Sravani.Humorous
-
ఆస్తిని చేజిక్కించుకునేందుకే కుట్రలు
అత్తింటివారిపై చక్రి సతీమణి శ్రావణి ఆరోపణ హైదరాబాద్ : తనను రోడ్డు పాలుచేసి తన భర్త సంపాదించిన ఆస్తినంతా కొల్లగొట్టాలనే పథకం ప్రకారం తన అత్తింటివారు తనపై విషం చిమ్ముతున్నారని ప్రముఖ సంగీత దర్శకుడు, దివంగత చక్రి సతీమణి శ్రావణి ఆరోపించారు. తన భర్త మరణధ్రువీకరణ పత్రం రశీదును తీసుకునేందుకు పంజాగుట్ట శ్మశానవాటికకు శనివారం వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. భర్త మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న తనను అత్త విద్యావతి, ఆడపడుచు కృష్ణప్రియ, మరిది మహిత్‌లు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. చక్రి మరణంపై తొలుత అనుమానం వ్యక్తం చేసింది తానేననీ ఇప్పటికీ దానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. చక్రి సంపాదన మీదే కుటుంబీకులు ఆధారపడేవారనీ ఆయన ఉన్నప్పుడు పెద్దమొత్తంలో ఖర్చులు చేసి ఆడపడుచు బిడ్డలను చదివించేవారనీ ఇప్పుడు వాటిని భరించే శక్తిలేక వారు కొత్త కుట్రలు చేస్తున్నారని వెల్లడించారు. తమకు సోమాజిగూడలో ఒకప్లాట్, మొయినాబాద్‌లో 1000 గజాల ఖాళీ స్థలం, ఘట్కేసర్ వద్ద 666 గజాల మరోప్లాట్, తిరుపతిలో కూడా ఓ ఖాళీ స్థలం ఉన్నాయనీ వాటిపైన అత్తింటివారు కన్నేశారని తెలిపారు. చక్రి,తాను సరోగసి విధానంలో బిడ్డను పొందాలనుకున్నామని అది నెరవేరకుండానే ఆయన ఈ లోకాన్ని విడిచారన్నారు. తనకు అండగా చక్రి స్నేహితులు నిలుచున్నారనీ వారి సాయంతో సమస్యలను అధిగమించగలనని చెప్పారు.అత్తింటి వారు చేసిన ఒత్తిళ్లకు మనోవేదనకు గురై చక్రి ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. త్వరలో చక్రిపేరిట ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి వర్ధమాన గాయనీ,గాయకులను ప్రోత్సహిస్తానన్నారు. ఓ స్టూడియో కూడా ఏర్పాటు చేసే యోచన కూడా తనకుందన్నారు. చక్రి డెత్ సర్టిఫికెట్ రశీదును తీసుకున్న శ్రావణి చక్రి మరణానికి సంబంధించి ధ్రువీకరణ పత్రం రశీదును పంజగుట్ట హిందూ శ్మశాన వాటిక పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు పాలడుగు అనిల్‌కుమార్ శనివారం చక్రి సతీమణి శ్రావణికి అందజేశారు. గత నెల 16వ తేదీన చక్రి బావ నాగేశ్వరరావు ఇదే శ్మశాన వాటిక నుంచి రశీదును తీసుకెళ్లిన సంగతి విదితమే. అతను దాన్ని శ్రావణికి ఇవ్వకుండా అతని దగ్గరే అట్టి పెట్టుకున్నారని అందుకే బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, జీహెచ్ఎంసీ ఏఎంహెచ్‌వో సూచనల మేరకు ఆ రశీదును రద్దుచేసి కొత్తగా మరో రశీదును శ్రావణికి జారీ చేసినట్లు పంజగుట్ట హిందూ శ్మశాన వాటిక పరిరక్షణ కమిటీ అధ్యక్షుడుఅనిల్కుమార్ తెలిపారు. తాము ఇప్పుడిస్తున్న రశీదు మాత్రమే చక్రి డెత్ సర్టిఫికెట్ తీసుకోవడానికి చెల్లుబాటు అవుతుందని ఆయన తెలిపారు. -
భర్త ఎడబాటు భరించలేక..
ఇద్దరు పిల్లలకు విషమిచ్చి... ఆత్మహత్యచే సుకున్న మహిళ భర్త మృతిచెందిన కొద్ది రోజులకే.. భార్యాపిల్లలు మృతి ఎంత క్షోభ అనుభవించిందో... ఆ తల్లి కడుపున పుట్టిన పిల్లలకే విషమిచ్చింది. భర్త ఎడబాటును తట్టుకోలేక తాను వెళ్లిపోతూ పిల్లలనూ తీసుకెళ్లిపోయింది. ముద్దులొలికే పసి పాపలను చేతులారా చంపేసుకుంది. మరోవైపు కన్నబిడ్డలా పెంచిన పంట తుపాను బారిన పడి నాశనం కావడం, ప్రభుత్వ సాయం అందకపోవడంతో ఓ యువ రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల ఉరి కొయ్యకు బలయ్యాడు. కష్టాలను ఎదుర్కోలేక, విధిని జయించలేక వీరు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు వారి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చాయి. వారిద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. కులాలు వేరైనా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా ముద్దులొలికే ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆనందమయంగా సాగుతున్నవారి జీవితంతో విధి ఆడుకుంది. ఒక్కసారిగా విషాదాన్ని నింపింది. తన ఆరో ప్రాణమైన భర్త రైలు ప్రమాదంలో మృతి చెందడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ప్రాణాధికంగా ప్రేమించిన భర్తలేని జీవితం తనకు వద్దనుకుంది. భర్త ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన పిల్లల్ని కూడా తనతో పాటు తీసుకుపోవాలని భావించింది. విషమిచ్చి, తాను ఆత్మహత్య చేసుకుంది. పుట్టింటివారికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. విజయనగరం క్రైం: రైలుప్రమాదంలో భర్త వెంకటేశ్వరరావు గత నెల 19న మృతిచెందాడు. అది తట్టుకోలేని శ్రావణి అనే మహిళ తన ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తాను ఫ్యాన్‌కు తాడుతో ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదాకర సంఘటన విజయనగరం పట్టణంలోని ఎస్.వి.ఎన్. నగర్, వెంకటేశ్వరస్వామి గుడి ఎదురుగా ఉన్న ఇంట్లో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా మందస మండలం మునపాడు గ్రామానికి చెందిన కళింగ వెంకటేశ్వరరావు (35), విజయనగరం పట్టణానికి చెందిన శ్రావణి (27) ప్రేమించుకున్నారు. కులాలువేరైనా తల్లిదండ్రులను ఎదిరించి ఆరేళ్లక్రితం పెళ్లి చేసుకున్నారు. వెంకటేశ్వరరావు తల్లిదండ్రులు కుమారుడు వద్దకు రావడం మానేయగా, శ్రావణి తల్లిదండ్రులు రెండేళ్లపాటు దూరంగా ఉన్నారు. పాప సాయిదర్శిని పుట్టిన తర్వాత శ్రావణి తల్లిదండ్రులు నుదురుపాటి రామకృష్ణ, లక్ష్మిలు కుమార్తె ఇంటికి రాకపోకలు సాగిస్తున్నారు. తరువాత శ్రీనివాసులు అనే బాబు పుట్టాడు. వీరు కాపురం సజావుగా సాగుతుందన్న సమయంలో గత నెల 19న వెంకటేశ్వరావు శ్రీకాకుళం జిల్లా సోంపేట వద్ద రైలు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో అప్పటినుంచి శ్రావణి దిగులుగా ఉంటోంది. దీంతో శ్రావణికి సహాయంగా ఆమె తల్లి లక్ష్మి ఉంటోంది. రామకృష్ణ పట్టణంలోని కంటోన్మెంట్లో నివాసం ఉంటున్నారు. బాలాజీ మార్కెట్లో చిన్న బట్టల షాపును నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం రామకృష్ణ దుకాణాన్ని వెళ్తున్న సమయంలో నాన్న ఒక్కడే కష్టపడుతున్నాడు. నువ్వు కూడా షాపునకు వెళ్లమ్మా అని శ్రావణి తన తల్లి లక్ష్మికి చెప్పింది. దీంతో భార్యాభర్తలు ఇద్దరు దుకాణానికి వెళ్లారు. శుక్రవారం ఉదయం 11గంటల సమయంలో రామకృష్ణ శ్రావణికి ఫోన్‌చేశాడు. అయితే శ్రావణి ఎంతకీ ఫోన్ ఎత్తలేదు. ఫోన్ సెలైంట్‌లో ఉండడం వల్లే ఎత్తడం లేదని భావించాడు. మళ్లీ ఒంటిగంటల సమయంలో ఫోన్‌చేశాడు. అప్పుడూ ఫోన్ ఎత్తలేదు. మూడు గంటల సమయంలో ఫోన్ చేశాడు ఎంతకీ ఫోన్ ఎత్తకపోవడంతో మూడున్నర గంటల సమయంలో ఇంటికివచ్చి తలుపులు తట్టాడు. తలుపులు తీయలేదు. కిటికీ తలుపును తెరచి చూశాడు. శ్రావణి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉంది. వెంటనే ఇంటి పక్కనున్న పూజారికి సమాచారం అందించాడు. ఆయన దారంట పోయే వ్యక్తిని పిలిచి తలుపుగడియను తొలగించి లోపలికి వెళ్లారు. అప్పటికీ శ్రావణి మృతిచెందగా, సోఫాలో ఇద్దరు పిల్లలు జీవశ్ఛవాల్లా పడి ఉన్నారు. వారి నోటి నుంచి నురుగులు వచ్చాయి. పక్కనున్ననోట్ పుస్తకంలో పెన్సిల్‌తో నన్ను క్షమించండి, నాభర్త లేకుండా నేను, నా పిల్లలు ఉండలేము. అందుకే ఇలా చేస్తున్నాను. అందరికీ సెలవు, మీశ్రావణి అని రాసి ఉంది. వెంటనే టూటూన్ పోలీసులకు సమాచారం అందించగా ఎస్ఐలు సీహెచ్.శ్రీధర్, శ్రీరాములు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. విషయం తెలుసుకున్న టూటౌన్ ఇన్ఛార్జ్ సీఐ ఆర్.శ్రీనివాసరావు సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాలను పరిశీలించారు. తల్లిదండ్రులను విచారణ జరిపి, ఆత్మహత్యకు గల కారణాలనుఅడిగితెలుసుకున్నారు. పాప సాయిదర్శిని మొడపై చిన్న మచ్చలు ఉండడంతో పరిశీలించి, అవి సాధారణమచ్చలే భావించారు. శ్రావణి భర్త కోట కూడలి సమీపంలోని ఓ ప్రైవేటు ఇన్సురెన్స్ కంపెనీలో పనిచేస్తూ ఇటీవల జరిగిన రైలు ప్రమాదంలో మృతిచెందాడు నాన్నకు సాయం వెళ్లమని... ఇంతపనిచేస్తుందనుకోలేదు నాన్న కష్టపడుతున్నారు, సాయంగా వెళ్లమంటే వెళ్లాను, ఇంతలోనే ఇంత పనిచేస్తుందని అనుకోలేదు అంటూ శ్రావణి తల్లి లక్ష్మి బోరున విలపించింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదంటే సెలైంట్‌లో ఉందనుకున్నానని ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని ఆమె తండ్రి రామకృష్ణ బోరున విలపించాడు. కుమార్తె ఆత్మహత్య చేసుకోడాన్ని తట్టులేక రామకృష్ణ రోడ్డుమీదే సొమ్మసిల్లి పడిపోయాడు. ముద్దులొలికే పిల్లలు సాయిదర్శిని (4), శ్రీనివాసులు(1) నిర్జీవంగా పడిఉండడాన్ని చూసి చుట్టుపక్కలవారు కన్నీరు పెట్టారు. -
పట్టాలపై దారుణం
తల్లి సహా కూతుళ్లను బలిగొన్న కలహాల కాపురం రైలుకింద పడి బలవన్మరణం మృతులు ఖమ్మం జిల్లా వాసులు మహబూబాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో దారుణం భర్త వేధింపులు ఆ ఇల్లాలిని కుంగదీశారుు. పన్నెండేళ్ల సంసారంలో సంతోషంగా ఉన్నది తక్కువే. భర్త రోజూ తాగొచ్చి వేధించినా.. ఆమె భరించింది. ఊరు నిండా అప్పులు చేసినా కూలోనాలో చేసి తీర్చింది. అరుునా అతడిలో మార్పు రాకపోగా.. రెండు రోజులుగా చిత్రహింసలకు గురిచేస్తుండడంతో విసిగి వేసారింది. పాఠశాల నుంచి తన ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకుని పుట్టెడు దుఃఖంతో రైలు పట్టాలపైకి చేరుకుంది. పిల్లలతో సహా రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడి కానరాని లోకాలకు చేరింది. మహబూబాబాద్‌లో శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఘటనతో మృతుల స్వగ్రామమైన ఖమ్మం జిల్లా చొప్పకట్లపాలెం, ప్రస్తుతం నివాసముంటున్న టేకులపల్లిలో విషాదాన్ని నింపింది. మహబూబాబాద్/ఖమ్మం అర్బన్ : తాగుబోతు భర్త వేధింపులు భార్య, పిల్లలను బలిగొన్నాయి. మానుకోటలో జరిగిన ఈ దారుణం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట గ్రామం జగ్గవరం కాలనీకి చెందిన తూము నాగమణి, గంగాధరం దంపతుల కుమార్తె శ్రావణి(28)కి అదే జిల్లా బోనకల్ మండలం చొప్పకట్లపాలెం గ్రామానికి చెందిన బొగ్గవరపు ఆంజనేయులుతో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమార్తెలు అమూల్య(11), జీవణి(9) ఉన్నారు. మద్యానికి బానిసైన ఆంజనేయులు భార్యపై అనుమానంతో నిత్యం వేధించేవాడు. దీంతో మూడేళ్లుగా ఆమె తన పిల్లలతో కలిసి భర్తకు దూరంగా ఉంటోంది. మూడు నెలల క్రితమే పెద్దమనుషులు ఎదుట తాను మారానని, తాగుడు మానానని ఒప్పుకుని భార్య, పిల్లలను తీసుకెళ్లాడు. ప్రస్తుతం వారు ఖమ్మం శివారు టేకులపల్లిలో శ్రీలక్ష్మినగర్ రోడ్డు నంబర్ 4లో నివాసముంటున్నారు. శ్రావణి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుండగా, ఆంజనేయులు ఖమ్మం శివారులోని క్వారీలో కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 11న తాగొచ్చి ఆమెను విచక్షణారహితంగా కొట్టాడు. రెండు రోజులుగా అలాగే కొడుతుండడం తో ఓపిక నశించిన శ్రావణి శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయల్దేరింది. ఖమ్మం రోటరీనగర్‌లో ఉంటున్న తన అక్క దగ్గరికి వెళుతున్నట్లు ఇంటి పక్కవారికి చెప్పి తన కుమార్తెలు చదువుతున్న కస్తూర్భా స్కూల్‌కు చేరుకుంది. వారితో పని ఉందని వెంటబెట్టుకుని బయల్దేరింది. అల్లుడు రోజూ కొడుతున్నాడని తెలియడంతో కూతురిని చూసేందుకు నాగమణి శుక్రవారం సాయంత్రం శ్రావణి ఉండే ఇంటికి వెళ్లగా ఇంట్లో సూసైడ్ నోట్ లభించింది. దీంతో ఆందోళనకు గురైన ఆమె తన కుమారులతో కలిసి వెళ్లి రాత్రి రాత్రి 9 గంటలకు ఖమ్మం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, బంధువులు సమీపంలోని సాగర్ కాల్వ, పరిసర ప్రాంతాల్లో గాలించినా జాడ తెలియలేదు. ఆమె వాడుతున్న సెల్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు ఆరా తీయగా నగరంలోని బస్టాండ్ సమీపంలో ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత అచూకీ లభించలేదు. ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి దాటాక మహబూబాబాద్ వద్ద రైలు కిందపడి తల్లి ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడిన వార్త టీవీల్లో శనివారం ఉదయం రావడం చూసి ఖమ్మం అర్బన్ ఎస్సై రుద్రగాని వెంకటనారాయణ వెంటనే మహబూబాబాద్ పోలీసులకు సమాచారమిచ్చా రు. అదృశ్యమైన తల్లీకూతుళ్ల ఫొటోలు పంపారు. వాటిని పరిశీలించిన మానుకోట పోలీసులు మృతులు వారేనని నిర్ధారించారు. దీంతో సమాచారం అందుకున్న మృతుల బంధువులు మహబూబాబాద్‌కు చేరుకున్నారు. విగతజీవులుగా పడి ఉన్న కూతురు, మనవరాళ్లను చూడగానే నాగమణి రోదించిన తీరు చూసి స్థానికులు కన్నీరుమున్నీరయ్యూరు. మహబూబాబాద్‌లో నమోదైన కేసు ను ఖమ్మం అర్బన్‌కు బదిలీ చేశాక ఆత్మహత్యకు కారణమైన శ్రావణి భర్త, అతడి బంధువులపై విచారణ చేసి చర్య తీసుకుంటామని ఎస్సై తెలిపారు.