మీ మంత్రిని రానివ్వం
భారత క్రీడామంత్రి శైలిపై ఒలింపిక్స్ నిర్వాహకుల ఆగ్రహం
రియో డి జనీరో: ప్రపంచ స్థాయి టోర్నీ జరిగినప్పుడు ఎవరైనా అక్కడి నిబంధనలకు లోబడి వ్యవహరించాలి. ఒలింపిక్స్‌లాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన గేమ్స్‌లో అయితే ఇక చెప్పక్కరలేదు. కానీ భారత క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ మాత్రం రియో గేమ్స్‌లోనూ తన దర్పాన్ని ప్రదర్శించాలనుకుంటున్నారు. విషయమేమిటంటే మ్యాచ్‌లు జరిగే వేదికల దగ్గరికి వెళ్లాలంటే గుర్తింపు కార్డులున్న వారికే ప్రవేశం ఉంటుంది.
అయితే తనతో పాటు గోయల్ మందీమార్బలంతో అలాంటి చోట్లకు వెళుతుండడంతో నిర్వాహకులు సీరియస్ అయ్యారు. పరిస్థితి మారకుంటే క్రీడా మంత్రి అక్రిడిటేషనే రద్దు చేస్తామని హెచ్చరించారు. ‘ఇతరులను వెంటబెట్టుకుని నిషేధిత స్థలాలకు వెళుతున్నట్టు మీ క్రీడా మంత్రిపై చాలా సార్లు ఫిర్యాదులందాయి. మేం అడ్డుచెప్పినా ఆయన పక్కనున్న వారు దూకుడుగా వ్యవహరిస్తూ మా సిబ్బందిని నెట్టేస్తున్నారు. ఇలా మరోసారి జరిగితే మంత్రి గుర్తింపును రద్దు చేస్తాం’ అని భారత చెఫ్ డి మిషన్ రాకేశ్ గుప్తాకు రాసిన లేఖలో రియో గేమ్స్ కాంటినెంటల్ మేనేజర్ సారా పీటర్సన్ పేర్కొన్నారు.