మాతృదేవోభవ.. పితృదేవోభవ
జన్మనిచ్చిన తల్లీ తండ్రీ, చదువు చెప్పిన గురువూ, ఇంటికొచ్చిన అతిథీ కూడా దైవంతో సమానమే అంది శాస్త్రం. కంటికి కనిపించే ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులను బాగా చూసుకుంటే, కంటికి కనిపించని దైవం తప్పకుండా హర్షిస్తాడు. వారి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేట్లు చేస్తాడు. రామాయణంలో కనిపించే శ్రవణకుమారుడి కథే ఇందుకు నిదర్శనం. తల్లిదండ్రుల పట్ల ఎంతటి అంకితభావాన్ని కలిగి ఉండాలో వాల్మీకి మహర్షి శ్రవణ కుమారుని పాత్ర ద్వారా లోకానికి చాటాడు.
వయసు మళ్లిన వృద్ధ దంపతులకు జన్మించినవాడే శ్రవణకుమారుడు. వారిద్దరినీ పోషించడం కోసం బాల్యం నుంచే శ్రవణకుమారుడు ఎంతో శ్రమించేవాడు. వారిని ఒకచోటినుంచి మరొకచోటికి తిప్పడం కోసం వారిద్దరినీ కావడిలో కూర్చోబెట్టుకుని భుజంపైన మోసుకుంటూ తీసుకు వెళ్లేవాడు.
ఒకసారి వారొక అడవిలో ప్రయాణిస్తుండగా శ్రవణుని తల్లిదండ్రులకు బాగా దాహం వేసింది. వారి దప్పిక తీర్చడం కోసం శ్రవణుడు తనవద్దనున్న ముంత తీసుకుని నీళ్లు తీసుకురావడానికి బయల్దేరాడు. సమీపంలోనే ఒక కొలను కనిపించడంతో నీళ్లకోసమని ఆ ముంతను కొలనునీటిలో ముంచాడు. అదే సమయానికి అడవికి వేటకు వచ్చిన దశరథుడు ఆ శబ్దం విని, అది జింక లేదా ఏనుగు వంటి జంతువు చేసిన శబ్దంగా భ్రమించాడు. తనకు తెలిసిన శబ్దభేది విద్యద్వారా ఆ శబ్దం వచ్చిన దిక్కుగా బాణం వేశాడు. ఆ బాణం కాస్తా శ్రవణ కుమారునికి తగిలి హా అని అరుస్తూ కుప్పకూలిపోయాడు. మనిషి గొంతు విని దశరథుడు పరుగున అక్కడికి వెళ్లాడు. ప్రాణాలు పోయేటప్పుడు కూడా శ్రవణకుమారుడు తన కర్తవ్యాన్ని మరువలేదు. దాహంతో అల్లాడిపోతున్న తన తల్లిదండ్రులకు నీళ్లిచ్చి వారి ప్రాణం నిలపమని దశరథుడికి చెప్పి కన్నుమూశాడు. ఆ తర్వాత జరిగిన కథ అందరికీ తెలిసిందే.
తల్లిదండ్రులు ఉండగా వారికి పిడికెడు మెతుకులు పెట్టని ప్రబుద్ధులు కొందరు వారు పోయిన తర్వాత వారి కర్మకాండలు ఘనంగా జరిపించి, లోకానికి తమ ఘనతను చాటుకుంటారు. అలాంటి వారిని దేవుడు మెచ్చడు. తాను ఎంత కష్టపడైనా సరే, చివరి వరకు తల్లిదండ్రులను ప్రేమగా చూసినవారే అసలైన బిడ్డలు. (నేడు పేరెంట్స్ డే )