సింధు, సాక్షి.. గోల్డ్ మెడళ్లు సాధించారా?
రియో ఒలింపిక్స్‌లో పతకాల కోసం భారతీయులు కళ్లు కాయలు గాచేలా ఎదురుచూస్తే.. ఇద్దరు అమ్మాయిలు ఆ లోటును తీర్చారు. మొదట రెజ్లర్ సాక్షి మాలిక్ గొప్ప పోరాటపటిమతో కాంస్య పతకాన్ని సాధిస్తే.. ఆ తర్వాత షట్లర్ పీవీ సింధు స్ఫూర్తిదాయక పోరాటంతో రజతాన్ని కైవసం చేసుకుంది. విశ్వ క్రీడా వేదికపై భారత్ గౌరవాన్ని నిలబెట్టిన ఈ ఇద్దరు అమ్మాయిలు ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. పీవీ సింధు, సాక్షితోపాటు ఖేల్ రత్న, ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీతలైన క్రీడాకారులు కూడా ప్రధాని మోదీతో సమావేశమైన వారిలో ఉన్నారు.
ఈ విషయాన్ని చెప్పే సమయంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ కొంత తడబడ్డారు. రియో ఒలింపిక్స్‌లో సాక్షి మాలిక్, పీవీ సింధు గోల్డ్ మెడలిస్టులని ఆయన మీడియాతో పేర్కొన్నారు. సాక్షాత్తు కేంద్ర క్రీడాశాఖ మంత్రే సింధు, సాక్షి మెడళ్ల విషయంలో తత్తరపడటం గమనార్హం. రియో ఒలింపిక్స్‌లోనే ప్రోటోకాల్ పాటించకుండా దురుసుగా విజయ్ గోయల్ ప్రవర్తించడం అప్పట్లో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే.