Sri Krishna temple
-
పులివెందులలో శ్రీకృష్ణుడి ఆలయం ప్రారంభంలో సీఎం జగన్
-
Jasna Salim: ఆమె గీసిన కృష్ణుడు
ముళ్లపూడి వెంకటరమణ రాసిన ‘కానుక’కథ లో ఒక నిరుపేద గ్రామీణుడు కృష్ణుడికి కానుక ఇవ్వాలని వందలాది వేణువులు తయారు చేస్తాడు. కేరళకు చెందిన జస్నా సలీమ్ కృష్ణునికి కానుక ఇవ్వాలని వందలాది బొమ్మలు గీస్తోంది. ఆరేళ్ల పాటు ఆమె సాగించిన కళార్చన ఇప్పుడు ఫలితం పొందింది. ఇక మీదట ఆ గుడిలో ఒక ముస్లిం మహిళ గీసిన బొమ్మ కూడా మూలవిరాట్టుతో పాటు పూజలందుకోనుంది. సెప్టెంబర్ 27, సోమవారం కేరళ కోజికోడ్ సమీపంలో ఉన్న పండలం అనే గ్రామంలోని ‘ఉలనాడు శ్రీకృష్ణ స్వామి దేవళం’లో 28 ఏళ్ల జస్నా తన ఇద్దరు కుమార్తెలతో ప్రవేశించింది. ఆమె శిరస్సు చుట్టు ముఖం కనిపించేలా బురఖా ఉంది. ఆమె చేతుల్లో వస్త్రంలో చుట్టిన ఒక ఫ్రేమ్ ఉంది. ఆ గుడిలోని పూజారులు ఆమెకు ఎదురు వచ్చారు. ఆమె చేతుల్లోని ఫ్రేమ్‌ను భక్తిగా అందుకున్నారు. దాని మీద వస్త్రాన్ని తొలగించారు. అది గాజు అద్దంపై గీసిన బాలకృష్ణుడి బొమ్మ. వెన్న తింటున్న కృష్ణుడి బొమ్మ. ఆ బొమ్మను గర్భగుడి ఎదురుగా పీఠం మీద ఉంచి తులసిమాల ధరింపచేశారు. ఆ తర్వాత ఆ పటానికి పూజ చేశారు. అంతటితో జస్నా కల ఒకటి నెరవేరింది. గత ఆరేళ్లుగా ఆమె కృష్ణుడి బొమ్మను దేవుడి గుడిలో ఉంచాలని ఆశిస్తోంది. ఇప్పుడు నెరవేరింది. ముస్లిం మహిళ గీసిన కృష్ణుడి బొమ్మ ఇకపై పండలంలోని కృష్ణుడి గుడిలో పూజలు అందుకోనుంది. ఈ దేశంలో హిందూ ముస్లిం సామరస్యం శతాబ్దాలుగా ఉంది. ఇటువంటి స్పందనలు ఆ సామరస్యాన్ని చాటి చెబుతున్నాయని ఈ ఉదంతం చూసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక్కటే బొమ్మ జస్నా సలీమ్ ప్రొఫెషనల్ పెయింటర్ కాదు. ఆమె బొమ్మలు వేయడం నేర్చుకోలేదు. కాని బొమ్మలంటే ఆసక్తి. చిన్నప్పుడు కొన్ని బొమ్మలు గీసింది. కాలక్రమంలో ఆమెకు సలీంతో పెళ్లయ్యింది. ఇద్దరు కుమార్తెలు జన్మించారు. సలీం దుబయ్‌లో కొన్నాళ్లు పెయింటర్‌గా పని చేసి తిరిగి వచ్చి ఇళ్లకు పెయింటింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరేళ్ల క్రితం జస్నాకు బొమ్మలు గీయాలనిపించింది. వాటిని అమ్మితే వేణ్ణీళ్లకు చన్నీళ్లులా ఉపయోగపడతాయనిపించింది. ‘నన్ను ఇంట్లో చిన్నప్పుడు ‘కన్నా’ అని పిలిచేవారు. ముస్లింల ఇళ్లల్లో కన్నా అని పిలువరు. అది కృష్ణుడి పేరు. కాని ఎందుకో నాకు అలా అలవాటైపోయింది. నేను బొమ్మలు వేయాలనుకున్నప్పుడు నాకు కృష్ణుడి బొమ్మే గుర్తుకు వచ్చింది. వెన్న తినే బాలకృష్ణుడి బొమ్మ నాకు చాలా ఇష్టం. దానిని చూస్తే మనసుకు ఎంతో బాగనిపిస్తుంది. అందుకే వెన్న తినే కృష్ణుడి బొమ్మను వేశాను. మొదటి బొమ్మను నా హిందూ మిత్రురాలికి ఇచ్చాను. వారు దానిని పూజ గదిలో పెట్టుకుంటే నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను రకరకాల కృష్ణుని బొమ్మలు వేయగలను కాని నాకు బాగా కుదిరేది వెన్న తినే కృష్ణుడి బొమ్మే. అదే పదే పదే వేస్తాను. దానిని జనం నా దగ్గర కొనుక్కుని వెళతారు’ అంటుంది జస్నా. తను గీసిన కృష్ణుడి బొమ్మతో జస్నా కొనేవారు.. అనేవారు 2015లో బొమ్మలు వేయడం మొదలెట్టిన జస్నా 2016లో కోజికోడ్‌లో తన కృష్ణుడి బొమ్మలతో ఎగ్జిబిషన్ పెట్టింది. అందరూ ముస్లిం మహిళ వేసిన ఆ బొమ్మలను కుతూహలంతో చూశారు. చాలామంది వాటిని కొన్నారు. ‘మీకు ఎటువంటి ప్రతిఘటన ఎదురు కాలేదా?’ అని అడిగితే ‘నా భర్త తరఫు వారు ఒక దేవళం సమీపంలోని ఇంట్లో పెరిగారు. వారికి హిందూ సంప్రదాయాలు తెలుసు. నేను కృష్ణుడి బొమ్మ వేయాలనుకున్నప్పుడు ‘అన్ని మతాలు మంచివే’ అని వారు అన్నారు. కాని మా పుట్టిల్లు ఉండేది ముస్లింల ఇలాకాలో. వారికి ఈ విషయం తెలిసినప్పుడు కొందరు అభ్యంతరం చెప్పారు. అయితే మా నాన్న నాకు మద్దతుగా నిలబడ్డాడు. అల్లా నన్ను ఈ భూమి మీదకు తెచ్చాడు. నా ఇస్లాం సాధన నేను కొనసాగిస్తాను. ఐదు పూట్ల నమాజు చేసుకుంటాను. అది కాని సమయంలో బొమ్మలు వేస్తాను. బొమ్మలు వేసే శక్తి కూడా నాకు అల్లా ఇచ్చాడు. నేను వేసే బొమ్మ కోట్ల మంది ఆరాధ్యదైవం. అంతవరకే మనం దీనిని చూడాలి. నాకు అడ్డు చెప్పేవారికి నేను ఒకటే చెప్పాను– నేను ఈ బొమ్మలు వేయకూడదంటే అల్లా నాకు ఈ కళ ఇచ్చి ఉండేవాడు కదా అని. వాళ్లు ఆ తర్వాత ఏమీ మాట్లాడలేదు’ అంటుంది జస్నా. గుడిలో బొమ్మ కృష్ణుడి బొమ్మలు వేస్తున్నప్పటి నుంచి ఆమె బొమ్మ చాలా మందికి సెంటిమెంట్‌గా మారింది. చాలామంది వాటిని కొనుక్కుంటున్నారు. ఒక్కో బొమ్మ మూడు వేల నుంచి ఐదు వేల వరకూ ఉంటుంది. అయితే తాను వేసే ఒక్క బొమ్మ అయినా గుడిలో ఉంటే బాగుంటుందని జస్నా అనుకుంది. అందుకు చాలా సమయం పట్టింది. ఆమె బొమ్మను గుడికి ఇవ్వాలనుకున్నప్పుడు కొంత మంది భక్తులు వచ్చి ఆ బొమ్మను పరిశీలించి అంగీకరించారు. గుడి నిర్వాహకులు ఆహ్వానించారు. దాంతో ముస్లిం మహిళ జస్నా తన కళను ఒక సామరస్య చిహ్నంగా మార్చగలిగింది. ఆమెను చాలా మంది అభినందిస్తున్నారు. -
భక్తులతో కిటకిట లాడుతున్న శ్రీ కృష్ణ ఆలయాలు
-
‘ఆ వివాదం మళ్లీ తెరపైకి తెచ్చారు’
సాక్షి, హైదరాబాద్ : శ్రీకృష్ణ జన్మభూమి వివాదాన్ని మళ్లీ తెరపైకి తేవడం పట్ల ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ జన్మస్ధాన్ సేవా సంఘ్, షాహి ఈద్గా ట్రస్ట్ మధ్య తలెత్తిన వివాదం 1968లో పరిష్కారమైందని, ఈ అంశాన్ని మళ్లీ లేవనెత్తాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రార్థనా స్ధలాల చట్టం 1991 ప్రార్ధనా స్థలాల మార్పిడిని నిరోధిస్తుందని, ఈ చట్టం అమలు బాధ్యత హోంమంత్రిత్వ శాఖకు అప్పగించారని, దీనిపై కోర్టులో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందని ఓవైసీ ప్రశ్నించారు. 1968 అక్టోబర్‌లో శ్రీకృష్ణ జనమ్మభూమి వివాదం పరిష్కారం కాగా మళ్లీ ఈ అంశాన్ని ఎందుకు తెరపైకి తెస్తున్నారని ఆయన నిలదీశారు. కాగా మధుర సివిల్ కోర్టులో అడ్వకేట్ విష్ణు జైన్ ఈ అంశంపై దావా వేశారు. మధురలోని వివాదాస్పద భూమిలో ప్రతి అంగుళం శ్రీకృష్ణ భగవానుడి భక్తులకు, హిందువులకు పవిత్రమైనదని జైన్ పేర్కొన్నారు.కృష్ణ జన్మభూమిలోని మొత్తం 13.37 ఎకరాలను అప్పగించాలని, 1968లో కుదిరిన రాజీ ఫార్ములాకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని వెల్లడించాలని కోరారు. షాహి ఈద్గా మసీదును తొలగించాలని దావాలో పొందుపరిచారు. మొగల్ రాజు ఔరంగజేబు మధురలోని కృష్ణ ఆలయాన్ని కూల్చివేశారని దావా ఆరోపించింది. చదవండి : సర్వ మతాలకూ సమ ప్రాధాన్యం -
అద్భుత స్తూపం... అందులో 'గీత'
మహాభూతాని అహంకారో బుద్ధిహిర్ అవ్యక్తం ఏవచ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరః శ్రీమద్భగవద్గీతలో చెప్పిన ఈ శ్లోకం పరమార్థాన్ని గ్రహిస్తే ఇలాంటి కార్చిచ్చులే కాదు, మనిషి–మనిషికి మధ్య అభిప్రాయ భేదాలూ పొడచూపవు. ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని, తోటివారూ తనలాంటి వారే అన్న భావనను ఒంటి పట్టించుకుంటే చాలు, ప్రపంచం ఆనందాల పొదరిల్లులా ఆహ్లాదంగా మారిపోవటం ఖాయం. ప్రపంచంలో తొలి మనోవికాస గ్రంథంగా భావించే భగవద్గీత సారాన్ని విశ్వవ్యాప్తం చేయటమే దీనికి మార్గం అంటున్నారు గట్టు వేణుగోపాలచార్యులు. అందుకే ఆయన ఆధ్వర్యంలో తొలి గీతాస్తూపం అమెరికాలో ఏర్పాటైంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అర్కాన్సాస్ రాష్ట్రం లో వాల్‌మార్ట్ హెడ్‌క్వార్టర్‌గా ఉన్న బెంటన్‌విల్‌లోని శ్రీకృష్ణ దేవాలయం ఆవరణలో ఈ అద్భుతస్తూపం భారతకాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి ఆవిష్కృతమైంది. స్తూపాలు కావాలంటూ 20 దేశాల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి. ప్రపంచం లోనే తొలి గీతాస్తూపంగా ఏర్పడ్డ ఆ నిర్మాణ రూపకర్త గట్టు వేణుగోపాలాచార్యులు మన తెలంగాణవాసి కావటం విశేషం. ఏముంది అందులో... శంఖుచక్రాలతో ప్రశాంతచిత్తంతో కొలువుదీరిన చతు ర్భుజ శ్రీమహావిష్ణువు నల్లరాతి విగ్రహంగా ప్రశాంతచిత్తంతో నిలుచున్న రూపం... దాని చుట్టూ ఎత్తయిన భారీ ప్యానల్స్... ఒక్కో ప్యానెల్‌పై గీతలోని అధ్యాయాలు.. వాటిల్లో శ్లోకాలు.. తాత్పర్యాలు. అలా 700 శ్లోకాలు ఆ ప్యానెల్స్‌పై ఆంగ్లం, హిందీల్లో కొలువుదీరాయి. వాటి అర్థం దిగువనే ఉంటుంది. పంచభూతాలమయమైన శరీరం, అదే పంచభూతాలతో నిండిన ప్రకృతితో మసలడం, సౌభ్రాతృత్వం, విశ్వశాంతి, సమానత్వం, ఆనందం... ఇలా మానవ జీవన సౌందర్యాన్ని సాక్షాత్కరించే జీవన విధానానికి మార్గదర్శనం చేస్తుందనేది ఆ స్తూపాన్ని చూసిన వారి భావన. దాని ఎదుట ఉండే కంప్యూటరైజ్ట్ సిస్టం ముందుగా సందర్శకులకు ఓ టోకెన్ జారీ చేస్తుంది. దానిపై భగవద్గీత అధ్యాయం, శ్లోకం సంఖ్య ఉం టాయి. అది తీసుకుని సరిగ్గా ఆ ప్యానెల్‌లోని ఆ శ్లోకం వద్దకు వెళ్లి దాన్ని చదవాలి. ఆ సమయంలో ఉన్న మానసిక స్థితిని– ఆ శ్లోకంలోని నిగూఢార్థాన్ని బేరీజు వేసుకుని అది తనకు మార్గ నిర్దేశనం చేస్తుందో పరిశీలించాలి. రూపకర్త మనవాడే.... జనగామ జిల్లా జీడికల్‌కు చెందిన గట్టు వేణుగోపాలా చార్యులు బెంటన్‌విల్ శ్రీకృష్ణ దేవాలయ ప్రధాన అర్చకులు. ఆయన తండ్రి గట్టు వెంకటాచారి ఉపాధ్యాయ వృత్తిలో దాదాపు దశాబ్దన్నరపాటు సిద్దిపేట జిల్లా అయినాపూర్‌లో పనిచేయటంతో వేణుగోపాలాచార్యులు పాఠశాల విద్య అక్కడేసాగింది. ఉన్నవిద్య పూర్తిచేసి చిన జీయర్‌స్వామి సమక్షంలో వేదాధ్యయనం ముగించి అమెరికాలో ఆధ్యాత్మక భావనలు వ్యాప్తించేందుకు వెళ్లారు. మాతృభూమిపై మమకారంతో.. ఇప్పుడు మాతృభూమిపై మమకారంతో ఇక్కడి గ్రామాల్లో కూడా భగవద్గీత సారాన్ని పంచటం ద్వారా జీవిత గమనంలో ఒత్తిడిని దూరం చేసి ప్రశాంతంగా ఉండే మార్గాన్ని కల్పించాలని నిర్ణయించినట్టు వేణుగోపాలాచార్యులు పేర్కొంటున్నారు. వచ్చే నెల 12– 20 మధ్య సిద్దిపేట జిల్లా చేర్యాల, అయినాపూర్, తిరుమలలో గీతా హోమాలను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. – సాక్షి, హైదరాబాద్ -
హిందూ ఆలయంపై పాక్ సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : దాయాది దేశం పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం అక్కడి హిందువులను షాక్‌తో పాటు, ఒకింత ఆనందానికి గురిచేసింది. పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం రావల్పిండిలోని శ్రీకృష్ణుడి ఆలయ అభివృద్ధికి దాదాపు 20 మిలియన్ల రూపాయలు కేటాయించి అందరిని ఆశ్చర్యపరిచింది. రావల్పిండి, ఇస్లామాబాద్ జంటనగరాల్లో మనుగడలో ఉన్న పురాతన శ్రీకృష్ణుడి ఆలయం ఇది ఒక్కటే. ప్రావిన్స్ అసెంబ్లీలో హిందూ సభ్యుడి సిఫార్సు మేరకు ఈ నిధులు మంజూరు చేసినట్లు అదనపు పరిపాలనాధికారి మహ్మద్ ఆసిఫ్ తెలిపారు. నూతన ఆలయ నిర్మాణం పూర్తైయ్యంత వరకూ విగ్రహాలను భద్రపరుస్తామని ఆసిఫ్ పేర్కొన్నారు. 1897లో కంజీమాల్, రామ్ రచ్‌పాల్ అనే ఇద్దరు ఈ గుడిని నిర్మించారు. 1970లో పాక్ ప్రభుత్వ పరిధిలోకి వచ్చే ట్రస్టు ప్రాపర్టీ బోర్డు పరిధిలోకి ఈ ఆలయం వెళ్లింది. ఇక్కడ ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం ఈ దేవాలయంలో పూజలు జరుగుతుంటాయి. ఈ గుడికి సంబంధించిన ప్రాంత పరిధిని పెంచాలని స్థానిక హిందువులు గత కొంత కాలంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్న నేపథ్యంలో పాక్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ అభివృద్ధికి త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం గుడి కనీసం 100 మంది భక్తులకు కూడా సౌకర్యాలు కల్పించలేని స్థితిలో ఉందని, దాన్ని విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ నిధులతో మరమ్మత్తులు చేయించాక.. వివిధ పండగలప్పుడు మరింతమంది హిందువులు వచ్చి పూజలు చేసుకొనేందుకు పాక్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు అక్కడి మీడియా తెలిపింది. -
గురువాయూరు శ్రీకృష్ణ దేవాలయం పేల్చేస్తాం
గురువాయూరు: కేరళ గురువాయూరులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకృష్ణ దేవాలయం. ఈ దేవాలయాన్ని 24 గంటలలో పేల్చివేస్తామని ఆగంతకులు మంగళవారం ఫోన్ చేసి దేవాలయ సిబ్బందిని బెదిరించారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. దేవాలయంతోపాటు పరిసర ప్రాంతాలను బాంబు స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. అలాగే ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలు భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. ఫోన్ కాల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. బెదిరింపు ఫోన్ కాల్ ఖతార్ నుంచి వచ్చినట్లు గుర్తించామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వాసికెక్కిన గురువాయూరు శ్రీకృష్ణ దేవాలయాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారన్న విషయం విదితమే.