ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో నిన్న (ఏప్రిల్ 18) జరిగిన ఆసక్తికర సమరంలో ముంబై ఇండియన్స్ 9 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. సూర్యకుమార్ యాదవ్ (53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (25 బంతుల్లో 36;2 ఫోర్లు, 3 సిక్సర్లు), తిలక్ వర్మ (18 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన పంజాబ్.. శశాంక్ సింగ్ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), అశుతోష్ శర్మ (28 బంతుల్లో 61; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగినప్పటికీ లక్ష్యానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బుమ్రా (4-0-21-3), గెరాల్డ్ కొయెట్జీ (4-0-32-3), అద్భుతంగా బౌలింగ్ చేసి పంజాబ్ ఓటమిని అడ్డుకున్నారు.
ఈ మ్యాచ్‌లో గెలుపు ఇచ్చిన జోష్‌ను ఎంజాబ్ చేస్తున్న ముంబై ఇండియన్స్‌కు ఊహించని షాక్ తగిలింది. స్లో ఓవర్‌రేట్ కారణంగా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు 12 లక్షల జరిమానా పడింది. ఈ సీజన్‌లో ఇది తొలి తప్పిదం (స్లో ఓవర్ రేట్) కావడంతో హార్దిక్ నామమాత్రపు జరిమానాతో తప్పించుకున్నాడు. ఇది మళ్లీ రిపీటైతే కెప్టెన్ హార్దిక్‌తో పాటు జట్టు సభ్యులందరూ జరిమానా కట్టాల్సి ఉంటుంది.
ఇటీవల దాదాపు ప్రతి మ్యాచ్‌లో ఏదో ఒక జట్టు స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాలు ఎదుర్కొంటుంది. జరిమానాతో పోతే సరిపోయింది.. స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్‌లు సైతం చేజారుతున్నాయి. నిర్ణీత సమయంలోపు కోటా ఓవర్లు పూర్తి చేయకపోతే 30 యార్డ్స్ సర్కిల్ బయట కేవలం నలుగురు ఫీల్డర్లను మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. సహజంగా చివరి రెండు ఓవర్లలో 30 యార్డ్స్ సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లను పెడతారు.
మ్యాచ్ కీలక దశలో (చివరి ఓవర్లలో) ఔట్ సైడ్ ద సర్కిల్ ఓ ఫీల్డర్ తక్కువ పడితే అది గెలుపోటములను తారుమారు చేస్తుంది. 30 యార్డ్స్ సర్కిల్ బయట కేవలం నలుగురు ఫీల్డర్లను మాత్రమే పెట్టడంతో ఇదే సీజన్‌లో కొన్ని జట్లు గెలవాల్సిన మ్యాచ్‌ను కోల్పోయాయి. ఇంచుమించు ఇలాంటి పరిస్థితే నిన్నటి మ్యాచ్‌లో ముంబై కూడా ఎదుర్కొంది.
చివరి రెండు ఓవర్లలో ఆ జట్టు బౌండరీల వద్ద నలుగురు ఫీల్డర్లతోనే ఆడింది. నిపంజాబ్‌కు గనుక చేతిలో వికెట్లు ఉంటే సునాయాసంగా సర్కిల్‌లో ఉన్న ఫీల్డర్ల పైనుంచి బంతులను పంపి పరుగులు రాబట్టేది. ఫలితంగా ముంబై మ్యాచ్‌ను కోల్పోవాల్సి వచ్చేది. అయితే నిన్నటి మ్యాచ్‌లో ముంబై లక్కీగా బయటపడింది.
Comments
Please login to add a commentAdd a comment