శ్రీలంక బౌలర్లను తప్పుబట్టిన సంగక్కర
లండన్: చాంపియన్స్ ట్రోఫిలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటుకు కారణమైన శ్రీలంక బౌలర్లను ఆ దేశ మాజీ కెప్టెన్ సంగక్కర తప్పుబట్టాడు. స్లో ఓవర్ రేటు కారణంగా శ్రీలంక తాత్కలిక కెప్టెన్ ఉపుల్ తరంగపై రెండు మ్యాచ్‌లు నిషేదం విదించిన విషయం తెలిసిందే. సీనియర్ బౌలర్లు ఉన్న స్లో ఓవర్ రేటు ఎందుకు వేయాల్సి వచ్చిందో అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. సీనియర్ బౌలర్ లసిత్ మలింగా, మరో ఇద్దరూ స్సిన్నర్లు ఉన్నా 39 నిమిషాలు మ్యాచ్ ఆలస్యం కావడం ఆహ్వానించదగిన విషయం కాదని ఐసీసీకి రాసిన కాలమ్‌లో సంగక్కర అభిప్రాయ పడ్డాడు. మ్యాచ్ వేగంగా జరిగేందుకు వికెట్ కీపర్, ఫీల్డర్లు కూడా భాగమవ్వాలని సూచించాడు.
ఇక దూకుడ మీద ఉన్న భారత్‌ను శ్రీలంక సగర్వంగా ఎదుర్కోవాలన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక పరాజయం పొందడంతో గురువారం భారత్‌తో జరిగే మ్యాచ్ చావో రేవో అన్నట్లుగా మారింది. ఆత్మస్థైర్యంతో సానుకూలంగా భారత్ ఎదుర్కోవాలని సంగక్కర శ్రీలంక ఆటగాళ్లకు సూచించాడు. పాక్‌పై విజయం సాధించి ఊపు మీద ఉన్నభారత్‌ను ఎదుర్కోవడం అంత సులువు కాదని సంగక్కర అభిప్రాయపడ్డాడు.భారత్ పై గెలవాలంటే 10 ఓవర్లలోపే వికెట్లు తీయాలన్నాడు. ఇక భారత్ బౌలింగ్‌కు అప్రమత్తంగా ఉండాలని, ఈ మధ్య కాలంలో భారత్ బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారని సంగక్కర హెచ్చరించాడు. ముఖ్యంగా పేస్ విభాగం పటిష్టంగా ఉందని, ఇక స్పిన్ వారి అదనపు బలమన్నాడు. ఉపుల్ తరంగపై నిషేదం, కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ ఫిట్‌నెస్‌పై సందిగ్థత నెలకోవడంతో శ్రీలంకకు సానుకూల పరస్థితులు కనబడటం లేదని సంగక్కర పేర్కొన్నాడు.