అద్భుత స్తూపం... అందులో 'గీత' | Innovative launch in America | Sakshi
Sakshi News home page

అద్భుత స్తూపం... అందులో 'గీత'

Published Sun, Aug 25 2019 3:29 AM | Last Updated on Sun, Aug 25 2019 3:29 AM

Innovative launch in America - Sakshi

స్తూపం ఇలా..

మహాభూతాని అహంకారో బుద్ధిహిర్‌ అవ్యక్తం ఏవచ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరః 
శ్రీమద్భగవద్గీతలో చెప్పిన ఈ శ్లోకం పరమార్థాన్ని గ్రహిస్తే ఇలాంటి కార్చిచ్చులే కాదు, మనిషి–మనిషికి మధ్య అభిప్రాయ భేదాలూ పొడచూపవు. ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని, తోటివారూ తనలాంటి వారే అన్న భావనను ఒంటి పట్టించుకుంటే చాలు, ప్రపంచం ఆనందాల పొదరిల్లులా ఆహ్లాదంగా మారిపోవటం ఖాయం. ప్రపంచంలో తొలి మనోవికాస గ్రంథంగా భావించే భగవద్గీత సారాన్ని విశ్వవ్యాప్తం చేయటమే దీనికి మార్గం అంటున్నారు గట్టు వేణుగోపాలచార్యులు. అందుకే ఆయన ఆధ్వర్యంలో తొలి గీతాస్తూపం అమెరికాలో ఏర్పాటైంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అర్కాన్సాస్‌ రాష్ట్రం లో వాల్‌మార్ట్‌ హెడ్‌క్వార్టర్‌గా ఉన్న బెంటన్‌విల్‌లోని శ్రీకృష్ణ దేవాలయం ఆవరణలో ఈ అద్భుతస్తూపం భారతకాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి ఆవిష్కృతమైంది. స్తూపాలు కావాలంటూ 20 దేశాల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి.  ప్రపంచం లోనే తొలి గీతాస్తూపంగా ఏర్పడ్డ ఆ నిర్మాణ రూపకర్త గట్టు వేణుగోపాలాచార్యులు మన తెలంగాణవాసి కావటం విశేషం.  

ఏముంది అందులో...  
శంఖుచక్రాలతో ప్రశాంతచిత్తంతో కొలువుదీరిన చతు ర్భుజ శ్రీమహావిష్ణువు నల్లరాతి విగ్రహంగా ప్రశాంతచిత్తంతో నిలుచున్న రూపం... దాని చుట్టూ ఎత్తయిన భారీ ప్యానల్స్‌... ఒక్కో ప్యానెల్‌పై గీతలోని అధ్యాయాలు.. వాటిల్లో శ్లోకాలు.. తాత్పర్యాలు. అలా 700 శ్లోకాలు ఆ ప్యానెల్స్‌పై ఆంగ్లం, హిందీల్లో కొలువుదీరాయి. వాటి అర్థం దిగువనే ఉంటుంది.    పంచభూతాలమయమైన శరీరం, అదే పంచభూతాలతో నిండిన ప్రకృతితో మసలడం,  సౌభ్రాతృత్వం, విశ్వశాంతి, సమానత్వం, ఆనందం... ఇలా మానవ జీవన సౌందర్యాన్ని సాక్షాత్కరించే జీవన విధానానికి మార్గదర్శనం చేస్తుందనేది ఆ స్తూపాన్ని చూసిన వారి భావన. దాని ఎదుట ఉండే కంప్యూటరైజ్ట్‌ సిస్టం ముందుగా సందర్శకులకు ఓ టోకెన్‌ జారీ చేస్తుంది. దానిపై భగవద్గీత అధ్యాయం, శ్లోకం సంఖ్య ఉం టాయి. అది తీసుకుని సరిగ్గా ఆ ప్యానెల్‌లోని ఆ శ్లోకం వద్దకు వెళ్లి దాన్ని చదవాలి. ఆ సమయంలో ఉన్న మానసిక స్థితిని– ఆ శ్లోకంలోని నిగూఢార్థాన్ని బేరీజు వేసుకుని అది తనకు మార్గ నిర్దేశనం చేస్తుందో పరిశీలించాలి.  

రూపకర్త మనవాడే.... 
జనగామ జిల్లా జీడికల్‌కు చెందిన గట్టు వేణుగోపాలా చార్యులు బెంటన్‌విల్‌ శ్రీకృష్ణ దేవాలయ ప్రధాన అర్చకులు. ఆయన తండ్రి గట్టు వెంకటాచారి ఉపాధ్యాయ వృత్తిలో దాదాపు దశాబ్దన్నరపాటు సిద్దిపేట జిల్లా అయినాపూర్‌లో పనిచేయటంతో వేణుగోపాలాచార్యులు పాఠశాల విద్య అక్కడేసాగింది. ఉన్నవిద్య పూర్తిచేసి చిన జీయర్‌స్వామి సమక్షంలో వేదాధ్యయనం ముగించి అమెరికాలో ఆధ్యాత్మక భావనలు వ్యాప్తించేందుకు వెళ్లారు.  

మాతృభూమిపై మమకారంతో.. 
ఇప్పుడు మాతృభూమిపై మమకారంతో ఇక్కడి గ్రామాల్లో కూడా భగవద్గీత సారాన్ని పంచటం ద్వారా జీవిత గమనంలో ఒత్తిడిని దూరం చేసి ప్రశాంతంగా ఉండే మార్గాన్ని కల్పించాలని నిర్ణయించినట్టు వేణుగోపాలాచార్యులు పేర్కొంటున్నారు. వచ్చే నెల 12– 20 మధ్య సిద్దిపేట జిల్లా చేర్యాల, అయినాపూర్, తిరుమలలో గీతా హోమాలను నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
– సాక్షి, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement