Sri Priya
-
మంత్రి వ్యాఖ్యలపై నటి శ్రీప్రియ సెటైర్లు
తమిళసినిమా: రాష్ట్ర సమాచార, ప్రచార శాఖ మంత్రి కడంబూర్ రాజూ, కమలహాసన్ మక్కల్ నీది మయం పార్టీ కార్యకర్త, నటి శ్రీప్రియల మధ్య మాటల యుద్ధం సాగింది. మక్కల్ నీది మయం పార్టీ తరఫున ఆ పార్టీ అధినేత కమలహాసన్ ఇటీవల తిరుచ్చిలో బహిరంగ సభను నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సభకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సమావేశంపై స్పందించిన మంత్రి కడంబూర్ రాజు బర్రెల బండితో పోల్చి పరిహాసం చేశారు. ఆయన మాట్లాడుతూ వైగై నదిలో గెదెను కడిగినా జనం పోగవుతారని అన్నారు. అలా నటుడి సభకు జనం రావడం ఆశ్చర్యం ఏమీ లేదు అని పేర్కొన్నారు. దీనికి కమలహాసన్ పార్టీ ఉన్నత కమిటీ కార్యకర్త శ్రీప్రియ స్పందిస్తూ మంత్రి కడంబూర్ రాజూ ఆయన పార్టీ వారిని నీరులేని కావేరి నదిలో స్నానం చేయించమనండి. వారిని చూడటానికి జనం పోగవుతారు అని వ్యంగ్యాస్త్రాలతో ధీటుగా తన ట్విట్టర్లో బదులిచ్చారు. -
దృశ్యం డైరెక్టర్‌తో నిత్యామీనన్
వెంకటేష్ హీరోగా తెరకెక్కిన మలయాళ రీమేక్ సినిమా దృశ్యంతో డైరెక్టర్‌గా పరిచయం అయ్యింది సీనియర్ నటి శ్రీ ప్రియ. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈమె, తన రెండో ప్రయత్నంగా కూడా ఓ థ్రిల్లర్ సినిమానే ఎంచుకుంది. రీమేక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రీ ప్రియ ప్రస్తుతం ఓ స్ట్రయిట్ సినిమాను రూపొందిస్తోంది. ఈ సినిమాలో లేడి ఓరియంటెడ్ సినిమాల కేరాఫ్ అడ్రస్ నిత్యామీనన్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఘటన పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. లవ్ కం రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కూడా తన మార్క్ థ్రిల్లర్ గా రూపొందిస్తోంది శ్రీ ప్రియ. సన్ మూన్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఘటనను సెప్టెంబర్‌లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. నిత్యా మీనన్‌తో పాటు క్రిష్, నరేష్, కోట శ్రీనివాసరావు, కోవై సరళలు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
వాళ్లంతా వెంకటేశ్ పేరే చెప్పారు: శ్రీప్రియ
‘‘యాభై ఏళ్ల మా సంస్థ చరిత్రలో తొలిసారి లేడీ డెరైక్టర్‌తో నిర్మించిన చిత్రం ఘనవిజయం సాధించడం ఆనందంగా ఉంది. ఇక్కడే కాదు.. విదేశాల్లోనూ ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది’’ అని డి. రామానాయుడు చెప్పారు. వెంకటేశ్, మీనా జంటగా శ్రీప్రియ దర్శకత్వంలో రామానాయుడు సమర్పణలో డి. సురేశ్‌బాబు, రాజ్‌కుమార్ సేతుపతి నిర్మించిన ‘దృశ్యం’ చిత్రం విజయోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ- ‘‘నటుడిగా నాలో ఆత్మవిశ్వాసం పెంచిన చిత్రం ఇది. నా కెరీర్లో ఎప్పటికీ మర్చిపోలేను’’ అన్నారు. ‘‘మలయాళ ‘దృశ్యం’ని తెలుగులో రీమేక్ చేస్తు, హీరోగా ఎవరైతే బాగుంటుందని నా స్నేహితురాళ్లు జయప్రద, జయసుధ, రాధికను అడిగితే.. వెంకటేశ్ పేరు చెప్పారు. తనతో సినిమా చేయడం ఓ మంచి అనుభవం’’ అని శ్రీప్రియ తెలిపారు. పరుచూరి గోపాలకృష్ణ, రాజ్‌కుమార్ సేతుపతి, మీనా, నదియా తదితరులు చిత్రవిజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
విజయనిర్మల స్ఫూర్తితో...
‘‘దర్శకురాలిగా నాకు విజయనిర్మల అంటే చాలా ఇష్టం. ఆమె స్ఫూర్తితోనే దర్శకత్వంపై ఇష్టాన్ని పెంచుకున్నాను. గతంలో దాసరి నారాయణరావు దగ్గర ‘స్వప్న’ చిత్రానికి దర్శకత్వశాఖలో పనిచేశాను’’ అని శ్రీప్రియ చెప్పారు. ‘అంతులేని కథ’, వయసు పిలిచింది, పొట్టేలు పున్నమ్మ తదితర చిత్రాల్లో నటించిన శ్రీ ప్రియ ఇటీవలే వెంకటేశ్‌తో ‘దృశ్యం’ సినిమా డెరైక్ట్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లో శ్రీ ప్రియ పత్రికల వారితో ముచ్చటిస్తూ -‘‘సాధారణంగా లేడీ డెరైక్టర్స్ అంటే పరిశ్రమలో కొంత చిన్న చూపు ఉంది. కానీ వెంకటేశ్ అలాంటి ఆలోచనలేవీ పెట్టుకోకుండా నటించారు. రీమేక్‌లు చేయడం ఓ రకంగా కష్టసాధ్యమైన వ్యవహారం. భవిష్యత్తులో సొంత సినిమాలే చేస్తాను తప్ప, రీమేక్‌లు చేయను’’ అని చెప్పారు. -
విద్యాబాలన్‌కి పద్మశ్రీనా? - శ్రీప్రియ
సీనియర్ నటి, దర్శకురాలు శ్రీప్రియకు కోపం వచ్చింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మ’ అవార్డుల గురించి శ్రీప్రియ తన ట్విట్టర్లో కొంచెం ఘాటుగానే స్పందించారు. సీనియర్ తారలను మర్చిపోవడం బాధాకరం అన్నారామె. విజయనిర్మలకు నటిగా ఎంతో గుర్తింపు ఉందని, అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి, గిన్నిస్ రికార్డ్ కూడా సాధించిన ఆమెకు ఇంకా ‘పద్మ’ పురస్కారం రాకపోవడం ఏంటి? అని ప్రశ్నించారు శ్రీప్రియ. అలాగే, నాటి తరం తారల్లో లక్ష్మి గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాలని, భారతీయ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన ఆమెను గుర్తించకపోవడం ఏంటి? అని ఘాటుగా స్పందించారు. కమల్‌హాసన్‌కి పద్మభూషణ్ రావడం ఆనందించదగ్గ విషయం అని, ఆయనకా అర్హత ఉందని పేర్కొన్నారామె. కానీ, ఎన్ని సినిమాలు చేసి ఉంటుందని విద్యాబాలన్‌కి పద్మ పురస్కారం కట్టబెట్టారో తనకు తెలియడం లేదని శ్రీప్రియ పేర్కొన్నారు. సీనియర్ తారలకు తగిన గుర్తింపు లభించడంలేదనే బాధతో ఈ కామెంట్లు చేశానని ఆమె స్పష్టం చేశారు. -
శ్రీప్రియ దర్శకత్వంలో వెంకీ
చంటి, చినరాయుడు, సుందరకాండ, అబ్బాయిగారు, సూర్యవంశం, రాజా, శీను, జెమిని, ఘర్షణ, బాడీగార్డ్... ఇలా వెంకటేష్ నటించిన రీమేక్ చిత్రాల జాబితా చాలానే ఉంది. ఇటీవల హిందీ ‘బోల్ బచ్చన్’ రీమేక్ ‘మసాలా’లో కూడా నటించిన విషయం తెలిసిందే. వెంకీ నటించిన రీమేక్ చిత్రాల్లో విజయం సాధించినవే ఎక్కువ. ప్రస్తుతం ఆయన హిందీ ‘ఓ మై గాడ్’ రీమేక్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా, మరో రీమేక్‌ని కూడా అంగీకరించారు. మలయాళంలో జీతు జోసఫ్ దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా రూపొందిన ‘దృశ్యం’ని తెలుగులో పునర్నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘మాలిని 22’ చిత్రాన్ని నిర్మిస్తున్న రాజ్‌కుమార్ థియేటర్స్ సంస్థ ఈ చిత్రం రీమేక్ హక్కులను దక్కించుకుంది. ఈ చిత్రాన్ని వైడ్ యాంగిల్ క్రియేషన్స్‌తో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ‘మాలిని 22’కి దర్శకత్వం వహిస్తున్న శ్రీప్రియ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. లేడీ డెరైక్టర్‌తో సినిమా చేయడం వెంకీకి ఇదే మొదటిసారి అవుతుంది. మలయాళంలో ‘దృశ్యం’ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ చిత్రంలో మోహన్‌లాల్ సరసన మీనా కథానాయికగా నటించారు.మరి... తెలుగు రీమేక్‌లో కథానాయికగా ఎవర్ని ఎంపిక చేస్తారు తదితర వివరాలు త్వరలోనే తెలుస్తాయి.