squadron commander
-
స్త్రీ శక్తి: సూపర్ ఫైటర్
సవాలుకు దీటైన సమాధానం విజయంలోనే దొరుకుతుంది. ‘అమ్మాయిలు బైక్ నడపడం కష్టం’ అనే మాట విన్నప్పుడు పట్టుదలగా బైక్ నడపడం నేర్చుకుంది. ‘ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ప్రవేశించడం చాలా కష్టం’ అనే మాట విన్న తరువాత ఫైటర్ పైలట్ కావాలనుకునే లక్ష్యానికి బీజం పడింది. ‘మిగ్–21 బైసన్’ యుద్ధ విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించిన స్క్వాడ్రన్ లీడర్ అవని చతుర్వేది జపాన్‌లో జరగబోయే ఎయిర్ కంబాట్ ఎక్సర్‌సైజ్‌లలో పాల్గొనబోతోంది... ఇండియా, జపాన్ దేశాలు కలిసి ఎయిర్ కంబాట్ ఎక్సర్సైజ్లు నిర్వహించనున్నాయి. ఎయిర్ డిఫెన్స్‌కు సంబంధించి పరస్పర సహకారాన్ని అందిపుచ్చుకునే లక్ష్యంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్), జపాన్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్(జేఎఎస్డీఎఫ్)లు గగనతల విన్యాసాలకు శ్రీకారం చుట్టనున్నాయి. జపాన్‌లో హైకురీ ఎయిర్‌బేస్ కేంద్రంగా జరిగే ఎయిర్ కంబాట్ ఎక్సర్సైజ్లు (వీర్ గార్డియన్ 2023) ఈ నెల 12 నుంచి 26 వరకు జరగనున్నాయి. మన దేశానికి సంబంధించి సుఖోయ్–30 ఎంకేఐ, సీ–17 హెవీ–లిఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్‌లు దీనిలో భాగం అవుతాయి. ఈ కార్యక్రమంలోపాల్గొంటున్న ఫస్ట్ ఉమెన్ ఫైటర్ పైలట్‌గా స్క్వాడ్రన్ లీడర్ అవని చతుర్వేది చరిత్ర సృష్టించనుంది. మన దేశంలో జరిగిన కంబాట్ ఎక్సర్‌సైజ్‌లలో మహిళా ఫైటర్ పైలట్లుపాల్గొన్న సందర్భాలు ఉన్నప్పటికీ, వేరే దేశంలో జరిగే దానిలో ఒక మహిళా ఫైటర్ పైలట్పాలుపంచుకోడం ఇదే తొలిసారి. మధ్యప్రదేశ్‌కు చెందిన అవని చతుర్వేది జైపూర్‌లో బీటెక్ చేసింది. విమానాలపై ఉన్న ఆసక్తితో రాజస్థాన్‌లోని వనస్థలి యూనివర్శిటీ ‘ప్లయింగ్ క్లబ్’లో చేరింది. అక్కడ మొదలైన ఆమె ప్రయాణం విజయపరంపరలతో సాగుతూనే ఉంది. ‘మిగ్–21 బైసన్’ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా 2018 చరిత్ర సృష్టించింది అవని. రాష్ట్రపతి చేతుల మీదుగా 2020లో ‘నారీశక్తి’ పురస్కారాన్ని అందుకున్న అవని, వైమానిక రంగంలో పనిచేయాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకోవడానికి ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిని ఇచ్చింది. అవని తండ్రి నీటిపారుదలశాఖలో ఇంజనీరు. సోదరుడు సైన్యంలో పనిచేస్తున్నాడు. సోదరుడి స్ఫూర్తితోనే సైన్యంలోకి వచ్చింది అవని. భారతీయ వైమానికదళంలో పనిచేయాలనే తన లక్ష్యాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు ‘ఫ్లైయింగ్ క్లబ్లో చేరినంత సులువు కాదు’ అని వెక్కిరించిన వాళ్లూ ఉన్నారు. అయితే వాటిని అవని సీరియస్‌గా తీసుకోలేదు. ఎఎఫ్సిఎటీ పరీక్షలో రెండో స్థానంలో నిలిచి ప్రశంసలు అందుకుంది. దుండిగల్(హైదరాబాద్)లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కఠినమైన శిక్షణ పొందింది. సాహసాలతో చెలిమి చేసింది. అవనికి బాస్కెట్‌బాల్, చెస్ ఆడడం, పెయింటింగ్ అంటే ఇష్టం. బాస్కెట్‌బాల్ వల్ల తెగువ, చెస్‌తో లోతైన ఆలోచన, పెయింటింగ్‌తో సృజనాత్మక శక్తులు తనలో వచ్చి చేరాయి. ‘ప్రతిరోజూ ఒక కొత్త విషయం నేర్చుకోవాలనేది నా విధానం. మంచి ఫైటర్ పైలట్‌గా పేరు తెచ్చుకోవాలనేది నా లక్ష్యం’ అంటోంది అవని చతుర్వేది. ‘కఠినమైన ఫైటర్–ఫ్లయింగ్ షెడ్యూల్స్’ అంటూ ఒకప్పుడు ఐఏఎఫ్ మహిళలను కంబాట్ స్ట్రీమ్‌లోకి తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు ఐఏఎఫ్ ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. దీనికి తాజా ఉదాహరణ జపాన్‌లో జరిగే ఎయిర్ కంబాట్ ఎక్సర్సైజ్కు అవని చతుర్వేదిని ఎంపిక చేయడం. -
‘‘ఈ ఎగిరే శవ పేటికలను రద్దు చేయండి’’
న్యూఢిల్లీ: భారత వైమానిక దళంలో మిగ్ ఫైటర్ జెట్లది ప్రత్యేక స్థానం. రెండేళ్ల క్రితం పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై ఇండియా నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్‌లో వీటినే వాడారు. వైమానిక దళంలో వీటి ప్రాముఖ్యత ఏంటో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంత ప్రతిష్టాత్మకమైన ఈ ఫైటర్ జెట్లు ప్రతి ఏటా పలువురు యువ ఐఏఎఫ్ ట్రైనీలను బలి తీసుకుంటున్నాయి. కారణం ఏంటంటే ఈ ఫైటర్ జెట్లు చాలా పురాతనమైనవి కావడంతో.. ట్రైనింగ్ సమయంలో కూలి పోతున్నాయి. తాజాగా రెండు రోజుల క్రితం మిగ్-21 ఫైటర్ జెట్ పంజాబ్ మోగా జిల్లాలో కూలిపోయింది. ప్రమాద సమయంలో దానిలో ఉన్న పైలెట్, స్క్వాడ్రోన్ లీడర్ అభివన్ చౌదరి మరణించారు. ఈ క్రమంలో ఆయన తండ్రి ‘‘ఈ ప్రమాదంలో నేను నా కుమారుడిని పొగొట్టుకున్నాను. మరి కొందరు తల్లిదండ్రులకు ఈ గర్భశోకం తప్పాలంటే.. దయచేసి ఈ మిగ్ ఫైటర్ జెట్లను ఐఏఎఫ్ నుంచి తొలగించండి’’ అంటూ ప్రభుత్వాన్ని చేతులెత్తి వేడుకుంటున్నారు. పంజాబ్‌లోని మోగా జిల్లాలో గురువారం అర్ధరాత్రి తర్వాత మిగ్-21 బైసన్ యుద్ధ విమాన కూలింది. ఈ ప్రమాదంలో స్క్వాడ్రోన్ లీడర్ అభినవ్ చౌదరి మరణించాడు. ఈ వార్త తలెసిన వెంటనే సన్నిహితులు, బంధువులు మీరట్‌లోని అతడి ఇంటికి చేరుకుని సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా అభినవ్ చౌదరి తండ్రి మిగ్-21 ఫైటర్ జెట్లను తొలగించాల్సిందిగా కన్నీటితో వేడుకుంటున్నాడు. ఈ సందర్భంగా అభినవ్ తండ్రి మాట్లాడుతూ.. ‘‘1980లోనే రష్యా వీటిని రద్దు చేసింది. ప్రతి ఏటా కుప్ప కూలుతున్న ఈ ఎగిరే శవ పేటికలు అనేక మంది యువకుల కలలను, జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. ఈ పాత కాలపు యుద్ధ విమానాలను రద్దు చేసే విషయంలో ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది. ఫైటర్ పైలెట్ల శిక్షణ కోసం ప్రభుత్వం ఏటా కోట్లు ఖర్చు చేస్తుంది. అలాంటప్పుడు ఈ అరిగిపోయిన విమానాలను శిక్షణ కోసం ఎందుకు అనుమతిస్తున్నారు’’ అంటూ ప్రశ్నించారు. చదవండి: ముక్కలైన మిగ్-21.. పైలెట్ దుర్మరణం -
20వ స్క్వాడ్రన్..4 పైలట్లు...
యుద్ధం లేని సమయంలో తొలిసారి పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకుని పోయి బాలాకోట్‌లోని ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై చేసిన మెరుపుదాడి భారత వైమానిక దళ ధైర్యసాహసాలకు ఓ ప్రతీక. మనదేశానికి చెందిన యుద్ధవిమానాలు వాస్తవాధీన రేఖను, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను కూడా దాటి పాక్‌లోకి చొచ్చుకుపోవటంలో చూపిన తెగువను 1971 నాటి బంగ్లా యుద్ధంలోనూ మన వాయుసేన ప్రదర్శించింది. మన దేశానికి చెందిన ఓ నలుగురు యువ పైలట్లు ఇలాగే పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి శత్రు వైమానిక స్థావరాన్ని నాశనం చేశారు . ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్క్వాడ్రన్ లీడర్ ఆర్ఎన్ భరద్వాజ్, ఫ్లైయింగ్ ఆఫీసర్లు వీకే హెబ్లే, బీసీ కరంబయ, ఫ్లైట్ లెఫ్టినెంట్ ఏఎల్ దియోస్కర్లు ఆ ఏడాది డిసెంబర్ 8న జెట్ విమానాల్లో మురిద్ వైపు దూసుకుపోయారు. పాకిస్తాన్ సరిహద్దు నుంచి 120 కిలోమీటర్ల లోపల ఉన్న మురిద్ వైమానిక స్థావరంలో నిలిపి ఉంచిన శత్రు విమానాలను ధ్వంసం చేశారు. నాటి సాహస కృత్యాలను ఫ్లైయింగ్ ఆఫీసర్‌గా పనిచేసిన బీసీ కరంబయ నెమరు వేసుకున్నారు. ఆయన మాటల్లోనే.. ఈ ఆపరేషన్‌కు నలుగురం బయల్దేరాం. ముందు రెండు, తర్వాత రెండు విమానాలు. మొదటి రెండు విమానాలు అనుకున్న ప్రకారం ముందుకెళ్లాయి. వెనకనున్న రెండు విమానాలను ముందు వాటి కంటే ఒకటిన్నర నిముషం ఆలస్యంగా బయలు దేరమన్నాం. ఆకాశంలో కాల్పుల శబ్దం వినపడింది. నేను విమానంలో రేడియో ఆన్‌చేశాను. ముందువెళ్లిన విమానం నుంచి ‘నేను ఇప్పుడే నాలుగు ఇంజన్ల విమానాన్ని షూట్ చేశాను’అని వినిపించింది. చుట్టూ చీకటిగా ఉంది. నేను మిగ్–19 ఎస్‌ను చూశానని అనుకున్నాను. (నిజానికి అది చైనా తయారీ ఎఫ్–6 విమానం, చూడ్డానికి రష్యా మిగ్–19లాగే ఉంటుంది). దియోస్కర్ మరో విమానాన్ని గుర్తించాడు. నేను కాల్పులు జరిపాను. విమానాలకు ఇంధనాన్ని నింపే ట్యాంకరుకు మంటలంటుకున్నాయి. నేను కాల్పులు జరుపుతూనే ఉన్నాను. అప్పుడు నేను భూమికి కేవలం 300 అడుగుల ఎత్తులోనే ఉన్నాను. విమానం ఊగటం మొదలుపెట్టింది. శత్రువులు నా విమానాన్ని కాల్చారని గుర్తించాను. నేను దూకేస్తున్నానని మిగతా వారికి చెప్పాను. బయటకు దూకేందుకు విమానం తలుపు తెరుస్తుండగా, శత్రువులకు యుద్ధ ఖైదీగా చిక్కకూడదని నిర్ణయించుకున్నాను. దాంతో దూకే ఆలోచనను విరమించుకుని తక్కువ ఎత్తులో ప్రయాణించసాగాను. నా విమానం రెక్క ముందు కుడి భాగం, ఇంధన ట్యాంకులు పేలిపోవడం చూశాను. అయినా విమానం ఎగురుతూనే ఉంది. విమానం బాగా ఊగిపోయింది. అవసరమైనంత ఎత్తులో నడుపుతూ ఇండస్,సట్లైజ్ నదుల్ని దాటి భారత భూభాగంలో దిగాను’’అని తన అనుభవాన్ని చెప్పారు. 1971లో కరంబయకు వీర్‌చక్ర పురస్కారం లభించింది. ఆ తర్వాత చాలా ఏళ్లకు ఆయన పదవీ విరమణ చేశారు. మురిద్‌పై దాడి చేసిన కరంబయకు కాని ఇతర పైలట్లకు కాని తామెంత గొప్ప పని చేశామో అప్పట్లో తెలియలేదు. బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత 47 ఏళ్లకు వచ్చిన ఒక పుస్తకంలో వీరి సాహసోపేత ఘనకార్యాన్ని పొందుపరిచారు. పాకిస్తాన్‌కు చెందిన మాజీ ఎయిర్‌కమాండర్ ఎం.కైసర్ తుఫైల్ ‘ఇన్ ద రింగ్ అండ్ ఆన్ ఫస్ట్ ఫీట్– పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఇన్ ద 1971 ఇండో–పాక్ వార్’పేరుతో రాసిన తాజా పుస్తకంలో ఈ ఘటనను వివరించారు. భారత వైమానిక దళం 20వ స్క్వాడ్రన్‌కు చెందిన హంటర్ విమానాలు ముదిర్ స్థావరంలో ఉన్న 5ఎఫ్–86 విమానాలను నాశనం చేశాయని ఆయన పేర్కొన్నారు. అయితే, బంగ్లాయుద్ధం తర్వాత భారత రక్షణ మంత్రిత్వ శాఖ భారత వైమానిక దళంపై ప్రచురించిన పుస్తకంలో దీని గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
లొంగిపోనున్న న్యూడెమొక్రసీ దళ కమాండర్..!
ఖమ్మం జిల్లా ఇల్లెందు ప్రాంత న్యూడెమొక్రసీ దళ కమాండర్ జగన్ పోలీసుల ముందు లొంగిపోనున్నట్టు విశ్వసనీయ సమాచారం. బయ్యారం ప్రాంతానికి చెందిన జగన్ మూడేళ్ల క్రితం పోరు బాట పట్టాడు. ఇతనిపై పలు కేసులు కూడా ఉన్నాయి. బయ్యారం లేదా ఇల్లెందు పోలీసుల ముందు జగన్ లొంగిపోనున్నట్టు తెలుస్తోంది.