Sports Minister Vijay Goel
-
సింధు, సాక్షి.. గోల్డ్ మెడళ్లు సాధించారా?
రియో ఒలింపిక్స్‌లో పతకాల కోసం భారతీయులు కళ్లు కాయలు గాచేలా ఎదురుచూస్తే.. ఇద్దరు అమ్మాయిలు ఆ లోటును తీర్చారు. మొదట రెజ్లర్ సాక్షి మాలిక్ గొప్ప పోరాటపటిమతో కాంస్య పతకాన్ని సాధిస్తే.. ఆ తర్వాత షట్లర్ పీవీ సింధు స్ఫూర్తిదాయక పోరాటంతో రజతాన్ని కైవసం చేసుకుంది. విశ్వ క్రీడా వేదికపై భారత్ గౌరవాన్ని నిలబెట్టిన ఈ ఇద్దరు అమ్మాయిలు ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. పీవీ సింధు, సాక్షితోపాటు ఖేల్ రత్న, ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీతలైన క్రీడాకారులు కూడా ప్రధాని మోదీతో సమావేశమైన వారిలో ఉన్నారు. ఈ విషయాన్ని చెప్పే సమయంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ కొంత తడబడ్డారు. రియో ఒలింపిక్స్‌లో సాక్షి మాలిక్, పీవీ సింధు గోల్డ్ మెడలిస్టులని ఆయన మీడియాతో పేర్కొన్నారు. సాక్షాత్తు కేంద్ర క్రీడాశాఖ మంత్రే సింధు, సాక్షి మెడళ్ల విషయంలో తత్తరపడటం గమనార్హం. రియో ఒలింపిక్స్‌లోనే ప్రోటోకాల్ పాటించకుండా దురుసుగా విజయ్ గోయల్ ప్రవర్తించడం అప్పట్లో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. -
ఎక్కడా దురుసుగా ప్రవర్తించలేదు : కేంద్ర మంత్రి
ప్రపంచ క్రీడల్లో అత్యున్నత ఈవెంట్ ఒలింపిక్స్ లో భారత క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ నిబంధనలను పాటించడం లేదని ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రియోలో దేశ ఆటగాళ్లను కలుసుకునేందుకు తనతో పాటు అక్రిడిటేషన్ లేని వాళ్లను తీసుకెళ్తున్నారని ఒలింపిక్ అధికారులకు కొందరు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి విజయ్ గోయల్ స్పందించారు. రియోలో తాను ఎక్కడా ప్రొటోకాలు ఉల్లంఘించలేదని, ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించ లేదని పేర్కొన్నారు. నిబంధలను కచ్చితంగా పాటించి అధికారులకు సహకరించానని ట్వీట్ చేశారు. దేశం తరఫున ఇక్కడికి వచ్చిన ఆటగాళ్లను ప్రొత్సహించడం మాత్రమే చేశానన్నారు. అయితే ఈ విషయాన్ని ఒలింపిక్ సిబ్బంది తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చుకున్నారు. మరోవైపు విజయ్ గోయల్ పై భారత చెఫ్ డి మిషన్ రాకేశ్ గుప్తాకు రాసిన లేఖలో రియో గేమ్స్ కాంటినెంటల్ మేనేజర్ సారా పీటర్సన్ ఫిర్యాదుచేశారు. క్రీడాశాఖ మంత్రి మా సిబ్బంది చెప్పినా వినిపించుకోవడం లేదని, దూకుడుగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. మరోసారి ఇలా జరిగితే మంత్రి గుర్తింపును రద్దు చేస్తామని ఇదివరకే హెచ్చరించిన విషయం తెలిసిందే. To my knowledge, we have been following all rules & regulations. We are committed to the spirit of Olympics & back our Indian players. (1/2) — Vijay Goel (@VijayGoelBJP) 11 August 2016 There seems to be some misunderstanding as we have followed all protocols as advised by the organizers. ( 2/2 ) — Vijay Goel (@VijayGoelBJP) 11 August 2016 -
మీ మంత్రిని రానివ్వం
భారత క్రీడామంత్రి శైలిపై ఒలింపిక్స్ నిర్వాహకుల ఆగ్రహం రియో డి జనీరో: ప్రపంచ స్థాయి టోర్నీ జరిగినప్పుడు ఎవరైనా అక్కడి నిబంధనలకు లోబడి వ్యవహరించాలి. ఒలింపిక్స్‌లాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన గేమ్స్‌లో అయితే ఇక చెప్పక్కరలేదు. కానీ భారత క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ మాత్రం రియో గేమ్స్‌లోనూ తన దర్పాన్ని ప్రదర్శించాలనుకుంటున్నారు. విషయమేమిటంటే మ్యాచ్‌లు జరిగే వేదికల దగ్గరికి వెళ్లాలంటే గుర్తింపు కార్డులున్న వారికే ప్రవేశం ఉంటుంది. అయితే తనతో పాటు గోయల్ మందీమార్బలంతో అలాంటి చోట్లకు వెళుతుండడంతో నిర్వాహకులు సీరియస్ అయ్యారు. పరిస్థితి మారకుంటే క్రీడా మంత్రి అక్రిడిటేషనే రద్దు చేస్తామని హెచ్చరించారు. ‘ఇతరులను వెంటబెట్టుకుని నిషేధిత స్థలాలకు వెళుతున్నట్టు మీ క్రీడా మంత్రిపై చాలా సార్లు ఫిర్యాదులందాయి. మేం అడ్డుచెప్పినా ఆయన పక్కనున్న వారు దూకుడుగా వ్యవహరిస్తూ మా సిబ్బందిని నెట్టేస్తున్నారు. ఇలా మరోసారి జరిగితే మంత్రి గుర్తింపును రద్దు చేస్తాం’ అని భారత చెఫ్ డి మిషన్ రాకేశ్ గుప్తాకు రాసిన లేఖలో రియో గేమ్స్ కాంటినెంటల్ మేనేజర్ సారా పీటర్సన్ పేర్కొన్నారు.