sree matam
-
ఫ్లెక్సీల ఏర్పాటుపై ఆలయాల మధ్య గొడవ
సాక్షి, మంత్రాలయం : అత్యుత్సాహమో.. అనాలోచితమో తెలియదుగానీ ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో శ్రీమఠం, ఆదోని మహాయోగి లక్ష్మమ్మవ్వ ఆలయం మధ్య వార్ నడుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఆరాధన వేడుకల మునుపు స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహం ప్రాంగణంలో ఇనుప బోర్డుపై ఆదోని మహాయోగి లక్ష్మమ్మవ్వ ఫ్లెక్సీ ప్రదర్శించారు. శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా అవ్వ ఫ్లెక్సీని తొలగించి రాములోరి, పీఠాధిపతుల ఫ్లెక్సీ వేశారు. ఉత్సవాలు ముగియడంతో భక్తులు అవ్వ ఫ్లెక్సీ తెచ్చి గురువారం పాత బోర్డుపై అతికించారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు సన్నిహితుడు గోరుకల్లు కృష్ణస్వామి చూసి ఏర్పాటును అడ్డుకున్నారు. ఇరువురు మధ్య కాసేపు చర్చలు జరిగాయి. అంతటితో ఆగకుండా శ్రీమఠం వారు రాత్రికి రాత్రి ఆ ఫ్లెక్సీని తొలగించేశారు. ఉదయానికంతా రాములోరి, పీఠాధిపతి ఫ్లెక్సీని ప్రదర్శించి రంగులు సైతం అద్దారు. ఈ క్రమంలో ఇరు ఆలయాల మధ్య కాసింత రగడ మొదలైంది. ఎవరికైనా దేవుళ్లు సమానమే. దీనికి విరుద్ధంగా శ్రీమఠం కొత్త సంప్రదాయానికి తెరతీయడంపై స్థానికులు విస్తుపోతున్నారు. ఈ గొడవ ఎక్కడికి దారి తీస్తుందోనని మంత్రాలయంలో చర్చసాగుతోంది.. -
శ్రీమఠంలో ప్రముఖులు
మంత్రాలయం: కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీమఠాన్ని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించు కున్నారు. కింగ్ ఫిషర్ అధినేత విజయమాల్యా, తమిళనాడు పశుసంవర్థక శాఖా మంత్రి చిన్నయ్య కుటుంబసభ్యులతో కలిసి శ్రీమఠాన్ని దర్శించుకున్నారు. మందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీరాఘవేంద్ర స్వామి మూల బృందావనంను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి ఘనంగా స్వాగతం పలికారు. స్వామి వారి మెమెంటో ఇచ్చి సత్కరించారు. ఇదే సమయంలో మఠానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆలయ అభివృద్ధికి రూ.లక్ష విరాళం అందించారు. -
రాఘవేంద్రుని సన్నిధిలో ఆప్కాబ్ చైర్మన్
మంత్రాలయం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు(ఆప్కాబ్) చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు గురువారం ఉదయం మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. సతీ సమేతంగా మంత్రాలయం చేరుకున్న ఆయన ముందుగా గ్రామ దేవతలకు పూజలు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా శ్రీమఠం అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. -
శ్రీమఠం వసతిగృహంలో చోరీ
కర్నూలు: మంత్రాలయంలోని శ్రీమఠం వసతి గృహంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. వివరాలు..మహబూబ్నగర్ జిల్లా మక్తల్ మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన రామచంద్రయ్య గౌడ్, నర్సింహులు కుటుంబసభ్యులతో కలిసి గురువారం శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకోవడానికి వచ్చారు. దర్శించుకున్న తర్వాత అదే రోజు రాత్రి శ్రీమఠం వసతి గృహంలో కుటుంబసభ్యులతో కలిసి బస చేశారు. నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వారి వద్ద నుంచి 8 తులాల బంగారాన్ని, ఓ సెల్ఫోన్ను తస్కరించారు. ఉదయాన్నే చోరీ జరిగిన విషయాన్ని తెలుసుకున్న బాధితులు మంత్రాలయం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుల నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీ మఠం భూముల వేలం
మంత్రాలయం: కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ మఠానికి చెందిన భూముల వేలం సోమవారం ఉదయం ప్రారంభమైంది. మఠానికి చెందిన భూములు అన్యాక్రాంతం అవుతుండడంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఈ వేలం జరుగుతోంది. 236.44 ఎకరాలను వేలం వేస్తున్నారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గాయత్రీ దేవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.