
భర్త ఎడబాటు భరించలేక..
ఇద్దరు పిల్లలకు విషమిచ్చి... ఆత్మహత్యచే సుకున్న మహిళ
భర్త మృతిచెందిన కొద్ది రోజులకే.. భార్యాపిల్లలు మృతి
ఎంత క్షోభ అనుభవించిందో... ఆ తల్లి కడుపున పుట్టిన పిల్లలకే విషమిచ్చింది. భర్త ఎడబాటును తట్టుకోలేక తాను వెళ్లిపోతూ పిల్లలనూ తీసుకెళ్లిపోయింది. ముద్దులొలికే పసి పాపలను చేతులారా చంపేసుకుంది. మరోవైపు కన్నబిడ్డలా పెంచిన పంట తుపాను బారిన పడి నాశనం కావడం, ప్రభుత్వ సాయం అందకపోవడంతో ఓ యువ రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల ఉరి కొయ్యకు బలయ్యాడు. కష్టాలను ఎదుర్కోలేక, విధిని జయించలేక వీరు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు వారి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చాయి.
వారిద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. కులాలు వేరైనా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా ముద్దులొలికే ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆనందమయంగా సాగుతున్నవారి జీవితంతో విధి ఆడుకుంది. ఒక్కసారిగా విషాదాన్ని నింపింది. తన ఆరో ప్రాణమైన భర్త రైలు ప్రమాదంలో మృతి చెందడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ప్రాణాధికంగా ప్రేమించిన భర్తలేని జీవితం తనకు వద్దనుకుంది. భర్త ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన పిల్లల్ని కూడా తనతో పాటు తీసుకుపోవాలని భావించింది. విషమిచ్చి, తాను ఆత్మహత్య చేసుకుంది. పుట్టింటివారికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది.
విజయనగరం క్రైం: రైలుప్రమాదంలో భర్త వెంకటేశ్వరరావు గత నెల 19న మృతిచెందాడు. అది తట్టుకోలేని శ్రావణి అనే మహిళ తన ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తాను ఫ్యాన్‌కు తాడుతో ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదాకర సంఘటన విజయనగరం పట్టణంలోని ఎస్.వి.ఎన్. నగర్, వెంకటేశ్వరస్వామి గుడి ఎదురుగా ఉన్న ఇంట్లో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా మందస మండలం మునపాడు గ్రామానికి చెందిన కళింగ వెంకటేశ్వరరావు (35), విజయనగరం పట్టణానికి చెందిన శ్రావణి (27) ప్రేమించుకున్నారు. కులాలువేరైనా తల్లిదండ్రులను ఎదిరించి ఆరేళ్లక్రితం పెళ్లి చేసుకున్నారు. వెంకటేశ్వరరావు తల్లిదండ్రులు కుమారుడు వద్దకు రావడం మానేయగా, శ్రావణి తల్లిదండ్రులు రెండేళ్లపాటు దూరంగా ఉన్నారు. పాప సాయిదర్శిని పుట్టిన తర్వాత శ్రావణి తల్లిదండ్రులు నుదురుపాటి రామకృష్ణ, లక్ష్మిలు కుమార్తె ఇంటికి రాకపోకలు సాగిస్తున్నారు. తరువాత శ్రీనివాసులు అనే బాబు పుట్టాడు. వీరు కాపురం సజావుగా సాగుతుందన్న సమయంలో గత నెల 19న వెంకటేశ్వరావు శ్రీకాకుళం జిల్లా సోంపేట వద్ద రైలు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో అప్పటినుంచి శ్రావణి దిగులుగా ఉంటోంది. దీంతో శ్రావణికి సహాయంగా ఆమె తల్లి లక్ష్మి ఉంటోంది. రామకృష్ణ పట్టణంలోని కంటోన్మెంట్‌లో నివాసం ఉంటున్నారు. బాలాజీ మార్కెట్‌లో చిన్న బట్టల షాపును నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం రామకృష్ణ దుకాణాన్ని వెళ్తున్న సమయంలో నాన్న ఒక్కడే కష్టపడుతున్నాడు. నువ్వు కూడా షాపునకు వెళ్లమ్మా అని శ్రావణి తన తల్లి లక్ష్మికి చెప్పింది. దీంతో భార్యాభర్తలు ఇద్దరు దుకాణానికి వెళ్లారు. శుక్రవారం ఉదయం 11గంటల సమయంలో రామకృష్ణ శ్రావణికి ఫోన్‌చేశాడు. అయితే శ్రావణి ఎంతకీ ఫోన్ ఎత్తలేదు. ఫోన్ సెలైంట్‌లో ఉండడం వల్లే ఎత్తడం లేదని భావించాడు. మళ్లీ ఒంటిగంటల సమయంలో ఫోన్‌చేశాడు. అప్పుడూ ఫోన్ ఎత్తలేదు. మూడు గంటల సమయంలో ఫోన్ చేశాడు ఎంతకీ ఫోన్ ఎత్తకపోవడంతో మూడున్నర గంటల సమయంలో ఇంటికివచ్చి తలుపులు తట్టాడు. తలుపులు తీయలేదు. కిటికీ తలుపును తెరచి చూశాడు. శ్రావణి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉంది. వెంటనే ఇంటి పక్కనున్న పూజారికి సమాచారం అందించాడు.
ఆయన దారంట పోయే వ్యక్తిని పిలిచి తలుపుగడియను తొలగించి లోపలికి వెళ్లారు. అప్పటికీ శ్రావణి మృతిచెందగా, సోఫాలో ఇద్దరు పిల్లలు జీవశ్ఛవాల్లా పడి ఉన్నారు. వారి నోటి నుంచి నురుగులు వచ్చాయి. పక్కనున్ననోట్ పుస్తకంలో పెన్సిల్‌తో నన్ను క్షమించండి, నాభర్త లేకుండా నేను, నా పిల్లలు ఉండలేము. అందుకే ఇలా చేస్తున్నాను. అందరికీ సెలవు, మీశ్రావణి అని రాసి ఉంది. వెంటనే టూటూన్ పోలీసులకు సమాచారం అందించగా ఎస్‌ఐలు సీహెచ్.శ్రీధర్, శ్రీరాములు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. విషయం తెలుసుకున్న టూటౌన్ ఇన్‌ఛార్జ్ సీఐ ఆర్.శ్రీనివాసరావు సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాలను పరిశీలించారు. తల్లిదండ్రులను విచారణ జరిపి, ఆత్మహత్యకు గల కారణాలనుఅడిగితెలుసుకున్నారు. పాప సాయిదర్శిని మొడపై చిన్న మచ్చలు ఉండడంతో పరిశీలించి, అవి సాధారణమచ్చలే భావించారు. శ్రావణి భర్త కోట కూడలి సమీపంలోని ఓ ప్రైవేటు ఇన్సురెన్స్ కంపెనీలో పనిచేస్తూ ఇటీవల జరిగిన రైలు ప్రమాదంలో మృతిచెందాడు
నాన్నకు సాయం వెళ్లమని... ఇంతపనిచేస్తుందనుకోలేదు
నాన్న కష్టపడుతున్నారు, సాయంగా వెళ్లమంటే వెళ్లాను, ఇంతలోనే ఇంత పనిచేస్తుందని అనుకోలేదు అంటూ శ్రావణి తల్లి లక్ష్మి బోరున విలపించింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదంటే సెలైంట్‌లో ఉందనుకున్నానని ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని ఆమె తండ్రి రామకృష్ణ బోరున విలపించాడు. కుమార్తె ఆత్మహత్య చేసుకోడాన్ని తట్టులేక రామకృష్ణ రోడ్డుమీదే సొమ్మసిల్లి పడిపోయాడు. ముద్దులొలికే పిల్లలు సాయిదర్శిని (4), శ్రీనివాసులు(1) నిర్జీవంగా పడిఉండడాన్ని చూసి చుట్టుపక్కలవారు కన్నీరు పెట్టారు.