'నా కూతురు నా మాట వినడం లేదు మహాప్రభో'
కరవ మంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి పరిస్థితి. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే నామినేషన్ పత్రాలు ఉపసంహరించుకోవాలని పాల్వాయి ... తన కుమార్తె స్రవంతికి సూచించారు. అందుకు ఆమె ససేమిరా అంది. ఇంకే చేస్తాంమంటూ పాపం పాల్వాయి దగ్గరుండి తన కుమార్తె చేత శనివారం నామినేషన్ దాఖలు చేయించారు. ఆ విషయం కాస్తా కేంద్రమంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్‌కు తెలిసింది.
అంతే పాల్వాయి గోవర్థన్పై జైరాం రమేష్ నిప్పులు తొక్కారు. నామినేషన్ ఉపసహంరింప చేయాలంటూ ఇంటికెళ్లి మరీ ఆదేశించారు. తన కుమార్తె తన మాట వినడం లేదు మహాప్రభో అంటూ పాల్వాయి గోవర్ధన్ కన్నీటీ పర్యంతమైయ్యారు. దాంతో జైరాం తిక్క రేగింది. కాంగ్రెస్ పార్టీ నిన్ను రాజ్యసభకు పంపిస్తే ఇంత పని చేస్తావా అంటూ పాల్వాయికి జైరాం తలంటాడు. అంతేకాకుండా కన్న కూతురుకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని పాల్వాయిని జైరాం రమేష్ ఆదేశించారు. మునగొడు ఎమ్మెల్యే టికెట్ పాల్వాయి గోవర్థన్ రెడ్డి ... తన కుమార్తె స్రవంతికి కాంగ్రెస్ అధిష్టానం కేటాయిస్తుందని ఆశించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం పాల్వాయి ఆశలుపై నీళ్లు చల్లింది. ఇంకేముంది స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతానని స్రవంతి తన తండ్రికి బల్లగుద్ది చెప్పింది. దాంతో పాల్వాయి తన కుమార్తె నామినేషన్ దగ్గరుండి మరీ వేయించారు.