tri - series
-
లంక పని పట్టాలి!
కొలంబో: నిదహస్ ట్రోఫీలో ఫైనలే లక్ష్యంగా ఆతిథ్య శ్రీలంకతో పోరుకు భారత్ సిద్ధమైంది. ఈ టోర్నీలో మూడు జట్లు ఒక్కో గెలుపోటములతో ఉండటంతో అందరిని ఫైనల్ బెర్తు ఊరిస్తోంది. ఈ నేపథ్యంలో రన్‌రేట్‌పైనో, మరో జట్టు జయాప జయాలతోనో సంబంధం లేకుండా... తమ శక్తిసామర్థ్యాలతోనే టైటిల్ పోరుకు అర్హత సాధించాలంటే సోమవారం జరిగే మ్యాచ్‌లో టీమిండియా గెలవాల్సిందే. ఈ ముక్కోణపు టి20 టోర్నీలో ఇప్పటి వరకైతే భారత్ బ్యాటింగ్ ఫర్వాలేదు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌తో పాటు, నిలకడలేని బౌలింగ్ జట్టు యాజమాన్యాన్ని కలవరపరుస్తోంది. టోర్నీ ఆరంభ మ్యాచ్ లో లంక ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా కాపాడుకోలేకపో యింది. రెండు మ్యాచ్‌ల సస్పెన్షన్ వేటు పడటంతో చండిమాల్ స్థా నంలో తిసారా పెరీరా లంకకు సారథ్యం వహించనున్నాడు. రోహిత్ చెలరేగాలి... కోహ్లి గైర్హాజరీలో పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ వ్యక్తిగతంగా గత రెండు టి20ల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. ఆతిథ్య జట్టుతో కీలకమైన ఈ మ్యాచ్‌లో అతను రాణిస్తే తిరిగి పుంజుకునే అవకాశముంది. సూపర్ ఫామ్‌లో ఉన్న ధావన్‌కు రో‘హిట్స్’ జతయితే జట్టు భారీస్కోరు ఖాయమవుతుంది. టి20ల్లో ధావన్ ఫామ్ అద్భుతంగా కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా పర్యటనలో చెలరేగిన అతను ఈ టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అర్ధసెంచరీలు బాదాడు. మనీశ్ పాండే అతనికి అండగా నిలిచాడు. నిలకడగా ఆడిన పాండే రెండు మ్యాచ్‌ల్లోనూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేశాడు. తొలి మ్యాచ్‌లో విఫలమైన రైనా బంగ్లాపై ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్‌కు అవకాశం ఇస్తే...పంత్ బెంచ్‌కు పరిమితం కావొచ్చు. బౌలింగ్ విభాగం కూడా కెప్టెన్ ఫామ్‌లాగే టీమ్ మేనేజ్మెంట్లో ఆందోళన పెంచుతోంది. ఉనాద్కట్ గత మ్యాచ్‌లో 3 వికెట్లు తీసినప్పటికీ తొలిపోరులో చేతులెత్తేశాడు. చహల్ మ్యాజిక్ కూడా ఇక్కడ ఆశించిన స్థాయిలో పని చేయడం లేదు. కొత్తగా జట్టులోకి వచ్చిన విజయ్ శంకర్ బంగ్లాపై రెండు వికెట్లు తీసి ఫర్వాలేదనిపించాడు. అయితే సమష్టిగా రాణిస్తేనే భారీస్కోర్లు చేస్తున్న శ్రీలంకను నిలువరించగలం. లేదంటే తొలి మ్యాచ్ ఫలితం పునరావృతమయ్యే అవకాశముంది. లంక బలం కూడా బ్యాటింగే... ఈ టోర్నీలో శ్రీలంక బ్యాటింగ్ అద్భుతం. తొలి మ్యాచ్‌లో భారత్ తమ ముందుంచిన లక్ష్యాన్ని ఛేదించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో రెండొందల పైచిలుకు స్కోరు చేసింది. ఫలితం నిరాశపరిచినప్పటికీ ఓవరాల్‌గా బ్యాటింగ్ ఫామ్ స్థిరంగా ఉంది. ముఖ్యంగా కుశాల్ పెరీరా స్ట్రయిక్‌రేట్ అసాధారణంగా ఉంది. ఇద్దరు ప్రత్యర్థులపైనా అతను రెండు మెరుపు అర్ధశతకాలు సాధించాడు. అతనితో పాటు కుశాల్ మెండిస్ గత మ్యాచ్‌లో కనబరిచిన జోరు భారత బౌలర్లకు మింగుడు పడని అంశమే. వీరికి గుణతిలక, తరంగలు కూడా జతయితే ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు తప్పవు. జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, సురేశ్ రైనా, రాహుల్/రిషభ్ పంత్, మనీశ్‌పాండే, దినేశ్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్, చహల్, విజయ్ శంకర్, శార్దుల్ ఠాకూర్, ఉనాద్కట్. శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్), లక్మల్, తరంగ, గుణతిలక, కుశాల్ మెండిస్, షనక, కుశాల్ పెరీరా, జీవన్ మెండిస్, నువాన్ ప్రదీప్, చమీర, ధనంజయ డిసిల్వా. స్లో ఓవర్‌రేట్... చండిమాల్ సస్పెన్షన్ స్లో ఓవర్‌రేట్ కారణంగా శ్రీలంక సారథి చండిమాల్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించారు. దీంతో అతను నేటి మ్యాచ్‌తో పాటు, 16న బంగ్లాదేశ్‌తో పోరుకూ దూరమయ్యాడు. బంగ్లాతో శనివారం జరిగిన పోరులో లంక నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తిచేయలేకపోయింది. ఆదివారం కెప్టెన్ చండిమాల్ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్‌కు వివరణ ఇచ్చిన అనంతరం ఆయన ‘సీరియస్ స్లో ఓవర్‌రేట్’ కావడంతో శిక్ష ఖరారు చేశారు. సస్పెన్షన్‌తో పాటు సహచరులపై పది శాతం జరిమానా పడింది. ఈ 12 నెలల్లో మరోసారి ఇది పునరావృతమైతే ఏకంగా రెండు టెస్టులు లేదంటే నాలుగు వన్డేలు/నాలుగు టి20ల సస్పెన్షన్ వేటు పడుతుంది. బంగ్లా సారథి మçహ్ముదుల్లాపై కూడా స్లో ఓవర్‌రేట్ కారణంగా 20 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించారు. పిచ్, వాతావరణం ఈ టోర్నీలో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఛేజింగ్ చేసిన జట్లే గెలిచాయి. పిచ్ మరోసారి బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. రాత్రివేళలో వర్షం కురిసే అవకాశం ఉంది. -
ముక్కోణపు టోర్నీలో 'గోల్డెన్' టాస్
కొలంబో: శ్రీలంక స్వాతంత్య్రం పొంది 70 ఏళ్లవుతున్న సందర్భంగా తలపెట్టిన ‘నిదాహస్’ ముక్కోణపు టి20 టోర్నీ మంగళవారం ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో భారత్ ఆతిథ్య శ్రీలంకను ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో ఎదుర్కోనుంది. వేడుకల సందర్భంగా శ్రీలంక క్రికెట్ బోర్డు మ్యాచ్ ఆరంభానికి ముందే వేసే టాస్ కాయిన్ ను ప్రత్యేక రూపొందించింది. బంగారం పూతతో ప్రత్యేకంగా టాస్ కాయిన్‌ను తయారు చేసినట్టు బోర్డు అధ్యక్షుడు తిలంగ సుమతిపాల తెలిపారు. టోర్నీలోని అన్ని మ్యాచ్‌ల్లో ఇదే కాయిన్‌ను వాడుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. టోర్నీలో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే, పలు ప్రాంతాల్లో శాంతిభద్రతలు అదుపుతప్పిన నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. మంగళవారం నుంచి 10 రోజుల పాటు ఈ ఎమర్జెన్సీ అమలులో ఉంటుందని అధికారులు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాచ్ జరుగుతుందా? అన్న అనుమానాలు తలెత్తాయి. దీనిపై స్పందించిన బీసీసీఐ షెడ్యూల్ ప్రకారం యథావిధిగా మ్యాచ్ జరిగి తీరుతుందని ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది. ఎమర్జెనీతో మ్యాచ్‌కు అంతరాయం కలగదని బీసీసీఐ స్పష్టం చేసింది. -
సచిన్‌కు ప్రత్యేక ఆహ్వానం
క్రికెట్ దిగ్గజం సచిన్‌కు టెండూల్కర్‌కు శ్రీలంక నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. శ్రీలంక ఈ ఏడాది 70 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే భారత్, బంగ్లాదేశ్‌లతో కలిసి నిదహాస్ టీ 20 ముక్కోణపు టోర్నీని జరుపుతోంది శ్రీలంక క్రికెట్ బోర్డు. ఈ నేపథ్యంలో వేడుకల్లో పాల్గొని, మ్యాచ్‌లను వీక్షించాలని లంక బోర్డు అధ్యక్షుడు తిలంగ సుమతిపాల సచిన్‌కు లేఖ రాశారు. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా వేడుకలకు హాజరుకాలేకపోతున్నానని తెలిపిన సచిన్.. 70 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న లంక ప్రజలకు శుభాకాంక్షలు తెలిపాడు. శ్రీలంక 50 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా 1998 లో భారత్-శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య ముక్కోణపు వన్డే సిరీస్(నిదహాన్ టోర్నీ) జరిగింది. ఆ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో గంగూలీ, సచిన్‌లు తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 252 పరుగులు జోడించగా.. నిదహాస్ ట్రోఫీ టీమ్ ఇండియా సొంతమైంది. కాగా, ప్రస్తుత టోర్నీలో భాగంగా మంగళవారం జరగనున్న తొలి మ్యాచ్‌లొ భారత్, శ్రీలంక తలపడునున్నాయి. -
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దు
సిడ్నీ: వర్షం కారణంగా భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దయ్యింది. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా సోమవారం జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్ కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో రద్దు చేయాలని నిర్ణయించారు. ఇరు జట్లకు చెరో రెండు పాయింట్లు వచ్చాయి. ఈ సిరీస్‌లో భారత్ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ గెలిస్తేనే ఫైనల్ బెర్తు లభిస్తుంది. భారత్, ఆసీస్ మ్యాచ్ కు వరుణుడు పదేపదే ఆటంకం కలిగించాడు. దీంతో మ్యాచ్ ను 44 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన ఆసీస్.. టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. టీమిండియా 16 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసిన సమయంలో మరోసారి వర్షం పడింది. ఆ తర్వాత వర్షం తెరిపి ఇవ్వకపోడంతో గ్రౌండ్ చిత్తడిగా మారింది. దీంతో మ్యాచ్ ను రద్దు చేశారు. -
వన్డే మ్యాచ్ కు మరోసారి వరుణుడు ఆటంకం
సిడ్నీ: ముక్కోణపు సిరీస్ లో టీమిండియా-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న ఐదో లీగ్ మ్యాచ్ కు వరుణుడు పదేపదే ఆటంకం కల్గిస్తున్నాడు. టీమిండియా 16 ఓవర్లలో రెండు వికెట్లు నష్టానికి 69 పరుగుల వద్ద ఉండగా మరోసారి వర్షం పడింది. దీంతో మ్యాచ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి అజ్యింకా రహానే(28), విరాట్ కోహ్లీ(3)పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇప్పటికే వర్షం రెండు సార్లు ఆటంకం కల్గించడంతో మ్యాచ్ ను 44 ఓవర్లకు కుదించారు.