షేమం దృష్ట్యా నడపాలని యోచిం చినప్పటికీ అది సాధ్యం కావడం లేదని చెపుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బైలడిల్లా నుంచి కాకుం డా సమీపంలో ఉన్న బయ్యారం ఐరన్‌ఓర్ ఉపయోగించుకుని నడపితే రవాణా చార్జీలు తగ్గుతాయని ఆలోచించినా.. ఇక్కడి ముడి సరుకు (ఐరన్‌ఓర్) ఉత్పత్తికి అవసరమైన మేర నాణ్యం గా లేదని తెలిసింది. దీంతో ఇక్కడ కోల్డ్ రోల్ మిల్ ఏర్పాటు చేస్తే బాగుంటదనే ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. దీనిపై యాజమాన్యం సైతం సానుకూలంగా ఉందని, కార్యరూపం దాల్చితే సంస్థకు మేలు జరుగుతుందని సిబ్బంది ఆశిస్తున్నారు. సాధ్యసాధ్యాలపై ఎంఎన్ దస్తూరి అనే కన్సెల్టెన్సీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇక్కడి సిబ్బందితో కూడా చర్చించినట్లు తెలిసింది. -
‘ఉక్కు’.. ఏ దిక్కు?
సాక్షి, కొత్తగూడెం : బయ్యారంలో ఉక్కు కర్మాగారం.. 2012 నుంచి దీనిపై రకరకాల చర్చలు, ఆందోళనలు జరుగుతున్నాయి. చివరకు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇటీవల కాలంలో దీనిపై వివిధ కదలికలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఒక స్పష్టమైన ప్రకటన మాత్రం రాకపోవడంతో అన్ని వర్గాల ప్రజల్లో అనేక సందేహాలు వస్తున్నాయి. ఇన్నాళ్లుగా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు అంశంపై ఉత్కంఠ నెలకొనగా.. తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. బయ్యారం బదులు పాల్వంచలో ఏడాదిన్నర క్రితం మూతపడిన ఎన్ఎండీసీలో విలీనం అయిన స్పాంజ్ ఐరన్ కర్మాగారాన్ని 1.5 మిలియన్ టన్నుల ఉక్కు కర్మాగారంగా కేంద్ర ప్రభుత్వం మార్చనుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడే అనేక సందేహాలు వస్తున్నాయి. ప్రస్తుతం పాల్వంచలో ఉన్న యూనిట్లో 30 వేల టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన రెండు యూ నిట్లు ఉండగా, ఏడాదిన్నర క్రితం ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక్కడ 425 ఎకరాల భూమి మాత్రమే అందుబాటులో ఉంది. అయితే 1.5 మిలియన్ టన్నుల సామ ర్థ్యంతో ఉక్కు కర్మాగారం నిర్మించాలంటే కనీసం 1000 ఎకరాల భూమి ఉండాలి. బయ్యారంలో భూసేకరణ సమస్యగా ఉంటుందని, పాల్వంచలో అయితే ఆ అవసరం లేదనీ చెపుతున్నప్పటికీ.. ఇక్కడ కూడా భూమి సేకరించాల్సిన అవసరం ఉంది. అయితే దీనిపై కేంద్రం నుంచి అధికారిక ప్రకటన మాత్రం ఇంతవరకు రాలేదు. ‘మెకాన్’ నుంచి డీపీఆర్ రాలే.. కేంద్ర ప్రభుత్వ కన్సల్టెన్సీ అయిన ‘మెకాన్’ (మైనింగ్ ఇంజినీర్స్ కన్సల్టెన్సీ) సంస్థ ఇప్పటివరకు ఇందుకు సంబంధించి డీపీఆర్ ఇవ్వలేదు. అక్కడి నుంచి డీపీఆర్ వస్తేనే కేంద్ర గనులు, ఉక్కు, ఆర్థిక శాఖలు కలిసి అనుమతి ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాతే తుది రూపు వస్తుంది. ఈ క్రమంలో బయ్యారం, పాల్వంచల మధ్య ఉక్కు కర్మాగారం అంశం దోబూచులాడుతోంది. అసలే కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ (పెట్టుబడుల ఉపసంహరణ) చేస్తున్న పరిస్థితుల్లో ఇంత భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టే అంశంపైనా సందేహాలు నెలకొన్నాయి. నాడు ఆదర్శం.. నేడు అగమ్యగోచరం.. పాల్వంచలోని జాతీయ ఖనిజాభివృద్ది సంస్థ(ఎన్ఎండిసీ) స్పాంజ్ ఐరన్ యూనిట్ సరికొత్త దేశీయ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుని పలు దేశాలకు ఆదర్శంగా నిలిచింది. స్పాంజ్ ఐరన్ తయారీలోనే ప్రత్యేకత కలిగి ఉండేది. ఇక్కడ రూపొందించిన టెక్నాలజీని సైతం ఇతర ప్రైవేట్ కర్మాగారాలకు విక్రయించింది. లక్ష్యానికి మించిన ఉత్పత్తిని సాధించి తన రికార్డులను తానే తిరగరాసింది. అయితే ముడిసరుకుతో పాటు మార్కెటింగ్ సమస్యతో చివరకు మూతపడింది. పక్కనే ఉన్న ఏపీ స్టీల్స్ మూతపడడంతో మార్కెటింగ్ కోసం చెన్నై తదితర దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో భారీ లాభాల నుంచి నష్టాల బాటలోకి వచ్చింది. 2010లో స్పాంజ్ ఐరన్‌ను విలీనం చేసుకున్న ఎన్ఎండీసీ ఏమాత్రం పట్టించుకోకపోగా, ఉన్న ఉద్యోగులకు కూర్చోబెట్టి జీతాలు ఇస్తోంది. గతంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రాంవిలాస్‌పాశ్వాన్ రూ.1,200 కోట్లతో విస్తరింపజేస్తామని ఇచ్చిన హామీ నీటిమూటే అయింది. -
స్పాంజ్ ఐరన్ కంపెనీల సమ్మె బాట...
హెచ్చరికలు జారీ చేసిన కంపెనీల అసోసియేషన్ ముడి ఇనుము దొరక్క 14 కంపెనీల మూత పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమల మూతతో వీధిన పడ్డ కార్మికులు త్వరలో సీఎంను కలిసి పూర్తి స్థాయిలో సమస్యలు వివరిస్తాం : చాంబర్ ఆఫ్ కామర్స అధ్యక్షుడు బళ్లారి : రాష్ట్రంలో స్పాంజ్ ఐరన్ కంపెనీల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని రాష్ట్ర స్పాంజ్ ఐరన్ కంపెనీల అసోసియేషన్ అధ్యక్షుడు, రాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సంపత్రాం పేర్కొన్నారు. ఆయన గురువారం బళ్లారిలోని స్పాంజ్ ఐరన్ కంపెనీల కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా స్పాంజ్ ఐరన్ కంపెనీలు 66 ఉండగా, ఇం దులో బళ్లారి జిల్లాలో 32 ఉన్నాయన్నారు. ఒక్క బళ్లారి జిల్లాలో 20 వేల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతుండగా, 2 లక్షల మం ది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని గుర్తు చేశారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే స్పాంజ్ ఐరన్ కంపెనీలు ముడి ఇనుము లేకపోవడంతో మూత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 14 స్పాంజ్ ఐరన్ కంపెనీలు మూతపడ్డాయన్నారు. కొన్ని కంపెనీలను బ్యాంకులు వేలం వేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పిం చే స్పాంజ్ ఐరన్ కంపెనీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ బాధ్యతలు తీసుకున్న తర్వాత మంచి జరుగుతుందని భావించామని, అయితే ఎలాంటి మార్పు కనబడడం లేదన్నారు. సీఎం సిద్ధరామయ్య దృష్టికి కూడా బళ్లారి స్పాంజ్ ఐరన్ సమస్యలను తీసుకెళ్లామన్నారు. ఆయన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు కానీ ఆచరణలో పెట్టడం లేదన్నారు. అధికారులు తమ సమస్యలపై ఎలాంటి స్పందన ఇవ్వక పోవడంతో గత కొన్ని సంవత్సరాలుగా ఫ్యాక్టరీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. తద్వారా వేలాది మంది ఉపాధి కోల్పోయి వీధిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పాంజ్ ఐరన్ కంపెనీలకు గనులు కేటాయించాలని, లోకాయుక్త నివేదికలో పొందుపరిచిన వాటిని వెంటనే అమలు చేయాలని మరోసారి సీఎం సిద్ధరామయ్యను కలిసి విన్నవిస్తామన్నారు. సమస్యలను పరిష్కరించపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. జిల్లాలోని స్పాంజ్ ఐరన్ కంపెనీల అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ బళ్లారి జిల్లాలో అపారమైన ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నాయని, అయితే ఇక్కడ నెలకొల్పిన స్పాంజ్ ఐరన్ కంపెనీలకు మాత్రం ముడి ఇనుము దొరకడం లేదన్నారు. ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ-ఆక్షన్ ద్వారా ఇనుప ఖనిజాన్ని తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. స్పాంజ్ ఐరన్ కంపెనీలకు కావలసిన లంప్స్‌ను రూ.3500 నిర్ణయించడం వల్ల కొనుగోలు చేయలేకపోతున్నామని గుర్తు చేశారు. బళ్లారి జిల్లా ప్రజలకు ఉపాధి కల్పించే స్పాంజ్ ఐరన్ కంపెనీలకు ముడి ఇనుము సరఫరా చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. గతంలో నిరాహార దీక్షలు కూడా చేశామని, అప్పటి సీఎం సదానందగౌడ, ప్రస్తుత సీఎం సిద్ధరామయ్యకు తమ సమస్యలను వివరించామని, అయితే ఎలాంటి పరిష్కారం లభించలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా గనులు తవ్వకాలకు అనుమతి ఇచ్చిందని, అయితే స్పాంజ్ ఐరన్ కంపెనీలకు మాత్రం గనులు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను కేంద్ర సాధికార సమితి(సీఈసీ) దృష్టికి కూడా తీసుకుని వెళ్లామన్నారు. అయినా ఫలితం లేకపోయిందని గుర్తు చేశారు. సమస్యలను వివరించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసేందుకు ప్రయత్నించామని అవకాశం దొరక లేదన్నారు. ప్రధానమంత్రిని కూడా కలిసేందుకు మళ్లీ ప్రయత్నం చేసి సమస్య పరిష్కరించాలని విన్నవిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్పాంజ్ ఐరన్ కంపెనీ అసోసియేషన్ , చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రముఖులు ద్వారకానాథ్, దినేష్, సుధాకర్‌శెట్టి, నగేష్, రమేష్‌గోపాల్ తదితరులు పాల్గొన్నారు.