సాక్షి, హైదరాబాద్ : దాయాది దేశం పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం అక్కడి హిందువులను షాక్‌తో పాటు, ఒకింత ఆనందానికి గురిచేసింది. పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం రావల్పిండిలోని శ్రీకృష్ణుడి ఆలయ అభివృద్ధికి దాదాపు 20 మిలియన్ల రూపాయలు కేటాయించి అందరిని ఆశ్చర్యపరిచింది. రావల్పిండి, ఇస్లామాబాద్ జంటనగరాల్లో మనుగడలో ఉన్న పురాతన శ్రీకృష్ణుడి ఆలయం ఇది ఒక్కటే. ప్రావిన్స్ అసెంబ్లీలో హిందూ సభ్యుడి సిఫార్సు మేరకు ఈ నిధులు మంజూరు చేసినట్లు అదనపు పరిపాలనాధికారి మహ్మద్ ఆసిఫ్ తెలిపారు.
నూతన ఆలయ నిర్మాణం పూర్తైయ్యంత వరకూ విగ్రహాలను భద్రపరుస్తామని ఆసిఫ్ పేర్కొన్నారు. 1897లో కంజీమాల్, రామ్ రచ్‌పాల్ అనే ఇద్దరు ఈ గుడిని నిర్మించారు. 1970లో పాక్ ప్రభుత్వ పరిధిలోకి వచ్చే ట్రస్టు ప్రాపర్టీ బోర్డు పరిధిలోకి ఈ ఆలయం వెళ్లింది. ఇక్కడ ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం ఈ దేవాలయంలో పూజలు జరుగుతుంటాయి. ఈ గుడికి సంబంధించిన ప్రాంత పరిధిని పెంచాలని స్థానిక హిందువులు గత కొంత కాలంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్న నేపథ్యంలో పాక్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆలయ అభివృద్ధికి త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం గుడి కనీసం 100 మంది భక్తులకు కూడా సౌకర్యాలు కల్పించలేని స్థితిలో ఉందని, దాన్ని విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ నిధులతో మరమ్మత్తులు చేయించాక.. వివిధ పండగలప్పుడు మరింతమంది హిందువులు వచ్చి పూజలు చేసుకొనేందుకు పాక్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు అక్కడి మీడియా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment