sri krishna janmashtami
-
శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో క్లీంకార.. ఉపాసన పోస్ట్ వైరల్!
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. తమ ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి శ్రీకృష్ణుని పూజలో పాల్గొన్నట్లు ఉపాసన ట్వీట్ చేసింది. క్లీంకారతో పాటు రామ్ చరణ్, చిరంజీవి సతీమణి సురేఖ కూడా పూజల్లో పాల్గొన్నారు.కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. ఆ తర్వాత చెర్రీ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో పనిచేయనున్నారు. ఇందులో గ్లోబల్ స్టార్ సరసన జాన్వీకపూర్ నటించనుంది. Amma & Kaara’s sweet simple puja. #HappyKrishnaJanmashtami 🙏❤️ pic.twitter.com/68LEYJISdy— Upasana Konidela (@upasanakonidela) August 26, 2024 -
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు (ఫొటోలు)
-
డల్లాస్ లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు
-
శ్రీ కృష్ణ జన్మాష్టమి నేపథ్యంలో మందిరాల్లో ప్రత్యేక అలంకరణ
-
తెలుగు ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు: మంత్రి రోజా
-
హైదరాబాద్ హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ కు పోటెత్తిన భక్తులు
-
తిరుమలలో ఇవాళ, రేపు శ్రీకృష్ణజన్మాష్టమి, ఉట్లోత్సవ వేడుకలు
-
Janmashtami 2022: ఆభరణ మోహనం.. రాధాకృష్ణుల రూపు, నెమలి పింఛం అందం!
రంగులలో చిత్రమై సిల్వర్‌లో సింగారమై దారాలతో జత కట్టి బంగారంగా మెరిసిపోయే కృష్ణ సౌందర్యాన్ని ఎన్ని వర్ణాల రూపు కట్టినా తనివి తీరదు. ఎన్ని విధాల వివరించినా మాటలు చాలవు. అందుకే ఆభరణాల డిజైన్లలో ప్రేమాన్వితమై వేల కాంతులను వెదజల్లుతున్నాడు. టెంపుల్ జ్యువెలరీ దేవతామూర్తుల ఆభరణాలలో రాధాకృష్ణుల రూపుతో ఉండే నెక్లెస్‌లు, హారాలు చూడగానే ముచ్చటగొలుపుతుంటాయి. నెమలి పింఛాల అందం, మురళీలోలుడుగా దర్శనమిచ్చే డిజైన్లు అన్నింటికన్నా ముందుంటాయి. అందుకు గోపికావల్లభుడిలో ఉండే ఆకర్షణ అసలైన కారణం. దారాల జతలు.. మట్టి కోటలు రంగు రంగుల దారాలను ముడులు వేస్తూ, కృష్ణుడి పెండెంట్‌ను దానికి జత చేస్తే ఆ సింగారాన్ని చూడటానికి రెండు కళ్లూ సరిపోవనిపిస్తుంది. వీటికే కొన్ని గవ్వలు, కొన్ని మువ్వలు జత చేస్తే ఫ్యాషన్ జ్యువెల్రీ అదుర్స్ అనిపించకమానదు. టెర్రకోట జ్యువెలరీలో కృష్ణుడు పెట్టని కోటలా హుందాగా మెరిసిపోతాడు. పెయింటింగ్ చిత్రాలు కృష్ణుడు ఉంటే రాధను వేరుగా చూపలేరు చిత్రకారులు. ఆ అందాన్ని ఫ్యాబ్రిక్, ఉడెన్.. మీద పెయింటింగ్‌గా కన్నయ్యను చిత్రించి, దండలలో కూర్చితే వెస్ట్రన్–ట్రెడిషన్ రెండు వేషధారణల్లోనూ సూపర్బ్ అనిపిస్తాడు. చిహ్నాలూ సుందరమే కృష్ణుడు రూపుతోనే ఆభరణాలను ధరించాలనేమీ లేదు. ఆ కిరీటి ధరించే నెమలి పింఛం, మురళీ, గోవు .. చిహ్నాలు కూడా ఆభరణమై మగువుల మదిని దోచుకుంటున్నాయి. వీటితో ఎన్నో సృజనాత్మక ఆభరణాలు రూపుకడుతున్నాయి. సిల్వర్ సింగారం వెండి ఆభరణాలలో కృష్ణుడి రూపుతో డిజైన్ ఉంటే సంప్రదాయ వస్త్రాలకంరణే కాదు, పాశ్చాత్య దుస్తుల మీదకూ అందంగా నప్పుతాయి. చదవండి: Protein Laddu- Aval Puttu: కన్నయ్యకు ఇష్టమైన వెన్న, అటుకులతో ప్రొటిన్ లడ్డు, అవల్ పుట్టు! Sri Krishna Janmastami: కన్నయ్య వేడుకకు ఇస్కాన్ మందిరం ముస్తాబు Srikrishna Janmashtami 2022: శ్రీకృష్ణ చెలిమి.. శ్రీనివాస కలిమి -
Srikrishna Janmashtami: కన్నయ్యకు ఇష్టమైన వెన్న, అటుకులతో ప్రొటిన్ లడ్డు, అవల్ పుట్టు!
Srikrishna Janmashtami 2022- Protein Laddu- Aval Puttu Recipes: శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని కృష్ణునికి ప్రియమైన అటుకులు, నెయ్యితో విభిన్న రకాల నైవేద్యాలను సమర్పిద్దాం... రుచులను ఆస్వాదిద్దాం.. ప్రోటీన్ లడ్డు కావలసినవి: ►వెన్న – టేబుల్ స్పూను ►జీడిపప్పు పలుకులు – మూడు టేబుల్ స్పూన్లు ►కిస్మిస్ – మూడు టేబుల్ స్పూన్లు ►పచ్చికొబ్బరి తురుము – ముప్పావు కప్పు ►బెల్లం తరుగు – అరకప్పు ►అటుకులు – రెండు కప్పులు ►యాలకులు – ఆరు. తయారీ: ►జీడిపప్పు, కిస్మిస్లను వెన్నలో వేయించాలి. ►ఇవి వేగిన తరువాత కొబ్బరి తురుము వేసి దోరగా వేయించాలి ►కొబ్బరి కూడా వేగాక బెల్లం వేయాలి ►మరో బాణలిలో అటుకులను దోరగా వేయించి, యాలకులు వేసి మిక్సీజార్ లో పొడిచేసి పెట్టుకోవాలి ►బెల్లం కరిగిన తరువాత అటుకుల పొడి వేసి చక్కగా కలుపుకుని లడ్డులా చుట్టుకుంటే ప్రోటీన్ లడ్డు రెడీ. అవల్ పుట్టు కావలసినవి: ►అటుకులు – అరకప్పు ►బెల్లం – అరకప్పు ►పచ్చికొబ్బరి తురుము – రెండు టేబుల్ స్పూన్లు ►జీడిపప్పు పలుకులు – ఆరు ►యాలకుల పొడి – పావు టీస్పూను ►నెయ్యి – రెండు టీస్పూన్లు ►ఉప్పు – చిటికెడు. తయారీ: ►అటుకులను మూడు నిమిషాలపాటు రంగు మారకుండా దోరగా వేయించుకుని, చల్లారాక మిక్సీ జార్లో వేసి రవ్వలా గ్రైండ్ చేయాలి ►రవ్వను వెడల్పాటి పాత్రలో పోసుకుని, చిటికెడు ఉప్పు వేసి కలపాలి. ►దీనిలో కొద్దికొద్దిగా వేడి నీళ్లు చల్లుతూ కలుపుకోవాలి. ►రవ్వ మరీ మెత్తగా కాకుండా గుప్పెట్లో పట్టుకుని వత్తితే ఉండయ్యేంత మెత్తగా కలిపి పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ►టీస్పూను నెయ్యిలో జీడిపప్పుని బంగారు వర్ణంలోకి మారేంత వరకు వేయించి పక్కనపెట్టుకోవాలి ►ఇప్పుడు మందపాటి పాత్రలో బెల్లం, పావు కప్పు నీళ్లుపోసి మరిగించాలి. ►బెల్లం కరిగిన వెంటనే ద్రావణాన్ని వడగట్టాలి ∙వడగట్టిన ద్రావణాన్ని ఉండపాకం రానివ్వాలి. ►పాకం రాగానే స్టవ్ ఆపేసి.. తడిపిపెట్టుకున్న అటుకుల రవ్వ వేసి తిప్పాలి ►రవ్వను చక్కగా కలుపుకున్న తరువాత జీడిపప్పు, కొబ్బరి తురుము, మిగిలిన నెయ్యి వేసి అందంగా గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రే చేయండి: Bread Jamun Recipe: బ్రెడ్ జామూన్ ఇంట్లోనే తయారు చేసుకోండిలా! దాల్ బనానా ఖీర్, కలాకండ్ లడ్డూ తయారీ ఇలా! -
Srikrishna Janmashtami 2022 : ముద్దు లొలికిస్తున్న ‘చిన్ని కృష్ణులు’ (ఫొటోలు)
-
కన్నయ్య వేడుకకు ఇస్కాన్ మందిరం ముస్తాబు
అనంతపురం: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం వాడవాడలా ఘనంగా జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లోని ఆలయాల్లో వేడుకల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు రోజుల పాటు వైభవంగా సాగే వేడుకలకు అనంతపురములోని ఇస్కాన్ మందిరాన్ని సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. విశ్వశాంతి యజ్ఞంతో గురువారం వేడుకలను అట్టహాసంగా ప్రారంభించారు. ఉదయం నుంచే ఇస్కాన్ మందిరం భక్తులతో కిటకిటలాడింది. రాధా కృష్ణుల వేషధారణలో చిన్నారులు అలరించారు. -
‘ఆ కుండ తయారు చేసిందెవరో.. వారికి రోడ్లు, బ్రిడ్జిల కాంట్రాక్ట్ ఇద్దాం
సాక్షి, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏ వీడియో వైరల్‌గా మారుతుందో తెలియదు. చిన్న వీడియో అయినా కూడా బాగుంటే దూసుకుపోతుంది. అందులో ఉన్నవారు రాత్రికి రాత్రే స్టార్లుగా మారుతారు. ఇలాంటివెన్నో జరిగాయి. తాజాగా మరో వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో అంతా మట్టి కుండ చుట్టూ తిరుగుతోంది. ఆ కుండ తయారుచేసిన వారెవరో తెలుసుకోండి.. అతడికి మనదేశంలోని రోడ్లు, బ్రిడ్జిల కాంట్రాక్టులు అప్పగిద్దాం’ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరికొందరేమో ఆ కుండను ఫెవికాల్తో తయారు చేశారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు మన మట్టి మహిమ అని మట్టిదనం గొప్పతనాన్ని వివరిస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసుకోండి. చదవండి: పట్టపగలు ‘డబ్బులు పంచుతున్న ఈ యువరాజు ఎవరు? కృష్ణాష్టమి సందర్భంగా ఓ చోట ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. పై వరకు చేరిన యువకులు ఆ కుండను కొట్టడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. రాయి తీసుకుని కొట్టినా కూడా కుండ పగలడం లేదు. మరో యువకుడు కూడా వచ్చాడు. ఆ యువకుడైనా ఉట్టి కొడతాడమోనని గ్రామస్తులు ఈలలు, కేరింతలు చేస్తూ ఉత్సాహ పరిచారు. అతడికి కూడా నిరాశే ఎదురైంది. రెండు చేతులతో పట్టుకుని బలంగా కొడుతున్నా ఆ కుండ కొంచెం కూడా పగలలేదు. దీంతో గ్రామస్తులంతా పగలబడి నవ్వారు. చివరకు ఆ ఉట్టికుండ పగిలిందో లేదో తెలియదు కానీ 30 సెకన్లు ఉన్న ఈ వీడియో మాత్రం వైరల్‌గా మారింది. కామ్‌దేవ్ బాబా అనే ట్విటరటీ ఈ వీడియో షేర్ చేశాడు. ‘ఆ కుండ ఎవరో తయారుచేశారో కనుక్కోండి! అతడికి మనదేశంలో రోడ్లు, బ్రిడ్జిల కాంట్రాక్టులు ఇద్దాం’ అని కామ్‌దేవ్ బాబా రాసుకొచ్చాడు. చదవండి: కుర్రాళ్ల కన్నా రఫ్ఫాడిస్తున్న తాత.. ఈ వీడియో చూడండి Find the guy who made this Matki and give him all the Highways and Bridges contract in whole of India 😅😊 pic.twitter.com/qJZY7lJoKB — KamDev Baba (@TheKamDevBaba) September 10, 2021 -
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణాష్టమి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహిస్తున్నారు. కృష్ణయ్య ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అయితే, ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న వేళ.. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ కృష్ణుని జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణ భక్తికి ప్రత్యేకమైన ఇస్కాన్ ఆలయాలలో సంబరాలు అంబరాన్ని తాకాయి. అత్యంత భక్తిభావంతో చిన్ని కృష్ణయ్యకు నిర్వహించే పూజలు, సేవలు ప్రతి ఒక్కటి విశేషంగా నిలుస్తున్నాయి. గోపాలుడి దేవాలయాల్లో గ్రామోత్సవం, గీతాపఠనం, ఉట్టి కొట్టడం లాంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. -
భక్తులతో కిటకిట లాడుతున్న శ్రీ కృష్ణ ఆలయాలు
-
ప్రజలకు గవర్నర్ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపినట్లు గవర్నర్ కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. జన్మాష్టమి నేపథ్యంలో శ్రీకృష్ణుని శాశ్వతమైన సందేశాన్ని భగవద్గీత గుర్తు చేస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. సామరస్యపూర్వక సమాజ నిర్మాణానికి అవసరమైన పునాదిని స్పష్టపరుస్తుందన్నారు. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పండుగను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. రజతం సాధించిన భావానీబెన్కు అభినందనలు టోక్యో పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించిన భారత క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్‌ను గవర్నర్ హరిచందన్ అభినందించినట్లు గవర్నర్ కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. కృషి, పట్టుదల, సంకల్పంతో టేబుల్ టెన్నిస్‌లో రజత పతకం సాధించడం గర్వకారణమన్నారు. తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ రాష్ట్ర సంస్కృతి, వారసత్వాన్ని యుగయుగాలుగా కాపాడిన తెలుగు భాషకు గర్వకారణంగా ఈ రోజును పాటిస్తున్నాం. తెలుగు కవి గిడుగు వెంకట రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని ఈ రోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణం’ అని గవర్నర్ ఆదివారం ట్వీట్ చేశారు. -
రైతు బాగుంటేనే దేశం బావుంటుంది
-
అద్భుత స్తూపం... అందులో 'గీత'
మహాభూతాని అహంకారో బుద్ధిహిర్ అవ్యక్తం ఏవచ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరః శ్రీమద్భగవద్గీతలో చెప్పిన ఈ శ్లోకం పరమార్థాన్ని గ్రహిస్తే ఇలాంటి కార్చిచ్చులే కాదు, మనిషి–మనిషికి మధ్య అభిప్రాయ భేదాలూ పొడచూపవు. ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని, తోటివారూ తనలాంటి వారే అన్న భావనను ఒంటి పట్టించుకుంటే చాలు, ప్రపంచం ఆనందాల పొదరిల్లులా ఆహ్లాదంగా మారిపోవటం ఖాయం. ప్రపంచంలో తొలి మనోవికాస గ్రంథంగా భావించే భగవద్గీత సారాన్ని విశ్వవ్యాప్తం చేయటమే దీనికి మార్గం అంటున్నారు గట్టు వేణుగోపాలచార్యులు. అందుకే ఆయన ఆధ్వర్యంలో తొలి గీతాస్తూపం అమెరికాలో ఏర్పాటైంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అర్కాన్సాస్ రాష్ట్రం లో వాల్‌మార్ట్ హెడ్‌క్వార్టర్‌గా ఉన్న బెంటన్‌విల్‌లోని శ్రీకృష్ణ దేవాలయం ఆవరణలో ఈ అద్భుతస్తూపం భారతకాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి ఆవిష్కృతమైంది. స్తూపాలు కావాలంటూ 20 దేశాల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి. ప్రపంచం లోనే తొలి గీతాస్తూపంగా ఏర్పడ్డ ఆ నిర్మాణ రూపకర్త గట్టు వేణుగోపాలాచార్యులు మన తెలంగాణవాసి కావటం విశేషం. ఏముంది అందులో... శంఖుచక్రాలతో ప్రశాంతచిత్తంతో కొలువుదీరిన చతు ర్భుజ శ్రీమహావిష్ణువు నల్లరాతి విగ్రహంగా ప్రశాంతచిత్తంతో నిలుచున్న రూపం... దాని చుట్టూ ఎత్తయిన భారీ ప్యానల్స్... ఒక్కో ప్యానెల్‌పై గీతలోని అధ్యాయాలు.. వాటిల్లో శ్లోకాలు.. తాత్పర్యాలు. అలా 700 శ్లోకాలు ఆ ప్యానెల్స్‌పై ఆంగ్లం, హిందీల్లో కొలువుదీరాయి. వాటి అర్థం దిగువనే ఉంటుంది. పంచభూతాలమయమైన శరీరం, అదే పంచభూతాలతో నిండిన ప్రకృతితో మసలడం, సౌభ్రాతృత్వం, విశ్వశాంతి, సమానత్వం, ఆనందం... ఇలా మానవ జీవన సౌందర్యాన్ని సాక్షాత్కరించే జీవన విధానానికి మార్గదర్శనం చేస్తుందనేది ఆ స్తూపాన్ని చూసిన వారి భావన. దాని ఎదుట ఉండే కంప్యూటరైజ్ట్ సిస్టం ముందుగా సందర్శకులకు ఓ టోకెన్ జారీ చేస్తుంది. దానిపై భగవద్గీత అధ్యాయం, శ్లోకం సంఖ్య ఉం టాయి. అది తీసుకుని సరిగ్గా ఆ ప్యానెల్‌లోని ఆ శ్లోకం వద్దకు వెళ్లి దాన్ని చదవాలి. ఆ సమయంలో ఉన్న మానసిక స్థితిని– ఆ శ్లోకంలోని నిగూఢార్థాన్ని బేరీజు వేసుకుని అది తనకు మార్గ నిర్దేశనం చేస్తుందో పరిశీలించాలి. రూపకర్త మనవాడే.... జనగామ జిల్లా జీడికల్‌కు చెందిన గట్టు వేణుగోపాలా చార్యులు బెంటన్‌విల్ శ్రీకృష్ణ దేవాలయ ప్రధాన అర్చకులు. ఆయన తండ్రి గట్టు వెంకటాచారి ఉపాధ్యాయ వృత్తిలో దాదాపు దశాబ్దన్నరపాటు సిద్దిపేట జిల్లా అయినాపూర్‌లో పనిచేయటంతో వేణుగోపాలాచార్యులు పాఠశాల విద్య అక్కడేసాగింది. ఉన్నవిద్య పూర్తిచేసి చిన జీయర్‌స్వామి సమక్షంలో వేదాధ్యయనం ముగించి అమెరికాలో ఆధ్యాత్మక భావనలు వ్యాప్తించేందుకు వెళ్లారు. మాతృభూమిపై మమకారంతో.. ఇప్పుడు మాతృభూమిపై మమకారంతో ఇక్కడి గ్రామాల్లో కూడా భగవద్గీత సారాన్ని పంచటం ద్వారా జీవిత గమనంలో ఒత్తిడిని దూరం చేసి ప్రశాంతంగా ఉండే మార్గాన్ని కల్పించాలని నిర్ణయించినట్టు వేణుగోపాలాచార్యులు పేర్కొంటున్నారు. వచ్చే నెల 12– 20 మధ్య సిద్దిపేట జిల్లా చేర్యాల, అయినాపూర్, తిరుమలలో గీతా హోమాలను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. – సాక్షి, హైదరాబాద్ -
బాలకృష్ణులతో ఉట్టివేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్
సాక్షి, విశాఖపట్నం : శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులతో మీ కోరికలన్నీ నెరవేరాలి. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం మీకు, మీ ఆత్మీయులకు సుఖసంతోషాలను, సమృద్ధిని అందించాలి’ అని వైఎస్ జగన్ ట్విటర్లో శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఉట్టి వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీకృష్ణుడి వేషధారణలోని చిన్నారులతో జననేత ఉట్టికొట్టించారు. బాలకృష్ణుడి వేషధారణలో ఉన్న చిన్నారులతో సరదాగా గడిపారు. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చేత స్వీటు ముద్ద
‘అమ్మా! తమ్ముడు మన్ను తిన్నాడు’బలరాముడి కంప్లైట్. తల్లికి కోపం వచ్చింది. నోరు తెరవంది.‘ఆ..’ అని తెరిచాడు చిన్ని కృష్ణుడు.లోపల.. లోకాలు లోకాలే కనిపించాయి. అయినా.. ఏ పరమార్థమూ లేకుండా..వెన్నముద్దలు తినే కన్నయ్య.. మన్నుముద్దలు తింటాడా..?!శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తోంది..ఆయన ‘చేత’ ఎప్పుడూ ఉండే వెన్నముద్దకుకాస్త మీగడ కలిపి.. స్వీటు ముద్దలు చేసుకుని..‘ఏదీ.. నోరు తెరువ్’ అని.. మీ చిన్నారులతో అనండి. బాసుంది కావలసినవి: తియ్యటి కండెన్స్డ్ మిల్క్ – 400 గ్రా. (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది); చిక్కటి పాలు – ఒకటిన్నర లీటర్లు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; జీడిపప్పు – 15 (చిన్నచిన్న ముక్కలు చేయాలి); పిస్తా పప్పులు – 15 (చిన్నచిన్న ముక్కలు చేయాలి); బాదం పప్పులు – 15 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); కుంకుమ పువ్వు – ఏడెనిమిది రేకలు; జాజికాయ పొడి – చిటికెడు తయారీ: మందపాటి పాత్రలో పాలు, కండెన్స్డ్ మిల్స్ వేసి స్టౌ మీద ఉంచి కలుపుతుండాలి. పాలను మరీ మరిగించడకూడదు. పాలు కాగుతున్నంతసేపు కలుపుతూనే ఉండాలి. లేదంటే గోధుమరంగులోకి మారే అవకాశం ఉంది. చిక్కబడుతుంటే బాసుంది తయారవుతున్నట్లు. మీగడ వచ్చినప్పుడల్లా అంచుల నుంచి మీగడను వేరు చేసి పాలలోకి రానిచ్చి కలుపుతుండాలి. ఈ విధంగా మీగడ తరకలతో పాలు చిక్కబడ్డాక, జాజికాయ పొడి, తరిగి ఉంచుకున్న డ్రైఫ్రూట్స్, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి బాగా కలియబెట్టి దింపేయాలి. బాసుందిని వేడిగా గాని చల్లగా గాని తీసుకోవచ్చు. గ్లాసులలో అందించే ముందు కొద్దిగా కుంకుమపువ్వుతో అలంకరిస్తే కనువిందుగా ఉంటుంది. బాదాం కుల్ఫీ కావలసినవి: పాలు – 4 కప్పులు; ఏలకులు – 5; పంచదార – పావు కప్పు; కార్న్ ఫ్లోర్ – ఒక టీ స్పూను; బాదం పప్పులు – 10; బ్రెడ్ – ఒక స్లైస్. తయారీ: ఏలకుల తొక్క తీసి పొడి చేసి వాడుకునే వరకు గాలిచొరని డబ్బాలో ఉంచాలి. బాదం పప్పులను చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన ఉంచాలి. (బాదం పప్పుల తొక్క తీయకుండా ఉంచితే, కుల్ఫీ తినేటప్పుడు రుచిగా ఉంటుంది. అలాగే కుల్ఫీ తయారయ్యాక చూడటానికి కూడా అందంగా ఉంటుంది). బ్రెడ్ స్లైస్ అంచులు వేరు చేసి, బ్రెడ్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు కుల్ఫీ తయారుచేయడం ప్రారంభించాలి. నాలుగు కప్పుల పాల నుంచి అర కప్పు పాలు వేరు చేసి పక్కన ఉంచాలి. మందంగా ఉన్న పాత్రను స్టౌ మీద ఉంచి, మిగిలిన మూడున్నర కప్పుల పాలు అందులో పోసి సన్నని మంట మీద పాలను మరిగించాలి. మూడున్నర కప్పుల పాలు ఒకటిన్నర కప్పుల పరిమాణంలోకి వచ్చేవరకు మరిగించాలి. పాలు మరీ చిక్కబడిపోతే రెండున్నర కప్పుల పరిమాణం వచ్చినా పరవాలేదు. మిక్సీ జార్లో బ్రెడ్ ముక్కలు, కార్న్ ఫ్లోర్, అర కప్పు పాలు వేసి అన్నీ కలిసి మెత్తగా ముద్దలా అయ్యేవరకు సుమారు రెండు నిమిషాలపాటు మిక్సీ పట్టాలి. పాలు బాగా చిక్కబడిన తరవాత మిక్సీ పట్టిన పాల ముద్దను వేసి ఆపకుండా కలుపుతుండాలి. (లేదంటే అడుగు అంటి మాడు వాసన వస్తుంది). ఈ మిశ్రమం బాగా చిక్కబడ్డాక పంచదార జత చేసి మరోమారు కలియబెట్టాలి. పంచదార వేయగానే పాలు పల్చబడతాయి. అందువల్ల పాలు మళ్లీ గట్టిపడేవరకు కలుపుతూ ఉడికించాలి. బాగా గట్టిపడ్డాక స్టౌ మీద నుంచి దింపేయాలి. ముందుగా తయారుచేసి ఉంచుకున్న ఏలకుల పొడి, డ్రైఫ్రూట్స్ తరుగు వేసి కలపాలి. బాగా చల్లబడ్డాక, కుల్ఫీ మౌల్డ్స్‌లోకి ఈ మిశ్రమం వేసి మూత పెట్టి, డీప్ ఫ్రీజర్‌లో ఆరు గంటలపాటు ఉంచి తీసేయాలి. మౌల్డ్‌లో నుంచి కుల్ఫీని జాగ్రత్తగా బయటకు తీసి చల్లగా అందించాలి. రబ్రీ రసమలై కావలసినవి: చిక్కటి పాలు – 4 కప్పులు; ఏలకుల పొడి – అర టీ స్పూను; కుంకుమ పువ్వు – నాలుగు రేకలు; పంచదార – పావు కప్పు; డ్రై ఫ్రూట్స్ తరుగు – 2 టేబుల్ స్పూన్లు; రసమలై మిల్క్ పౌడర్ కోసం... పాల పొడి – ఒక కప్పు; పంచదార పొడి – 2 టేబుల్ స్పూన్లు; పాలు – పావు కప్పు; నెయ్యి – అర టీ స్పూను; తయారీ: ముందుగా రబ్రీని తయారుచేసుకోవడం కోసం నాలుగు కప్పుల పాలను మందంగా ఉండే పాత్రలో పోసి, స్టౌ మీద ఉంచి మరిగించాలి. అడుగు అంటకుండా ఉండటం కోసం మధ్యమధ్యలో కలుపుతుండాలి. పాలు బాగా మరిగిన తరవాత, అర టీ స్పూను ఏలకుల పొడి అందులో వేసి గరిటెతో బాగా కలియబెట్టాలి. ఇవి మరుగుతుండగానే, ఒక చిన్న కప్పులో ఒక టీ స్పూను నీళ్లు పోసి అందులో కుంకుమపువ్వు రేకలు వేసి కరిగించి, మరుగుతున్న పాలలో పోసి కలపాలి. ఇప్పుడు పావు కప్పు పంచదార వేసి కలిపి, తీపి సరిపడిందో లేదో రుచి చూసి, అవసరమనుకుంటే మరికాస్త పంచదార జత చేయాలి. మంట బాగా తగ్గించి, ఐదు నిమిషాలు కలపకుండా అలాగే వదిలేయాలి. మీగడ ఏర్పడి, అం చులకు చేరినప్పుడల్లా, గరిటెతో మీగడ కలుపుతుండాలి. ఇలా పాలు బాగా దగ్గరపడి చిక్కపడేవరకు కలుపుతూనే ఉండాలి. ఆ తరవాత రెండు టేబుల్ స్పూన్ల డ్రైఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం పప్పులు, పిస్తా పప్పులు) జత చేసి మరోమారు బాగా కలిపి మరో ఐదు నిమిషాలు స్టౌ మీదే ఉంచాలి. పాలు బాగా చిక్కబడితే రబ్రీ తయారైనట్లే. (తయారనై రబ్రీని పక్కన ఉంచాలి). రసమలై తయారీ: పెద్ద బాణలిలో ఒక కప్పు పాల పొడి వేసి, రెండు టేబుల్ స్పూన్ల పంచదార పొడి, పావు కప్పు పాలు జత చేయాలి. మంట బాగా తగ్గించి, పాలను ఆపకుండా కలుపుతుండాలి. ఉండలు లేకుండా, పాలు బాగా చిక్కగా తయారయ్యేవరకు కలుపుతుండాలి. బాగా చిక్కబడ్డాక, అర టీ స్పూ ను నెయ్యి జత చేసి మరోమారు కలపాలి. బాణ లి నుంచి విడివడేవరకు బాగా కలుపుతుండాలి. చేతికి నెయ్యి పూసుకుని, మిశ్రమా న్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసి ఒక పాత్రలో ఉంచాలి. చివరగా తయారుచేసి ఉంచుకున్న ర బ్రీని రసమలై మీద పోసి వెంటనే రసమలై అందించాలి. పనీర్ పాయసం కావలసినవి: చిక్కటి పాలు – 3 కప్పులు; పనీర్ తురుము – అర కప్పు; పంచదార – 6 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; బాదం పప్పులు – 15 (సన్నగా తరగాలి); పిస్తా పప్పులు – 15 (సన్నగా తరగాలి); జీడి పప్పులు – 15 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); కుంకుమ పువ్వు – కొద్దిగా; రోజ్ వాటర్ – ఒకటిన్నర టీ స్పూన్లు; తయారీ: మందపాటి పాత్రలో పాలు పోసి స్టౌ మీద ఉంచి సన్న మంట మీద పాలను మరిగించాలి. బాగా మరిగిన తరవాత పంచదార వేసి కలిపి ఐదు నిమిషాలుపాటు మరిగించాలి. డ్రైఫ్రూట్స్ తరుగులు వేసి బాగా కలిపాక, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి అన్నీ కలిసేలా బాగా కలియబెట్టాలి. ఆ తరవాత పనీర్ తురుము వేసి కలపాలి. పనీర్ బాగా ఉడికేవరకు కలుపుతుండాలి. బాగా ఉడికినట్లు అనిపించాక రోజ్ వాటర్ జత చేసి మరోమారు కలపాలి. కుంకుమ పువ్వు వల్ల మంచి రంగు, రోజ్ వాటర్ వల్ల సువాసన వస్తుంది. పనీర్ పాయసాన్ని వేడివేడిగా కాని, చల్లగా కాని తీసుకోవచ్చు. పనీర్ పాయసాన్ని సర్వ్ చేసే ముందు పాత్రలో చిటికెడు కుంకుమ పువ్వు లేదా డ్రై ఫ్రూట్స్ తరుగు లేదా గులాబీ రేకలు వేస్తే కంటికి ఇంపుగా ఉంటుంది. బెల్లం పాలకోవా కావలసినవి: చిక్కటి పాలు – ఒక లీటరు; బెల్లం పొడి – అర కప్పు; పంచదార – అర కప్పు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; నెయ్యి – ఒక టీ స్పూను తయారీ: మందపాటి పాత్రలో పాలు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి. అడుగు అంటకుండా మధ్యమధ్యలో కలుపుతుండాలి. ఏలకుల పొడి జత చేసి సుమారు గంటసేపు కలుపుతుండాలి. పాలు బాగా చిక్కగా అయ్యి, దగ్గర పడిన తరవాత బెల్లం పొడి వేసి కలియబెట్టాలి. పాలతో బెల్లం కలిసి ఉడుకుతున్నప్పుడు రంగు మారుతుంది. అలా రంగు మారిన అంటే సుమారు పావు గంట తరవాత పంచదార వేసి మరోమారు కలియబెట్టాలి. పాల పరిమాణం బాగా తగ్గటం గమనించాలి. నెయ్యి జత చేసి మరోమారు బాగా కలిపి స్టౌ మీద నుంచి దింపేయాలి. చల్లారుతుండగా మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని కోవా మాదిరిగా ఒత్తాలి. గట్టిపడ్డాక డబ్బాలో నిల్వ చేసుకోవాలి. కాయం కావలసినవి: బెల్లం తరుగు – అర కప్పు;శొంఠి – చిన్న ముక్క;మిరియాలు – 4 గింజలు;వాము – ఒక టీ స్పూను;గసగసాలు – ఒక టేబుల్ స్పూను;దాల్చినచెక్క – చిన్న ముక్క; నెయ్యి – పావు కప్పు; తయారీ: స్టౌ మీద పెద్ద బాణలి ఉంచి వేడి చేయాలి. కొద్దిగా నెయ్యి వేసి కరిగాక శొంఠి వేసి దోరగా వేయించి, తీసి పక్కన ఉంచాలి. ఆ తరవాత గసగసాలను వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. అదే బాణలిలో వాము కూడా వేసి వేయించి పక్కన ఉంచాలి. వేయించి ఉంచుకున్న పదార్థాలన్నీ చల్లారనివ్వాలి. మిక్సీలో శొంఠి, మిరియాలు, గసగసాలు, వాము, దాల్చిన చెక్కలను ఒకదాని తరవాత ఒకటి వేస్తూ మెత్తగా చేయాలి. చివరగా బెల్లం తరుగు వేసి పదార్థాలన్నీ కలిసేలా మిక్సీ పట్టి, ఒక పాత్రలోకి తీసుకోవాలి. చిన్న గిన్నెలో నెయ్యి వేసి స్టౌ మీద ఉంచి, కరిగించి దింపేయాలి. సిద్ధంగా ఉన్న శొంఠి పొడి మిశ్రమంలో నెయ్యి వేసి ముద్దలా చేయాలి. చిన్న చిన్న ఉండలు చేసి ఒక పళ్లెంలో ఉంచి శ్రీకృష్ణుడికి నివేదన చేయాలి. ఇలా తయారుచేసిన ఉండలను కాయం ఉండలు అంటారు. వీటిని శ్రీకృష్ణుడు ఇష్టంగా తినేవాడని దక్షిణాది వారు భావిస్తారు. శ్రీఖండ్ కావలసినవి: పెరుగు – అర కిలో (పుల్లగా ఉండకూడదు); కుంకుమ పువ్వు – నాలుగు రేకలు; గోరువెచ్చటి పాలు – 2 టేబుల్ స్పూన్లు; పంచదార పొడి – పావు కప్పు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; పిస్తా తరుగు – పావు కప్పు; మిఠాయి రంగు – 2 చుక్కలు (పసుపు పచ్చ రంగు) తయారీ: పెద్ద పాత్రకు పల్చటి వస్త్రాన్ని కట్టి ముడి వేయాలి. అందులో పెరుగు వేసి ఆ పాత్రను ఫ్రిజ్‌లో మూడు గంటల సేపు ఉంచి, బయటకు తీయాలి. స్పూన్‌తో గట్టిగా అదిమి, పెరుగులో ఉన్న నీటిని పిండి తీసేయాలి. నీరు లేని గట్టి పెరుగును ఒక పాత్రలోకి తీసుకోవాలి. పంచదార పొడి వేసి బాగా కలపాఇ. గోరు వెచ్చని పాలలో కుంకుమపువ్వును పది నిమిషాల పాటు ఉంచి, ఆ పాలను గట్టి పెరుగులో వేసి కలపాలి. పంచదార, పిస్తా తరుగు, ఏలకుల పొడి జత చేసి మరోమారు బాగా కలియబెట్టాలి. మిఠాయిరంగును జత చేసి మరోమారు బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచి సుమారు గంట తరవాత బయటకు తీసి చల్లగా అందించాలి. ధనియా పంజీరీ కావలసినవి: ధనియాల పొడి – ఒక కప్పు; పంచదార పొడి – ఒక కప్పు; మఖనీ – ఒక కప్పు (తామర గింజలు); ఉడికించిన కొబ్బరి తరుగు – అర కప్పు; నెయ్యి – పావు కప్పు; జీడి పప్పులు – 10; బాదం పప్పులు – 10; చిరోంజీ – 2 టేబుల్ స్పూన్లు; ఏలకులు – 4 (చిన్నవి). తయారీ: ముందుగా డ్రై ఫ్రూట్స్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మఖ్నీలనుని చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. స్టౌ మీద బాణలి ఉంచి వేడిచేయాలి. బాగా వేడిగా అయిన తరవాత మనం తీసుకున్న నేతిలో సగ భాగాన్ని బాణలిలో వేయాలి. నెయ్యి బాగా కరిగిన తరవాత మఖనీ ముక్కలను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు కలపాలి. వాటిని వేరే పాత్రలోకి తీసుకోవాలి. ఆ తరవాత కొబ్బరి తురుము వేసి రంగుమారే వరకు వేయించి మరో పాత్రలోకి తీసుకోవాలి. ఆ తరవాత డ్రైఫ్రూట్స్ వేసి ఒక నిమిషం పాటు వేయించి మరో పాత్రలోకి తీసుకోవాలి. ఇప్పుడు మిగతా నెయ్యి వేసి కరిగాక ధనియాల పొడి వేసి వేయించాలి. ఆపకుండా కలుపుతుండాలి. మంచి వాసన వచ్చేవరకు వేయించాలి. ధనియాల పొడి బదులు ధనియాలు కూడా వాడుకోవచ్చు. ధనియాల పొడిని మరో పాత్రలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్దపాత్రలో ధనియాల పొడి, పంచదార పొడి, కొబ్బరి తురుము, డ్రైఫ్రూట్స్, ఏలకుల పొడి, చిరోంజీ వేసి కలపాలి. ఇది పొడిపొడిగా ఉంటుంది. మఖనీలను చేతితో మెత్తగా నలపాలి. ఆ పొడిని కూడా జతచేసి మరోమారు కలపాలి. మఖ్నీ బదులు పుచ్చకాయ గింజలు కూడా వేసుకోవచ్చు. ఇలా తయారైన ధనియా పంజీరీని ఉత్తరాది వారు శ్రీకృష్ణునికి నివేదన చేయడానికి ప్రసాదంగా తయారుచేస్తారు. నిర్వహణ వైజయంతి పురాణపండ -
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
పుట్టపర్తి అర్బన్: శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో మంగళవారం విద్యార్థులునిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈసందర్భంగా విద్యార్థులు గోకులం నుంచి అందంగా తయారు చేసిన గోవులకు సిల్క్ దుప్పట్ట కప్పుకొని ప్రశాంతి నిలయానికి తీసుకువచ్చి సేవ చేశారు. ట్రస్టు సభ్యులు వాటికి గడ్డి, పండ్లు, కాయలు తినిపించారు. అదేవిధంగా గోశాలలో పెంచుతున్న జింకలు, నెమలి, కుందేలు, పావురాలు తదితర పక్షులు, జీవాలకు పాలు తాగించడం, పండ్లు తినిపించడం చేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు మధురాష్టకం, చల్లగాలిలో యమున తాటిపై, జగదానందకర, భవమీయ గోపాలబలం అంటూ సాగే సంగీతాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. 5000 ఏళ్ల నాటి నుంచి శ్రీకృష్ణుడు చేసిన లీలా వినోదాన్ని నాటక రూపంలో ప్రదర్శించారు. అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యులు, ఆశ్రమం సీనియర్లు, బాబా భక్తులు పాల్గొన్నారు. -
ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
-
రారా...కృష్ణయ్య
-
ఇద్దరూ ఒకరే... ఒకరిలోనే ఆ ఇద్దరు!
17న శ్రీకృష్ణ జన్మాష్టమి రాముడు రఘుకులాన్వయ ‘రత్న’దీపం... కృష్ణుడు విజయతే గోపాల ‘చూడామణి’. రత్నమణులు రెండూ... రామకృష్ణులిద్దరూ తేజోవంత కాంతిపుంజాలే. మరకత మాణిక్యాలే. రాముడూ... కృష్ణుడూ! ఇద్దరూ భగవంతుడి రూపాలే. అవతార స్వరూపాలే. అన్యాయం చెలరేగిననాడు, అధర్మం పెచ్చరిల్లిననాడు ధర్మాన్ని రక్షించ వచ్చిన మర్మమూర్తులు వారు. కాకపోతే ఒకరు త్రేతాయుగాన... మరొకరు ద్వాపరన. ఒకరు అయోధ్యన. మరొకరు ద్వారకన. ఇద్దరూ ఇద్దరే. శ్రీరాముడు అనగానే మర్యాదకు సూచిక. శ్రీకృష్ణుడనగానే యుక్తికి ప్రతీక. శ్రీరాముడంటే ఓ భయంతో కూడిన గౌరవం... శ్రీకృష్ణుడంటే మనవాడనే దగ్గరితనం. ఎందుకీ తేడా...? ఎందుకంటే... మనమందరం రోజూ చదివే ఆ శ్లోకాలే చూద్దాం. ‘ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం, రామం నిశాచర వినాశకరం’... అని నీలమేఘశ్యాముణ్ణి... ఆ రాముణ్ణి స్తుతిస్తారు. కేళీవిలాసంగా ఉండే ఆ శిఖిపింఛమౌళిని... ‘నాసాగ్రే నవమౌక్తికం... కరతలే వేణుం... కరే కంకణం’... అంటూ నుతిస్తారు. రాముడు రఘుకులాన్వయ ‘రత్న’దీపం... కృష్ణుడు విజయతే గోపాల ‘చూడామణి’. రత్నమణులు రెండూ... రామకృష్ణులిద్దరూ తేజోవంత కాంతిపుంజాలే. మరకత మాణిక్యాలే. కానీ ఆ ఇద్దరిలోనూ కొన్ని తేడాలు... నిశితంగా చూస్తే తప్ప కనిపించని అత్యంతసూక్ష్మమైన నిత్యవ్యత్యాసాలు... వాటిలో కొన్ని... శ్రీరాముడు ధీరోదాత్తుడైనా స్థిరచిత్తుడే అయినా సీతను ఎత్తుకెళ్లిన సందర్భంలోనో, అడవిలో ఉన్న వేళలోనైనా అప్పుడో ఇప్పుడో కాస్తో కూస్తో దుఃఖిస్తాడు. కనుల నీరు దొర్లిస్తాడు. కానీ కృష్ణుడో... ఆ మోమున ఎప్పుడూ చిద్విలాసమైన చిరునవ్వే. ఆ నవ్వే ఒక చిరునవ్వులదివ్వె. రాముడు ఎప్పుడూ సలహాలు స్వీకరిస్తూనే ఉంటాడు. హనుమంతుడివో, సుగ్రీవుడివో, లంక గుట్టు తెలుసుకోడానికి, దాన్ని ముట్టడించడానికి విభీషణుడివో. ఇలా రాముడు తాను గెలవడానికి ఇతరుల సహాయం తీసుకుంటుంటాడు. కానీ కృష్ణుడు ఎప్పుడూ సలహాలిస్తూ ఉంటాడు... జరాసంధ సంహారానికి భీముడికో. ఖాండవదహనానికి అర్జునుడికో. కురుక్షేత్ర యుద్ధానికి ధర్మజుడికో. ఎవరో గెలవడానికి కృష్ణుడు తానెప్పుడూ సాయం చేస్తూనే ఉంటాడు. ఇలా... అందరి సాయం రాముడి గెలుపు... కృష్ణుడి సాయం అందరి గెలుపు. విశ్వామిత్రుడి వెంట వెళ్తున్న బాల రామలక్ష్మణులను చూసినా, అరణ్యవాసం చేస్తున్న యౌవన అన్నదమ్ముల్ని వీక్షించినా కనిపించే దృశ్యం వేరు. ‘నిశాచర వినాశకర’ స్వరూపాలైన వారు ధనుర్బాణాలతో ఆయుధధారులై మిలటరీ యూనిఫామ్‌లో ఉంటారు. కానీ కృష్ణుడో... ‘కరే కంకణం, కరతలే వేణుం’ అంటూ పిల్లనగ్రోవిని వరించిన ఆ వేణుధరుడి వేణిలో పింఛం అలంకరించుకుని ఎప్పుడూ మఫ్టీలో ఉంటాడు. జలజాతాసనవాసవాది సురపూజా భాజనంబై తనర్చు ఆ కృష్ణుడు... బ్రహ్మాది దేవతలంతా స్తుతించే, నుతించే, ఆర్తితో కీర్తించే స్థానంలో ఉన్న ఆ కృష్ణుడు... ఆదిదేవుడైన ఆ విష్ణువు రూపానికి దగ్గరగా ఎలా ఉంటాడో చూడండి. ఆర్తత్రాణపరాయణత్వంలోనూ, హడావుడి సమయంలోనూ శంఖచక్రయుగముం జేదోయి సంధింపక భయపెట్టక ఉండే విష్ణుమూర్తి మూల రూపానికి కృష్ణావతారం ఎంత దగ్గరగా ఉంటుందో చూడండి. ధనుస్సు లాంటి ఆయుధాన్ని ధరించి న వారిని చూస్తే భయంతో కూడిన గౌరవం. అదే సంగీత ఝరిని ప్రసరింపజేసే వేణువును ధరించిన వాడిని చూస్తే నిర్భయంతో కూడిన దగ్గరిదనం. అందుకే రామాయణమూర్తి కంటే మహాభారతమూర్తే ముచ్చటగా కనిపిస్తాడు. మనవాడే అనిపిస్తాడు. తేడాలేముంటేనేం... ఇద్దరూ ఇద్దరే. దైవావతారాలే. కైవల్యమొసగగల కారుణ్యరూపాలే.అందుకే ముసలీముతకా వారిద్దరినీ కలుపుకుని ‘కృష్ణా.. రామా’ అనుకుంటుంటారు. కొత్తగా బిడ్డను కలిగే వయసులో ఉన్నవారు ఆ ద్వయంలో ఏ ఒక్కరినీ వదల్లేక ‘రామకృష్ణుడ’ంటూ తమ బిడ్డలకు ద్వంద్వసమాసయుక్తమైన వాళ్ల పేరిడుతుంటారు. ముకుళిత హస్తయుగళంతో, మంగళగళంతో, హారతిపళ్లెంతో, తులసీదళంతో ఆ ఇద్దరికీ ఇదే మా ప్రార్థన. - కె.రాంబాబు -
భక్తిశ్రద్ధలతో కృష్ణాష్టమి వేడుకలు
రాజమండ్రి కల్చరల్, న్యూస్‌లైన్ : అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్ మందిరం) ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఇస్కాన్ ప్రాంగణమంతా జనసంద్రమైంది. హరే కృష్ణ నామస్మరణతో ఆప్రాంతం మార్మోగింది. వేకువజామునే శ్రీకృష్ణునికి మహామంగళహారతితో మేలుకొలుపు పాడారు. అనంతరం శృంగారహారతితో గోపాలుని కొలిచారు. ఇస్కాన్ నగరాధ్యక్షుడు సత్యగోపీనాథ్‌దాస్ భాగవత ప్రవచనంలో ధర్మసంస్థాపన కోసమే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు భువిపై అవతరించాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశ్వశాంతి మహాయజ్ఞాన్ని వేద విద్వాంసులు ఘనంగా నిర్వహించారు. ఇస్కాన్ సేవలు అభినందనీయం : రౌతు ఆధ్యాత్మిక, సేవారంగాల్లో ఇస్కాన్ సేవలు అభినందనీయమని నగర శాసన సభ్యుడు రౌతు సూర్యప్రకాశరావు పేర్కొన్నారు. ఇస్కాన్ నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బుధవారం మధ్యాహ్నం ఆయన బహుమతి ప్రదానం చేశారు. వివిధ విద్యాసంస్థల నుంచి 2850 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. సంప్రదాయ నాట్యం, చిత్ర లేఖనం, వక్తృత్వం, గాత్రం, విచిత్ర వేషధారణ, వ్యాసరచన, భగవద్గీత శ్లోకాల పోటీలు నిర్వహించారు. విచిత్ర వేషధారణ పోటీల్లో హోలీ ఏంజిల్స్ పాఠశాలలో మూడో తరగతి విద్యార్థి మోటూరి యాశ్విత్ తృతీయ బహుమతిని గెలుచుకున్నాడు. కృష్ణార్జునులుగా ద్విపాత్రాభినయం చేసి అందరినీ అలరించాడు. ఉత్సాహంగా సాగిన ఉట్టికొట్టడం వెన్నమీగడలు దొంగిలించిన బాలకృష్ణుని లీలలను స్ఫురింపచేసే ఉట్టికొట్టడం కార్యక్రమంలో పెద్దసంఖ్యలో యువకులు పాల్గొన్నారు. భక్తులు ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని తిలకించారు. బాలయ్య ఉట్టికొట్టడంలో విజయం సాధించాడు. రాధాకృష్ణుల చిత్రపటాన్ని, ప్రసాదాన్ని బహుమతిగా ఇస్కాన్ అధ్యక్షుడు సత్యగోపీనాథ్ దాస్ చేతుల మీదుగా అందుకున్నాడు. శేషవాహనంపై రాధాకృష్ణుల ఊరేగింపు అనంతరం అనంత శేషవాహనంపై రాధాకృష్ణులను ఊరేగించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా లవకుశ పౌరాణిక నాటకాన్ని హైదరాబాద్‌కు చెందిన సురభి కళాకారులు ప్రదర్శించారు. రాధాకృష్ణులను విద్యుద్దీపాలతో అలంకరించిన పడవలో ఉంచి గోదావరిలో తెప్పోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి వరకు కార్యక్రమాలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. రత్నగిరిపై... అన్నవరం: రత్నగిరిపై శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు మహారాజ గోపురం ఎదురుగా గల ఆవరణలో దేవస్థానం చైర్మన్ రామ్‌కుమార్, ఏసీ ఈరంకి వేంకట జగన్నాథరావు తదితరులు గోవులను పూజించారు. వేదపండితులు ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠీ, గంగాధరభట్ల గంగాధరశాస్త్రి, చిట్టి శివ, ప్రధాన అర్చకులు కొండవీటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం ఆరు గంటలకు సత్యదేవుని ప్రధానాలయంలో శ్రీకృష్ణుని ప్రతిమకు ప్రత్యేక పూజలు చేశారు. వెన్న, నేతితో చేసిన పిండివంటలను, పాలు, పండ్లను శ్రీకృష్ణునికి నివేదన చేశారు. రాత్రికి సత్యదేవుడు, అమ్మవారు, శ్రీకృష్ణులను గ్రామంలో ఊరేగించారు. రత్నగిరి రామాలయం, తొలిపాంచా, పంపా సత్రం, ఈరంకి వారి వీధి తదితర చోట్ల ఉట్ల పండుగను నిర్వహించారు. రత్నగిరిపైగల శ్రీగోకులంలో సప్తగోవులకు అధికసంఖ్యలో భక్తులు ప్రదక్షిణలు చేసి శ్రీకృష్ణుని పూజించారు. -
ఘనంగా జన్మాష్టమి
న్యూఢిల్లీ: నగరవాసులు బుధవారం శ్రీకృష్ణ జన్మాష్టమిని ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే నగరంలోని కృష్ణ మందిరాలు భక్తులతో పోటెత్తాయి. ఈ సందర్భంగా భక్తులు ఆయా ఆలయాల్లో పూజలు నిర్వహించారు. బిర్లా మందిర్, ఇస్కాన్ తదితర ఆలయాల వద్ద నుంచి నగరంలోని అనేక ప్రాంతాలమీదుగా రథయాత్ర నిర్వహించారు. శ్రీకృష్ణ నామస్మరణతో నగరమంతా హోరెత్తిపోయింది. ఈ సందర్భంగా కొంద రు భక్తులు భగవద్గీతను పఠించారు. మరి కొంతమంది భక్తులు మంగళవారం రాత్రంతా ఉపవాసముండి, ఉదయాన్నే ఆయా ఆలయాల్లో పూజ లు చేశారు. పండుగ నేపథ్యంలో నిర్వాహకులు ఆయా ఆలయాలను సుందరంగా అలంకరించారు. రంగురంగుల విద్యుద్దీపాలు ఏర్పాటు చేయడంతో ఆలయాలన్నీ శోభాయమానంగా కనిపించాయి. హరేరామ హరేకృష్ణా.. గోవిందా ఆలారే తదితర భక్తిగీతాలను అలపించారు. కొంతమంది ఆనంద పరవశంతో నృత్యాలు చేశారు. నెహ్రూ ప్లేస్‌కు సమీపంలోని ఇస్కాన్ మందిరం, మధ్య ఢిల్లీలోని బిర్లా ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. ఈ సందర్భంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో దహిహండి నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో రథాల ఊరేగింపు జరిగింది. రాష్ట్రపతి శుభాకాంక్షలు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా నగరవాసులకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజ లంతా సన్మార్గంలో నడవాలంటూ ఆయన ఆకాం క్షించారు. తీహార్ కారాగారంలో తీహార్ కారాగారంలోని ఖైదీలు బుధవారం శ్రీకృష్ణ జన్మాష్టమిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా భక్తిగీతాలాపనతోపాటు నృత్యకార్యక్రమాలు నిర్వహించారు. ఈ విషయాన్ని జైలు అధికార ప్రతినిధి సునీల్ గుప్తా వెల్లడించారు. హరేరామ, హరేకృష్ణ అంటూ భక్తితో నినదించారు. ఈ కార్యక్రమంలో ఖైదీల పిల్లలు కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత దహిహండి కూడా నిర్వహించారు. -
శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రభుత్వ సెలవు రేపు
సాక్షి, హైదరాబాద్: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గురువారాన్ని సెలవు దినంగా ప్రకటించింది. కేంద్రం బుధవారమే సెలవుగా నిర్ణయించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం క్యాలెండర్లో మాత్రం గురువారం సెలవుదినంగా పేర్కొంది. దీనిపై చర్చ జరిగినా చివరికి గురువారాన్నే సెలవుదినంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
గోవిందా బృందాలకు బీమా!
సాక్షి, ముంబై: బీమా సౌకర్యం పొందేందుకు గోవిందా బృందాలు ఓరియంటల్ బీమా కార్యాలయాలవద్ద బారులు తీరుతున్నాయి. గతం కంటే ఈ సారి బీమా చేయించుకునే బృందాల సంఖ్య రెట్టింపయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బృందాలను స్పాన్సర్ చేసేందుకు అనేక కంపెనీలు, రాజకీయ పార్టీలు ముందుకు వస్తున్నాయి. దీంతో ముంబై, ఠాణే, నవీముంబై, పుణే, నాసిక్ లాంటి ప్రధాన నగరాలలో గోవిందా బృందాలకు ఉచితంగా బీమా సౌకర్యం పొందేందుకు అవకాశం లభించింది. శ్రీకృష్ణ జన్మాష్టమి (ఉట్టి ఉత్సవం) కి దాదాపు రెండు వారాల సమయం ఉంది. ఇప్పటి వరకు సుమారు 289 సార్వజనిక గోవిందా బృందాలు అంటే 26,248 మంది సభ్యులు బీమా చేయించుకున్నారు. వీరికి రిహార్సల్ మొదలుకుని ఉట్టి ఉత్సవాలు పూర్తయ్యేంత వరకు బీమా వర్తిస్తుంది. గత ఐదేళ్లుగా ఓరియంటల్ బీమా కంపెనీ ఈ సంఘాలకు బీమా సౌకర్యం కల్పిస్తోంది. అందుకు ఒక్కొక్కరికి రూ.30 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది స్పాన్సర్లు ముందుకు రావడంతో ఈ గోవిందా మండళ్లకు ఉచితంగానే బీమా పొందే అవకాశం లభించింది. కుర్లా ప్రాంతానికి చెందిన శివసేన నాయకుడు అజయ్ బడ్గుజర్ తన బడ్గుజర్ ఫౌండేషన్ తరఫున ఇప్పటివరకు 110 గోవిందా బృందాలకు ఉచిత బీమా సౌకర్యం కల్పించారు. అదేవిధంగా మంగల్‌ప్రభాత్ లోఢాకు చెందిన లోఢా చారిటబుల్ ట్రస్టు, ముంబై బీజేపీ కూడా స్పాన్సర్ చేసేందుకు ముందుకు వచ్చాయి. దిండోషీ ప్రాంతంలోని గోవిందా బృందాలకు బీమా కల్పించాయి. కాగా 29 గోవిందా బృందాలు స్వయంగా ప్రీమియం చెల్లించి బీమా పాలసీ తీసుకున్నాయని ఓరియంటల్ బీమా కంపెనీ పరిపాలన అధికారి సచిన్ ఖాన్వీల్కర్ చెప్పారు. ఆగస్టు 23వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. కేవలం రూ.30 ప్రీమియంతో రూ.లక్షకుపైగా విలువచేసే బీమా కల్పించడంతో గోవిందా బృందాలు ఈ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నాయని ఖాన్వీల్కర్ అభిప్రాయపడ్డారు.