హెచ్చరికలు జారీ చేసిన కంపెనీల అసోసియేషన్
ముడి ఇనుము దొరక్క 14 కంపెనీల మూత
పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
పరిశ్రమల మూతతో వీధిన పడ్డ కార్మికులు
త్వరలో సీఎంను కలిసి పూర్తి స్థాయిలో సమస్యలు
వివరిస్తాం : చాంబర్ ఆఫ్ కామర్‌స అధ్యక్షుడు
బళ్లారి : రాష్ట్రంలో స్పాంజ్ ఐరన్ కంపెనీల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని రాష్ట్ర స్పాంజ్ ఐరన్ కంపెనీల అసోసియేషన్ అధ్యక్షుడు, రాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సంపత్‌రాం పేర్కొన్నారు. ఆయన గురువారం బళ్లారిలోని స్పాంజ్ ఐరన్ కంపెనీల కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా స్పాంజ్ ఐరన్ కంపెనీలు 66 ఉండగా, ఇం దులో బళ్లారి జిల్లాలో 32 ఉన్నాయన్నారు. ఒక్క బళ్లారి జిల్లాలో 20 వేల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతుండగా, 2 లక్షల మం ది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని గుర్తు చేశారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే స్పాంజ్ ఐరన్ కంపెనీలు ముడి ఇనుము లేకపోవడంతో మూత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 14 స్పాంజ్ ఐరన్ కంపెనీలు మూతపడ్డాయన్నారు. కొన్ని కంపెనీలను బ్యాంకులు వేలం వేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పిం చే స్పాంజ్ ఐరన్ కంపెనీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ బాధ్యతలు తీసుకున్న తర్వాత మంచి జరుగుతుందని భావించామని, అయితే ఎలాంటి మార్పు కనబడడం లేదన్నారు. సీఎం సిద్ధరామయ్య దృష్టికి కూడా బళ్లారి స్పాంజ్ ఐరన్ సమస్యలను తీసుకెళ్లామన్నారు.
ఆయన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు కానీ ఆచరణలో పెట్టడం లేదన్నారు. అధికారులు తమ సమస్యలపై ఎలాంటి స్పందన ఇవ్వక పోవడంతో గత కొన్ని సంవత్సరాలుగా ఫ్యాక్టరీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. తద్వారా వేలాది మంది ఉపాధి కోల్పోయి వీధిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పాంజ్ ఐరన్ కంపెనీలకు గనులు కేటాయించాలని, లోకాయుక్త నివేదికలో పొందుపరిచిన వాటిని వెంటనే అమలు చేయాలని మరోసారి సీఎం సిద్ధరామయ్యను కలిసి విన్నవిస్తామన్నారు. సమస్యలను పరిష్కరించపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. జిల్లాలోని స్పాంజ్ ఐరన్ కంపెనీల అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ బళ్లారి జిల్లాలో అపారమైన ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నాయని, అయితే ఇక్కడ నెలకొల్పిన స్పాంజ్ ఐరన్ కంపెనీలకు మాత్రం ముడి ఇనుము దొరకడం లేదన్నారు. ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ-ఆక్షన్ ద్వారా ఇనుప ఖనిజాన్ని తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. స్పాంజ్ ఐరన్ కంపెనీలకు కావలసిన లంప్స్‌ను రూ.3500 నిర్ణయించడం వల్ల కొనుగోలు చేయలేకపోతున్నామని గుర్తు చేశారు. బళ్లారి జిల్లా ప్రజలకు ఉపాధి కల్పించే స్పాంజ్ ఐరన్ కంపెనీలకు ముడి ఇనుము సరఫరా చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. గతంలో నిరాహార దీక్షలు కూడా చేశామని, అప్పటి సీఎం సదానందగౌడ, ప్రస్తుత సీఎం సిద్ధరామయ్యకు తమ సమస్యలను వివరించామని, అయితే ఎలాంటి పరిష్కారం లభించలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా గనులు తవ్వకాలకు అనుమతి ఇచ్చిందని, అయితే స్పాంజ్ ఐరన్ కంపెనీలకు మాత్రం గనులు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ సమస్యలను కేంద్ర సాధికార సమితి(సీఈసీ) దృష్టికి కూడా తీసుకుని వెళ్లామన్నారు. అయినా ఫలితం లేకపోయిందని గుర్తు చేశారు. సమస్యలను వివరించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసేందుకు ప్రయత్నించామని అవకాశం దొరక లేదన్నారు. ప్రధానమంత్రిని కూడా కలిసేందుకు మళ్లీ ప్రయత్నం చేసి సమస్య పరిష్కరించాలని విన్నవిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్పాంజ్ ఐరన్ కంపెనీ అసోసియేషన్ , చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రముఖులు ద్వారకానాథ్, దినేష్, సుధాకర్‌శెట్టి, నగేష్, రమేష్‌గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
స్పాంజ్ ఐరన్ కంపెనీల సమ్మె బాట...
Published Fri, Feb 20 2015 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM
Advertisement
Advertisement