ఆరంభం అదిరినా!
► తడబడిన భారత మిడిల్ ఆర్డర్
► తొలి ఇన్నింగ్స్ 329/6
► ధావన్ శతకం
► రాహుల్ అర్ధ సెంచరీ
► రాణించిన లంక బౌలర్లు
విదేశీ గడ్డపై తొలిసారిగా మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తున్న భారత్‌కు ఈ సిరీస్‌లో తొలిసారిగా శ్రీలంక బౌలర్ల నుంచి ఇబ్బంది ఎదురైంది. తొలి సెషన్లో భారత్ చెలరేగినా... తర్వాతి రెండు సెషన్లలో శ్రీలంక బౌలర్లు పైచేయి సాధించారు. శిఖర్ ధావన్, రాహుల్ తొలి వికెట్‌కు 188 పరుగులు జత చేయడంతో.. ఇక మరోసారి భారీ స్కోరు ఖాయమే అనిపించింది.
ఓపెనర్లు పెవిలియన్‌కు చేరాక సీన్ రివర్స్ అయ్యింది. మిడిల్ ఆర్డర్ తడబాటుతో భారత్ 141 పరుగుల తేడాలో ఆరు వికెట్లను కోల్పోయింది. తొలి రెండు టెస్టుల్లో 600 పైచిలుకు స్కోరు చేసిన భారత్ ఈసారి 400 పరుగులు దాటే విషయం టెయిలెండర్ల చేతుల్లో ఆధారపడి ఉంది.
పల్లెకెలె: శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో ఎప్పటిలాగే తొలి రోజు భారత జట్టు 300 పైచిలుకు పరుగులు సాధించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (123 బంతుల్లో 119; 17 ఫోర్లు) సిరీస్‌లో రెండో శతకంతో చెలరేగడంతో పాటు మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (135 బంతుల్లో 85; 8 ఫోర్లు) వరుసగా ఏడో అర్ధ సెంచరీతో మెరిశాడు. దీంతో టీమిండియా 400 పరుగులు కూడా సులువుగా దాటేస్తుందేమో అనిపించినా... అనూహ్యంగా శ్రీలంక బౌలర్లు విజృంభించారు.
దీంతో ఫామ్‌లో ఉన్న మిడిలార్డర్ కూడా పూర్తిగా తడబడింది. ఫలితంగా శ్రీలంకతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో తొలి రోజు శనివారం ఆట ముగిసే సమయానికి భారత్ 90 ఓవర్లలో 6 వికెట్లకు 329 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (84 బంతుల్లో 42; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా... క్రీజులో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (38 బంతుల్లో 13 బ్యాటింగ్), హార్దిక్ పాండ్యా (1 బ్యాటింగ్) ఉన్నారు. పుష్పకుమారకు మూడు, సందకన్‌కు రెండు వికెట్లు దక్కాయి. రవీంద్ర జడేజా స్థానంలో ‘చైనామన్’ కుల్దీప్ యాదవ్ భారత తుది జట్టులోకి వచ్చాడు.
సెషన్–1 ఓపెనర్ల జోరు
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శిఖర్ ధావన్, రాహుల్ జోడి అద్భుత ఆరంభాన్ని అందించింది. పిచ్ నుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకపోవడంతో ఈ జోడి యథేచ్ఛగా బ్యాట్లు ఝుళిపించింది. ఆరో ఓవర్లో రాహుల్ రెండు ఫోర్లు బాదగా, ధావన్ మరో ఫోర్ కొట్టాడు. 12వ ఓవర్లో రాహుల్ ఇచ్చిన క్యాచ్‌ను మిడ్ ఆన్‌లో పుష్పకుమార జారవిడిచాడు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ వన్డే తరహాలో చెలరేగిన వీరిద్దరు 107 బంతుల్లోనే జట్టు స్కోరును 100 పరుగులు దాటించారు. అటు చక్కటి ఫోర్‌తో రాహుల్ 67 బంతుల్లో అర్ధ సెంచరీని అందుకున్నాడు. లంచ్ విరామానికి ముందు ఓవర్లో కూడా అతను వరుసగా రెండు ఫోర్లు బాది పరుగుల వేగాన్ని మరింత పెంచాడు.
ఓవర్లు: 27, పరుగులు: 134, వికెట్లు: 0
సెషన్–2 ధావన్ శతకం
లంచ్ అనంతరం కూడా శిఖర్, రాహుల్ దూకుడును కొనసాగించారు. అయితే 39 ఓవర్ల అనంతరం ఎడంచేతి వాటం స్పిన్నర్ పుష్పకుమారను బరిలోకి దింపిన లంక ఫలితం పొందింది. వరుసగా ఏడోసారి కూడా తన హాఫ్ సెంచరీని శతకంగా మలచకుండా రాహుల్ మిడ్ ఆన్‌లో కరుణరత్నేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అయితే తన జోరును కొనసాగించిన ధావన్ మాత్రం 107 బంతుల్లో సిరీస్‌లో రెండో శతకాన్ని అందుకున్నాడు. కానీ కొద్దిసేపటికే పుష్పకుమార... ధావన్ వికెట్ కూడా తీసి లంక శిబిరంలో డబుల్ సంతోషాన్ని నింపాడు. పుజారా (8) కూడా త్వరగానే అవుట్ కావడంతో కోహ్లి, రహానే జాగ్రత్తగా ఆడి మరో వికెట్ పడకుండా టీ బ్రేక్‌కు వెళ్లారు.
ఓవర్లు: 29, పరుగులు: 101, వికెట్లు: 3
సెషన్–3 తడబాటు
ఆఖరి సెషన్లో లంక బౌలర్ల హవా సాగింది. స్పిన్నర్ల ధాటికి భారత బ్యాట్స్‌మెన్ పరుగులు చేసేందుకు చెమటోడ్చాల్సి వచ్చింది. రహానే (17) వికెట్‌ను కూడా పుష్పకుమార తీయడంతో భారత్ 264 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కోహ్లి, అశ్విన్ (75 బంతుల్లో 31; 1 ఫోర్) జోడి లంక బౌలర్లను ఆచితూచి ఎదుర్కొంది. 12 ఓవర్లు ఆడిన ఈ జోడి ఒక్క బౌండరీ కూడా నమోదు చేయలేకపోయింది. చివరికి 79వ ఓవర్లో స్పిన్నర్ సందకన్‌కు కోహ్లి దొరికిపోయాడు. మరో రెండు ఓవర్లలో తొలి రోజు ఆట ముగుస్తుందనగా అశ్విన్ కూడా లెఫ్టార్మ్ స్పిన్నర్ ఫెర్నాండో బౌలింగ్‌లో అవుట్ కావడంతో జట్టు ఆరో వికెట్‌ను కోల్పోయింది.
ఓవర్లు: 34, పరుగులు: 94, వికెట్లు: 3
గతంలో నా ఆట గాడి తప్పినప్పుడు పూర్తి రక్షణాత్మక ధోరణిలో ఆడేవాణ్ని. కానీ ఇప్పుడలా కాకుండా నా సహజ శైలినే నమ్ముకుంటున్నాను. అదే ఇప్పుడు ఫలితాన్నిస్తోంది. రాహుల్, నేను బాగా ఆడాం. అయితే దూకుడుగా వెళుతున్నప్పుడు అదే తరహాలోనే అవుట్ కూడా అవుతుంటాం. చివరి రెండు సెషన్లలో వికెట్లను కోల్పోవడం సాధారణమే. స్పిన్నర్లు పుష్పకుమార, సందకన్ నిలకడగా బౌలింగ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అయినా తొలి రోజు మేం సాధించిన 329 పరుగులు మరీ తక్కువేమీ కాదు. అయితే ఈ పిచ్‌పై భారీ స్కోరు కోసం పరుగులు చేయడం కష్టమే. – భారత ఓపెనర్ శిఖర్ ధావన్
⇒ వరుసగా ఏడు టెస్టుల్లో అర్ధ సెంచరీలు సాధించిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా, ఓవరాల్‌గా ఆరో క్రికెటర్‌గా కేఎల్.రాహుల్ గుర్తింపు పొందాడు. ఇంతకుముందు ఎవర్టన్ వీక్స్, ఆండీ ఫ్లవర్, చందర్‌పాల్, సంగక్కర, క్రిస్ రోజర్స్ ఇలా చేశారు.
⇒ మూడు టెస్టుల సిరీస్‌లో వరుసగా 3 సార్లు తొలి ఇన్నింగ్స్‌లో తొలి రోజే 300 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి జట్టుగా భారత్ నిలిచింది.
⇒ కోహ్లి కెప్టెన్సీలో భారత్ వరుసగా 29వ టెస్టులోనూ తుది జట్టులో కనీసం ఒక మార్పుతో బరిలోకి దిగింది.
⇒ శ్రీలంక గడ్డపై టెస్టుల్లో తొలి వికెట్‌కు అత్యధిక పరుగుల (188) భాగస్వామ్యం నమోదు చేసిన ఓపెనింగ్ జోడిగా ధావన్, రాహుల్ గుర్తింపు.
⇒ శిఖర్ ధావన్ టెస్టుల్లో ఇప్పటివరకు ఆరు సెంచరీలు చేశాడు. ఇందులో ఐదు విదేశీ గడ్డపైనే వచ్చాయి.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: ధావన్ (సి) చండిమాల్ (బి) పుష్పకుమార 119; రాహుల్ (సి) కరుణరత్నే (బి) పుష్పకుమార 85; పుజారా (సి) మాథ్యూస్ (బి) సందకన్ 8; కోహ్లి (సి) కరుణరత్నే (బి) సందకన్ 42; రహానే (బి) పుష్పకుమార 17; అశ్విన్ (సి) డిక్వెలా (బి) ఫెర్నాండో 31; సాహా బ్యాటింగ్ 13; పాండ్యా బ్యాటింగ్ 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (90 ఓవర్లలో ఆరు వికెట్లకు) 329.
వికెట్ల పతనం: 1–188, 2–219, 3–229, 4–264, 5–296, 6–322. బౌలింగ్: ఫెర్నాండో 19–2–68–1; లాహిరు కుమార 15–1–67–0; కరుణరత్నే 5–0–23–0; పెరీరా 8–1–36–0; సందకన్ 25–2–84–2; పుష్పకుమార 18–2–40–3.