మహ్ముదుల్లా, పెరీరాతో బంగ్లా ఆటగాడు నూరుల్ హసన్ వాగ్వాదం
లంకను బంగ్లా మళ్లీ దెబ్బకొట్టింది. తొలి లీగ్ మ్యాచ్‌లో వారిపై భారీ స్కోరు ఛేదించి ఆశ్చర్యపరిచిన ఈ జట్టు... ఒత్తిడి, ఉత్కంఠ, వివాదం మధ్య సాగిన చివరి లీగ్ మ్యాచ్‌లోనూ జయభేరి మోగించి ఫైనల్‌కు చేరింది.
కొలంబో: తమ దేశ 70వ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న నిదహస్ ట్రోఫీ ముక్కోణపు టి20 టోర్నీలో శ్రీలంక ఫైనల్‌కు చేరలేకపోయింది. శుక్రవారం ఇక్కడ జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 2 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించింది. భారీ స్కోర్లు నమోదవకున్నా చివరి ఓవర్ వరకు విజయం దోబూచులాడిన ఈ పోరులో మహ్ముదుల్లా (18 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) వీరోచితంగా ఆడి బంగ్లాకు అద్భుత విజయాన్ని అందించాడు. అంతకుముందు లంక 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది.
అనంతరం ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (42 బంతుల్లో 50; 4 ఫోర్లు, 2 సిక్స్), మిడిలార్డర్‌లో ముష్ఫికర్ (25 బంతుల్లో 28; 2 ఫోర్లు)లకు తోడు మహ్ముదుల్లా కడవరకూ నిలవడంతో బంగ్లాదేశ్ 8 వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. చివరి ఓవర్‌లో 12 పరుగులు చేయాల్సి ఉండగా... తొలి రెండు బంతులకు పరుగు రాలేదు. రెండో బంతికి నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ముస్తఫిజుర్ రనౌట్ కావడంతో మహ్ముదుల్లాకు స్ట్రైకింగ్ వచ్చింది. ఈ దశలో అతడు వరుసగా 4, 2, 6 కొట్టి మ్యాచ్‌ను ఘనంగా ముగించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్‌తో బంగ్లాదేశ్ ఆడుతుంది.
షార్ట్‌పిచ్ బంతుల వివాదం...
అది బంగ్లా ఇన్నింగ్స్‌లో 20వ ఓవర్. గెలవాలంటే 12 పరుగులు చేయాలి. క్రీజులో ముస్తఫిజుర్. బౌలర్ ఉదాన. తొలి బంతి భుజం కంటే ఎత్తులో వెళ్లినా ‘నో బాల్’ ఇవ్వలేదేమని మహ్ముదుల్లా అంపైర్లను అడిగాడు. మరోవైపు ఇదే తరహాలో వచ్చిన రెండో బంతిని పుల్ చేయలేకపోయిన ముస్తఫిజుర్ పరుగుకు యత్నించి రనౌటయ్యాడు. ఈ సమయంలో మైదానంలోకి వచ్చిన బంగ్లా సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లు, శ్రీలంక ఆటగాళ్ల మధ్య వాదన మొదలైంది.
అంపైర్లు కలగజేసుకుని బ్యాట్స్‌మెన్‌తో మాట్లాడారు. ఈలోగా కెప్టెన్ షకీబ్ సహా బంగ్లా ఆటగాళ్లంతా బౌండరీ దగ్గరకు వచ్చేశారు. షకీబ్ అంపైర్లతోనూ తీవ్ర వాదులాటకు దిగాడు. మైదానం వీడి వచ్చేయాల్సిందిగా తమ బ్యాట్స్‌మెన్‌ను పదేపదే ఆదేశించాడు. అయితే.. బంగ్లా జట్టు మేనేజర్ ఖాలెద్ మెహమూద్ శాంతపర్చడంతో మహ్ముదుల్లా తిరిగి బ్యాటింగ్‌కు వెళ్లాడు. మ్యాచ్ ముగిశాక సైతం ఆటగాళ్ల మధ్య ఇదే ఉద్రిక్తత కనిపించింది.
స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్: గుణతిలక (సి) షబ్బీర్ (బి) షకీబుల్ హసన్ 4; కుశాల్ మెండిస్ (సి) సౌమ్య సర్కార్ (బి) ముస్తఫిజుర్ 11; కుశాల్ పెరీరా (సి) మెహదీ హసన్ (బి) సౌమ్య సర్కార్ 61; తరంగ (రనౌట్) 5; షనక (సి) ముష్ఫికర్ (బి) ముస్తఫిజుర్ 0; జీవన్ మెండిస్ (సి) ముస్తఫిజుర్ (బి) మెహదీ హసన్ 3, తిసారా పెరీరా (సి) తమీమ్ (బి) రూబెల్ 58; ఉడాన (నాటౌట్) 7; ధనంజయ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 159.
వికెట్ల పతనం: 1–5, 2–22, 3–31, 4–32, 5–41, 6–138, 7–154. బౌలింగ్: షకీబుల్ 2–0–9–1, రూబెల్ 4–0–41–1, ముస్తఫిజుర్ 4–1–39–2, మెహదీ 4–0–16–1, మహ్ముదుల్లా 4–0–29–0, సౌమ్య సర్కార్ 2–0–21–1.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ (సి) పెరీరా (బి) గుణతిలక 50; లిటన్ దాస్ (సి) పెరీరా (బి) ధనంజయ 0; షబ్బీర్ (స్టంప్డ్) పెరీరా (బి) ధనంజయ 13; ముష్ఫికర్ (సి) పెరీరా (బి) అపోన్సొ 28; సౌమ్య సర్కార్ (సి) పెరీరా (బి) మెండిస్ 10; మహ్ముదుల్లా (నాటౌట్) 43; షకీబుల్(సి) ధనంజయ (బి) ఉడాన 7; మెహదీ హసన్ (రనౌట్) 0; ముస్తఫిజుర్ (రనౌట్) 0; రూబెల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.5 ఓవర్లలో 8 వికెట్లకు) 160.
వికెట్ల పతనం: 1–11, 2–33, 3–97, 4–105, 5–109, 6–137, 7–148, 8–148. బౌలింగ్: నువాన్ ప్రదీప్ 1–0–10–0, ధనంజయ 4–0–37–2, అపోన్సొ 3–0–19–1, తిసారా పెరీరా 2–0–20–0, గుణతిలక 3–0–24–1, జీవన్ మెండిస్ 4–0–24–1, ఉడాన 2.5–0–26–1.
Comments
Please login to add a commentAdd a comment