లంక పని పట్టాలి! | India open to experimentation but not at cost of results | Sakshi
Sakshi News home page

లంక పని పట్టాలి!

Published Mon, Mar 12 2018 4:03 AM | Last Updated on Mon, Mar 12 2018 4:03 AM

India open to experimentation but not at cost of results - Sakshi

రోహిత్‌ శర్మ

కొలంబో: నిదహస్‌ ట్రోఫీలో ఫైనలే లక్ష్యంగా ఆతిథ్య శ్రీలంకతో పోరుకు భారత్‌ సిద్ధమైంది. ఈ టోర్నీలో మూడు జట్లు ఒక్కో గెలుపోటములతో ఉండటంతో అందరిని ఫైనల్‌ బెర్తు ఊరిస్తోంది. ఈ నేపథ్యంలో రన్‌రేట్‌పైనో, మరో జట్టు జయాప జయాలతోనో సంబంధం లేకుండా... తమ శక్తిసామర్థ్యాలతోనే టైటిల్‌ పోరుకు అర్హత సాధించాలంటే సోమవారం జరిగే మ్యాచ్‌లో టీమిండియా గెలవాల్సిందే.

ఈ ముక్కోణపు టి20 టోర్నీలో ఇప్పటి వరకైతే భారత్‌ బ్యాటింగ్‌ ఫర్వాలేదు. కానీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫామ్‌తో పాటు, నిలకడలేని బౌలింగ్‌ జట్టు యాజమాన్యాన్ని కలవరపరుస్తోంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌ లో లంక ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా కాపాడుకోలేకపో యింది. రెండు మ్యాచ్‌ల సస్పెన్షన్‌ వేటు పడటంతో చండిమాల్‌ స్థా నంలో తిసారా పెరీరా లంకకు సారథ్యం వహించనున్నాడు.

రోహిత్‌ చెలరేగాలి...
కోహ్లి గైర్హాజరీలో పగ్గాలు చేపట్టిన రోహిత్‌ శర్మ వ్యక్తిగతంగా గత రెండు టి20ల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. ఆతిథ్య జట్టుతో కీలకమైన ఈ మ్యాచ్‌లో అతను రాణిస్తే తిరిగి పుంజుకునే అవకాశముంది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ధావన్‌కు రో‘హిట్స్‌’ జతయితే జట్టు భారీస్కోరు ఖాయమవుతుంది. టి20ల్లో ధావన్‌ ఫామ్‌ అద్భుతంగా కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా పర్యటనలో  చెలరేగిన అతను ఈ టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అర్ధసెంచరీలు బాదాడు. మనీశ్‌ పాండే అతనికి అండగా నిలిచాడు. నిలకడగా ఆడిన పాండే రెండు మ్యాచ్‌ల్లోనూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేశాడు.

తొలి మ్యాచ్‌లో విఫలమైన రైనా బంగ్లాపై ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్‌కు అవకాశం ఇస్తే...పంత్‌ బెంచ్‌కు పరిమితం కావొచ్చు. బౌలింగ్‌ విభాగం కూడా కెప్టెన్‌ ఫామ్‌లాగే టీమ్‌ మేనేజ్‌మెంట్‌లో ఆందోళన పెంచుతోంది. ఉనాద్కట్‌ గత మ్యాచ్‌లో 3 వికెట్లు తీసినప్పటికీ తొలిపోరులో చేతులెత్తేశాడు. చహల్‌ మ్యాజిక్‌ కూడా ఇక్కడ ఆశించిన స్థాయిలో పని చేయడం లేదు. కొత్తగా జట్టులోకి వచ్చిన విజయ్‌ శంకర్‌ బంగ్లాపై రెండు వికెట్లు తీసి ఫర్వాలేదనిపించాడు. అయితే సమష్టిగా రాణిస్తేనే భారీస్కోర్లు చేస్తున్న శ్రీలంకను నిలువరించగలం. లేదంటే తొలి మ్యాచ్‌ ఫలితం పునరావృతమయ్యే అవకాశముంది.  

లంక బలం కూడా బ్యాటింగే...
ఈ టోర్నీలో శ్రీలంక బ్యాటింగ్‌ అద్భుతం. తొలి మ్యాచ్‌లో భారత్‌ తమ ముందుంచిన లక్ష్యాన్ని ఛేదించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో రెండొందల పైచిలుకు స్కోరు చేసింది. ఫలితం నిరాశపరిచినప్పటికీ ఓవరాల్‌గా బ్యాటింగ్‌ ఫామ్‌ స్థిరంగా ఉంది. ముఖ్యంగా కుశాల్‌ పెరీరా స్ట్రయిక్‌రేట్‌ అసాధారణంగా ఉంది. ఇద్దరు ప్రత్యర్థులపైనా అతను రెండు మెరుపు అర్ధశతకాలు సాధించాడు. అతనితో పాటు కుశాల్‌ మెండిస్‌ గత మ్యాచ్‌లో కనబరిచిన జోరు భారత బౌలర్లకు మింగుడు పడని అంశమే. వీరికి గుణతిలక,  తరంగలు కూడా జతయితే ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు తప్పవు.  

జట్లు (అంచనా)
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్, సురేశ్‌ రైనా, రాహుల్‌/రిషభ్‌ పంత్, మనీశ్‌పాండే, దినేశ్‌ కార్తీక్, వాషింగ్టన్‌ సుందర్, చహల్, విజయ్‌ శంకర్, శార్దుల్‌ ఠాకూర్, ఉనాద్కట్‌.

శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్‌), లక్మల్, తరంగ, గుణతిలక, కుశాల్‌ మెండిస్, షనక, కుశాల్‌ పెరీరా, జీవన్‌ మెండిస్, నువాన్‌ ప్రదీప్, చమీర, ధనంజయ డిసిల్వా.

స్లో ఓవర్‌రేట్‌... చండిమాల్‌ సస్పెన్షన్‌
స్లో ఓవర్‌రేట్‌ కారణంగా శ్రీలంక సారథి చండిమాల్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించారు. దీంతో అతను నేటి మ్యాచ్‌తో పాటు, 16న బంగ్లాదేశ్‌తో పోరుకూ దూరమయ్యాడు. బంగ్లాతో శనివారం జరిగిన పోరులో లంక నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తిచేయలేకపోయింది. ఆదివారం కెప్టెన్‌ చండిమాల్‌ మ్యాచ్‌ రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌కు వివరణ ఇచ్చిన అనంతరం ఆయన ‘సీరియస్‌ స్లో ఓవర్‌రేట్‌’ కావడంతో శిక్ష ఖరారు చేశారు. సస్పెన్షన్‌తో పాటు సహచరులపై పది శాతం జరిమానా పడింది. ఈ 12 నెలల్లో మరోసారి ఇది పునరావృతమైతే ఏకంగా రెండు టెస్టులు లేదంటే నాలుగు వన్డేలు/నాలుగు టి20ల సస్పెన్షన్‌ వేటు పడుతుంది. బంగ్లా సారథి మçహ్ముదుల్లాపై కూడా స్లో ఓవర్‌రేట్‌ కారణంగా 20 శాతం మ్యాచ్‌ ఫీజులో కోత విధించారు.

పిచ్, వాతావరణం
ఈ టోర్నీలో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఛేజింగ్‌ చేసిన జట్లే గెలిచాయి. పిచ్‌ మరోసారి బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. రాత్రివేళలో వర్షం కురిసే అవకాశం ఉంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement