ఆ క్షణం చిరస్మరణీయం...
జాతీయ గీతాలాపనపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్
ముంబై: వేలాది ప్రేక్షకుల మధ్య 2011 ప్రపంచకప్ ఫైనల్లో జాతీయ గీతం పాడుతున్నప్పుడు కలిగిన అనుభూతి తన జీవితంలో మరిచిపోలేనిదని భారత క్రికెట్ బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తెలిపారు. ‘జనగణమన పాడుతున్నప్పుడు మన తల ఎప్పుడూ పైకే ఉంటుంది. అదే స్టేడియంలోని వేలాది ప్రేక్షకులు ఆలపిస్తున్నప్పుడు మన ఛాతీ గర్వంతో ఉప్పొంగి పోతుంటుంది. ఇలాంటి అనుభం నాకు 2003 ప్రపంచకప్లో పాకిస్తాన్తో ఆడుతున్నప్పుడు.. స్వదేశంలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లోనూ ఎదురైంది. ముఖ్యంగా ముంబైలోని వాంఖడే స్టేడియం మొత్తం జాతీయ గీతాలాపన చేసిన వైనం ఇంకా నా చెవుల్లో మార్మోగుతూనే ఉంది.
ఇది ఎప్పటికీ మరిచిపోలేను. నా జీవితంలోనే అత్యంత గర్వించదగ్గ క్షణాలవి. నేను ఎన్ని రికార్డులు సాధించినా ఈ అనుభవం ముందు దిగదుడుపే’ అని సచిన్ అన్నారు. హాకీ స్టార్ ధన్రాజ్ పిళ్లై, క్రికెటర్ నిలేశ్ కులకర్ణిలతో కలిసి ‘ది స్పోర్ట్ హీరోస్’ వీడియో ఆవిష్కరణలో సచిన్ పాల్గొన్నారు. ఈ వీడియోలో భారత క్రీడారంగం ప్రముఖులైన సచిన్ టెండూల్కర్తోపాటు సునీల్ గవాస్కర్, సానియా మీర్జా, మహేశ్ భూపతి, ధన్రాజ్ పిళ్లై, బైచుంగ్ భూటియా, గగన్ నారంగ్, సుశీల్ కుమార్ తదితరులు జాతీయగీతం పాడారు.